కొందరికి కవిత్వం అంటే భక్తితో కూడిన ఆరాధన. కొందరికి కవిత్వం అంటే నీడలా వెంబడించే చెలికాడు. మరికొందరికి కవిత్వం అంటే అపూర్వమైన జీవన సౌందర్యం..
కవిత్వాన్ని కేవలం కాలక్షేపం కోసం రాయకుండా, ఒక సామాజిక మార్పు కోసం నిరంతర ప్రయత్నంగా భావించే కవులు మన మధ్యన ఎందరో ఉన్నారు. అట్లాంటి కోవకు చెందిన కవి మడిపల్లి రాజ్ కుమార్. మూడు దశాబ్దాలకు పైగా కవిత్వం రాస్తున్న ఆయన వందల కవితలు రాశారు. కానీ పుస్తకాన్ని తీసుకురావడంలో మాత్రం నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడో సంపుటిగా రావాల్సిన ఆయన కవిత్వం ఇప్పటికైనా వచ్చినందుకు ఆహ్వానిద్దాం. అరవై కవితలతో ‘తప్పిపోయిన కాలం’ శీర్షికతో కవిత్వ ప్రియులకు కానుకగా అందించారు.
కవులు రెండు రకాలు. అందులో కొందరు, చూసిన ప్రతి దృశ్యాన్ని వర్ణిస్తూ, అప్పటికప్పుడు వాక్యాలను పేరుస్తూ రాసే కవులు. మరికొందరు కవులు, చూసిన దృశ్యాన్ని మనసులో మననం చేసుకుంటూ, ప్రతి వాక్యం వెనుక మనిషి యొక్క అంతర్ముఖాన్ని సామాజిక దృక్పథంతో రాస్తారు. అలా రాసిన కవిత్వాన్ని కవిత్వంగా ఇష్టపడే పాఠకులకు కొదవలేదు.
__________________
రాజ్ కుమార్ గారు రెండో కోవకు చెందిన కవి. ఏదిపడితే అది రాయరు, ఎట్లాపడితే అట్లా రాయరు. రాసే ప్రతి వాక్యానికి ఒక ప్రయోజనం ఉండాలని బలంగా నమ్మే కవి. అందుకనే ఆయన కవిత్వాన్ని చాలామంది ఇష్టపడతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఎదిగి వచ్చిన కవి. ఇక్కడి సంక్లిష్టమైన జీవితాన్ని, అట్టడుగు స్థాయి జీవితాలను ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకున్న కవి. అందుకే ఆయన కవిత్వంలో విస్తారమైన జీవనానుభవాలు మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి. ప్రతి వాక్యం వెనుక ఆయన గుండె తడి కనిపిస్తుంది, మనల్ని స్నేహపూర్వకంగా పలకరిస్తుంది. చదివిన ప్రతి కవిత మనల్ని కదలిస్తుంది. కవిత్వ వస్తువు పట్ల ఆయన తీసుకున్న జాగ్రత్త మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.
___________________
ఆదిలాబాద్ అంటేనే అడవి. అడవి అంటేనే ఆదివాసి గిరిజనులు. మైదాన ప్రాంత జీవితాలకు, ఇక్కడి జీవితాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారు మానవీయులైన మనుషుల్ని, జంతుజాలాన్ని ప్రేమిస్తారు. నమ్మించి మోసం చేయడమింకా నేర్చుకోలేదు వాళ్ళు. అందుకే ఏ చిన్న అలికిడికైనా విలవిల్లాడిపోతారు. అడవిని ప్రాణంగా చూసుకుంటారు. ‘కవ్వాలాభయారణ్యం’ కవిత రాజ్ కుమార్ అంతరంగానికి అద్దం పడుతున్నది. ఈ కవితా వాక్యాలు అడవి పైనున్న ఆయన మమకారాన్ని తెలియజేస్తాయి:
అవి చల్లటి గాలులతో
నీలిమబ్బులకు చక్కిలిగిలి పెడితే
మెరుపులు ఉరుములుగా నవ్వి నవ్వి
మోస్తున్న నీళ్లు వొలకబోసుకుంటాయి
అడవులు మిన్ను మన్నుల నడుమ
వానల వారధులు
పంటల ప్రాణహితులు
అడవులు మృగాల బతుకు తొవ్వలు
నానా రకాల పక్షులు జంతువులు సాకే
అమ్మతనపు హరిత హృదయాలు
పోరాటం అంటేనే ఒక అగ్నికెరటం. పోరుతత్వం అలవర్చుకున్న వాళ్ళెవరూ దేనికీ బానిసలు కారు. బానిసత్వాన్ని రూపుమాపడానికి తమ వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. రాజ్యంపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంటారు. ఆ పోరాటంలో వేలాదిమంది సైనికులు ఉండాల్సిన అవసరం లేదు. ధైర్యంతో కూడిన ఒక హెచ్చరిక లేదా ఒక వాక్యం చాలు, అవి కూడా పోరాటం కిందికే వస్తాయి. ఆంగ్లేయుల పాలనలోని దుర్మార్గాన్ని రూపుమాపడానికి గొంతెత్తిన రాంజీ గోండు జీవితం ఆదివాసి గిరిజనులకు స్ఫూర్తిదాయకమైనది. ఊడలమర్రికి వెయ్యిమందిని ఉరి తీసిన నాటి అరాజకత్వాన్ని కవి ప్రశ్నిస్తున్నారు. ఆ హృదయవిదారకమైన సంఘటన ప్రతి ఒక్కరినీ కలవరపరుస్తుంది. నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నేటికీ నిలిచిన ఊడలమర్రి కూలిపోతే ఆయన మనస్సు చలించిపోయింది. ఆనాటి ఉద్యమ యోధులు తన కళ్ల ముందు కదలాడుతుంటారు. ఇదే ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ ఎన్నోసార్లు దాన్ని దర్శించి ఉంటారు. అందుకనే ఆయన కలం పదునైన కవితా వాక్యాలను కురిపించింది. ఈ కవిత చదువుతుంటే కళ్లల్లో నీటి చెమ్మ ఉబికి వస్తుంది. ‘వంద కవుల గానం’ తెలంగాణ కవితా సంకలనంలో ‘వేయి ఉరులమర్రి’ శీర్షికతో ఈ కవితను ప్రచురించారు:
“పచ్చని శ్వాస కోసమై బతుకునీయాల్సింది పోయి/ఊడల తాళ్లతో ఉరితీశానని/ఎన్ని పిడుగుల వానలు కురువనీ/తన చేతుల కంటిన రక్తమేది కడగదని అనాదిగా రోధిస్తూ/ రాంజీ గోండు వీరగాథని/పచ్చగ గానం చేస్తూనే/ఆ మర్రి ఒకానొక వర్షపు రాతి నిలువునా కూలింది/తల్లి ఒడి చేరింది/ ఆ మర్రి మరణించినా/ఆ మర్రి ఆశయం/ఈ నేలన ప్రసరిస్తూనే ఉన్నది/ఈ గాలిలో ఈ నీటిలో వినిపిస్తూనే ఉన్నది/రాంజీ గోండు ఆఖరి కేక/కొమరం భీమ్ లకై/ఈ కొండల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది”.
‘మనిషి కథ’ అంటూ రాసిన కవిత మానవ చరిత్రకు అద్దం పడుతున్నది. యుగాల నుండి మనిషి సాధించిన పురోగతిని స్వాగతిస్తూనే, మితిమీరిన స్వార్థం వల్ల భూమిపైన జరుగుతున్న విధ్వంసాన్ని సరళమైన వాక్యాల ద్వారా కవి వర్ణించారు. మనిషికి, మృగానికి ఉన్న తేడాను మానవీయమైన కోణంలో వివరించారు. మనిషి జీవితం మొదలు వేటతో మొదలైందని, ఆ తర్వాత వ్యవసాయాన్ని అందుకొని, స్థిరనివాసం ఏర్పరచుకొని, నాగరికత వికాసానికి దారులు నిర్మించుకున్న విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరించారు. అడవుల్ని, కొండల్ని, చివరికి నదుల్ని సైతం తన స్వార్థం కోసం నామరూపాలు లేకుండా చేస్తున్న తీరుపైన కవి ఈ కవిత్వ పాదాల ద్వారా నిరసన వ్యక్తం చేశారు:
అనగనగా మనిషి
భూమిని పూర్తిగా అలికేసిన మనిషి
చంద్రుణ్ణి అంగారకుణ్ణి అలికేస్తూ
తన పేరు తాను మరిచిపోయాడు
మృగమైన మనిషి
వాహనమైన మనిషి
యంత్రమైన మనిషి
ఆకాశం అద్దంలో తనను తాను చూసుకుని
విశ్వమంతగా వాచిన మెదడు తప్ప
మరేమీ కనిపించని మనిషి
మనిషి జీవితమే దుఃఖభరితమైనది. రైతు కుటుంబాల కథలు ఎన్ని చెప్పుకున్నా తరిగిపోనివి. కాలాన్ని నమ్ముకుని, కాలం పెట్టే పరీక్షలను ఎదుర్కొంటూ సాగు చేస్తున్న కుటుంబాల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ప్రపంచానికి భోజనం పెడుతున్న ఆ కుటుంబాలు కడు దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, వేదనాభరితంగా వ్యక్తీకరించిన కవిత ‘మరణ యాతన’. 1998లో ఈ కవితకు రంజని కుందుర్తి అవార్డు లభించింది. పంటలకు పట్టిన పురుగును చంపని పురుగుల మందు, బాధలతో సతమతమవుతున్న కుటుంబ సభ్యుల్ని చంపుతున్నదని కవి దుఃఖపడతారు. ఈ కవితా వాక్యాలు రైతు బిడ్డల కష్టమయమైన జీవితాలకు అచ్చమైన నిదర్శనాలు:
“పురుగును చంపని మందు/పెద్దోడిని మాత్రం అమాంతం నలిపేసిన వేళ/నీటి అద్దంలో ముఖం చూసుకోలేక చేనులో/ నాగలై కూరుకు పోయిన చిన్నోడు/కలుపు మొక్కల పచ్చదనపు పరిహాసానికి/ పాలిపోయిన ముఖం వేలాడేసిన వేళ/ కార్చిన కన్నీటి జ్ఞాపకం ఏది/ అంటనంత లోతుల్లో/కరకు కత్తుల గూళ్లలో కళ్లు/ అనంతమైన ఎదురుచూపు”.
మన అస్తిత్వానికి నిదర్శనం స్థానికత. దాన్ని మర్చిపోవడం అంటే ఒక రకంగా మరణించినట్టే. తనతో పెనవేసుకున్న బంధాన్ని ఊపిరి ఉన్నంతవరకు కాపాడుకోవడం మనిషి కనీస కర్తవ్యం. నేటి గ్లోబలీకరణ మాయాజాలం మానవీయ బంధాల్ని పాతర వేసింది. ఒకనాటి ఆత్మీయ అనురాగాలు కానరాకుండా పోతున్నాయి. బాల్యంలోని అనుభవాలను కవి ఇప్పటికీ తలుచుకుంటారు. ఆనాటి ఆనందమయ క్షణాలను గుర్తుచేసుకున్న ప్రతిసారి తల్లిని కోల్పోయిన పిల్లాడిలా విలవిలలాడుతున్నారు. తన గత జ్ఞాపకాలను అక్షరీకరించి మనతో ముచ్చటిస్తున్నారు. ఇవి తన ఒక్కడివే కాదు, మనందరి జ్ఞాపకాలు కూడా. మనమంతా తప్పిపోయిన కాలంలోనే బతుకుతున్నట్లుగా ఉంది. ఆ కలివిడితనం కాటకలిసిపోయింది. ఆ హుషారైన జీవితం కనుమరుగైపోయింది. బాల్య స్నేహితులు కానరాకుండా పోతున్నారు. నగరంలో స్థిరపడిన కవి వేదన తీరేది కాదు. అందుకే తప్పిపోయిన కాలంలో బతుకుతున్నానని ఈ కవితా పాదాల్లో అంటున్నారు:
“వస్తు జాలంలో చిక్కుకున్న మమ్ములని/అమాంతం పొంగిన సుద్ధ వాగు ముంచేసింది/సీసీ కెమెరాలు చూస్తున్నాయని మరిచి/వాగు నీళ్లల్ల ఏసంగిల పారిచ్చిన/దోసకాయలు ఇరుగ తిన్నం/కాళ్ళ కింద చలువ రాయి ఉన్నా/గుంచీలు తవ్వి గోటీలు, గిల్లి దండలాడినం/దిగుడు కాదు కదా పట్నంల/మట్టే కరువన్నది మరిచి”.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్దాల పాటు రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో పాఠాలను బోధించారు. ఆదిలాబాద్ అంటేనే అడవి. అడవి మీద, అడవి పుత్రులైన ఆదివాసి, గిరిజనుల మీద అమితమైన ప్రేమను ఈ కవిత్వాక్షరాల్లో కురిపించారు:
‘అడవి అడవంతా దాహానల జ్వాలాముఖి అవుతుంది/ ఒక నీటి చుక్క కోసం/ఒక తడి మబ్బు జాడ కోసం/ ఒక ప్రాణ వీచికా స్పర్శ కోసం/బీటలు వారిన నేల/ బెరడు రాలిన చెట్టు/సమస్త అరణ్యమూ/ లోకైక నిరీక్షణమవుతుంది’.
రాజ్ కుమార్ గారి కవిత్వంలోని సారవంతమైన వాక్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నేలపైన నెలవంకల్లా పలకరిస్తున్న ఆయన కవిత్వాన్ని ఒక్కసారైనా చదవాల్సిందే. ఆ పరవశభరితమైన అనుభూతిని అక్కున చేర్చుకోవాల్సిందే!
– గోపగాని రవీందర్
94409 79882











