బడ్జెట్ పై అన్నదాత అసహనం
(యం.వి.రామారావు,సీనియర్ జర్నలిస్టు)
ప్రత్యక్షపన్నుదారులు మూడురెట్లు పెరిగారని కేంద్రం గొప్పలు చెప్పుకుంది.అది తన ప్రతిభేనని చెప్పుకుంది.గురువారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమర్పిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు గర్వంగా చెప్పడం విశేషం.పార్లమెంట్ లో వరుసగా ఆరోసారి ప్రవేశపెట్టి మురార్జీ దేశాయ్ తో సమాన స్థానం పొందారు. పన్ను చెల్లింపుదారులు చెల్లించే ప్రతి పైస దేశ నిర్మాణంలో మూల ధనంగా మారుతోందని చెప్పారు.వారి పాత్ర మరింతగా పెరిగిందన్నారు. పన్నురహితం 7లక్షల రూపాయలు నుంచి మరోలక్ష ఈ బడ్జెట్ లో పెంచుతారని ఆశించిన పన్ను చెల్లింపుదారులకు మాత్రం బడ్జెట్ నిరాశ మిగిల్చింది. జీఎస్టీ నెలవారీ ఆదాయం 1.66కోట్లకు చేరడం సంతోషదాయకమైనా ఇది సక్రమంగా సద్వినియోగంకావాలి. పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం ఈ ఆదాయం సద్వినియోగం కావడం, వారికి ఉపాథి మార్గాల ద్వారా వాళ్లకాళ్లమీద వారు నిలబడేలా మారాలి. ముఖ్యంగా రైతులు స్వయంసంవృద్ధి కావాలి. ఈ బడ్జెట్ లో వ్యవసాయరంగానికి నూతన పరిజ్ఞానం జోడించడంద్వారా కొత్త ఆదాయమార్గాలు ప్రవేశపెడుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించడం వెనుక రైతుకు నేరుగా లభించే లాభం వివరించలేదు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువల జోడింపు ,వృథాను అరికట్టడం,గిడ్డంగుల నిర్మాణం,ప్రాసెసింగ్ కోసం ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు. కాని పంట చేతికి రావడం తోనే ఖర్చుల నిమిత్తంమొత్తం రైతు అమ్ముకుంటాడు. గిడ్డంగులు,ప్రాసెసింగ్ రైతుకు నేరుగా ఉపయోగపడవు. మధ్యదళారులకు,పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడానికి ఇవిఊతంఇస్తాయి.రైతుకు విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటుధర, మార్కెట్ సౌకర్యం , పంటబీమా సౌకర్యం కల్పించాలి. అవే నేరుగా ఉపయోగపడతాయి.బడ్జెట్ రూపొందిఅంచే ఆర్ధిక వేత్తలకు ఈ విషయం తెలియందికాదు. నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధి సాధించేందుకు కొత్తగా పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. అందుకు రైతులకు సబ్సిడీ పై విత్తనాలు, ఎరువులతోపాటు మార్కెట్ సౌకర్యం కల్పించాలి. ముందుగా ప్రచారం చేసి,అనువైన భూములను గుర్తించి రైతులకు ఆయా సౌకర్యాలను కల్పించి సక్రమంగా అమలు జరిగేలా చూడాల్సిఉంది. అలాగే పాడి అభివృద్ధి,డెయిరీ ప్రాసెసింగ్ లకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. భారతదేశ ఆత్మ వ్యవసాయరంగం. వ్యవసాయానికి పాడి తోడుగా ఉంటే పల్లెలు సంవృద్ధిగా ఉండి రైతులు బాగుంటారు.నేటి పల్లెలు అసలు వ్యవసాయం గిట్టుబాటుకాక రైతుకుటుంబాలు వలసలు పోతున్నాయి. పాడి పంటలు పరస్పర ఆదాయమార్గాలు.కాని నేడు యంత్రాల రాకతో పశువులను రైతులు పెఅంచడం లేదు.ముఖ్యంగా పాడి పశువులు పెంచడం తగ్గించారు.పాలఉత్పత్తికి గుజరాత్ తరహాలో కొత్త ప్రొత్సాహకాలు ప్రకటించాలి.పాడి లేకపోగా పొలాలు కౌలుకు ఇస్తున్నారు. అసలు రైతుకే గిట్టూబాటుకాని వ్యవసాయం కౌలురైతుకు మాత్రం లాభిస్తుందా అనేది జవాబులేని ప్రశ్న.ప్రభుత్వం కౌలు రైతుల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించాల్సిఉంది. అప్పుడే వ్యవసాయం దారిలో పడుతుంది. రైతు పండించడం మానేస్తే కంచంలోకి అన్నం రాదు.ఎన్ని పథకాలు ప్రకటించినా,ఎంత అభివృద్ధి జరిగినా రైతు పంట పండించపోతే అంతావృథా ప్రయాస. అందుకే ప్రభుత్వాలు ముందు రైతును, వారి సంక్షేమాన్ని చూసి మిగతాది చూడాలి. పన్ను చెల్లింపుదారులుపెరిగారు, ఆదాయం రెట్టింపు అయిందని బల్లలు చరచడం కాదు. ఈ ఏడాది ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాన్ని నివారించుట ఎలా అనేది ప్రశ్నించుకోవాలి .ఎస్ఎస్ జీల ద్వారా 9 కోట్ల మంది మహిళలు ఆర్థికంగా ఉన్నతి సాధించారని ప్రభుత్వం ప్రకటించింది.కోటిమంది లక్షాధికారులైరారని, మరింతమంది లక్షాధికారులు కావాలనేది లక్ష్యం గా చెప్పారు.ఒక పక్కన 7లక్షల రూపాయలు పన్ను పరిమితి అనడం మరోపక్క మహిళలను లక్షాధికారులు చేస్తాననడం ఆశ్చర్యం కలుగుతోంది.సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఈ పరిమితి విధించి మహిళను లక్షాధికారిని చేస్తామనడం వారి జీవనంలో ఇది ఏపాటిది.నారీశక్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం కాదు.వారికి పురుషులతో సమాన స్థానం లభించేలా ప్రభుత్వాలు ఆలోచించాలి. అత్యాచారాలు, వేధింపులు లేని భారత్ నిర్మించాలి. ఆర్ధిక అసమానతలు లేని దేశంగా మారాలి. అంబానీ,అదానీల స్థాయికి ప్రజలు ఎదిగేలా తలసరి ఆదాయం పెంచాలి.సంక్షేమం పేరిట లక్షల కోట్ల అప్పులు చేయడం కాదు.అప్పుడు తాకట్టు భారతంగా మారుతుంది.ఆ మేరకు పథకాలు రూపకల్పన చేయాలి.గ్రామీణ భారతం ప్రస్తుతం కుప్పకూలిపోతున్న వ్యవస్థ.దాన్ని పునర్ నిర్మాణం చేయాలి.అప్పుడే గాంధీ కలలుకన్న భారతం మళ్లీ కనులముందు సాకారమవుతుంది.