చదవడమనేది ఒక నిరంతర ప్రక్రియగా చేసుకొని సాగిస్తున్న ప్రయాణంలో భాషా శాస్త్రంలో ఎం.ఏ, పట్టా పొందిన వరప్రసాద్.. మద్దూరి నగేష్ బాబు సాహిత్యంపై ఎం.ఫిల్, “దళిత కవిత్వంలో హిందూ- బౌద్ధ – క్రైస్తవ మత ప్రతీకలు” అంశంగా ఆచార్య గోగినేని ప్రభావతీదేవి గారి పర్యవేక్షణలో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టా పొందారు. దళితులపట్ల జరుగుతున్న అణచివేతలపై కవులు ధర్మాగ్రహం ప్రకటిస్తూ ఈ భావాలను కవిత్వికరించడానికి తమదైన సరికొత్త పంథాను అనుసరించినందుకుగాను ఈ పరిశోధనకు నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు వారిచే ఆచార్య తూమాటి దోణప్ప ఉత్తమ పరిశోధనకు ఇచ్చే బంగారు పతకం పొందారు.
30 జాతీయ సెమినార్లలో పాల్గొని పత్రసమర్పణ చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్, బెంగుళూరు వారి ఆధ్వర్యంలో ఇంగ్లీషు, తెలుగు, హింది, కోయభాషా నిఘంటు నిర్మాణంలో పాల్గొన్నారు. SCERT వారికి పాఠ్యపుస్తక రచయితగా పాఠ్యాంశాలు రాశారు. సర్వశిక్షా అభియాన్ నిర్వహించిన అనేక శిక్షణా కార్యక్రమాలలో DRP గా వ్యవహరించారు. ‘అధీర’ బాలల యానిమేషన్ చిత్రానికి కథ, మాటలు, పాటలు సమకూర్చారు.
అందుకున్న ముఖ్యమైన పురస్కారాలు – గౌరవాలు :
శ్రీశ్రీ స్మారక పురస్కారం, సత్తెనపల్లి 1983,మంజీర రచయితల సంఘం సాహితీపురస్కారం (హైదరాబాద్) – 1991,జాషువా సాహితీ పురస్కారం వినుకొండ- 2003,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ,ఏలూరు – 2011, గురుబ్రహ్మ పురస్కారం,విజయవాడ – 2011, జాషువా ప్రతిభా పురస్కారం, సత్తెనపల్లి – 2018, క్రైస్తవ సాహిత్య అకాడమీ, సాహిత్య సేవారత్న పురస్కారం విజయవాడ- 2018, ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవ సందర్భంగా లిటరసీ పురస్కారం -2018 , కాట్రగడ్డ సాహితీ పురస్కారం, ఏలూరు – 2018, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉగాది విశిష్ట పురస్కారం రాజమండ్రి – 2019 , నన్నయ విశ్వవిద్యాలయం నుండి జాతీయ స్థాయి మెరిటోరియస్ టీచర్ -2019, శ్రీ కాట్రగడ్డ పౌండేషన్ నుంచి తెలుగు సౌరభం బిరుదు ప్రదానం , గోల్కొండ సాహితీ కళాసమితి హైదరాబాద్ వారి నుండి మణిపూసల కవిభూషణ పురస్కారం, జాతీయ క్రైస్తవ సాహిత్య అకాడమీ వారిచే వచన రచన సామ్రాట్ బిరుదు-2024 పొందారు. ప్రస్తుతం మెట్ట ప్రాంత సాహితీ సంగమం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
ముద్రిత రచనలు..దళిత కవిత్వంలో హిందూ-బౌద్ధ-క్రైస్తవ మతప్రతీకలు- పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంధం.,తెలుగు పరిమళం (దీర్ఘకావ్యం), క్రీస్తు ఖైది (ఏకపాత్ర), అక్షరభూమిక (కవిత్వం) డా. వూటుకూరి మణిపూసలు – 2021.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని 2021 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రకటించి సత్కరించింది. ప్రస్తుతం కొయ్యలగూడెం మండలం, బోడిగూడెం జి.ప.ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా ఉద్యోగిస్తున్న వరప్రసాద్ ..మంచి స్నేహశీలి మాత్రమే కాదు..సమాజం పట్ల బాధ్యత కలిగిన కవి,పరిశోధకులు.అంతకు మించి సాహితీ జిజ్ఞాస మెండుగా కలిగిన ఉత్సాహవంతుడు. బోధనావృత్తిలో 34 సంవత్సరాలపాటు పనిచేసి మే నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా డా. ఊటుకూరి వరప్రసాద్ గారితో ప్రముఖకవి కొమ్మవరపు విల్సన్ రావు ముఖాముఖి సృజనక్రాంతి పాఠకుల కోసం.
నమస్కారమండీ డా॥ వూటుకూరి వర ప్రసాద్ గారు
నమస్కారం విల్సన్ రావు గారు
మీ ఉద్యోగ విరమణ సందర్భంగా మీతో కొద్దిసేపు ముచ్చటిద్దామని వచ్చాను. మీ సాహితీ విశేషాలు, జీవిత పయనాన్ని మా పాఠకులకు పరిచయం చేద్దామని ఆలోచన.
చాలా సంతోషంగా ఉంది మీరీ మాట అంటుంటే. ఎవరిని ఎవరూ పట్టించుకోని ఈ రోజుల్లో నా కోసం హైదరాబాద్ నుండి వచ్చి నాతో ముఖాముఖి అంటే చాలా ఆనందంగా ఉంది.
మీ బాల్యం విద్యాభ్యాసం, మీ సాహితీ ప్రయాణం గురించిన వివరాలు
మాది గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అనంతవరం గ్రామం. మా నాన్నగారు ఉపాధ్యాయుడు, మా అమ్మగారు గృహిణి. నాన్నగారి దగ్గరే ఐదవ తరగతి వరకు చదువుకున్నాను. నాన్నగారు జాషువా పద్యాల్ని చాలా బాగా ఆలపించేవారు.అలా వినడం వల్ల పద్యాల పట్ల ఆసక్తి పెరిగింది. మా అమ్మ గారు క్రైస్తవ భక్తి గీతాలు బాగా పాడేవారు. అలా సంగీతం పట్ల,సాహిత్యం పట్ల, మమకారం పెరిగింది. చిన్నప్పుడు మా గ్రామంలో హరి కథలు, బుర్ర కథలు, తోలుబొమ్మలాటలు,వినటం వల్ల కథాంశాలు పట్ల, ఇష్టం ఏర్పడింది. మా ఊళ్లో మూడు నాటక సమాజాలు ఉండేవి. వేసవి కాలం వస్తే పోటి పడి నాటకాలు ఆడేవారు.వాటన్నింటిని దగ్గరుండి పరిశీలించేవాడ్ని. అలా పద్యాలన్ని నా నోటికి వచ్చేవి. క్రైస్తవ సమాజాలు ప్రదర్శిస్తున్న నాటకాలలో రెండు పర్యాయాలు ఆపద్ధర్మంగా పాత్రలు పోషించాల్సి వచ్చింది. ఆ నాటకాలు దావీదు విజయం, సంసోను డెలీలా. ఇలా సాగుతున్న తరుణంలో నాలోని ఆసక్తిని గమనించి మా నాన్నగారు నాకు మర్ఫీ రేడియో కొని ఇచ్చారు.అలా నిరంతరమైన శ్రోతగా రేడియో కార్యక్రమాలు వింటూ, అర్థం చేసుకునేవాడ్ని. ఈ పాట నేర్చుకుందాం అనే శీర్షికలో నేర్పిన పాటలన్ని నాకు వచ్చేవి. ఈ మాసపు పాట ప్రతి ఆదివారం ప్రసారం అయ్యేవి. అలా సంగీత పరమైన, సాహిత్య పరమైన కార్యక్రమాల్ని వింటూ పెరిగాను. ఆ విధంగా చూస్తే రేడియో నా మొదటి గురువు. నేను మంచి పాఠకుణ్ని, పాటగాణ్ని, క్రీడాకారుణ్ని
ఒక పల్లెటూరి విద్యార్థిగా ఇన్ని రకాల టాలెంట్స్ మీకు ఎలా అబ్బినవి.
నేను పల్లెలో పుట్టినా మా కుటుంబం బ్రిటిష్ కాలం నుండి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. మా తాతగారు రాజారత్నం బ్రిటిష్ కాలంలో ఉపాధ్యాయులుగా పనిచేసారు. మా నాన్న గారు ఉపాధ్యాయుడు. 1920 నుంచి 1971 వరకు మా చుట్టు ప్రక్క గ్రామాల్లో చదువుకున్నవారు ఎవరన్న ఉంటే వారు మా కుటుంబంలోని తాత, మా తండ్రి గారి ద్వారా చదివినవారే. అలా విద్యారంగంలో ఒక శతాబ్ధం పాటు మా కుటుంబం సేవలందించింది. దీనిని నేను ప్రత్యేకతగా భావిస్తాను.
ఇది చాలా అభినందించ తగిన విషయం. మీ విద్యాభ్యాసానికి సంబంధించిన విషయాలు.
తొమ్మిదవ తరగతి దాకా దొడ్లేరు హైస్కూల్ లో చదువుకున్నాను. పదవ తరగతి మా అమ్మమ్మగారి ఊరైన చందర్లపాడులో చదివాను. ఇంటర్ మీడియట్ నందిగామ కె.వి.ఆర్. కళాశాలలో చదివాను. నేను చెప్పిన విద్యాసంస్థల్లో తెలుగు ఉపాధ్యాయులందరు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నాలో ఉన్న సాహితీ పిపాసకు వారు చేయూతను అందించారు. డిగ్రీలో స్పెషల్ తెలుగు కోసం ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ లో చేరాను. అక్కడ నా సాహితీ వికాసం బహుముఖాలుగా సాగింది. మా గురువులు డా॥ నేలటూరి కిషోర్‌గారు, స్పూర్తిశ్రీ గారు, మంచి కవిత్వం రాయటానికి మార్గాన్ని చూపారు.నేను రేడియో శ్రోతగా ఎదిగిన క్రమంలో 1983 సెప్టెంబర్ 21 తారీఖున నా కవిత్వం రేడియోలో ప్రసారం అయినప్పుడు నా స్నేహితులు విని అభినందించారు. అలా నా కవిత్వం మెల్లమెల్లగా పత్రికల్లోను, రేడియోల్లోను రావటం మొదలైంది.ఆ తరువాత ఆంధ్ర యూనివర్సీటిలో యం.ఎ., నాగార్జున యూనివర్సీటిలో ఎం.ఫిల్. పి.హెచ్ డి లు చేయటం జరిగింది.
మీరు ఏ అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా పొందారు.
ఆచార్య నాగార్జున యూనివర్సీటి నుంచి ‘‘దళిత కవిత్వంలో హిందూ బౌద్ధ క్రైస్తవ మత ప్రతీకలు’’ అనే అంశం మీద నా పరిశోధన కొనసాగించాను. డా॥ యోగ ప్రభావతి గారు నా మార్గదర్శకులు. నా పరిశోధనకు 2011 సం॥ గాను ఆచార్య తూమాటి దోణప్ప ఉత్తమ పరిశోధనకిచ్చే బంగారు పథకం నాకు లభించింది. నా పరిశోధన గ్రంధాన్ని మొదటి సారి రాజమండ్రి ప్రాంగణం తెలుగు విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి ప్రతిపాదనతో రిఫరెన్స్ టెక్స్ట్ గా నిర్ణయించటం జరిగింది. ఆ తరువాత దళిత సాహిత్యం మీద నాపుస్తకం మంచి దిక్సూచిగా నిలబడింది.
దళిత సాహిత్యంపై ఎందుకు పరిశోధన చేయాలనిపించింది. కారణం ఏంటి?
నేను గుంటూరు ఎ.సి కాలేజ్ లో చదివేటపుడు కారంచేడు సంఘటన జరిగింది. ఆ సంఘటన మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. ఆ రోజుల్లో బాధితులకు మేము హాస్టల్‌లో ఉన్న 400 విద్యార్థులం ఒక పూట రేషన్ ని వారికి పంపాము. అలా బాధితుల పట్ల మాకు తోచిన సాయాన్ని మేము అందించగలిగాము. ఈ తరువాత దళిత కవిత్వం శరపరంపరగా రావటం మొదలయ్యింది. నా సహచరులు మంచి కవిత్వం రాసారు. కవితా సంకలనాలు వచ్చాయి. దళిత కవిత్వంలో ఉన్న ధిక్కారతను,ఆత్మవిశ్వాసాన్ని పోరాట పటిమను వెలికి తీయాలని బాధితుల్లో ఒకడిగా నా వంతు ప్రయత్నంగా ఈ పరిశోధన చేసి ప్రపంచం ముందు ఉంచాను.
మీ ఉద్యోగ జీవితం, సాహితీ ప్రయాణం మిమ్ములను ఎంత వరకు తృప్తి పరిచాయి.?
నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రాకముందే కొంత కాలం ప్రైవేట్ స్కూల్స్, కాలేజ్ లలో పనిచేసాను. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాక మా అధికారులందరు నన్ను గూర్చి విని తమ ఛాంబర్ లోనికి పిలిచి నాతో మాట్లాడి వారి కార్యక్రమాలకు అనుసంధాన కర్తగా నన్ను ఉపయోగించుకునే వారు. ఆ విధంగా పై అధికారుల ఆదరాభిమానాలు పొందగలిగాను. కొయ్యలగూడెం మండలంలో డి.వై.ఇ.ఓ.గా పనిచేసిన తిరుమలదాసు గారు, డి.ఇ.ఓ గా పనిచేసిన రవీంద్రనాథ్ రెడ్డి గారు నన్ను బాగా ప్రోత్సహించి సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాల్లో ఉపాధ్యాయ శిక్షకుడిగా అవకాశమివ్వడంతో ఒక దశాబ్దంపాటు నేను సేవలందించాను.సృజన టి.ఎల్.యం. పుస్తకానికి సర్వేశ్వరరావు గారు నా చేత కొన్ని పాఠ్యాంశాలు రాయించారు. 2013 లో జరిగిన పాఠ్య పుస్తకాల రచయితల్లో నేను ఒకడ్ని. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 12 పాఠాలు నేను రూపకల్పన చేసాను. 10వ తరగతిలో అమరావతి పాఠ్యభాగం నేను రాసాను. 2020లో బాల సాహిత్యం వర్క్ షాప్ లో పాల్గొని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివిధ అంశాలపై పాఠ్యంశాలు తయారు చేసాను. సిలికాన్ ఆంధ్రా వారి ఆధ్వర్యంలో తానా వారి నేతృత్వంలో మాబడి, పాఠశాల నిర్వహణలో ఆరు సెమిస్టర్ ల పాఠాల రూపకల్పనలో పాల్గొన్నాను. 2023 తెలుగు పరిమళం పాఠ్య పుస్తకంలో ప్రధాన పాత్ర పోషించటానికి కారకులు డా॥ టి.వి.యస్. రమేష్ మరియు గౌ॥ డా॥ ప్రతాప్ రెడ్డిగారు. స్కూల్ కాంప్లెక్స్ లో దాదాపు ఒక దశాబ్ధం పాటు నాతోటి ఉపాధ్యాయులకు పాఠ్యాంశాల బోధనలో సలహాలు సూచనలు ఇవ్వటానికి నాకు అవకాశం దక్కింది. ప్రభుత్వం రూపకల్పన చేసిన ఇ.యం. పి.డి. కార్యక్రమంలో ఒక సంవత్సరం పాటు స్వయం శక్తితో ఎలా బ్రతకాలో.. విద్యార్థులకు బోధించడం జరిగింది.
మీ ముద్రిత రచనల వివరాలు తెలియజేస్తారా.
మద్దూరి నగేష్ బాబు రచన ‘నరలోక ప్రార్థన’ పై యం.ఫిల్ పరిశోధన, దళిత కవిత్వంలో హిందూ- బౌద్ధ- క్రైస్తవ మత ప్రతీకలు, అక్షర భూమిక కవితా సంకలనం, తెలుగు పరిమళం దీర్ఘకావ్యం, ఈ పుస్తకానికి కాట్రగడ్డ ఫౌండేషన్ వారి నగదు పురస్కారం రూ.20,000/-గెలుచుకుంది. మణిపూసలు, లఘు కవితలు,వివిధ విమర్శ, అమ్మలేని ఊరు కథా సంకలనం,ది టీచర్, దీర్ఘ కావ్యం, ప్రస్తుతం వచ్చిన పుస్తకాలు.
మీ పరిశోధనకు వచ్చిన గుర్తింపు గురించి.
నా దళిత సాహిత్య పరిశోధనకు గానూ దళిత సాహిత్య అకాడమి న్యూఢిల్లి వారు, దళిత ఓపెన్ యూనివర్సీటి వారు, అంబేద్కర్ ఫెలోషిప్ మరియ జాతీయ అవార్డు ఇచ్చారు. ఇంకా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు, మణిపూసల కవిభూషణ అనే బిరుదు, తెలుగు సౌరభం, వచన రచన సామ్రాట్ లాంటివి కొన్ని సంస్థలు ఇచ్చాయి.
చివరిగా సాహిత్య కృషి ఎలా చేస్తే ప్రజల దగ్గరకు వెళ్తుంది.
సమకాలీన జీవనాన్ని ఎవ్వరు ఏ రూపంలో రాసినా ప్రజలకు చేరువైనప్పుడు తప్పక ఆదరిస్తారు. రచయితలు బాగా చదివి ప్రపంచాన్ని అర్ధం చేసుకుని పాఠకుడికి అందించగలిగినప్పుడు ఆ రచన చిరస్థాయిగా నిలబడుతుంది.
ఇంటర్వ్యూ:విల్సన్ రావు కొమ్మవరపు
సాహితీ సంపాదకులు, సృజనక్రాంతి