దారితప్పిన జీవితాన్ని దరికి తెచ్చే “మళ్ళీ మనిషిలోకి”

సాహిత్యం

మనిషి జీవన ప్రయాణం గమనిస్తే , జీవన పరిణామంలో మనుషుల సమూహం కనిపిస్తుంది. ఆ సమూహంలో నుండి మనిషి పరిణతి చెందుతూ ఆధునికత వైపు అభివృద్ధి చెందుతూ వచ్చాడు. శుభకార్యాలైన, అశుభకార్యాలైన ఏదైనా మనిషి తన సమూహంతో గడిపేవాడు. నేటి పరిస్థితి దానికి పూర్తి భిన్న ధ్రువంలో ప్రయాణిస్తుంది.అభివృద్ధికై పయనిస్తూనే మనిషి తన అస్తిత్వాన్ని క్రమక్రమంగా కోల్పోతూ వస్తున్నాడు. ఇప్పుడు సమూహంతో పని లేకుండా ఎవరికి వారే అన్నట్టుగా జీవిస్తున్నారు. ప్రపంచమే తన చేతిలోకి (సెల్ఫోన్) వచ్చాక, ప్రపంచమే చాలా ఇరుకుగా అయిపోయింది. అందుకే మన కవి డా. ఉదారి నారాయణ గారు తప్పిపోయిన మనుషుల సమూహంను గూర్చి చెప్పుతూ మన ముందుకు “మళ్ళీ మనిషిలోకి”… అంటూ వచ్చాడు .

సాహితీ ప్రపంచంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచున్న కవి డా. ఉదారి నారాయణ. ఆదిలాబాద్ గిరిజన ప్రాంతంలో నివాసం ఉండి అక్కడి స్వచ్ఛమైన గాలి మరియు ప్రజల జీవన స్థితిగతులు తెలిసినవాడు కాబట్టి, వాటిని గూర్చిన వ్యక్తీకరణ తన కవిత్వం నిండా కనిపిస్తుంది. ఇలా మనుషుల పట్ల అపారమైన విశ్వాసంతో రాసిన వాక్యాలు ఈ కవితా సంపుటి నిండా మనల్ని పలకరిస్తాయి.వీరు రాసిన రేడియో నాటికలు ‘లోగిలి’ పేరుతో తెలంగాణ భాషా ముచ్చట్లు వందలాదిగా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారం అయ్యాయి .అంతేకాకుండా వివిధ పత్రికలో ‘మావూరి ముచ్చట్లు’ , సాహితీ వ్యాసాలు, కథలు మరియు సమీక్షలు ప్రచురితమయ్యాయి.

ఈ కవితా సంపుటిలోని “కాలనీ” అనే కవితలో ( పేజీ 25) కన్ను తెరిచినా మూసినా పిడికెడు మందితోనే/ ఎవరింట్లో వాళ్లే ఎవరెస్టులు/ జియో టవరుకు వేలాడే గబ్బిలాలు/వైఫైలు సెల్ ఫోన్లు కార్ల హెుయలు/ ఇంటి గుట్టును హుందాగా చూయించే/సైబర్ ఫిరంగులు.

నెట్వర్క్ సిగ్నల్ “వైఫై” ఉంటే చాలు, ఇక ఈ ప్రపంచంతో పని లేదన్నట్టుగా చాలామంది జీవించేస్తున్నారు. ఒక పెద్ద చెట్టుకి గబ్బిలాలు వేలాడిన లాగున నేడు మనిషి ఇంటర్నెట్ అనే చెట్టుకి తనను తాను వేలాడ తీసుకుంటున్నాడు. ఇక్కడ గబ్బిలంతో మనిషి జీవనగమనాన్ని ముడి పెట్టడం కవి యొక్క నేర్పరితనం కనిపిస్తుంది.

‘లేబర్ చౌక్’ కవితలో కార్మికుల యొక్క స్థితిగతుల్ని,పనికోసం తండ్లాడే ఆతృతను ఎంతో హృద్యంగా కత్వీకరించిన తీరు మనసును ద్రవీకరింపక మానదు.అలాగే ‘పెత్రమాస’ కవితలో.. ‘ఈ రోజు మా పెద్దలను ఇల్లంతా కండ్లతో మా ఇంటికి రమ్మంటాను’ అంటూ ప్రాణదాతలైన తల్లిదండ్రుల గురించి, ‘పల్లెబస్సు’ కవితలో ‘బస్సులోనే ఉదయిస్తాయి కొన్ని బతుకులు, సంసారాలు’ అంటూ పల్లె జీవనాన్ని కళ్లకుకట్టినట్టు చెప్పారు. ఆదిలాబాద్ పచ్చని అడవికి నిలయం. తన ప్రాంత అడవుల గురించి రాస్తూ ‘మూడాకుల తొడిమెలని జత చేసి తలపై కప్పుకుంటే ఆకాశమే ఆకుపచ్చని దుప్పటయ్యేది’ అంటూ మనసులమీదనే కాదు ప్రకృతి అడవులపై కూడా తన మమకారాన్ని అక్షరరూపంలో కవిత్వీకరించాడు.వీరి కవిత్వం నిండా ప్రతిఫలించిన సమాజం ఉంటుంది, మానవ సంబంధాలు ఉంటాయి, కావలసినంత జీవితానుభవం ఉంటుంది. కవిత్వం చాలా మంది రాస్తున్నారు కానీ, మనిషి జీవనంలోంచి, చుట్టూ పరుచుకొని ఉన్న పరిసరాల్లోంచి కవిత్వాన్ని అల్లుకొని రాసేవారు కొద్దిమందే ఉంటారు.ఆ కొద్దిమందిలో ఈ కవి ముందు వరసలో ఉంటారు .

“పెద్ద దర్వాజా” అనే కవితలో (పేజీ 58).

‘పిట్టరాని గూటిలో
పిల్లలు ఎంత నిరాధారమో
నాన్న లేని మా ఇల్లూ అంతే’
అంటారు కవి.

ఇది నాన్న ఔన్నత్యం గురించి చెప్పే కవిత. నాన్న ఎప్పటికి నాన్నే. మనం ఎంత ఎదిగినా, నాన్న మనతో ఉంటేనే జీవితానికి బలం. పిల్లలకోసం నిరంతరం తపించే వ్యక్తి, నాన్న శ్రమ చెమటచుక్కల నుండి ఎదిగిన వాళ్ళమే అందరం. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కవితలో నాన్నలోని ప్రేమను, పిల్లల ఎదుగుదల కోసం నాన్న చూపే కోపాన్ని గూర్చి రాస్తూ… నాన్నా! / మా జీవిత నాటకానికి / కనిపించని గొప్ప దర్శకునివి నువ్వే / కనిపించే రియల్ హీరోవి నువ్వే … అంటూ కవితని ముగిస్తాడు . ప్రతి ఒక్కరికి నాన్నేకదా నిజమైన హీరో.

మరో కవిత “చివరి జాము” లో ( పేజీ 66).

‘ఆవేదనా అశ్రు ధారలు,
నిరాశా నిప్పు రవ్వలు
మార్కెట్ స్మశానంలో పంటను
తగుల వెడ్తున్నపుడు
తెల్లారి నిజంగా ఎద్దు ఏడువదని
ఎవుసం కుంటు వడదని చెప్పలేము’

అంటూ ఎంతో ఆవేదన చెందుతాడు కవి.

నిజంగా మట్టి మనిషి అయిన రైతు ఆవేదనను, లోకమంతా బువ్వ పెట్టడానికి, తాను ఎన్ని కన్నీళ్ళగాయాల్ని భరించాలో, ఎన్నెన్ని చీకటి తెరల్ని దాటాలో, ఎన్ని మృత్యులోయల్ని తాకాలో!. వ్యవసాయం ఒకప్పుడు పండుగలా సాగేది. రైతే రాజు అనే నానుడి నుండి ఇప్పుడు దళారుల విషపు కోరల్లో, గ్లోబల్ మార్కెట్ వ్యాపార కుయుక్తిలో బంది అయిపోయాడు. అందరికీ అన్నం పెట్టే రైతు నేడు ఆదరణ కరువై, దేశానికే వెన్నుముకైన రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పుల్లో విలవిలలాడుతున్నాడు. రైతు యొక్క వ్యధలను, కన్నీళ్ళను అక్షరరూపంలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు ఈ కవితలో కవి నారాయణ గారు.

కరోనా మహమ్మారి ఎంత విధ్వంసం సృష్టించిందో అందరం కళ్లారా చూసాము. అప్పటి వరకు బిజీబిజీగా యాంత్రికంగా గడిపిన జీవితాలను ఎంతటి ప్రభావితం చేశాయో. అలాంటి కరోనా పరిస్థితుల గురించి చాల చక్కటి కవిత రాసారు నారాయణ గారు “కలల గూటిలో” అనే కవితలో ( పేజీ 74).

‘గంటల బండి మీద ఉరికి ఉరికి
ఆరోగ్యాన్ని ఆవిరి చేసుకున్నావు
పిల్లల నవ్వుల నీడలు పడకుండానే
ఇల్లాలినొసట సూర్యుడు మెరవ కుండానే
పైసల ప్యాసెంజరు వెంట పరిగెత్తావు
ఇప్పుడు సమయమే నీ కాళ్లకు చుట్టుకొని
బతిమిలాడుతున్నది
గడప దాటకని గడ్డం పడుతున్నది’

ఊపిరి సల్పని బిజీ జీవితంలో ఉదయం లేచి, బతుకు దెరువు కోసం వెళ్లి ఏ రాత్రికో ఇంటికి చేరే జీవితాల్లో ఒక్కసారి ఇంటి గడప దాటని సమయం వచ్చింది. భయంభయంగా, బిక్కు బిక్కుమంటూ ఇంట్లోనే గడిపిన విపత్కర సమయాలు. కరోనా మనకు ఎలా బతకాలో నేర్పింది. మనుషుల యొక్క విలువను తెలియజేసింది.

ఈ కవితాసంపుటి నిండా పల్లె జీవితాలు, పచ్చదనాన్ని పరుచుకున్న అడివి, అక్కడి యాస, భాష, కవి హృదయంలోంచి ఎంతో ఆర్ధ్రతతో అక్షరాలను కవిత్వీకరించిన కవితలు ఈ సంపుటి నిండా కనిపిస్తాయి. దీనిలోని కవితలు చదువుతున్నంతసేపూ నారాయణ గారి కవిత్వం మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. గడ్డుకాలాల్లో ఎలా జీవించాలో నేర్పుతుంది. ఇంకా మనిషి మనిషిలా ఎలా ఉన్నతంగా, ప్రేమగా ఉండాలో చెప్పుతుంది. జీవులలో కెల్లా మనిషి జీవితం చాల ఉన్నతమైనది. కానీ ఆధునికత పేరుతో, మనసుని ఇరుకుగా చేసుకొని అందరికి దూరమవుతూ ఒంటరిగా మిగులుతున్నాడు.

ఈ కవి మనుషుల పట్ల విశాల హృదయాన్ని కలిగి ఉన్నారు. అందుకేనేమో ఈ కవితా సంపుటికి “మళ్లీ మనిషిలోకి” అని చక్కటి శీర్షికతో మన ముందుకు వచ్చారు. డా. ఉదారి నారాయణ మరింత మంచి సాహిత్యాన్ని వెలువరించాలని అభిలాషిస్తూ, కవికి శుభాకాంక్షలు.

‘మళ్లీ మనిషిలోకి’ (కవిత్వం)పేజీలు:136, వెల ₹150లు. సంప్రదించవలసిన వారు 9441413666కు ఫోన్ చేయవచ్చు .

 

-గాజోజి శ్రీనివాస్
99484 83560

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *