గురువు బోధనలే జ్ఞాన విత్తనాలు..

ఎడిటోరియల్

విశ్వ సౌభాగ్యానికి పట్టుకొమ్మ, సమాజ జీవనానికి చుక్కాని గురువు..
గురువు బోధనలను శ్రద్ధతో విని, ఆచరించిన వాడే ఉన్నత స్థితికి చేరుతాడు..
విద్యారంగంలో ప్రజల భాగస్వామ్యం పేరుతో రాజకీయాలు చొరబడటం వల్లనే విలువలు పతనం..
“ఎండలో మాడి చల్లటి నీడను, ప్రాణవాయువును” ఇచ్చే తరువులాంటి వాడు గురువు. గాడి తప్పుతున్న సమాజాన్ని సన్మార్గంలో ప్రయాణింప చేయాల్సిందే..
ఆచార్యులను గౌరవిస్తేనే సమాజానికి ఉన్నతి..

ప్రపంచాన్ని నాగరికత వైపు నడిపించే సాధనం “చదువు” ఒక్కటే. ఈ చదువును బోధించే “గురువు” సమర్ధుడైన వాడై ప్రశ్నకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను పురిగొలిపితే.. విద్యార్థుల్లో జ్ఞానార్జన, శాస్త్రీయ వైఖరి, సామాజిక స్పృహ పెరుగుతుంది. చదువు సక్రమంగా అబ్బాలంటే ప్రశ్నించడం, పరిశోధించడం ఫలితాలకై, పరిష్కారాలకై పరితపించడం ఒక్కటే మార్గం. ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని రగిలిస్తాయి. నిష్ఠూరంగా ఉన్నా! నిజాలు బయటపడి చైతన్య బాట పట్టిస్తాయి. నాటి నుండి నేటి వరకు అభివృద్ధి శిఖరాన్నంటిన నేటి టెక్నాలజీల జ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన గురువులదే. పూల కడుపున తేనె పోసెనెవ్వడో! దాన్ని తీయు నేర్పు తుమ్మెదకు లభించినట్లే.. విద్యార్థికి జ్ఞానాన్ని నూరిపోసి సృజనాత్మకత అనే తేనియను తీయు నేర్పు గురువుకు మాత్రమే దక్కింది. తల్లిదండ్రులు జన్మనిస్తే దానికి సార్ధకత చేకూర్చేది గురువులు. విద్యార్థుల్లోని అజ్ఞానం అనే చీకట్లను పారదోలి విజ్ఞానం నింపి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతారు.
అంతే కాదు తాను నిత్య విద్యార్థై బోధనా నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటూ నువ్వు ఎవరివో నీకు తెలియజేస్తూ నిఖార్సైన పౌరునిగా ఎదగడానికి నిస్వార్థంగా దోహదపడతారు. సమాజ జీవనానికి చుక్కాని వంటి వారు. విశ్వ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు విద్యార్థులు-గురువులే. అందుకే ఆచార్యులకు అత్యున్నత స్థానం కల్పించారు పెద్దలు-సమాజం.

ప్రపంచంలో అతి సులువైన పని పెళ్లి చేసుకొని పిల్లలు కనడం. అతి కష్టమైన పని ఆ పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. ఇది సాధిస్తేనే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. అది గురుతర బాధ్యత మోస్తున్న గురువులకే సాధ్యం.అలా గురువు స్థానానికే వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5 న ఆనాటి అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా, గొప్ప రచయితగా, తత్వవేత్తగా, ఆదర్శమూర్తిగా, మంచి నాయకుడిగా, భారత ఉపరాష్ట్రపతిగా, చివరగా భారతదేశ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయనకు అందని శిఖరం అంటూ లేదు. విద్యావేత్తగా అందరి ప్రశంసలు అందుకున్నారు. భారత ప్రభుత్వం “భారతరత్న” బిరుదుతో సత్కరించింది. అందుకే ఆయన జన్మదినాన్ని “గురు పూజోత్సవం”గా జరుపుకుంటున్నాం. విద్యార్థుల్లో నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొలిపి జ్ఞానం, ఆనందాన్ని, మంచి భవిష్యత్తును నింపేది గురువులే. ప్రతి మనిషిలో నిక్షిప్తమై ఉన్న విశ్వజనీన భావాలను వెలికి తీసే విద్యను అందించే మంచి గురువులు తమ విద్యార్థుల విజయాల్లో చిరంజీవులై ఉంటారు. ఇలా వర్తమానం అనే అపురూప బహుమానాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి గురువులు-శిష్యులు. గురు శిష్యుల మధ్య పట్టరాని ఆనందం, అపారమైన ప్రేమ కలగలిపిన బోధన సాగినప్పుడే “సృజనాత్మకత” పురి విప్పుకుంటుంది. అనేక వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలకు దారులు పడతాయి. పుష్పం నుంచి పరిమళాన్ని వేరుచేసి చూడలేము.. అలాగే గురుశిష్య సంబంధం కూడా. గురువు మంచి మాటలు మంచి నేలపై పడిన విత్తనాలు లాంటివి. సమాజ ఎదుగుదలకు, చైతన్యానికి, మార్పుకు నాంది పలుకుతాయి. ఆ మాటలు మకరందంలా ఉండాలి. అవి మనసును తట్టి విద్యార్థిని మహోన్నతుడిని చేస్తాయి. మెప్పించేవిగానో, నొప్పించేవిగానో కాకుండా మంచి వైజ్ఞానిక దృక్పథంతో మార్పును తెచ్చేవిగా, బుద్ధిని వికసింపచేసేవిగా ఉండాలి. బోధించే గురువు ఆర్తిని, ఆవేదనను మెదడుకు ఎక్కించుకోవాలి. నిష్టతో వినే శక్తిని(లిజనింగ్ స్కిల్) కలిగి ఉండాలి. శిష్యుల మాటల తీరు శోధనాత్మాకంగా, అభ్యుదయం, అధ్యయనం , సామాజిక స్పృహ కలిగి ఉంటే గురువులకు ప్రతిష్ట పెరుగుతుంది. గురువు చదువుతో పాటు స్ఫూర్తిని రగల్చి బోధించిన దాన్ని నేర్చుకునే, ఆచరించే సంస్కారం శిష్యులకు అలవర్చాలి.

ఆధునిక రాజకీయాల్లో విద్యారంగంపై శ్రద్ధ లోపించడంతో పాటు, ప్రజల భాగస్వామ్యం పేరుతో రాజకీయాలు చొరబడటమే విలువల పతనానికి ముఖ్య కారణం. నేడు మద్యం పాలసీపై ఉన్న శ్రద్ధ, ప్రాధాన్యతా విద్యా రంగంపై, పాఠశాలల నిర్వహణ మీద లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఒకప్పుడు గురువే సర్వాధికారి. ఆ వృత్తిని అందరూ గౌరవించేవారు. ఇప్పుడు అధికారుల, రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మగా, గుమస్తాగా చూస్తున్నారు. విద్యలో విఫల ప్రయోగాలతో విద్య నుండి గురువులను దూరం చేసి, విద్యను అంగడి సరుకును చేసి ఉచిత నిర్బంధ విద్య నుండి పాలకులు క్రమంగా తప్పుకుంటూ “గురువును బలిపీఠం” మీద కూర్చోబెట్టినారు. అయినా కాలం ఏదైనా పాలన ఎవరిదైనా సమాజ హితాన్ని కోరుకుంటాడు గురువు. కోట్లాది తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న వారి పిల్లల్ని మన చేతిలో ఉంచారని, అంతకన్నా ఆప్యాయంగా అక్కున చేర్చుకొని భిన్న వాతావరణంలో పెరిగిన పిల్లలను విశాల హృదయులుగా మారుస్తాడు. తన ఇంట్లో బాగా లేకపోయినా, ఒంట్లో బాగా లేకపోయినా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ అధికారుల కోపాన్ని, తల్లిదండ్రుల తాపాలను తట్టుకుంటూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా పనిచేస్తున్నారు. భూదేవిలా అన్నీ భరించి సమాజంలో విలువల కోసం పరితపిస్తున్నారు. పూర్వం మంచి గురువు కోసం వెతికేవారు. నేడు మంచి విద్యార్థులు లభించడం కష్టంగా మారింది. విద్యాలయాల్లో విద్యార్థులకు మానవతా విలువలు బోధించినప్పటికీ, అనేక కారణాలతో వారిలో క్రమశిక్షణ, భయభక్తులు, శ్రద్ధాసక్తులు తగ్గిపోయి వ్యసనాలకు బానిసలై సమాజం గాడి తప్పుతుంది. విద్యార్థుల దశలో గురు బోధనలు విస్మరించి ఆ తర్వాత భగవంతుని నమ్ముకోవడం అంటే?” చెంబులో నీళ్లను పారబోసి వర్షం నీళ్ల కోసం “ఆరాటపడడం లాంటిదే..!. గురువు బోధనను శ్రద్ధతో అనుసరించి, ఆచరించేవాడే ఉన్నత స్థితికి చేరుకుంటాడు. అలా కాదని పెడచెవిన పెట్టి ఆయన పట్ల, బోధన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు విద్యార్థి దశ దాటిన తర్వాత బాధపడతారు. గురువుకు బడితోనే బంధం, సుగుణాలే ధనం, పాఠమే ప్రాణం. జ్ఞానానికి జన్మనిచ్చే ప్రసూతి గదే తరగతి గది. అజ్ఞానాన్ని దహనం చేస్తూ, జాతి భవితను నిర్మించే కర్మాగారం బడైతే, గురువులు అందులో కార్మికులు. సరైన నిర్ణయాలు తీసుకునే న్యాయస్థానం తరగతి గదే. ప్రశ్నలకు నిలయం.. జవాబుల ఖజానా గురువే. “ఆచార్యులకు విలువనివ్వని సంఘం ప్రాణం లేని దేహం” లాంటిది సుమా. సమర్ధుడైన గురువు లభిస్తేనే శిష్యుని జీవితానికి సార్ధకత-యోగ్యుడైన శిష్యుడు లభించకపోతే గురువందించే విద్యకు ప్రకాశం ఉండదు. ఎన్నో అవరోధాలు ఎదురైనా గాడి తప్పుతున్న సమాజాన్ని గాడిలో పెడుతూ, సమాజంలో నైతిక విలువలు పెంపొందించే క్రతువులో “చెట్టు ఎండలో మాడి చల్లటి నీడను- మనిషికి ప్రాణవాయువును” ఇస్తున్నట్లే గురువు తన ప్రయాణం కొనసాగించాల్సిందే.. ఆ ప్రయాణంలో గురువు గౌరవాన్ని పెంచడం కోసం ప్రభుత్వాలు, విద్యార్థులు, సమాజం చేయూత ఇచ్చినప్పుడే “గురు పూజోత్సవానికి” సార్ధకత.

 

మేకిరి దామోదర్,
సోషల్ ఎనలిస్ట్,
9573666650.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *