ప్రజారోగ్యానికి గ్యారెంటీ ఇవ్వలేరా..

ఎడిటోరియల్

*మనకు వచ్చే వ్యాధుల్లో 56 శాతం మనం తినే తిండి వల్లే..
*బద్ధకం వీడండి.. మన వంటింటి సమతుల ఆహారమే ఆరోగ్య సూత్రం..
*కల్తీ ఆహారాన్ని అమ్మే హోటళ్లు రెస్టారెంట్లు, బేకరీలపై ఉక్కు పాదం మోపాలి..
*ఆహార భరోసా పాలకుల, పాలితుల ఉమ్మడి బాధ్యతే..

ఆరోగ్యం చేజారితే.. కీర్తి, ధనం, గౌరవం, ప్రతిష్టలు ఇవేవీ మనిషికి ఆనందాన్ని, ఆయుష్షును ఇవ్వలేవు. అందుకే మనిషి ఏది సాధించాలన్నా ముందుగా కావలసింది ఆరోగ్యం. ఆధునిక కాలంలో నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో మనిషి సంపాదన ధ్యాసలో పడి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఇండ్లలో వంట చేసుకునే సమయం లేక, ఉన్నా బద్ధకంతో ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా ఫుడ్ తెప్పించుకొనే పరిస్థితి చూస్తున్నాం. ఇదే అవకాశంగా చేసుకొని కాలం చెల్లిన మసాలాలు కలిపిన పాడైపోయిన పదార్థాలు, ఘుమఘుమలాడే వాసనలు, ఆకర్షణీయమైన రంగులతో వేడివేడిగా వడ్డించే హోటళ్ళు, రెస్టారెంట్లలో జిహ్వ చాపల్యం మోజులో పడి తింటే మాత్రం అనారోగ్యం తప్పదు. ఈ జీవన శైలి మూలంగా వ్యాధుల బారిన పడుతున్నారు. మరోవైపు పదేపదే కాచిన నూనెల వినియోగం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. హోటళ్లలో ఫ్రిడ్జిలో నిల్వ ఉంచిన పదార్థాలు, నకిలీ వాటర్ బాటిళ్ళు, చాక్లెట్లు, మసాలాలు, చీజ్, సిరప్, శాండ్విచ్ బ్రెడ్ లను అక్రమంగా విక్రయిస్తున్నారు. అంతేకాదు పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, వంట గదులు అపరిశుభ్రం.. ఇలా రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీల్లోని ఆహార పదార్థాల పైపై ఆకర్షణకు లోనై కల్తీ ఆహార పదార్థాలు తిన్నవాళ్లకు తిన్నంత అనారోగ్యం అన్నట్లుగా మారిపోయింది.

ఈ బాగోతం వివిధ పత్రికల్లో పతాక శీర్షికల్లో రావడంతో రాష్ట్ర ఆహార భద్రత విభాగం గత 20 రోజులుగా 67 చోట్ల తనిఖీలు చేపట్టగా సగానికి పైగా పలు చోట్ల నిబంధనలను ఉల్లంఘించడం, ఆహార కల్తీ ఉన్నట్లుగా తేలింది. చిన్న చిన్న రోడ్డు మీద మోబైల్ ఫుడ్ సెంటర్ల నండి స్టార్ హోటల్ వరకు ఇదే పరిస్థితి ఉందనేది సత్యం. ఈ తనిఖీల్లో రుచి సంగతి పక్కన పెడితే, శుచి శుభ్రత, నాణ్యతలు మచ్చుకైనా కానరావడం లేదు. కల్తీ ఆహార విక్రయదారులను కటకటాల్లోకి పంపగా, వారికి బెయిల్ కోసం జడ్జి వద్ద ఓ లాయర్ ప్రయత్నించగా మీరు వాళ్ళు తయారు చేసిన కల్తీ ఆహారాన్ని తింటారా.. అని జడ్జి ప్రశ్నించగా సదరు లాయర్ బెయిల్ పిటిషన్ వాపసు తీసుకోవడం జరిగింది. పై సంఘటన తీవ్రత దృష్ట్యా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి జీవనశైలి, ఆహారపు అలవాట్లతో గణనీయమైన మార్పులు వస్తుండడం, ఇది ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతుండటం గమనార్హం. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడడం, వ్యాయామం లేకపోవడం, భోజనం, నిద్రకు సమయపాలన లేకపోవడంతోనే వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ ఆహారంతోనే దాదాపు 56 శాతం వ్యాధులు సంక్రమిస్తున్నాయి అనేది జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ ఐ ఎన్ )అంచనా. మంచి ఆరోగ్యం కోసం ఏం తినాలి? ఎప్పుడు తినాలి? వంటి అంశాలను “డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్స్” పేరుతో (ఎన్ ఐ ఎన్) తాజాగా విడుదల చేసింది. పోషకాహారంతో బీపీ, షుగర్, హృద్రోగం తదితర ముప్పులను తగ్గించుకోవచ్చు. ఉప్పు, చక్కెర ఎక్కువగా వుండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (చిప్స్ , బర్గర్లు, పిజ్జా, కూల్ డ్రింక్స్ తదితరాల) విషయంలో అప్రమత్తత తప్పనిసరి. జిహ్వ చాపల్యం మోజులో కంట్రోల్ తప్పితే ఇక ఆరోగ్యం సంగతి అంతే.

పోషకాహారంతోనే దీర్ఘకాలిక వ్యాధులకు దూరం. పోషకాహారం, శారీరక వ్యాయామంతో ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. కూరగాయలు, పండ్లు తప్పనిసరి. పోషకాహారం వల్ల అన్ని వయసుల వారికి వ్యాధుల ముప్పు తప్పుతుంది. “మై ప్లేట్ ఫర్ డే” కింద ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కనీసం 8 రకాల ఆహార పదార్థాలు ఉండాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇతరాలు కలిపి 500 గ్రాముల వరకు ఉండాలి. అందులో అందుబాటులో ఉండే పండ్లు100 గ్రాములు తప్పకుండా ఉంటే మంచిది. *రోజువారీ ఆహారం ఇలా ఉండాలి.. పండ్లు 100 గ్రాములు, కూరగాయలు 400 గ్రాములు, తృణధాన్యాలు 250 గ్రాములు, పప్పు దినుసులు, గుడ్లు, మాంసం 85 గ్రాములు, గింజ పప్పులు 35 గ్రాములు, పాలు లేదా పెరుగు 300 మి.లీ.లు, నూనె, కొవ్వు పదార్థాలు 27 గ్రాములు, ఇలా ప్రతిరోజు సమతుల ఆహారమే ఆరోగ్య సూత్రం. అధికంగా టీ, కాఫీలు తాగవద్దు. ప్రజలకు సమతుల ఆహారం అందజేసే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలి. ఇక్కడ సర్కారు ఒక్కరిదే బాధ్యత కాదు, ప్రజలు ఇందులో భాగస్వామ్యం అవ్వాలి. ప్రభుత్వాలు నిరంతర తనిఖీలు, పరిశీలన, కఠిన చర్యలతో సర్కారు శాఖలను ప్రజల గుమ్మాలు తొక్కే దాకా పరుగెత్తించాలి. ప్రజల్లో చైతన్య, అవగాహన కార్యక్రమం పెంచాలి. కల్తీ చేస్తున్న, నాణ్యత పాటించని వ్యాపారాలపై కొరడా ఝులిపించి సమతుల ఆహారం అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం సాధ్యమవుతుంది.

 

మేకిరి దామోదర్,
సామాజిక విశ్లేషకులు,
ఫోన్ :9573666650.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *