_____________
హిందీ చిత్రసీమలో అనేక సూపర్ హిట్ పాటలకు చక్కని సాహిత్యం అందించిన గుల్జార్ కు పురస్కారాలు కొత్తేమి కాదు. ఆయనను 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. దేశంలోని ప్రముఖ ఉర్దూ కవుల్లో ఒకరిగా గుల్జార్ ను పరిగణిస్తారు. గుల్జార్ అనేది కలం పేరు. ఆయన అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. ఆయన కలం నుంచి అనేక ఉర్దూ కవితలు, షాయరీలు జాలువారాయి. ఆయన ఉర్దూ, పంజాబీ భాషల్లో పలు కథలు కూడా రాశారు. 2004లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ప్రదానం చేసింది. ఈ నెల 17వ తేదీన గుల్జార్ కు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం-సంపాదకులు.
_______
మన్నించండి, మిత్రులారా! నేను మీకు గుల్జార్ గురించిన తెలియని విషయాలేమీ చెప్పబోవడం లేదు. కాకపోతే ఒక కథ చెబుదామని మాత్రం అనుకుంటున్నా.
ఒకసారి ఒక పేదవాడు వెళ్తున్న మార్గంలో ఒక బోర్డు కనబడింది. ఇక్కడ పది అడుగులు తవ్వితే మీకు బంగారు నిధి నిక్షేపాలు లభిస్తాయని రాసి వుంది. వెంటనే ఆ పేదవాడు అక్కడ తవ్వడం ప్రారంభించాడు. రెండు, మూడు అడుగులు తవ్వేసరికి చుట్టు పక్కల గ్రామస్తులు జమకూడారు. బాగా తవ్వమని అతడిని ప్రోత్సహించారు. అతడు రెట్టించిన వుత్సాహంతో మరింత వేగంగా తవ్వడం ప్రారంభించాడు. నాలుగైదు అడుగులు తవ్వేసరికి చుట్టూ మూగిన ఆ గ్రామస్తులే వెక్కిరించడం ప్రారంభించారు. వెర్రివాడివని అతడిని గేలి చేశారు. అయినా ఆ పేదవాడు పట్టు వీడకుండా మరో రెండు అడుగులు తవ్వాడు. బంగారం జాడ ఏ మాత్రం కనిపించలేదు. అతడిని నిరాశ ఆవరించింది. చుట్టూ మూగిన గ్రామస్తులు ఎగతాళిగా నవ్వుతున్నారు. అయినా, అతడు ఓపిక చేసుకుని మరో అడుగు తవ్వాడు. అక్కడంతా ఇసుక తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేదవాడు నిస్త్రాణగా తన ప్రయత్నాన్ని విరమించుకుని వెనుదిరిగాడు. గ్రామస్తులు ఆయన వెంటపడి గోల చేస్తూ తరిమికొట్టారు.
కొద్ది రోజుల తరువాత అదే మార్గం గుండా మరో పేదవాడు వచ్చాడు. అక్కడి బోర్డు చూసి, తవ్వాలని నిర్ణయించుకున్నాడు.
మరి అతడికి బంగారం దొరికిందా? నిథి నిక్షేపాలు అక్కడ నిజంగా వున్నాయా? తెలుసుకునే ముందు, గుల్జార్ గురించి నేను విన్నవీ, కన్నవీ మీకు నివేదిస్తాను. కాస్త ఓపిక చేసుకోండి..
***
నొప్పి తెలిసినవాడే జీవితాన్ని నవనవోన్మేషంగా మలుచుకో గలుగుతాడు. గుండెకు గాయమైనవాడే గేయమై వెల్లువెత్తుతాడు. దేశ విభజన, మత విద్వేషాలు, సామూహిక హత్యలు, చెల్లాచెదురైపోయిన జీవితాలు, గుండెలు పగిలిన కలలు.. దేశంపైని పుట్టుమచ్చలైతే, ఆ మచ్చల మధ్య ఓ మధురమైన విషాదపు టాటూ గుల్జార్.
ప్రస్తుత పాకిస్తాన్‌లోని జీలం జిల్లా దీనాలో 1934 ఆగస్టు 18న జన్మించిన సంపూరన్ సింగ్ కల్రా.. గుల్జార్ గా మారడం వెనుక వున్న చరిత్ర ఘనమైనది కాదు, విషాదకరమైనది. అది ఈ దేశ చరిత్రలోని చీకటితో ముడిపడి వుంది. దేశ విభజన సందర్భంలో జరిగిన అల్లర్లలో గుల్జార్ కుటుంబం అమృతసర్, ఢిల్లీల మీదుగా ముంబై చేరుకుంది. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. సవతి తల్లి యథావిధిగానే సరిగా చూడలేదు. చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో ఇంటర్మీడియట్‌తో ఆపేశాడు. తండ్రి సంపాదన అంతంత మాత్రమే కావడంతో ఒక కార్ల గ్యారేజీలో పనికి కుదురుకున్నాడు. అక్కడ పని ఎక్కువగా వుండకపోవడంతో పుస్తకాలు విస్తృతంగా చదవడం మొదలెట్టాడు.
_____________
చిన్నతనం నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకర్షణలో ఓలలాడుతున్న గుల్జార్ కవిత్వాన్ని తన మార్గం చేసుకున్నాడు. అలా అక్కడి పోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ కార్యక్రమాలకు దగ్గరయ్యాడు. తరచూ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్న గుల్జార్ ను అప్పటి ప్రముఖ కవి శైలేంద్ర ప్రముఖ దర్శకుడు బిమల్ రాయ్ కి పరిచయం చేశారు. ‘బందనీ’ సినిమాకు సంగీతం సమకూరుస్తున్న ఎస్.డి. బర్మన్ కీ, శైలేంద్రకీ ఏవో తేడాలు రావడంతో ఆ సినిమాలో ఒక పాట రాసే అవకాశం గుల్జార్ కు దక్కింది. ఆ పాట బాగా నచ్చడంతో బిమల్, గుల్జార్ ని తన అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. అంతే, అక్కడ్నించి గుల్జార్ హిందీ సినిమా రంగాన్ని కమ్ముకున్నాడు.
_________
బిమల్ రాయ్ బెనజీర్ మొదలు పెట్టిన రోజులవి. అందులో అలనాటి అందాల నటి మీనా కుమారి హీరోయిన్. బిమల్ అసిస్టెంట్ గా వున్న గుల్జార్ ఆమె మైకంలో మునిగిపోయాడు. త్వరలోనే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంలో ఎంత ప్రేమ వుందంటే-ఒకసారి అనారోగ్యంతో వున్న మీనా కుమారి రంజాన్ ఉపవాస దీక్ష కారణంగా మందులు వేసుకోవడానికి నిరాకరిస్తే, ఆమె బదులు తాను ఉపవాసం వుండి ఆమెను కాపాడాడు. ఆ అలవాటుతోనో, ఆమె జ్ఞాపకాలతోనో.. మీనా కుమారి మృతి చెందిన తర్వాత కూడా గుల్జార్ రంజాన్ ఉపవాస దీక్ష చేసేవాడని చెప్పుకుంటారు. గుల్జార్ మొదటి సినిమా ‘మేరే అప్నే’లో మీనాయే హీరోయిన్. ఆమె మరణానంతరం ప్రముఖ హీరోయిన్ రాఖీని వివాహం చేసుకున్నాడు. అయితే, కూతురు మేఘన పుట్టగానే ఇద్దరూ విడిపోయారు. కానీ, ఇప్పటికీ విడాకులు తీసుకోలేదు.
సినిమాలు, పాటలు రాయడంలో మునిగి తేలుతున్నా సీరియస్ సాహిత్యాన్ని గుల్జార్ నిర్లక్ష్యం చేయలేదు. అంతేకాదు, ఒకే రకమైన ధోరణికి విరుద్ధంగా కొత్తగా ఏవైనా చేయాలనే తహతహతో పిల్లల కామిక్స్ వైపు దృష్టి సారించాడు. ‘జంగిల్ బుక్’కు రాసిన ‘జంగిల్.. జంగిల్.. బతా చలాహై’ పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘అలియాస్ ఇన్ వండర్ లాండ్’, ‘పొట్లి బాబా’కు మాటలు, పాటలు రాశాడు. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలని తపించే గుల్జార్ 40వ ఏట సితార్ వాయించడం నేర్చుకున్నాడు. 50వ ఏట టెన్నిస్ ఆడటం మొదలుపెట్టాడు. ఠాగూర్ సాహిత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం ఏకంగా బెంగాలీ భాష నేర్చుకున్నాడు. ‘కోషిష్’ సినిమాలో మూగ చెవిటి హీరో హీరోయిన్లకు సరైన దిశా నిర్దేశం చేయడం కోసం ఏకంగా ఆ సైగల భాష కూడా నేర్చుకున్నారు. ఆ అనుభవంతో వారి పాఠశాలకు సహాయం చేయడానికి విస్తృతంగా కృషి చేశాడు. 84 ఏళ్ల వయసులో ‘టు’ పేరుతో నవల రాశాడు. దేశ విభజన నాటి ఘటనలను అందులో కళ్లకు కట్టాడు.
ఠాగూర్ సాహిత్యాన్ని అనువాదం చేసిన గుల్జార్ ‘‘ఆయన సాహిత్యం చదువుతున్నకొద్దీ అద్భుతంగా అనిపిస్తుంద’’ని అంటాడు. తొంభై ఏళ్లకు చేరువవుతున్న ఆయన ఇప్పటికీ వివిధ భాషల్లో వచ్చిన సాహిత్యాన్ని చదువుతూ, సమకాలీన మార్పులను అవగాహన చేసుకుంటూనే వుంటాడు. 34 భాషల నుంచి 300 మంది కవుల కవితలను అనువాదం చేసిన ఆయన ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇప్పుడు పదునైన కవిత్వం వస్తోందని అంటారు.
“ఈ దేశంలో బతకాలంటే మతం నుంచి నన్ను నేను దూరంగా వుంచుకోవాలనుకున్నాను. అప్పుడు మాత్రమే ఈ దేశంలో బతకగలం” అని నవ్వుతూ అంటారు. గుల్జార్ కవిత్వం గురించి విస్తృతంగా తెలిసిన అనేక మందికి ఆయన వచనం గురించి చాలా తక్కువగా తెలుసు. విభజన సమయంలోని దుర్ఘటనల గురించి ఎంత చెప్పినా, వాటిని ప్రక్షాళన చేయలేమని వాపోతాడు.ఆ దుఃఖాన్ని వెళ్లబోసు కోవడంలో ఉర్దూ సహకరించినట్టుగా, ఇంగ్లీషుతో కుదరడం లేదని చిరాకు పడతాడు. రోడ్ల మీద చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను, కుళ్లిపోయిన శవాలను గుర్తు చేసుకుంటూ విభజన నగ్నత్వాన్ని ‘టు’ అనే నవలలో అసమానంగా ఆవిష్కరిస్తాడు. కవిత్వంలో గుల్జార్ భాష మాత్రమే తెలిసిన వారికి ఈ వచనంలోని భాష తొందరగా కొరుకుడు పడదు. విభజన వల్ల నష్టపోయిన, దాని శిథిల జ్ఞాపకాల్లో నివసిస్తున్న వారి మౌన సంభాషణను ఈ నవల పదునుగా వినిపిస్తుంది.
______________
మూడు సంపుటాలుగా వెలువడిన గుల్జార్ కథలు కూడా ఎంతో ప్రభావశీలమైనవి. గుల్జార్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందించిన కథా సంకలనాన్ని ‘పొగ’ పేరిట మృణాళిని గారు తెలుగులోకి అనువదించారు. మరో కథా సంపుటి ‘ఆఫ్ ఏ రూపీ’ని పెంగ్విన్ ప్రచురించింది. ఈ కథల్లో బిమల్ రాయ్, జావేద్ అక్తర్, సాహిర్ లూథియాన్వి, కులదీప్ నయ్యర్‌ల గురించిన నిజ జీవిత కథలు కూడా వుండటం విశేషం.
_________
ప్రధాన మంత్రిని హతమార్చడానికి వచ్చిన మహిళా మానవబాంబు చివరి రోజు జీవితం, ముంబైలో ఇల్లు కొట్టుకుపోతుంటే వర్షంతో కొట్లాడే తాగుబోతు వ్యక్తావ్యక్త ఆలాపన, వైర్ లెస్ లో మాత్రమే మాట్లాడటానికి అలవాటు పడిన సైనికుడు ఈ కథల్లో మనకు తారసపడతారు. దేశ విభజన నాటి అమానవీయ ఘటనలు గుల్జార్ హృదయంపై చెరగని ముద్ర వేశాయి అనడానికి ‘నేరేడు చెట్టు’, ‘భయం’, ‘పంట’, ‘పొగ’, ‘విభజన’ వంటి కథలు నిదర్శనంగా నిలుస్తాయి. ‘వివాహ బంధం’, ‘మగవాడు’, ‘అతిథి’ వంటి కథలు స్త్రీ పురుష సంబంధాలను ఆవిష్కరిస్తాయి. కాకపోతే, గుల్జార్ కవిత్వానికి, వచనానికి ఒక దగ్గర సంబంధం వుంది. అదేమిటంటే, ఆ రచనను చదవడం పూర్తయిన తర్వాత కూడా ఆ భావాలు మనల్ని వెంటాడతాయి.
అందుకే-‘సృష్టిలోని ప్రతిదాంట్లో రొమాన్స్ వుంటుంది. నొప్పిలో, పడే కష్టంలో కూడా రొమాన్స్ వుంటుంది. జీవితాన్ని ప్రేమించడం నేర్చుకుంటే, అది మీ సొంతమవుతుంద’ని గుల్జార్ అంటారు.
***
అన్నట్టు కథ సంగతేంటనే కదా మీ సందేహం. అప్పటికే ఎనిమిది అడుగులు తవ్విన పేదవాడికి లభించనిది, నాకేం దొరుకుతుందిలే అని మరో పేదవాడు అనుకోలేదు. గొప్ప ఆశావహ దృక్పథంతో ఆ ఎనిమిది అడుగులు గోతిలోకి దిగాడు. చెమటోడ్చి, కష్టపడి మరో రెండు అడుగులు తవ్వాడు. అంతే.. మరో వెర్రి వెంగళప్ప వచ్చాడని గేలిచేస్తున్న గ్రామస్తుల నోళ్లు మూతబడిపోయాయి. ఆ పదడుగుల గోతిలో దొరికిన బంగారు నిధి నిక్షేపాల వెలుగులకు చుట్టుపక్కల అందరి కళ్లు బైర్లు కమ్మాయి. కృషి, పట్టుదలతో ఆ నిధిని సొంతం చేసుకున్న పేదవాడు మాత్రం దశాబ్దాలకు పైగా బంగారాన్ని అందరికీ పంచుతూనే వున్నాడు.
ఇంతకీ, ఆ మరో పేదవాడు ఎవరో నేను మీకు చెప్పక్కర్లేదు కదా?
***
తోటమాలికి తెలియకుండా దొంగిలించాననుకుంటున్న ఈ నాలుగు పూలను గుత్తిగా మలిచి ఆ జ్ఞానపీఠం ముందుంచి వినమ్రంగా ప్రణమిల్లుతూ..
-దేశరాజు
99486 80009