ప్రైవేటు బడుల ఫీజుల మోత..

ఎడిటోరియల్

*ప్రైవేటు విద్యలో ఇష్టారాజ్యంగా ఫీజులు.. *అనుమతులు, భద్రతా ప్రమాణాలు మృగ్యం..
*విద్యా వ్యాపారం కట్టడి చేయకపోతే? సమాన అవకాశాలు అందని ద్రాక్షే.. *ప్రభుత్వం ఉదాసీనత వీడాలి..

ప్రాథమిక విద్య బలంగా ఉంటే? ఎంతటి ఉన్నత విద్యనైనా అలవోకగా అభ్యసించవచ్చు. ఇష్టపడి నేర్చుకున్న విషయం ఏనాటికి మరపు రాదు. విద్య బాల బాలికలందరి హక్కు. విద్యతోనే బాల బాలికలకు విజ్ఞానం దక్కుతుంది. విశ్వ సౌభాగ్యానికి విద్యార్థి పట్టుకొమ్మ.. మన దేశంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. నిధుల కేటాయింపు కూడా ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తాయి. అలాగే విద్య ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాలచే అందించబడుతుంది. ప్రభుత్వ అజమాయిషి కొరవడి “రెంటికి చెడ్డ రేవడిలా” రెండు రంగాల్లోనూ కూనరిల్లి పోతుంది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఉచిత నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు అందని ద్రాక్షగా మారుతోంది..

ప్రభుత్వ విద్యా రంగంలో పాఠశాలల్లో ఉచిత విద్యతోపాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, వర్కుబుక్కులు తదితర సౌకర్యాలు అందించబడుతున్నాయి. అయినా ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రభుత్వ రంగంలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య పడిపోతున్నది. దీనిలో అనేక మేనేజ్మెంట్లలో కుల, మత, లింగ బేధాలతో గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు ప్రభుత్వ రంగంలోనే ఒక దానికి మరో సంస్థ పోటీగా ఏర్పడినవి. మౌలికవసతులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కొరతతో ప్రభుత్వ విద్య కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ప్రధానంగా కేజీ టు పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందిస్తామని, అటెండర్ పిల్లల నుంచి కలెక్టర్ పిల్లల వరకు-సర్పంచ్ పిల్లల నుండి సీఎం పిల్లల వరకు అంతా ఒకే బెంచీ(తరగతి గది)లో చదివేలా “కామన్ స్కూల్” తీసుకొస్తామన్న మాటలు దశాబ్ద కాలం గడిచినా అమలుకు నోచుకోలేదు. అంగన్వాడీలను సర్కారు బడుల్లో విలీనం చేయకపోగా, 6సం. నిండిన వారినే చేర్చుకోవాలన్న నిబంధనలు శాపంగా మారినాయి. ప్రభుత్వ విద్యను పరిరక్షించడంలో పాలకుల ఉదాసీనతతో ప్రైవేటు విద్యాసంస్థలకు వరంగా మారింది. తల్లిదండ్రులకు స్తోమత లేకపోయినా
భారీగా ఫీజులు పెంచినా భరిస్తూ పంపుచున్నారు. ఇలా ప్రభుత్వాలు విద్యా పరిరక్షణకు నిధులు పెంచడంలో, ప్రజల్లో నమ్మకం కల్పించడంలో విఫలమయ్యారని విద్యావేత్తలు భావిస్తున్నారు.

మన రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ బడుల్లో ఫీజుల మోత ఆకాశాన్ని అంటుచున్నది. ప్లే స్కూల్, ఎల్కేజీ, యూకేజీ మొదటి తరగతి నుంచి పదోతరగతి వరకు డొనేషన్లు, అభివృద్ధి చార్జీలతో పాటు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయి. పాఠశాలకు ఉన్న డిమాండ్ ను బట్టి ఫీజులను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. ప్రభుత్వం రుసుములు పెంచడం పై నియంత్రణ పాటించకపోవడం వాటికి అనుకూలంగా మారింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. నగరాల్లో పలు కార్పొరేట్ పాఠశాలలు 45 నుంచి 50శాతం పెంచేస్తున్నాయి. ఇలా ఏటా పాఠశాలల్లో రుసుములు పెంచడం ఆనవాయితీగా మారిపోయింది. దీనికంటూ నిర్ణీత ప్రాతిపదిక ఏమీ లేదు. మరోవైపు యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగుల ధరలను పెంచేస్తున్నాయి. రూ. 200 లభించే చిన్నారుల బూట్లకు రూ.500 నుంచి రూ.1000 వరకు, 3జతల యూనీఫామ్ లకు రూ.3000లు, టై రూ.300, బెల్ట్ కు రూ.300చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులు వేడుకుంటున్నా వినడం లేదు. ప్రత్యేకంగా తయారు చేయించామని పాఠశాల చిహ్నం ఉన్నందున ఇక్కడే కొనుగోలు చేయాలని ఖరాఖండిగా చెప్తున్నారు. పుస్తకాలు సైతం బయటి మార్కెట్లో కొనడానికి ఒప్పుకోవడం లేదు. తాము చెప్పిన ముద్రణ సంస్థ పుస్తకాలనే కొనాలని అంటున్నాయి. ఇలా పెంచిన రుసుము(ఫీజు)లు అదనపు బాదుడుతో సామాన్య, మధ్య తరగతుల ప్రజలపై పెను భారం పడుతుంది. కొందరు అప్పులు చేసి మరీ పిల్లల ఫీజు చెల్లిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల పెంపుదలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం యాజమాన్యాలకు వరంగా మారింది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. పాఠశాలల ఫీజుల వసూలు నియంత్రణ చట్టాన్ని తేవాలని 2022 జనవరి 17వ తేదీన జరిగిన మంత్రి మండలి సమావేశంలో అప్పటి మంత్రులు 11 మందితో ఉపసంఘం ఏర్పరిచింది. ఆ సిఫారసులు అమలు కావడం లేదు. కొన్ని పాఠశాలల్లో ప్లే స్కూల్ కు రూ. 1 లక్ష, ఒకటో తరగతికి రూ. 2.5 లక్షలుగా ఆపై తరగతుల వారిగా పెంచుకుంటూ పోతున్నారు. అందరికీ ఉచితంగా అందించవలసిన విద్యను వ్యాపారంగా మార్చారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ బడులు గుర్తింపు, అనుమతి లేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వ్యాపారం మొదలు పెట్టినారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఏ ఒకటో రెండో బ్రాంచ్లకు అనుమతులు తీసుకొని వేరువేరు చోట్ల అనేక బ్రాంచ్లను నిర్వహిస్తున్నారు. కనీస రక్షణ లేని బహుళ అంతస్తుల భవనాలలో తరగతులు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వనిబంధనలు..ఎస్టాబ్లిష్ మెంట్ రికగ్నైజేషన్ అడ్మిషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్కూల్ అండర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ యాక్ట్ 1993 ప్రకారం నివాస భవనాల్లో తరగతులు నిర్వహించకూడదు. తరగతుల నిర్వహణకు అనుమతులు ఇవ్వకూడదు. ఈ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఆట స్థలం లేకపోవడంతో శారీరక వ్యాయామం, మానసిక వికాసం లేక మెజారిటీ పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా సైన్స్ ప్రయోగశాలలు మచ్చుకైనా కనిపించవు. తాగునీరు సైతం విద్యార్థులే సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇక మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. ఇలా గుర్తింపు, సౌకర్యాలు లేని పాఠశాలను వెంటనే రద్దు చేయాలి. విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యాశాఖ అధికారులు హడావుడి చేసి మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోతుంది. కావున ఈ ఫీజుల దోపిడీని ఆపేలా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను వెంటనే కట్టడి చేయాల్సి ఉంది. ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్, కార్పొరేటు విద్య కూడా అర కొర సౌకర్యాలతోనే నడుస్తున్నది. కానీ ఫీజులు రాబట్టడంలో మాత్రం జలగల్లా పీక్కు తింటున్నారు. ప్రభుత్వం వెంటనే కట్టడి చేయాల్సి ఉంది. విద్య, వైద్యం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయి. అందరికీ ఉచిత నాణ్యమైన విద్య అందేలా చూడాలి. తద్వారా ఎదగడానికి సమాన అవకాశాలు కల్పించబడాలి. విద్య వ్యక్తికి వ్యక్తిత్వాన్ని, జీవనోపాధిని కల్పించాలి. సంస్కారవంతంగా తీర్చి దిద్దబడాలి. ప్రభుత్వం ఉదాసీనత వీడనంత కాలం ఇది సాధ్యపడదు. పేదరికం దూరం చేయనంతవరకు విద్యారంగం ఆశించినంత అభివృద్ధి సాధించలేదు. ఈ విషయంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అయినా కఠిన చర్యలతో విద్యను ఒకే గొడుగు కిందికి తెచ్చి “కామన్ స్కూల్” విధానాన్ని ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ విద్యను పూర్తిగా ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలి. అప్పుడే పేద, మధ్య తరగతి వాళ్లకు న్యాయం జరుగుతుంది. సమాన అవకాశాలు దొరుకుతాయి.

మేకిరి దామోదర్
సామాజిక విశ్లేషకులు, వరంగల్,
ఫోన్: 9573666650

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *