మానవ సంబంధాల అనుభూతులతో పెనవేసుకున్న – మమతల పందిరిలోకి రండి

సాహిత్యం

తెలుగు ఉపాధ్యాయురాలుగా తనవంతు భాద్యతలను నిర్వహిస్తూనే, ఇటు కవయిత్రిగా, రచయిత్రిగా సాహితీరంగంలో కృషి చేస్తున్నారు. ప్రజా సాహిత్య సంస్కృతిక నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీమతి మర్రి జయశ్రీ బాల్యం నుంచే తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ఐదవ తరగతి నుంచే చిన్న చిన్న కవితలు కథలు రాస్తూ రచనా వ్యాసంగాన్ని మెరుగుపరుచుకుంటు వస్తున్నారు. వీరి నాన్నగారు శ్రీ మర్రి రామస్వామి గారు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆదర్శ ఉపాధ్యాయులు కావడం తండ్రి ప్రోత్సాహం స్ఫూర్తితో తనని తను మెరుగులు దిద్దుకుంటు సాహిత్య ప్రయాణం కొనసాగిస్తున్నారు.
వివిధ సామాజిక అంశాలపై స్పందిస్తు, తన మనోభావాలను, మానవతా దృక్పథాన్ని జీవన సౌందర్యాన్ని, సామాజిక స్పృహను, చైతన్యాన్ని మమతల పందిరి కవితా సంకలనంలో పంచుకుంటున్నారు. ఈ సంకలనం కవయిత్రి మొదటి కవితా సంకలనం ఒక విధంగా ప్రత్యేకమైనది, మొదటి పుస్తకం వెనుక ఒక సాధన, వడపోత, నీరిక్షణ ఇలాంటివెన్నో కలగలిపి ఉంటాయి. ఉహ తెలిసిన నాటి నుండి అల్లుకున్న భావాలు ఇందులో ఉన్న యాబై ఎనిమిది కవితలలో పంచుకున్నారు. అంతరించిపోతున్న మానవ సంబంధాలను గురించి సూటిగా చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వలన నిరంతరం విద్యార్ధులతో, పిల్లలతో కవితల రూపంలో సంభాషణల రూపంలో పంచుకోవడం, తరగతిగదిలో పాఠాలను కొత్తగా చెప్పడం కోసం నిరంతరం పరిశ్రమ చేయడం, వాటికి సాహిత్య, సమకాలీన సామాజిక అంశాలను జోడించి పిల్లల్లో ఆసక్తిని నింపడం పిల్లలను ప్రోత్సాహించడం, వాళ్ళలో ఉత్సాహం నింపడం కోసం సాహిత్య ప్రక్రియలను ఉపయోగించడం మర్రి జయ శ్రీ ప్రత్యేకత.
‘మమతల పందిరి’కి అల్లుకున్న స్నేహాలతలు, పుష్పలతలు ప్రేమలతలతో అల్లుకున్న అనేక కవితలు మనకు స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా మహిళలు అనేక సామాజిక కుటుంబ వృత్తిపరమైన ఒత్తిడుల మధ్య రచనా వ్యాసంగం కొనసాగించడం గొప్ప విషయం కవయిత్రి మర్రి జయశ్రీ తను ఎంచుకున్న ఏ అంశాన్నయినా తనదైనశైలిలో కవిత్వం చేయగలరు. నిజానికి మొదటి పుస్తకంలోని కవితల ఆధారంగా కవయిత్రి దృక్పధాన్ని, అభిప్రాయాలను పూర్తిగా అంచనా వేయలేం, సులభమైనశైలి సరళమైన భాష ఈ కవితలలో కనిపిస్తుంది. ఈ సంపుటిలోని కవితలను జాగ్రత్తగా గమనిస్తే వస్తువు ఎంపికలో కవయిత్రి సామాజిక స్పృహ, కనిపిస్తుంది. తండ్రి రామస్వామి నుండి వారసత్వంగా భోదనాకళను అందుకున్న మర్రి జయశ్రీ ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూనే సాహిత్య సామాజిక సేవా కార్యక్రమాలలో తనదైన స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. బడిపిల్లలను సాహిత్యాభిలాషులుగా తీర్చిదిద్దడంలో ఒక భాషోపాధ్యాయురాలుగా ప్రత్యక శ్రద్ధచూపిస్తున్నారు మర్రి జయశ్రీ.
ఈ సంకలనంలో అనేకమంది మహానీయుల స్ఫూర్తిని, స్మృతిని కవితలుగామలిచారు. ప్రతి కవిత ఎంతో సందేశాత్మకంగా ఉండి. కవయిత్రి తన కవితల్లో సమాజంలో పేరుకుపోయిన అనేక సమస్యల్ని కలం కన్నుతో దర్శించారు. తన కళ్ళముందు కనిపించే సంఘటనల్ని కవిత్వం చేశారు. కవయిత్రిగా తన సామాజిక బాధ్యతను నెరవేర్చారు.
సమాజాన్ని చైతన్యపరచడంలో సాహిత్యానిది ప్రత్యేక పాత్ర అటువంటి ఉన్నత భావాలతో తన కలాన్ని కదిలిస్తూ తనవంతు పాత్రను సామాజిక బాధ్యతను, కవయిత్రిగా, రచయిత్రిగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా నిర్వహిస్తున్నారు. మర్రి జయశ్రీ. ఒకవైపు సాహిత్యంలో రాణిస్తూనే మరోవైపు సమాజంలో సాహిత్యం పాత్రను తెలియజేయడానికి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంఘసేవకురాలుగా సాహితీవేత్తగా పలు విధాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మర్రి జయశ్రీ అభినందనీయురాలు, ఉత్తమ ఉపాధ్యాయురాలిగా వివిధ సంస్థల నుండి అనేక పురస్కారాలు అందుకున్నారు.
‘మమతల పందిరి’ సంకలనంలో ఎంపికచేసుకున్న కవితా వస్తువులను కవితాత్మకంగా మలవడంలో మరింత దృష్టి పెడితే బాగుండేనని అనిపించినప్పటికీ ఆమెకు దేశంపట్ల, సంస్కృతిపట్ల ఉన్న శ్రద్ధను అభినందించి తీరుతాం. ఆమె మున్ముందు కవిత్వసృజనలోని మెలకువలను తెలుసుకొని తన కలానికి పదును పెట్టుకోవాలని కోరుకుంటూ వీరి కలం నుండి అనేక గ్రంథాలు వెలువడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కవయిత్రికి హృదయపూర్వక అభినందనలు.

మోతుకూరు శ్రీనివాస్
అనంతుడు ఫౌండేషన్
9030061350 / 9866061350