బతకనియ్యని గాయం..ఇంకా సలుపుతూనే వుంది

ఈ గాయం ఈ నాటిది కాదు. అందమైన కనుబొమ్మల్ని భయంకరంగా కత్తిరించుకున్న మానవత్వం, క్రమంగా దానవత్వపు గడపల్లో బ్రతకటం నేర్చుకున్న రోజునుంచి ఒక మనిషి మరో మనిషి జీవితం మీద కర్కశంగా చేసిన గాయమిది. ఆ గాయం నుంచి కారిన రుధిరం, విసిరివేయబడ్డ ఒక చరిత్ర పేజీలనిండా సిరాచుక్కలై ఇప్పటికీ పలకరిస్తూనే వుంది.

మనిషికే కాదు, గాయాలకు గుండె వుంటుంది. గాయాలు సలుపుతున్నాసరే ఎప్పుడో నలిపేసిన గొంతునుంచి ఒక సన్నటి మూలుగు మనకు వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని అర్ధం చేసుకునే భాష మనసుకు వుంటే, ఆ మూలుగే పదాలుగా మారుతుంది, వాక్యాలై పలకరిస్తుంది. కవితలై ఎగిరి మనముందు వాలుతుంది. అలా గాయాలతో వాలిన పావురాన్ని చేతుల్లోకి తీసుకొని రెక్కల్ని నిమురుతూ పేరడిగితే, కాలిన ప్రేగులనుంచి సగంకాలిన తన గుండె ద్వారాలను తెరుచుకొంటూ, మెల్లగా గొంతువిప్పి కేశవ కుమార్ తనకు పెట్టిన పేరు ‘ఎగిరే పళ్లెం, నడిచే మంచం, ఓ కూనిరాగం…’ అంటూ చెవిలో గుస, గుసలాడింది.

అలా ఆ తెల్లపావురాన్ని చేతపట్టి ఒక్కొక్క రెక్కనే విప్పుతూ, ఆ రెక్కల ఈకలు మోస్తున్న రాతల్ని తనివితీరా చదవటం మొదలు పెట్టాక, బతకనియ్యని ఓ గాయం..ఒక జాతిని ఇంకా ఎంత భయంకరంగా సలుపుతుందో, ఆ బాధను ప్రేమగా ఆలింగనం చేసుకుని ముద్దాడుతున్నప్పుడు నా వెనక నా నీడలో ఒక మనిషి కదులుతున్న దృశ్యం చాలా స్పష్టంగా కనపడుతోంది.
___________________

‘అంబేద్కర్ నా కవిత్వ చిరునామా…’ అంటూ సగర్వంగా ప్రకటించుకున్న ఈ కవి..కాలం జారుబండ మీద తాపీగా తిరుగుదామనుకున్నాడు కానీ, మనుషులంటే తెలియకుండానే బతికే కోణాల్లోకి విసిరివేయబడ్డాడు. కష్టాల కడలి అలల్ని ఈదుకుంటూ, తీరం అంచును పట్టుకుని నిటారుగా నిలబడి ఓ కాలజ్ఞానిలా ఈ ప్రపంచాన్ని ముద్దాడినప్పుడు, అప్పటి పాకలో చూరుపట్టుకుని కారిన వర్షపు చుక్క గట్టిగా చప్పట్లు కొడుతోంది. అదే రాజకీయం, అదే కల్లోల ప్రజాజీవితం, అదే నిరంకుశ పాలన, అవే మత హూంకరింపులు… ఏమాత్రం మార్పులు లేవు.
____________________

అభద్రత భవిష్యత్తులో ఊపిరాడని జనం ముందు, తనకు తెలిసిన భాషతో కేకలేస్తూ ఈ కవి ఒక నిరసన పత్రాన్ని లిఖిస్తున్నాడు. మృత ప్రవాహానికి అడ్డంగా ఈదే అడ్డగోలు మనిషిగా మారాలనుకుంటున్నాడు. కదలని కాలానికి సవాలుగా నిలిచి, ఇన్నాళ్లు సాగిలపడి, నేలనుండి కొలిస్తే అంగుళం కూడా జీవితంలో ఎదగని జనసమూహానికి కొత్త చరిత్ర అందించేందుకు తన ధైర్యాన్ని పాళీగా మార్చుకొని ఒక సైనిక కవాతుకు సిద్ధమవుతున్నాడు.

ఈ కవి దృష్టిలో తాను నడిసొచ్చిన దారంతా చీకటే. సూర్యుడు, చంద్రుడులేని దారుల్లో అతడు నడుస్తున్నాడు. ఇతడు ఊహల్లో ఊగిపోతూ కవిత్వం రాయలేడు. గత చరిత్ర కార్చిన కన్నీరంతా గుర్తుకొచ్చి సెలయేర్లనిండా సముద్రాలను మించిన ఉప్పు అతడ్ని పలకరిస్తోంది. అడవి గర్భాన్ని కూల్చిన ప్రోక్లేన్ గాట్లులా అతని వొళ్లంతా ఇంకా సలపరిస్తున్న జ్ఞాపకాలే. ఈ కారణాల చేతనే ఎవరి రాతల్లో ఇంకని బ్రతుకు ప్రయాణాన్ని తన జాబితాలో రాసుకొన్నాడు.

ఒకచోట ఈ కవి ఇలా అంటున్నాడు… ‘అక్షరాలకు అవతల ఇంకా మిగిలిపోయిన వేదన నాది/నేను నిత్యం కాలుతున్న కడుపుమంటని/చేతనయితే అక్షరాల్లేని భాషలో నన్ను హత్తుకో/నేను మలాన్ని చేత్తో ఎత్తేసినట్లు…’ అంటూ తాకిన ఈ మాటలు మనసున్న ఏ మనిషినైనా కదిలించి, కరిగించి, ద్రవింపజేస్తాయి. ‘ఇప్పుడు యంత్ర నగరాన్ని నిద్రపుచ్చే మంత్రం కావాలి/మంత్ర నగరితో/మాట్లాడే ధైర్యం కావాలి/కొత్త వాక్యాన్ని తోడు తీసికెళ్లాలి/ మనమున్న అగాధ లోయల్లోకి/మాయలేని మంత్ర నగరంలోకి…’ అంటూ ఎండిన డొక్కలు, వంగిన వెన్నుపూసలు, నడవలేని కళేబరాళ్లు, ఎటుచూసినా విరగబడి పండిన కన్నీళ్లు…వీటి మధ్య నిలబడి వూరిమీద ఉరిమిచూస్తున్న అంబేద్కర్ బొమ్మ ఆత్మగౌరవానికి తలవంచి నమస్కరిస్తున్నాడు ఈ కవి.

తర, తరాలుగా కారిన కన్నీటి చారల తడిని ఇంకా తడిమి చూసుకుంటూ… ‘మెరుపులా/ఒక పిడుగొచ్చి/గత శబ్దాలన్నిటినీ/చెరిపేస్తే బాగుణ్ణు/వచ్చే వానజల్లుకి/వరదలా కర్మఫలాలన్నీ/కొట్టుకెళ్తే బాగుణ్ణు…’ అంటూ వ్యక్తపరిచిన ఈ మాటల పొరల్లోకి ఒక్కసారి తొంగిచూస్తే, కాలం క్యాలెండర్ మీద పేరుకుపోయిన బురదరంగు ఎంత అసహ్యంగా వుందో తెలుస్తోంది. పగిలిన అద్దంలో కవి తన ముఖాన్ని చూసుకుంటున్నాడు. ఆటల్లో అవహేళనని, వినోదాల్లో వెటకారాన్ని తనమీద నిప్పుల్లా కురిపించిన వాళ్లు తినే ప్రతి ముద్దమీద తన చెమటముద్రలే కనిపిస్తున్నాయి. అవతలివాళ్లు ఒక వికారమైన నాగరికతకు హక్కుదారులైతే, తానుమాత్రం నేలతల్లి ఆలింగనాలతో నాగలికి మరోరూపంగా మారిపోతున్నాడు. పగిలిన అద్దంలో అతని ముఖం వెయ్యి ముక్కల్లా కనిపించడం లేదు. మరచిన చరిత్రలో అతని చిరునవ్వు, విప్పిన జ్ఞాపకాల పొట్లంగా కనపడుతోంది. కాలానికి ఎదురుగా నిలబడ్డ ఈ కవి, తనకు తానే కొత్త భాషగా ఆవిష్కరించుకుంటూ.. ‘నేనిప్పుడు చరిత్రను కాదు సజీవ సత్యాన్ని/నేను నిత్య గాయాల ప్రతిబింబాన్ని…’ అంటూ చుక్కల చీరలో చిరిగిన పాటని చుట్టుకుని చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఇంటిలోపల బందీ అయిన తాను, నేరం తేలకుండానే జైల్లో శిక్ష అనుభవిస్తూ, నిశ్శబ్దాన్ని నములుకుంటూ చీకటి గదిలో గోడలకు మాత్రమే తెలిసేలా తనలో తాను మాట్లాడుకుంటున్న మిత్రుడు గుర్తుకొచ్చిన సందర్భమిది. ఊరుల్లోంచి, వేదనల్లోంచి, అవమానాల్లోంచి, అణిచివేతల్లోంచి, తానూ తన మిత్రుడు యూనివర్సిటీలోకొచ్చి, ఆత్మగౌరవ పాఠాల్ని పరిచయం చేద్దామనుకున్న సంగతులన్నీ గడియారంలోని ముళ్ల మీద నిలబడి కరచాలనం చేస్తున్నాయి.

‘ఈ గాంధీ జయంతినాడు/ఎక్కడా మాంసం కూడా దొరకదు/మనుషుల వేటమాత్రం సాగుతూనే వుంది! /మేమేమో/ నిత్యం నిఘా జైలులోనే!…’ అంటూ తెలియకుండానే కవి కనురెప్పల మధ్య ఊరుతున్న తడి మనల్ని తట్టి మరీ మాట్లాడుతోంది. ‘ఇప్పుడు నేను మనిషిని కాదు/జ్ఞానాన్ని, చరిత్ర చోదకుడ్ని కాదు/కోపాన్ని, కసిని అంతకన్నా కాదు/నేను పన్నెండంకెల సంఖ్యని మాత్రమే/సంఖ్యలో ఇంకిపోయిన నేను/నన్ను నేను మరిచిపోయి/కాగితం ముక్కమీద నెంబర్…’ అంటూ ఈ కవి తన అస్తిత్వాన్ని వెతుక్కుంటూ సాగిపోతున్నాడు.

కవికున్న అద్భుతమైన ఊహాశక్తి పదే, పదే చాలా కవితల్లో తొంగిచూస్తూ మన ఆశ్చర్యానికి తెరలు తీస్తోంది. ఆకాశంలో మేఘాలు మాయమయ్యాయి. చూస్తే వాటిని రైతు కోసుకెళ్లి నెర్రెలిచ్చిన పొలంలో చల్లుతున్నాడు. మారాం చేస్తున్న పిల్లాడికి ఓ అమ్మ చందమామను కిందికి దింపి గోరుముద్దలు చేసి తినిపిస్తోంది. చీకటి పడకముందే నక్షత్రాలన్నిటిని నోటికి కరచుకొని పిట్టలు ఎగిరిపోతున్నాయి. మార్కెట్ లో తప్పిపోయిన భూమిని గురించి, ప్రపంచాన్ని వదిలి పారిపోయిన సూర్యుడి గురించి వెతుకుతున్న నేపథ్యంలో నీలి ఆకాశం వెలుగు చుక్కల మధ్య, చల్లని చందమామ బొమ్మ, ఆదివాసుడి అందమైన కవిత్వం, దొరికిన అజ్ఞాత సూర్యుడి ఆచూకీ!… ఇవన్నీ కవితా శిల్పానికి కవి అద్దిన సొగసులుగా సంతకాలు చేస్తున్నాయి.
__________________

కేశవకుమార్ కవిత్వాన్ని చదివాక అందులోని వాక్యాలు రెక్కలు విరిగిన తూనీగ గుండె సవ్వడుల్ని మనకు వినిపిస్తున్నాయి. చరిత్రపుటల నుండి రాలుతున్న అబద్దాల అవశేషాల నుంచి అసలు నిజాల రూపాలు తిరిగి ప్రాణవాయువును పొంది ముత్తాత వేటకొడవలిని, నిప్పురాయిని చేత్తో తిప్పుతూ విన్యాసాలు చేస్తున్నాయి. గాయాలు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ…‘ఎవడి బతుకు యుద్ధం/వాళ్లని చేసుకోనివ్వండి/ యుద్ధ దారి మళ్లించకండి/మీ తెలివైన అతి మాటలతో…’ అంటూ మనుషులంటే ఘనీభవించిన కాలం కాదనే ఒక తీర్మానాన్ని కవి తనదైన శైలిలో చాలా బలంగా ప్రవేశపెడుతున్నాడు.
_____________________

ఈయన కవితలలోని పదాలలో అక్షరాలుండవు. అన్నీ ఆయుధాలే. ‘ఇప్పుడు మా అస్తిత్వమే మాకు ప్రశ్న అవుతోంది…’ అంటూ ఎర్రబడ్డ కవి చూపులనిండా కనిపిస్తున్న రక్తచారికలు రేపటి మేలుకొలుపుల పోరాట పాటలను పాడుతున్నాయి. సామ్రాజ్య రోబోల మేధస్సు మీదెక్కి చిందులేసే మట్టిమనుషుల మహామానవ సామ్రాజ్య సరిహద్దులు కనపడుతున్నాయి.

ఒక పోరాటాన్ని తన కవిత్వానికి కవచాన్ని చేసి యోధుడిలా కలాన్ని ఖడ్గంలా తిప్పిన కేశవకుమార్ గళం నుండి తాకిన ప్రతి శబ్దం ఇన్నాళ్ల నిశ్శబ్దాన్ని తునాతునకలు చేస్తోంది. వైవిధ్యాన్ని సుగంధంలా అద్దుకున్న ఈ కవి కవిత్వం ఇక్కడ ఒకప్పుడు భూగోళం ఉండేదన్న నిజాన్ని గుర్తుచేస్తోంది. భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు సాక్షిగా దాచుకున్న కన్నీళ్లను రంగులుగా మార్చుకున్న కవితల్లోని పదజాలం, కాలపు వొడ్డున చెట్టుమీద ఒక పిట్ట పాడిన పాటను, ఆ పాట మైమరుపులో పొలం గట్టున నాగలి పట్టుకు నడిచిపోయే మట్టిమనిషి వర్ణ చిత్రాలను చిత్రీకరిస్తోంది. ఆకాశం నిండా పరుచునేలా, సముద్రపు హెూరులో, సూర్యుడి సంగీతంలో అక్షరాలు నేరుగా మనిషి రూపంలోకి మారే చరిత్రకు ‘ఎగిరే పళ్లెం, నడిచే మంచం, ఈ కూనిరాగం’ సంపుటిలోని కవితలు పేజీలుగా మారిపోతున్నాయి.

ఈ సందర్భంగా సారవంతమైన సాహిత్యాన్నే కాదు, తన ఆగ్రహాన్ని, తన వేదనను, తన కన్నీళ్లను, తన తిరుగుబాటును చాలా సమర్థవంతంగా కవిత్వ రూపంలో అందించిన కేశవకుమార్ కు అభినందనలు.

 

-‘సాహిత్య ప్రపూర్ణ’
డాక్టర్ కె.జి. వేణు
98480 70084