డా. చిల్లర భవానీదేవి. ఈనాటి పాఠకలోకానికి సుపరిచితమైన పేరు. 16 కవితాసంపుటాలు, 4 కథాసంపుటాలు, 4 నవలలు, 7 బాలసాహిత్యం పుస్తకాలు, 2 నియోలిటరేచర్, 9 అనువాదాలు, 3 వ్యాససంపుటాలు, 11 ఇతర రచనలు- వెరసి 56 పుస్తకాలు. ఆమె సాహిత్య వరివస్య ఇంకా విస్తృతమైనది. టీవి సీరియల్స్ కు రాశారు. క్యాసెట్లు ఇచ్చారు. ఇలా బహుముఖీన ప్రజ్ఞాప్రాభవం కలిగిన భవానీదేవిగారు – ఆంధ్రాంగ్ల హిందీ భాషల్లో పండితురాలు. స్నాతకోత్తర పట్టభద్రులు. న్యాయ శాస్త్రంలోనూ డిగ్రీ వున్నది. ఆ ప్రతిభామూర్తికి లభించిన పురస్కారాలూ, సన్మాన సత్కారాల వివరాలు పెద్ద పట్టిక…
భవానీదేవిగారు డా॥ ఎన్. గోపిగారి సృజన- నానీలను రాసి ప్రచురించిన మొదటి కవయిత్రి. ఆ నానీల్లో ఒక నానీ – ‘వివాహమా! / ఎంతపనిచేశావు? / నన్ను పుట్టింటికి అతిథిని చేశావు!’ అనేది బహుళ ప్రాచుర్యం పొంది, ఆమెకు ఘనకీర్తిని లభింపజేసింది.
కథారచయిత్రిగా, భవానీదేవిగారి కథల్లో – ‘మండుటెండలే కాదు, చలువపందిళ్లు కూడా ఉంటాయి’- అన్నారు మధురాంతకం రాజారాంగారు. ఇది నిజం. ఆమెకు గల పరిణామశీలమైన సమాజ గతిని పరిశీలించే అద్భుతమైన శక్తి దీనికి కారణం.
__________
యథార్థ జీవన చిత్రణం కథకు ఆయువు. ఈ చిత్రణ చేసేటప్పుడు సాధారణ రచయిత దృష్టి ఎక్కువగా పాత్ర బహిరంగ స్వరూపం, ప్రవర్తన మీద వుంటుంది. సన్నివేశకల్పన ద్వారా వీటిని సాధించుకుంటూ పోతాడు. అయితే మనుషుల అంతరంగం అట్టడుగున తారట్లాడే ఆనంద విషాదఛాయలకు, అంటే ఆయా పాత్రల అంతరంగతరంగాల కదలికకు, మనస్తత్వానికీ, స్వభావానికీ, కథాత్మకమైన చిత్రణనీయటం కష్టంతో కూడిన పని కనుక, సాధారణ రచయిత ఈ అంశాలపట్ల శ్రద్ధ వహించడు. జీవితానికి దర్పణం పట్టటం కాక, జీవితాన్ని వ్యాఖ్యానించి పాఠకులకొక దిశా నిర్దేశం చేయగల ప్రతిభావంతులు ఇలాంటి కథల్ని వెలయిస్తారు. అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు.తన ప్రతిభాస్వరంతో అలాంటి చాలా గొప్ప కథల్ని రాశారు భవానీదేవిగారు.
___________
భవానీదేవిగారి కథల్లో ఎక్కువభాగం స్త్రీ జీవిత చిత్రణ కేంద్రకంగా సాగినవే. అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, ఉద్యోగినిగా, విద్యార్థినిగా… ఇలా అనేకానేక పాత్రల్లో ‘ఆమె’ బతుకుగీత ఎలా సాగుతున్నదో ‘ఈనాటి’ సామాజిక వాస్తవికతతో రంగరించి ఆవిష్కరించారీ రచయిత్రి.
‘అమ్మంటే ప్రేమ. సంవేదనల కలయిక. ఆమె అస్విత్వాన్ని ఓడించే శక్తి ఎవరికుంటుంది. మానవత్వానికి మూలం (అమ్మ) మమకారమే. అందుకే, ఏ కాలంలోనైనా అమ్మ అమ్మే!’ సంతానం, కేన్సర్ ఒకేసారి స్త్రీ శరీరంలో పెరుగుతూవున్న విషాద పరిస్థితిలో ఒక యామిని!’ కథ పేరు ‘అమ్మంటే’.
‘తప్తశిల’ కథ చదివి, కను చెమరింపు కలుగలేదనే పాఠకుడు ఎవరైనా కనపడితే-ఒట్టు! శతకోటి కథల్లో ఇది ఒక్కటీ ఒక్కటే, ఒక్కటి మాత్రమే ఒక మణిపూస. ఉద్యోగినిగా శిశిర,గర్భిణిగా శిశిర, ఇద్దరు పిల్లల తల్లిగా శిశిర – ఎంతటి ఆవేదనకూ, అవస్థకూ-నిండు ‘చింత’ (ల) చెట్టుగా దర్శనమిస్తుందో; కథ ముగింపులో తన కళ్లముందే పాప కాలిమసైపోతుంటే అంతకంతగా గుండె బద్దలయ్యేట్టు వలవలా ఏడుస్తున్న నిస్సహాయ శిశిరను చూస్తూ చదువుతూ, పఠనానుభూతి, ఒక సంవేదనాభారం!
ఇవాళ స్త్రీ తనకోసం తాను ఎందుకు బతుకదు? అనే ప్రశ్నని చెవులు చిల్లులు పడేట్టు ధ్వనింపజేస్తుంది ‘ఆమె విముక్తి’ కథ. హాస్పటల్లో సెడేషన్లో వున్న అనసూయ మరణం ఎప్పుడో చెప్పలేమన్న డాక్టర్ మాటవిని, భర్త శ్రీపతి తానే కొన్ని ట్యూబుల్ని తీసేసి ఆమెకు విముక్తి కల్పిస్తాడు!
కథలో సంభావ్యత, అసంభావ్యతల చర్చకు అవకాశం లేదు. ఎందువలన? అంటే కథాత్మకంగా అనసూయ ఒక All gone గృహిణి. ఛాయాదేవి గారి సుఖాంతంలో నాయిక లాంటిది. సంసారచట్రంలో ఇరుక్కుపోయి, ఆ పళ్ళచక్రంలో నలిగి, నుజ్జయిన స్త్రీ బాధ్యతల బరువుతో క్రుంగిపోయిన స్త్రీ “She is more misunderstood than understood type.” ఆమె కనీస మానవత్వ స్పందనల రోదన అయిపోయింది. శ్రీపతి ఆమెకి విముక్తి కలిగించడం కేవలం ఆమె బాధచూడలేక మాత్రమేనా?- అంటే, అవునని నిర్థారణగా చెప్పలేం. ‘ఎన్నాళ్ళనేది చెప్పలేం’. అన్న డాక్టర్ మాటలే అసలైన Proximate cause గానూ భావించాల్సి వుంది.
రిటైర్డ్ జీవితంలో పిల్లల నిరాదరణకు జవాబుగా తనకోసం తాను బతుకటానికే నిర్ణయించుకుంటుంది.
జీవితంలో రాజేశ్వరి! నలుగురు ఆడపిల్లల్లో మొదటిది కావ్య. తల్లికోసం, చెల్లెళ్లకోసం, ఐదో వాడుగా పుట్టిన అబ్బరపు కొడుకు ఈమె తమ్ముడి కోసం, చేసిన త్యాగం, పడిన బాధలూ అన్నీ నిష్ఫలంగా పరిణమిస్తాయి. తల్లి చనిపోతే చివరికి తలకొరివిపెట్టటానికీ రాడు. ‘అపుత్రస్య గతిర్నాస్తి’ అని తల్లిదండ్రులు తపనపడి కనే – పుత్రుడి ఆదరణ ఇలా ఉంటుంది. చివరికి కావ్యే శవానికి తలకొరివి పెడుతుంది. ‘అపుత్రికస్య’ కథలో కావ్య పఠిత మేధలో ఒక వెంటాడే వాక్యంలా నిలుస్తుంది.
ఈ స్థితికీ, పాత్రకీ విపర్యాయంగా- కొడుకుగా పుట్టి ఆడపిల్లల కంటే హీనంగా చూడబడిన ఒక యువకుని మానసిక వేదననీ భవానీదేవిగారు ఎంతో ఆర్ద్రంగా చిత్రించారు- ‘వచ్చేజన్మకైనా’ కథలో! స్వాభావికంగా, సహజ మానసిక సాన్నిహిత్యం వలన స్త్రీ జీవిత చిత్రణకే ప్రాధాన్యం ఇచ్చిన రచయిత్రే అయినా, భవానీదేవిగారు సిసలైన సాహిత్యారాధనతో – కథా వస్తువుకి పాత్ర ప్రమేయంతో ఇతివృత్తాన్ని కూర్చేటప్పుడు-నిర్మొహత్వంతో, నిరపేక్షతో, ఆబ్జెక్టివ్ గా – ఇలాంటి కథా రచననూ ఎంతో సాంద్రంగా, అనుభూతి ప్రదంగా ఆవిష్కరించారు.
‘సహజం అనిపించే అసహజం కథ’ అన్నారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. భవానీదేవిగారి ‘అమ్మ నీడ’ అనే ఒక అసాధారణ కథ చదివినప్పుడు ఈ నిర్వచనంలోని సత్యం నిలువెత్తున్న మన కళ్లముందు నిలుస్తుంది. వాస్తవికతలో కల్పన, కల్పనలో వాస్తవికత తగుపాళ్లలో మేళవించటంవలన – కథ చదువుతుంటే అసంకల్పంగా అవ్యక్తదుఃఖం, ఉద్వేగం, ఉద్విగ్నత ముప్పిరిగొని గుండెని సంచలింపజేస్తాయి.
మగవాడిచేతిలో, చేష్టలో మోసపోయిన స్త్రీ ఆత్మహత్యకు పూనుకుంది. ఆమెకు ఒక పసిపాప. ఆ ఆత్మహత్యాప్రయత్నంలో ఆదుకుని ఇంటికి తీసుకు వచ్చి మళ్లీమనిషిని చేస్తాడు ఒక డాక్టర్. లోకులు పలుగాకులు కదా. చాలా అనుకుంటారు. పాప దొరుకుతుంది. ఆమె పెరిగి పెద్దదయింది. తల్లిని అసహ్యించుకుంటుంది. చివరికి నిజం తెలుస్తుంది. జ్ఞానోదయం కలిగింది! ఇలా సంక్షిప్తపరిస్తే, సినిమా అనిపిస్తుంది. చదివితే- దానిలోని కథాత్మకతకూ, కళాత్మకతకూ-జోహారు చేస్తాము!
‘అమ్మ పేరు’ మరొక సానబెట్టిన కథానికా వజ్రం. ఒక జులాయిబతుకు బతికిన యువకుడు. కాటికాపరిగా బతుకీడుస్తున్నాడు. తాను నిర్దయగా పాన్ డబ్బాదగ్గర కూర్చోబెట్టి వదిలేసిపోయిన తల్లి శవంగా ఈ కొడుకు నాగులు దగ్గరికి తేబడింది!! గొప్ప సన్నివేశం,సంఘటన! అమ్మకు పేరు ఏదయితేనేం? అమ్మ అమ్మే!!
కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికా పోయి, అమ్మకు తెలియకుండా ఒక అమెరికన్ ని పెళ్ళిచేసుకుని స్థిరపడి, ఈమెని ఇండియాలో అన్ని బంధాలూ తెంపుకుని అమెరికా రమ్మని హుకుం జారీ చేశాడు. టికెట్స్ పంపాడు. ఆ తల్లి అంతర్ముఖీనురాలై ఆవేదన చెందింది. పుట్టిపెరిగిన ఊరు, జీవిక జరిగిన ఊరు కాక పరాయిదేశంలో జన్మ ముగించుకుని ఆ మట్టిలో కలిసిపోవటం ఎంత దురదృష్టం. శ్రీరాముడిని స్వర్ణమయ లంకలో ఉండమంటే జననీ, జన్మభూమి, స్వర్గంకన్నా ఎక్కువ అని చెప్పలేదా! నేటి భారతీయులు రాముని వారసులు కాదా! సుజాత ఎక్కవలసిన విమానం ఆమె లేకుండానే అమెరికా వైపు ఎగిరిపోయింది. అమెరికాలో ఉన్న సారథికి తల్లి దగ్గరి నుంచి ఒక చివరి మెయిల్ అందింది. “బాబూ! సారథీ, నిన్ను నేను తప్పుపట్టను. మీ తరం అంతా ఇలాగే ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల వలస జరగటం నేనూ చూస్తూనే ఉన్నాను. పిల్లలులేని మేము భోపాల్లో ఉన్నప్పుడు అనాథవయిన నిన్ను ఒడి చేర్చుకున్నాము. చివరిదాకా మాకు తోడవుతావనే!” ఇదీ ‘చివర వలస’ కథలో కొసమెరుపు.
___________
భవానీదేవిగారి కథలన్నిటా వస్తువులో సమకాలీనత, సామాజికత నిండుగా ప్రసరించటమేగాక, ఇతివృత్తంలో శైలీ, శిల్పాల కలనేత రంగులీనుతూ అలరింపజేస్తుంది. మంచి కథ చేయవలసిన పని నగ్నవాస్తవికతని ప్రదర్శించటం కాదు. కథాత్మక వాస్తవికతని సంభావ్యతతో ఆవిష్కరించాలి. అంతకుమించిన జీవిత వ్యాఖ్యానాన్ని అందించి, పఠిత సంస్కారాన్ని ఉన్న స్థాయి నుండి మరికొంత ఉన్నత స్థాయికి చేర్చాలి.
___________
భవానీదేవిగారి కథలకు ఈ బలం అమేయంగా వుంది. కథాంతర్గతంగా ఆమెగా అందించే తాత్త్విక వ్యాఖ్యలూ, వాస్తవిక ఉటంకింపులూ ఆమె పరిణతవాణికి దర్పణాలుగా నిలుస్తాయి. “సారథి తల్లితో మాట్లాడుతున్నాడు. కోడలు మాత్రం పలకరించలేదు’ ఇది ‘స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్’. మామూలు రచయిత చేతిరాతే! ఆ తర్వాతి వాక్యం – ‘బంధంలేని బంధుత్వం మరి!’ అనేది. ఇదీ వ్యాఖ్య! ఇదీ రచయిత్రి రచనా నైపుణ్యం; కథా కథన ప్రయుక్తి!! ఇలా కథలన్నిటా – ‘ఆగు, చూడు, నడు’- అనే సందేశాలు తగులుతూ ఆలోచనా ప్రేరకం చేస్తాయి.
భవానీదేవిగారి కథల్లోని మరో ప్రధాన సులక్షణం – క్లుప్తత. క్లుప్తతే కథానికకు మొదటి ప్రాణం. ఈమె కథలన్నీ ‘బ్రివిటీ’లోని ‘క్రియేటివిటీ’ని ఆహ్లాదంగా, ఆశ్చర్యజనకంగా అందిస్తాయి. తెలుగు కథ చిన్న నవలగా మారిపోయి, జీవితాల పిష్టపేషణమే గొప్ప కథాలక్షణంగా కొందరు కథా పండితుల వివరణల్లోకి జారిపోయిన ప్రస్తుత కథా సాహిత్య వాతావరణంలో – భవానీ దేవిగారి అచ్చమైన కథానికల్ని చదవటం, ఆనందించటం-ఒక వాంఛనీయమైన పఠనానుభవం!!
-విహారి
98480 25600