మూసకు మూత- ‘కొత్త తలుపు’ కథలు

సాహిత్యం హోమ్

కాళ్ళకూరి శైలజ వైద్యురాలిగా అటు మనుషులకు చికిత్స అందిస్తూ, ఇటు తన సృజనాత్మక కథల ద్వారా కథా సేద్యం చేస్తూ, సమాజానికి మానసిక చికిత్స అవసరమైన చోట చేస్తూ, స్వస్థత చేకూరుస్తూ రాసిన 15 కథల సంపుటి “కొత్త తలుపు”. పేరుకు తగ్గట్టుగా కథలన్నీ కథా సాహిత్యంలో కొత్త తలుపులు తెరుస్తున్నాయి. ప్రత్యేకమైన శైలిలో జెండర్ లిమిటేషన్స్ అధిగమించి కొన్ని కథల్లో పొయెటిక్ ప్రోజ్ వాక్యాలతో విభిన్న తరహా ఇతివృత్తాలు, పాత్రలు, వ్యక్తిత్వ వైవిధ్య వైరుధ్యాలను కథనం చేయటంలో వినూత్న పంథాలో సాగడం వలన ఇందులోని కథలన్నీ కొత్తగా పరిమళిస్తున్నాయి. వృత్తిలో ఎంత బాధ్యతగా ఉంటారో,రచన పట్ల కూడా అంతే బాధ్యతగా ఉంటారని పాఠకులు గ్రహిస్తారు. వృత్తి, పఠనం, లేఖనం, పర్యటనం ఆమెను కథకురాలిగా తీర్చిదిద్దాయి అనిపిస్తుంది. మరికొంత కథా చర్చలలో

కూడా పాల్గొంటూ కథలు, కథనంలో లోతుపాతులను గురించిన సమగ్ర అవగాహనతో కథావిష్కారం చేస్తున్నారనిపిస్తుంది.

వైద్య వృత్తిలో ఉండే వారికి నిత్యం ఆరోగ్య సమస్యలతో వచ్చేవారి నుండి ఆ సమస్యల మూలాలు కేవలం శారీరక పరమైనవే కూడా. మానసిక ఆర్ధిక సామాజిక పార్శ్వాలను తన స్టెత్ ద్వారా విని, అందులోని ఆంతరంగిక విషయాలను జనాంతికంగా మార్చి కథలుగా వెలార్చారనడానికి ఇందులోని కథలే సాక్ష్యం.

రచనకు సమయాన్ని కుదుర్చుకుంటూ లోకరీతి, విస్తృతి, మానవ జీవన వైవిధ్యాన్ని దర్శిస్తూ, ప్రాకృతిక సౌందర్యంలో సేద తీరుతూ ఎప్పటికప్పుడు దైనందిన జీవిత అవసరాలను వాటి ప్రాథమ్యాలను గుర్తించడం వల్లనే కథల్లో ఆ వైవిధ్యం కొత్తదనం పఠనీయత, భావ, భాషాభివ్యక్తికి దోహదం చేశాయని ఆమె పంచుకున్న ‘నా అంతరంగం’ నుంచి, కేఎన్ మురళీ శంకర్ ‘ఆప్తవాక్యం’ నుంచి పాఠకులు గ్రహిస్తారు.
__________________

ఈ కథా రచయిత్రి, కవయిత్రి విమర్శకురాలు వ్యాసకర్త అనువాదకురాలు యాత్రికురాలు అని తెలియ చెప్పడం వల్ల ఆమె ఇన్ని గురుతర బాధ్యతలను సక్రియంగా నిర్వహిస్తూ జీవితాన్ని, సాహిత్య వ్యాసంగాన్ని బ్యాలెన్స్డ్ గా నడుపుతున్నారని అర్థమవుతుంది.
___________________

మనుషుల్ని చూస్తూ, మనసులో కలిగే ఆలోచనలను 360 డిగ్రీల పరిధిలో అవలోకిస్తూ ఉండడం వలననే ఎన్నెన్నో కొత్త విషయాలు రచయిత్రి మనసులోంచి ఆమె కలంలోకి, అక్కడ నుంచి పాఠకుల మెదడులోకి సులువుగా సాఫీగా చేరిపోతున్నాయి అని కూడా అనిపిస్తుంది.

ఈ కథలను చదువుతూ, మనుషుల జీవితాల లోలోపలి పొరల్లోకి చొచ్చుకుపోగలిగితే ఎన్నెన్నో జీవిత సత్యాలు, రహస్యాలు ముత్యాలుగా ఏరుకోవచ్చు. మనుషులు తమ బిజీబిజీ రొటీన్ లైఫ్ నుండి బయటపడి ప్రకృతి ఒడిలోకి పోగలిగితే, ఆ పచ్చటి ప్రకృతిలో, పక్షులు ప్రవాహపు చప్పుళ్లలో వినిపించే సంగీత రవళులు- కాలుష్యం సోకిన మనసులను క్షాళనం చేసుకొని తిరిగి సరికొత్తగా జీవన యానం కొనసాగించవచ్చు- అతి నవ్యంగా.

మనసు కను రెప్పలకి రెక్కలు ఇచ్చి ఎగిరితే.. కనపడే ఆ లోకంలో ఎన్నో అద్భుతాలను తిలకిస్తూ, గాలిపటమై, డ్రోన్ తరహా విహంగ వీక్షణం చేయవచ్చు. అలాంటప్పుడు మనసు కాదు, దేహమే మనసుతో మాట్లాడుతుంది. మనకు అంతవరకు అంతగా పరిచయం కాని, ఈ పంచేంద్రియాల గూడు మొదటిసారిగా గొంతు విప్పుకోవడం గమనిస్తాం. ప్రకృతి కట్టే పూల గుత్తులు ఇకెబాన, మర్రిచెట్టు మొదట్లో పుట్టగొడుగులు, నాగమల్లి చెట్టు బోదిమీద శివలింగపు పూలు గుత్తులుగా కనబడడం అందులోని వివిధ వర్ణాలు ఆవిష్కృతం అవుతూ ప్రకృతి పరవశానికి అనుభూతిస్తూ అడుగులేస్తుంటే.. ఊరే మనకు దగ్గరగా, ఎదురుగా నడిచి వస్తుంది, మనకు అలుపు అలసట లేకుండా.

ఒరలోంచి బయటపడ్డ కత్తి అంచులు మెరిసినట్లు కథల్లోని కోర్ విషయాలు మురిపిస్తాయి. ‘బొమ్మల ఊరు’ కథలో కనిపించేవి దిష్టిబొమ్మలు కావు. అవి ఇరవై ఏళ్లుగా కాన్పులు, పిల్లల ఆట,పాటలు లేక, ఆ వృద్ధ పల్లీయులు అలా బొమ్మలుగా చేసి పెట్టుకున్నారని తెలిసి బ్రహ్మజెముడు ముళ్ళేవో మనకు గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది.

చక్ర భ్రమణం కథ, ఒక తత్వం గీతంలా జీవన వైవిధ్యాన్ని నిర్మలంగా సహజ ప్రవాహంలా దర్శింప చేస్తుంది. కర్ణాకర్ణిగా అన్నది కథగా కంటే ఒక ఆబ్ స్ట్రాక్ట్ చిత్ర ప్రదర్శన గాను, వరుస హైకూలు గాను కనిపిస్తాయి, వినిపిస్తాయి. ‘బ్రాండ్’ కథ, కథా ప్రపంచంలో ఒక ‘రిసార్ట్ ఇన్ సిటీ’ ని చూపిస్తుంది. ‘కొత్త తలుపు’ కథ, ఒక అప్ ట్రెండ్ రచయిత్రి బ్రాండ్ పడిన కథ. ‘తాకట్టు విడుదల’ కథ, పెట్టుబడిగా మారిన కథ. టౌన్- సిటీ అవుతున్న వేళ చితికి బతికిన కుటుంబాన్ని చూస్తాము.
_________________

ప్రతి కథాంశం క్రాపింగ్ తర్వాత ఒక అందమైన తలకట్టుగా మారినట్లు, జీవితం కుబుసం విడిచి చెప్పదలుచుకున్న విషయాన్ని పడగలా విప్పి, బహిర్గతం చేసినట్లు పాఠకులు గమనిస్తారు. కథలలోని సంభాషణలు కొలతలతో కత్తిరించి పెట్టుకున్న గుడ్డ ముక్కల్లా వ్యర్ధ ప్రలాపాలు లేకుండా సూటిగా సాగుతాయి.
___________________

కథలను ఆషామాషీగా కాకుండా సీరియస్ గా ఏకాగ్రతతో చదివించి ఆ కథాగమన వేగాన్ని అందుకొనేలా చేస్తాయి.. మనుషులు కొత్త మోడల్ కారును సునాయాసంగా ఎలా డ్రైవ్ చేయలేరో, కొత్త పద్ధతిలో రాయబడిన ఈ కథలను కూడా వేగంగా చదవడం అది లోపం కాదు. చినుకు భూమి లోతులకు చేరుకునేందుకు పట్టే సమయం. అనుక్షణం డ్రైవ్ ని ఫీల్ గుడ్ ఫీలింగ్ తో గమ్యాన్ని భద్రంగా చేర్చినట్లు పాఠకులు అనుభూతిస్తారు.

 

 

-మల్లేశ్వరరావు ఆకుల
79818 72655.