నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే అనేక విషయాల ద్వారా, వివిధ అంశాల నిశిత పరిశీలన ద్వారా, మనకు సిద్ధించే అనుభవ జ్ఞానం ద్వారా లోకంలోని సమస్త వస్తు సంచయాన్ని, జీవితాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ స్థితిలో కవికి ఎదురయ్యే అనుభవాలలో, ఆశ్చర్యాలలో, ఆనంద విషాదాలలో… ఆ దృశ్యానికి ఎలాంటి పటాటోపం లేకుండా, డాంబిక పద ప్రదర్శన లేకుండా, సరళంగా, యథాతథంగా హృదయ సంవేదనకు అక్షర రూపం ఇవ్వడమే హైకూ.
___________________
‘మనం బతికిన క్షణాల్ని ఇంద్రియ గోచర దృశ్యాల ద్వారా ప్రకటించడమే హైకూ పని. ఆ క్షణాల్ని వివరించడం గానీ, సమర్థించడం గానీ లేదా దానికి ఏదైనా తాత్విక, రాజకీయ వ్యాఖ్యానాన్ని ఇవ్వడం గానీ హైకూ పని కాదు’ అని ‘ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆన్ ద వెబ్’ అనే వెబ్సైట్లో అన్నారని చినవీరభద్రుడు గారు, డా. ఎన్. శైలజ గారి ‘బాల్కనీలో పిచ్చుక’ హైకూ పుస్తకం గురించి రాస్తూ పేర్కొన్నారు. ఆయన ఇంకా ‘మనుషుల మధ్యా, ప్రకృతి మధ్యా, మారే ఋతువుల మధ్యా దినదినం అత్యంత మధురంగా వినిపించే జీవన సంగీతాన్ని అందుకోవడంలో, ఒకటి రెండు సూచనలతో విశాలమైన స్ఫురణని అందివ్వడంలో హైకూ సున్నిత మనస్కులూ, భావుకులూ అయిన కవులకు ఒక విశిష్టమైన పరికరంగా అందుబాటులోకి వస్తుంది.’ అన్నారు.
_______________________
హైకూ కవి తన స్వీయానుభవాన్ని వ్యక్తం చేస్తాడు. కానీ, తాను దర్శించే, అనుభవించే ప్రతి విషయం నుండి తనను తాను విడదీసుకుని, నిరపేక్షగా వ్యాఖ్యానించవలసి ఉంటుంది. ‘Attachment with detachment’ (మమకారంతో కూడిన అనాసక్తి) సాధన చేయవలసి ఉంటుంది. కానీ, నేటి సంక్లిష్ట జీవన పరిస్థితులలో సగటు మనిషి జీవన మూలాలు అన్నీ తెగిపోయి, కులవృత్తులు ధ్వంసమైపోతున్న ఈ కార్పొరేట్ ప్రపంచీకరణ దుమారంలో, హైకూ కవి అనివార్యంగా ఈ అసంగత్వ స్థితి నుండి బయటకు వచ్చి తన ఆవేదనలని, తన మూలాల అస్తిత్వ పోరాటాల్ని, అసమంజస సామాజిక అస్తవ్యస్తతను కూడా పలకాల్సి వస్తోంది.
ఇటువంటి సందర్భాలలోనే జపనీయులు సృష్టించిన మరో సమాంతర హైకూ రూపం ‘సెన్ ర్యూ’. సెన్ ర్యూ (Senryū) అనేది జపనీయ ప్రాస రహిత, మూడు పాదాల కవిత. ఇది నిర్మాణంలో హైకూను పోలి ఉన్నప్పటికీ, ప్రకృతి కంటే ఎక్కువగా మానవ స్వభావం, బలహీనతలు మరియు దైనందిన జీవితంపై దృష్టి సారిస్తుంది. ఇందులో ప్రకృతి కంటే హాస్యం, వ్యంగ్యం లేదా విమర్శ ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రూపం, నిర్మాణం అంతా హైకూనే పోలి ఉంటుంది. సారంలో మాత్రం మానవుని చిత్త ప్రవృత్తి మీద, డాంబికాల మీద, ద్వంద్వ ప్రవర్తనల మీదా, సామాజిక అసమానతల మీద, మానవ బలహీనతల మీద హాస్యస్ఫోరకంగా చురకలు వేస్తుంటుంది.
నిజానికి ఇటీవల వచ్చిన తమిళ హైకూల తెలుగు అనువాద సంకలనం ‘దిగులు కొంగ’ పుస్తకాన్ని ఆశగా, ఆత్రంగా తెరిచి చదివినప్పుడు నాకు అందులో హైకూల కన్నా ‘సెన్ ర్యూ’లే ఎక్కువగా పలకరించాయి. ఒకటి చూడండి, మీకే అర్థమవుతుంది:
కుబేర మూల
గోడ నిండుగా
అప్పు లెక్కలు
— (అలివేలు మంగై – వెన్మన్నతూర్)
దీనికి వ్యాఖ్యానం కూడా అంత అవసరం లేదు. మన నమ్మకాల మీద కాల్చి పెట్టిన ఒక చురక ఇది. ఇంకా చూడండి:
ఊరంతా శ్మశానం
కులం మాత్రం
కాలనేలేదు
— (మునియర్ ర. ముత్తుపాండి)
ఇక్కడ దిగులు స్థానే ఒక వేదన, అనుభూతి స్థానే ఒక చేదు అనుభవం వెంటాడుతుంది. ‘సెన్ ర్యూ’ సామాజిక అంశాలకు అందుకే సరిపోలుతుంది.
మనలాగే
నటిస్తోంది
మన నీడ కూడా
— (ఎమ్. సోలై – అంబత్తూర్)
నవ నాగరిక సమాజంలో మానవ ద్వంద్వ ప్రవృత్తికి ఇది నీడలా లేదు?
పేదరికంతో చదువుకొని
మధ్యలోనే ఆపేశారు..
ఎదురింటి లక్ష్మీ సరస్వతులు!
— (ఓవియా నాగేంద్రన్ – తిరుమోగుర్)
దుఃఖానికి అతీతమైన హృదయ సలుపు ఇది. దిగులు కూడా బొగులు పోయే కవిత ఇది.
అమ్మకానికొచ్చిన
చేప కళ్ళలో
ఎండిన సముద్రాన్ని చూస్తున్నా
— (రాజ కుమార్ – తిరుపత్తూర్)
ఈ ‘సెన్ ర్యూ’లో మానవుడు తన భృతి కోసం పడే తిప్పల్లో కూడా సహజీవుల జీవిక పట్ల సహానుభూతి చూపడం కనిపిస్తుంది. ప్రకృతి ఆహార చక్రంలో సమస్త ప్రపంచమూ పడి తిరగాల్సిందే కదా! ఇటువంటిదే మరొకటి:
గాలానికి చిక్కిన
చేప కళ్ళల్లో
నది పారుతుంది
— (పిత్తన్ వెంకటరాజ్ – చెన్నై పల్లాపరం)
విస్థాపితుడైన మనిషి కళ్ళల్లో, కలల్లో తాను నడయాడిన ఊరు తిరుగాడదా? ఇదీ అంతే!
నీళ్ళ కొళాయిల దగ్గర
గొడవలు
నిండి పొర్లుతున్నాయి మాటలు
— (బాల కుమార్ సుబ్రమణ్యన్ – చిన్న మన్నూర్)
చిరు హాస్యంలోనూ మరచిపోలేని జీవన విషాదం ఉంటుంది. నీళ్ళ కోసం పెట్టుకున్న తగువులాటలో ఎన్ని మాటలు వృథా అవుతున్నాయి? మానవుడి అభిజాత్యానికి ఇంకెన్ని బలి కావాలి? ‘ఇసుక దొంగకీ / ఓ ఏరు కావాలి / వాడి అస్థికలు కలిపే దినానికి’ అని ఉసూరుపడి, మనం ఏమీ చేయలేక మనసుని ఊరడించుకుంటాము. ‘బుడ్డలమ్మే బిడ్డలకూ / బుడ్డలు / కొనే వయసే’ అని సరిపెట్టేసుకుంటాము ఇలాంటి మనసును నలిపేసే దృశ్యాలను చూసి.
ఇవన్నీ సమాజ అసహజ చలనానికి, అసమతౌల్యానికి, దుర్భర వాస్తవాలకు సాదృశ్యాలు. నిత్యం కళ్ళకు ఎదురయ్యే కన్నీటి గాథలు. మనిషిని అణిచిపెడతావు, మరి మనసుని? ఎదుటి మనిషి మనసుని అణిచిపెట్టి అదుపు చేయగలవా?
తాళమేసిన ఇంట్లో
రాత్రంతా గుర్రపు స్వారీ
అక్క కలలో రాజకుమారుడు
— (హంస ప్రియ – పొల్లాచ్చి)
ఈ ఊహా స్వైరవిహారాన్ని ఏ శక్తీ ఆపలేదు. మనసు లేని మనిషిని ఆధీనంలో, అధికారంలో ఉంచుకొని, దాష్టీకం చేసి ఏం సాధిస్తావు? ఉండకూడని ఇటువంటి వాటితో నిండిన సమాజంతో ముడిపడిన మానవుడిని ‘సెన్ ర్యూ’ ఎండగడుతుంది. మరొకటి.. తన ఉనికిని తానే చెరుపుకునే మనిషి గురించి: ‘చెట్టు నీడలో / మాట్లాడుతున్నారు / నరికే రోజు గురించి’. ఇందులో ‘కిరెజి’ వాడి ఉంటే, అది మనల్ని తాకే తీవ్రతలో ఇంకా తేడా ఉండేది.
‘దిగులు కొంగ’లో నాకు తారసపడిన నిజమైన హైకూలు కొన్నే.
పగిలిన
మట్టి కుండలోనూ
కొంచెం నీళ్ళు
— (ము. మురుగేశ్ – వందవాసి)
ఆ మిగిలిన కొంచెం నీళ్ళ వైపు చూడటమే, మరిన్ని నీళ్ళు వృథా కాకుండా కాపాడుకోవడమే, ప్రకృతిలో మన పాత్రని సక్రమంగా నిర్వహించడమే హైకూ తత్వం మరియు సారం. రూపంలో ఇది 5-7-5 మాత్రలు తీసుకోవడానికి కారణం – మనిషి తీసుకునే ఏకశ్వాస భరిత సమయం 17 మాత్రల కాలానికి సమానం అని జపనీయుల విశ్వాసం. అందులోనూ హైకూ మూడు పాదాలుగా, రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి సందర్భం లేదా దృశ్యం అయితే, రెండోది ఆ దృశ్యం నుండి ఉద్భవించే జ్ఞాన సంచయం.
________________
హైకూ చదువుకుంటూ పోయే విరిచిన వాక్యంలా ఉండకూడదు. విభజన పదం (కిరెజి – Kireji: A verbal ‘cut’ that creates a pause) ఉండాలి. జపనీయ హైకూలలో సాంప్రదాయిక విధిగా, ఖచ్చితంగా పాటించే మరో నియమం – కాలాన్ని లేదా ఋతువును సూచించే పదం (కిగొ). కానీ హైకూ సమాంతర రూపమైన ‘సెన్ ర్యూ’లో ‘కిగొ’ ను విధిగా పాటించరు. జీవితానికి సంబంధించిన ఒక బెంగ, నశ్వర వస్తువుల పట్ల ప్రేమపూర్వక దిగులు, సమస్త జీవుల పట్ల అంతర్గత జాలి, దయ, పరివేదన అంతర్లయగా హైకూలో వ్యక్తమైతే, ఆ అనుభూతి తరంగాలు మన హృదయంలో సుడి తిరుగుతూనే ఉంటాయి.
____________________
‘దిగులు కొంగ’లో హైకూ నిర్మాణం పెద్దగా పాటించినట్లు లేదు. విభజన పదం ‘కిరెజి’ లేదు. చాలా కవితల్లో ‘కిగొ’ లేదు.
కోయిల కూత తర్వాత
తిరిగి వస్తుంది
చెట్టుకు ప్రశాంతత
— (అయ్యప్ప మాధవన్ – కోవై)
దీనినే మనం ఇలా కూడా అనవచ్చు: ‘కోయిల కూత తర్వాత తిరిగి వస్తుంది’ అని అన్నప్పుడు ఒక ‘కిరెజి’ (విరామం) ఇచ్చినట్లయితే, ఆ అనుభూతిలోంచి ఒక జ్ఞాన సంచయం ఉబికి వస్తుంది. అదే ‘చెట్టుకు ప్రశాంతత’ అన్న మాట. ఆ మాట చెట్టుకే కాదు, విసిగిపోయిన ప్రతి మనిషి మనసుకూ వర్తిస్తుంది. కనుకనే హైకూ రెండు విభాగాల సమాహారం. ఒకదానికొకటి ఈ భాగాలు పూరకాలు మరియు జ్ఞాన ప్రేరకాలు.
ఇక ఈ హైకూ అనువాదాలు తమిళం నుండి సేకరించినవి. తమిళ దర్శకుడు లింగుస్వామికి ప్రసిద్ధ తమిళ కవి అబ్దుల్ రెహమాన్ సంస్మరణగా వచ్చిన ‘వాడియదు కొక్కు’ అనే సంకలనం నచ్చింది. దానిని తెలుగు, తమిళం తెలిసిన ‘బోర్డరోడు’గా పేరుపొందిన నేటి కథకుడు, అనువాదకుడు గిడ్డకింద మాణిక్యం అనువదించారు. ఆయనకు ఇది మొదటి పుస్తకం. కవిత్వానికి కదిలిపోయే గుణం ఉండటం వల్ల మాణిక్యం ఈ హైకూలను చక్కగా తెలుగు చేశాడు. కానీ, హైకూ స్వరూప స్వభావాల గురించి కూడా లోతుగా తెలుసుకొని అనువదించి ఉంటే ఈ హైకూలు ఇంకా నాణ్యంగా వచ్చేవి. పాదాల విభజన వల్ల, అమరిక వల్ల హైకూ వెలుగుతుంది.
బహుశా లింగుస్వామి కూడా అభివ్యక్తిలో చైతన్యాన్ని చూశారే తప్ప, నిర్మాణ సారాల పరంగా అది ఇచ్చే మరింత మేలైన ఇంద్రియ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోలేదని అనిపిస్తుంది.
‘ఇందుమూలంగా మూలంలో లేనిది అనువాదంలో ఎలా వస్తుంది?’ అని సరిపుచ్చుకుంటూనే.. ముందుమాటలు రాసి ప్రోత్సహించిన గురువుల్ని, మిత్రుల్ని అంగీకరిస్తూనే.. అనువాదకుడిగా మాణిక్యాన్ని మెచ్చుకుంటూనే, పునర్ముద్రణలో ఈ లోపాలని సరిచేసుకోవాలని సూచిస్తున్నాను.
ప్రతుల కొరకు: 90108 66078 సంప్రదించవచ్చు.

– పి.శ్రీనివాస్ గౌడ్,
99494 29449











