సమకాలీనతకు ప్రతిరూపం ‘గిరీశం’

సాహిత్యం

‘చిన్నతనంలో బొమ్మలాట నేర్చి ఉండటం చేత లోకమనే రంగంలో చిత్ర కోటి రీతులను ఆటాడే మనుష్యులనే పాత్రముల సొగసును కనిపెట్టడము నాకు అలవాటైన, సొగసులేని మనిషే లేదు. స్నేహము, ప్రేమ అనేవి అనాది అయిన్నీ ఎప్పటికీ కొత్తగా ఉండే రెండు వెలుగులను వరుని మీద తిప్పికాంచితే వింత, వింత సొగసులు బయలుదేరతవి, అసూయ అనే అంధకారంలో అంతే ఏకనలుడే’- తన పాత్ర చిత్రణ గురించి ‘గురజాడ’ వ్యాఖ్యానం.

గురజాడ మహాకవి – తన రచనల ద్వారా సమాజంలో స్త్రీ సమస్యలను తన రచనల ద్వారా బహిర్గతం చేసి, వారిని ప్రశ్నించమని, ‘ధ్వనిం’చమని చెప్పిన రచయిత, కవి, నాటకకారుడు, ‘కన్యాశుల్కం’ నాటక రచన గురజాడకు శాశాత్వమైన కీర్తిని తెచ్చిందనడం అతిశయోక్తి కాదు. ఆయన రచనా చమత్కృతి, పాత్రల చిత్రణ, భాషాపటిమ ఆనాటి సాంఘీక సమాజ చిత్రణలో ‘నగ్నత్వం’ వంటివి ఆయన రచనలో ప్రయోగాత్మకంగా, జనరంజకంగా చెప్పినా అవి ఈ నాటికీ సమాజలో ‘రూపం మార్చుకొని’ తిష్ట వేసుకొనే ఉన్నాయి అనుకోవటం ఓ ఐరని ‘కన్యాశుల్కం’ తొలి ప్రతి 1897లో వచ్చింది. రెండో కూర్పు 1909లో వచ్చింది. ఇందులో మొత్తం 14 పాత్రలు ఉన్నాయి. ‘కన్యాశుల్కం’వచ్చి ఒక శతాబ్దానికి పైగానే జరిగింది, కాని ఇందులోని పాత్రలు తెల్లవారితే నేటికి మనకు కళ్ళముందునే కనిపిస్తాయి, కనిపిస్తుంటాయి. దోచుకోబడుతున్నవాళ్ళు, దోచేవారు, వ్యసనపరులు, మోసగాళ్ళు, లుబ్ధులూ, ప్రేమంటే పెద్దగా ‘ప్రేమ’లేని గిరీశాలు, మధురవాణి వంటి వారు నిత్యం పరిచయమవుతుంటారు.నిత్య జీవితంలో పలకరిస్తుంటారు.ముఖ్యంగా గురజాడ సృజనలో పాత్రలన్ని ‘వాడుక భాష’లో ఎటువంటి ముసుగులు లేకుండా మాట్లాడతాయి. వాడుక భాషను ప్రతిభావంతంగా తన ‘కన్యాశుల్కం’లో ఉపయోగించుకొని గురజాడ ద్రష్టగా నిలిచారు. ఏ పాత్రను తీసుకొని చూసినా ‘ఈ భాషా చాతుర్యం’ కనిపిస్తుంది.

పాత్రల సృష్టిలో రచయిత ‘తను చూసిన’, ‘తను అనుభవించిన’ వ్యక్తులను అనుకరిస్తూ, అనుసరిస్తూ ఉంటారు. గురజాడ వారు “కన్యాశుల్కం”లో కూడా తన భావనలకు, ఊహలకు రచనా రూపం కల్పించి తదనుగుణమైన పాత్రలను, వారి పరిచయ రంగాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. షేక్స్పియర్ నాటకాల్లో కథాంశమును కథ ప్రారంభంలోనే ‘ధ్వని’ మాత్రంగా చెప్పటం జరుగుతుంది. గురజాడ వారు సృష్టించిన ‘గిరీశం’ కూడా అదే చేస్తాడు.నాటకం అతనితోనే ప్రారంభమవుతుంది. అతనితోనే ముగుస్తుంది.అతను పరిచయం ‘బొంకులుదిబ్బ’ ప్రాంతం (విజయనగరం) ‘బొంకులు’ అనగా అబద్దాలు.గిరీశం చెప్పేవన్నీ అవే కదా.ఒక ప్రాంతాన్ని పరిచయం చేస్తూ తద్వారా ‘పాత్ర’ వ్యక్తిత్వాన్ని కూడా పరోక్షంగా విప్పి చెప్పడం ఓ గొప్ప సృజన, అతను ‘నాయకుడు’ కాదు. వాడు, నేడు, రేపు కూడ ఎంతో మంది గిరీశంలు మనకు తారసపడుతుంటారు. ప్రజలను ‘వెంకటేశాల’ ను చేసి దోచుకుంటారు. ‘వెంకటేశం’ కు గురువుగా గిరీశం చుట్టలు కాల్చటం తప్పా మరేమీ నేర్పలేదు. వర్తమానంలో ‘గిరీశం’ వంటి గురువులు ఎందరెందరో? ‘సోషల్ ఫార్మ్’ పేరుతో ‘సమాజాన్ని’, ‘సంస్కరణల’ను తనకనుగుణంగా మార్చుకొని ‘గొప్పవారుగా’ ఎదుగుతారు.అమాయకులను(?) తొక్కుకుంటూపోతారు.‘తొక్కేసి’వెళ్ళిపోతారు. ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’, ‘కుప్పసామయ్యరు మేడ్ డిఫికల్ట్’, ‘మనవాళ్ళు వట్టి వెధవాలయ్’, ‘అన్నీ వేదాల్లో వున్నాయిష’, ‘నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్’, ‘అట్నుంచి నరుక్కురమ్మన్నారు’, ‘పొగతాగనివాడు దున్నపోతైపుట్టున్’ వంటి అవకాశవాద వ్యాఖ్యానాలతో అవాస్తవాలను, అసహజాలను సహితం ‘సహస్రవాదులు’ గా చిత్రించి, నమ్మించే గొప్ప వాక్చాతుర్యం కలిగిన ‘గిరీశాలు’ వర్తమానంలో కోకొల్లలు.

గొప్ప సీన్లతో, మానిఫెస్టోలతో ప్రజలను బురిడీ కొట్టించి మాటలకోటలు కట్టి ‘నోట్లోనే’ బూరెలు ఊరించి, ‘చిటికెనవేలు’ మీద స్వర్గాలు నిర్మించే నాయకులు, వ్యక్తులు మనల్ని నిత్యం పలకరిస్తారు. మోసం చేస్తుంటారు, ‘ఏడు అంకాల’ కన్యాశుల్కం నాటకంలో ఆరు అంకాల్లో గిరీశం కనిపిస్తాడు. కాని అతను కథానాయకుడు కాదు. ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి గారు ‘గిరీశం పైకి చూడటానికి వెకిలి పాత్రగా, ఔచిత్యం పాటించని వాడిగా, విలువలు లేని వ్యక్తిగా, జీవితంలో గాంభీర్యాన్ని నవ్వులపాలు చేసేవాడుగా కనిపిస్తాడు. ‘కన్యాశుల్కం’ నాటి సామాజిక వాస్తవాలను గురజాడ అర్ధం చేసుకొన్న తీరును వాటి మీద ఆయన అభిప్రాయాలను ప్రతిఫలిస్తాడు. కనుక గిరీశం పాత్ర సంకీర్ణ పాత్ర అంటారు.

‘వర్తమాన గిరిశాలు’ నేటి సామాజిక వ్యవస్థకు ప్రతిబింబాలు. సమాజంలో పరిస్థితులకనుగుణంగా కొందరు మారిపోతారు. కాని ఆ పరిస్థితులను తమకనుగుణంగా కొందరు ‘అతి తెలివి మేధావులు’ మార్చుకుంటారు. వారంతా గిరీశాలే! ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడూ ఛేంజ్ చేస్తూ ఉంటూనే కాని పొలిటీషియన్ కానేరడు’. నాకు తోచిన కొత్త అర్థమెంట్ విన్నావా? అంటూ తనదైన శైలిలో ‘ఊసరవెల్లి’ రాజకీయ నాయకుల్లో గిరీశం ‘అంశ’ కనిపించకపోతే అది ‘ఓటరు’ తప్పు కాదు. వారి తెలివితేటలు, తనకు ప్రయోజనం కలిగితే ‘వర్తమానాన్ని’పొగడటం, అది లేకపోతే తెగడటం గిరీశం నైజం. విధవలైన స్త్రీలను అవమానించిన గిరీశం ‘బుచ్చెమ్మ’పై ప్రేమ(?) కలిగిన తరువాత వారిపైన అపారమైన ప్రేమాభిమానాలు కురిపిస్తాడు. ‘విధవా వివాహమే. నాగరికత’ కు నిగ్గు అయినప్పుడు బాల్యవివాహాలు లేకపోతే నాగరికత ఆగిపోతుందని చెబుతాడు. ఓ అస్పష్టతాపూరిత స్పష్టత తనకు ఉపయోగపడుతుందని’ అతని అభిప్రాయం నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండి నేడు అధికారపక్షంలో ఉన్నవారు ప్రతిపక్షం ప్రగతిని అడ్డుకుంటున్నారని అంటారు. ‘ఆనాడు ప్రతిపక్షం ప్రగతికి మార్గం’అన్నవారు ఇటువంటివారే ప్రేమంటే సరదాగా భావించే వర్తమాన యువ ‘గిరీశం’ అంశలైన వారు ‘లేవదీసుకొనిపోతే సుఖము, కీర్తి’ కూడా లభిస్తాయనుకుంటారు.

చివరకు ‘డామిట్ కథ అడ్డం తిరిగిందని’ వాపోతారు. గిరీశం వంటి గురువులు చెప్పే చదువులకు వెంకటేశం వంటి ఆంగ్లమాధ్యమ విద్యార్థులు ‘క్రియేషన్’ అంటే ఆవులు, గేదెలు దగ్గరనే ఆగిపోవడం అందరికీ తెలిసిందే. ‘కపిద్దాకార భూగోళ’ అని మనుధర్మ శాస్త్రంలో చెప్పినాడు. కపిద్దామంటే ఏమిటి? అని అడిగిన గిరీశం, తరువాత బుచ్చెమ్మ అందాన్ని గురించి చెప్పిన మాటలు వింటే వర్తమాన విద్యావిధాన ప్రయాణగమ్యం ఏమిటో అనే ప్రశ్న ఉదయించకమానదు. బుచ్చెమ్మ కోసం ‘గిరీశం’ చెప్పిన ప్రేమకబుర్లు కూడా నేడు నిత్య నూతనం.మాధ్యమాల్లో పొంగి ప్రవహిస్తున్న కవిత్వం చూస్తుంటే అనేక వేల మంది ‘గిరీశం’ వారసులైన ప్రేమికులు కనిపిస్తారు. గిరీశం చెప్పిన ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’ రైమ్ ను విని మండిపోయే వెంకమ్మలు కూడా నేడు బహుమిక్కుటమే! నాటకంలో ప్రతీ పాత్రను ‘గిరీశం’ ప్రభావితం చేయగలిగాడు. తనమాటల గారడీతో బోల్తా కొట్టించి పబ్బం గడుపుకోగలిగాడు.

మధురవాణి, సౌజన్యారావు పంతులు మాత్రమే ‘గిరీశం’ పాత్రలోని ‘అసలుతత్వం’ను గ్రహించి దూరంగా ఉంచగలిగారు. ప్రయోజనం తనదైతే తాను మారిపోయానని’ చెప్పడం అతనికి వెన్నతో పెట్టిన విద్య సౌజన్యారావు పంతులు దగ్గర అతను చెప్పిన మాటలు ఇందుకు ఉదాహరణ, బుచ్చెమ్మతో పెళ్ళి చేయమని అడుగుతాడు, కాని సౌజన్యారావు పంతులు ‘గెటౌట్’ అన్నప్పుడు ‘డామిట్ కథ అడ్డం తిరిగిందనుకుంటాడు. ప్రతీ ఒక్క పాత్రను అతను ఉపయోగించుకోగలిగాడు కాని ఏ పాత్రకు అది ఉపయోగపడలేదు. ‘ఏ ఎండకా గొడుగు’, ‘ఏ అవసరానికి ఆ ఉపాయం’ ఇతని నైజం, రాజకీయ నాయకులంత సులభంగా తన ఒపీనియన్స్ ను మార్చుకోగలడు, ప్రస్తుత రాజకీయాల్లో గిరీశం వారసులే ఎక్కువ.

‘కన్యాశుల్కం’ రచన ప్రారంభంలో గురజాడ వారు ‘గిరీశం’ పాత్రను ఇంత విస్తృతంగా విస్తరించలేదు. కాని, క్రమేపి ‘గిరీశం’ గురజాడను డామినేట్ చేసేసాడని చెప్పవచ్చు. S.M.Y శాస్త్రి గారన్నట్టు “Girisham must have taken the author himself by storm and argued and bluffed his way into the drama. .” గిరీశం ఇంతగా ఇంతమంది ప్రేక్షకులను, పాఠకులను ఎందుకు కుదిపేస్తున్నాడు అని ప్రశ్నించుకుంటే ‘గిరీశంలోని లక్షణాలు, జీవితాన్ని అనుభవించాలనే తపన’ వంటివి ప్రతీ వ్యక్తి సుప్త చైతన్యంలో దాగి ఉంటాయి, అవన్నీ గిరీశంలో ప్రదర్శనమవుతాయి. కన్యాశుల్కం… ఆధునిక సాహిత్యంలో ‘సోషల్ రియలిజం’ ‘గిరీశం’…! నిజంగానే నిజమైన పాత్ర.

శివసాగర్ అన్నట్లు
గురజాడా!
నీవు సృష్టించిన పాత్రలు
నిజంగానే
సజీవమైనవి
అందుకనే అవి మారే కాలంతో పాటు
మార్పు చెందుతున్నవి.
‘గిరీశం’ ఇందుకు మినహాయింపు కాదు.

-భమిడిపాటి గౌరీశంకర్
94928 58395

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *