‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’
ప్రకృతి పాఠశాలలో పాటను దిద్దుకున్న సహజకవి అందెశ్రీ. పరిసరాలలోని పరిణామాలకు పాటగా పరిఢవిల్లిన ప్రజాకవి అందెశ్రీ. పసితనంనుండే పశువుల కాపరిగా పనిచేసినా, తాపీమేస్త్రీగా, రోజువారీ కూలీగా శ్రమించినా మనసుమాత్రం పదాల అల్లికల చుట్టూ పరిభ్రమించేది.
________________
జూలై 18,1961లో వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన అందెశ్రీకి పాట ఒక ఊరట నిచ్చింది. ఏ బడిలో చదువుకోకపోయినా లోకమనే విశ్వవిద్యాలయంలో లోతైన తాత్త్విక విషయాలను అవగాహన చేసుకున్నారు. ఆ వెలుగులలోంచే మనిషితనం కోసం తపించిపోయారు. మనిషిని కేంద్రకంగా చేసుకుని మానవీయ జీవన విలువల కోసం అన్వేషణ చేసాడు. ‘మాయమైపోతున్న మనిషి’ కోసం భూగోళమంతా ప్రతిధ్వనించేలా తన పాటను వినిపించాడు. లక్షలాది హృదయాలను కదిలించిన అలాంటి ఆర్ధ్రత, ఆవేదన, చింతనలతో నిండిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే గీతాన్ని మరోసారి ఇక్కడ మననం చేసుకుందాం.
__________________
‘మాయమైపోతున్నడమ్మా…’ పాటలో కవి కనిపించకుండా పోతున్న మనుషులకోసం దేవులాడుతున్నాడు. మనుషులతో కిక్కిరిసిపోయిన ఈ భూమ్మీద ఒక మనిషికోసం వెతుకులాడడం ఆశ్చర్యమే. నిజానికి కవి ఎదురుగా అసంఖ్యాకమైన మానవులు తిరుగులాడుతూనే వున్నారు. కవికి కావలసింది కేవలం భౌతికమైన మనుషులే కాదు. ఆ మనుషుల మనసులు మానవత్వంతో నిండిపోయి మరో మనిషిపట్ల ప్రేమతో స్పందించగలిగే నిజమైన మనిషికోసం ఆవేదనతో ఆలపిస్తున్నాడు.సమాజంలో క్షీణించిపోతున్న మానవ సంబంధాలపట్ల కవి విలాపమే ఈ గీతమంతా విస్తరించింది. ఎనిమిది విభిన్న విషయాలను ప్రస్తావిస్తూ నలభై ఎనిమిది చరణాలలో లోకాన్ని ప్రశ్నిస్తూ ఒక విశ్వమానవ ప్రేమికుడిగా మానవీయతను ప్రతిష్టింపజేస్తాడు కవి.
కవి మనిషిలోని నిలువెత్తు స్వార్థాన్ని అసహ్యించుకుంటున్నాడు. ఒక్కక్షణం కూడా స్వార్థరహితంగా నడచుకోలేకపోతున్న మనిషిలోని విడదీయలేని స్వార్థాన్ని అతని నీడతో పోల్చుతూ ఎంతగా దిగజారిపోయాడో చూపిస్తున్నాడు. మనిషిలో అవినీతి, అత్యాశ పెరిగిపోవడాన్ని సహించలేకపోతున్నాడు. అలాంటి అంధకారాల్లో చిక్కిపోయి శిథిలమైపోతున్న మనిషిని చూస్తూ తీవ్ర కలత చెందుతున్నాడు కవి.
కవి దైవాన్ని మనసారా నమ్ముతాడు. కాని దైవరూపాలు, అవతారాలు అనే పేరుతో కుక్క నక్కలను, పంది నందులను గుడ్డిగా పూజించే మనుషుల అవివేకాన్ని అసహ్యించుకుంటాడు. చీమలకు చెక్కర, పాముకు పాలుపోసి అదే జీవకారుణ్యం, దాన్నే అమూల్యమైన పుణ్యఫలంగా మార్చుకుంటున్నామనే మనిషి అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటాడు. తనమీద ఆధారపడిన తోడబుట్టిన వాళ్ళందరినికాదు తోటి మనుషులను అంటరానివారిగా చూస్తున్న తీరుకు నివ్వెరపోతాడు కవి. కులం పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలు, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఊరవతలి వెలివాడల బాధలతో మమేకమైపోతాడు అందెశ్రీ.
అందెశ్రీ ఒక ఆధ్యాత్మిక బాటసారి. దారి పొడుగునా పాటతోడుగా నడిచిపోయె జానపదుడు. ఆధ్యాత్మికతకు అర్థం తెలుసుకోలేక అంధులైపోతున్న అన్ని మతాలవారిని ఈసడించుకుంటాడు. మనుషుల మధ్య మమేకత భావనలు నింపే మతాన్ని సైతం కలుషితం చేసిన మనిషి మతోన్మాదాన్ని చూసి భయపడిపోతాడు. లోకహితము కోరుకునేదే తనమతం. తన పాట కోరుకునేది అదే అభిమతం. ఈ సరిహద్దుల రేఖమీద నిలబడి తను అనుకునే ఆ మనిషికోసం నిరీక్షిస్తున్నాడు కవి.
కవి మనిషి చేస్తున్న కొన్ని కీలకమైన పనులను వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తాడు. ‘ఇరవైఐదు పైసలు అగరువత్తులు కాల్చి అరవైఐదు కోట్ల వరములడిగే’ బేరసారాల పిసినారి లౌక్య భక్తుల మనస్తత్వాన్ని ఎండగడుతాడు. దేవుడి పేరుతో చందాల దందా చేసే దాదాగిరి భక్తుల దుష్టప్రవర్తనను నిర్భీతిగా అవహేళన చేస్తాడు. భక్తి పేరుతో దొంగ బాబాలు, సన్యాసులు చేసే అరాచకాలు, అకృత్యాలను వదలకుండా కవి తీవ్రంగా విమర్శిస్తాడు. సమాజంలోని భక్తులు, బాబాల నగ్నస్వరూపాన్ని నిర్మొహమాటంగా విమర్శిస్తాడు కవి.
కవికి ధనం విలువ తెలుసు. అంతకు మించిన ఆత్మాభిమాన ప్రాధాన్యం తెలుసు. మన అవసరాలకోసం మనం సృష్టించుకున్న రూపాయి కాగితం మనిషిని ఎంతో పాపాత్ముడిగా దుర్మార్గుడిగా మార్చిన వైనాన్ని అందెశ్రీ జీర్ణించుకోకపోతున్నారు. రూపాయికోసం ఎంతటి పాపానికైనా ఒడిగట్టే మనిషి స్వభావాన్ని ఈసడించుకుంటున్నాడు.
గుప్పెడు మెతుకులతో కడుపు నింపుకోవడంతో సంతృప్తి చెందడం లేదు. ఎవరికి చెప్పలేనంత ధనం సంపాదించి దాచిపెట్టుకోవాలనే మనిషి దురాశకు దుఃఖిస్తాడు. రూపాయి ఆసరా లేకుండానే నగరాన్ని ఈదిన కవి పోరాట జీవన శైలి ఈ పాటలో అవగతమవుతుంది.
ఈ పాటలో అందెశ్రీ మనిషి సంస్కారతీరుకు ఒక ప్రణాళికను రూపొందించారు. ఆదర్శనీయమైన జీవన గమనానికి పూలబాటలు పేరుస్తాడు. స్త్రీలపై జరిగే అత్యాచారాల పట్ల గుండెలవిసేలా గొంతు పెగల్చి అరుస్తాడు. కామంతో కళ్ళుమూసుకుని పోయిన మగవారి లైంగిక దౌర్జన్యాల్ని, అమానుష అకృత్యాల్ని తీవ్రంగా ప్రతిఘటించాలంటున్నాడు. కన్నవాళ్ళను సైతం నిరాదరించే సంతానంపట్ల ఏహ్యభావాన్ని ప్రకటిస్తాడు. మద్యానికి బానిసలై వావివరసలు మరచిన నరుడి దుష్టత్వాన్ని, క్రూరత్వాన్ని నాశనం చేయాలని తలుస్తున్నాడు కవి.
కవులకు రాజకీయ చైతన్యం, పాలకుల పనితీరుపై ధిక్కారాన్ని ప్రదర్శించడం అనివార్యమైన అంశం. అందెశ్రీ సైతం ఈ పాటలో మనిషి రాజకీయం పేరుతో అనుసరిస్తున్న అరాచకీయ పద్ధతుల్ని ఖండిస్తున్నాడు. ఉత్తమమైన నిర్మాణాత్మక కార్యక్రమాలను చేయవలసిన నాయకులు ఆధిపత్యపు గొడవల్లో కూరుకుపోయి ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న వైనాన్ని విమర్శిస్తాడు. ప్రజాస్వామిక రాజ్యం కోసం కలలుగంటున్న లోకంలో రాజకీయం అనే పదం అమానవీయతకు పర్యాయపదంగా మారడం శోచనీయం. ఆ దుస్థితిని మనముందుంచుతున్నారు అందెశ్రీ. కవిలోని సమకాలీన రాజకీయస్పృహ మనల్ని ఆలోచింపజేస్తుంది.
_________________
అందెశ్రీ లోకంతో విభేదించడం లేదు. లోకులతో వైరం పెట్టుకోవడం లేదు. ఈ భూమిని మాతృమూర్తి ఒడిలా భావించిన కవికి అనుభవానికి వచ్చిన చేదునిజాలు వేరు. ఈ మట్టిని ప్రేమించిన మనిషికి ఆ మట్టిమీద మనుషులతోనే గొడవ మొదలయింది. బౌద్ధిక తత్వాన్ని, జాతక కథల సారాన్ని ఒంటపట్టిచ్చుకున్న కవిలో ఏదో కలత మొదలయింది. ప్రపంచీకరణ విషగాలులకు కంటి ముందే భూగోళాన్ని చుట్టిముట్టిన అనేకానేక అణుధార్మిక వాయువుల్లాంటి అమానవీయ ధోరణులతో మనిషి ప్రాణభీతితో విలవిల్లాడుతున్నాడు.
___________________
ఆకాశమే హద్దుగా ఆశయాలు సాధించగల మనిషి నిష్క్రియ పరుడిగా మారిపోతున్నాడు. అంతుచిక్కని అనంత విశ్వరహస్యాల్ని విప్పగలిగిన మేధస్సున్న మనిషి అహంకారపు వలలోపడి కనుమరుగై పోతున్నాడు. నిఖార్సైన మనిషి కనిపించకుండా పోతున్నాడని కవి గాఢంగా తాననుకున్న మనిషికోసం అక్షరాలా కన్నీరు కార్చుతాడు.
‘జయజయహే తెలంగాణ’ అనే మార్చ్ పాస్ట్ లాంటి ఉద్యమగీతంతో తెలంగాణా జాతికి పోరాటపథ నిర్దేశాన్ని చేసిన వాగ్గేయకారుడు అందెశ్రీ.
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట ప్రతిరోజు ప్రతిక్షణం అందెశ్రీ ప్రాసంగికతను పెంచుకునిపోతున్న పాట. ఏ మనిషికి ఆ మనిషి తన ఆత్మవిమర్శకు ఒక రింగ్ ట్యూన్ గా మార్చుకోవాల్సిన పాట ఇది. పల్లె పొత్తిళ్ళలోంచి పుట్టిన మట్టి పరిమళపు కవి, పలుకులమ్మ ప్రియ పుత్రుడి శాశ్వత చిరునామా ఈ గీతం.

-డా.ఎస్.రఘు
అసోసియేట్ ప్రొఫెసర్
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 98482 08533
