ప్రకృతి స్వేచ్ఛ-మనసు స్వచ్ఛత కలెగలిపితే “ఆనందజీవి” !

సాహిత్యం హోమ్

“Highlight themes of self-knowledge, freedom from conditioning, observation without evaluation, and living in the present moment.” ఈ నాలుగు లక్ష్యాల, ఆచరణాల జీవన గమనాలలో దృగ్గోచరిత “truth is pathless land” ని సంభాషణల్లో, సంవాదాల్లో, ప్రసంగాల్లో, రచనల్లో పరిపుష్టిగా పరివ్యాప్త పరచిన జిడ్డు కృష్ణమూర్తి (1895-1986) గారిని తెలియని భారతీయ సమాజం, ప్రపంచ సమాజమున్నూ లేదంటే అతిశయోక్తి కాదు.

చార్లెస్ లెడ్ బీటర్ , అనీబిసెంట్ ప్రోద్బలంతో దివ్యజ్ఞాన సమాజంలో చేరాక, ఆధ్యాత్మిక మత విశ్వగురువుగా వెలుగొందటాన్ని తిరస్కరించి, విస్తృత పర్యటనలు చేస్తూ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక విషయాల పట్ల అనురక్తి పెంచుకొని, వాటి ఉద్బోధనలో కాలం గడిపారు. The first and last freedom, Krishnamurti notebook ఆయన గ్రంథాల్లో ప్రాముఖ్యత వహించినవి. 2001 లో ఏర్పాటైన Krishnamurti foundation of India(Chennai) ద్వారా దాదాపు 17 volumes గా తన ప్రసంగాలు పుస్తకరూపంలో ప్రచురితమైవి.

__________________

భయంతోనో, ఓటమితోనో, వేదనతోనో జీవితం నుంచి పారిపోవాలనుకొంటున్న సందర్భంలో కలిసిన ఒక తరుణ వయస్కురాలికి దృఢచిత్తం, బతుకుపై ప్రగాఢ విశ్వాసం ఆమెలో పాదుకొల్పేందుకు రాసిన లేఖలే, “happy is the man who is nothing” పుస్తకం. సరోజిని ప్రేమ్ చంద్ తెలుగు అనువాదంగా “ఏమీ కాని మనిషే-ఆనందజీవి” స్నేహితురాలికి లేఖలు.

___________________

1948 జూన్ నుండి 1960 మార్చి మధ్య ఆమె నెపమే అయినప్పటికీ, విశ్వమానవాళి దృష్టితో రాసిన లేఖలుగా, విశిష్ట సాహిత్యంగా భావించవచ్చు. ఒకానొక మానసిక, శారీరక, లేదా ఇతరులచే సృష్టించబడిన కీడుల, ఆపదల దాడుల నెదుర్కొనే ఆత్మస్థైర్యం, స్థితప్రజ్ఞత శాశ్వత సిద్దిగా ఈ పుస్తకం హృదిలో ప్రతిష్టిస్తుంది.

“స్పష్టమైన దిశా నిర్దేశము, కారుణ్య పూర్వక బోధన, ఊరట, స్వస్థత పొందే రచనా శిల్పం” ఈ లేఖల సారాంశంగా ద్యోతకమవుతుందని భారతదేశ కళాకారిణి, గాంధీ, నెహ్రూ, జిడ్డు గార్ల జీవిత చరిత్రలను గ్రంథస్తం చేసిన రచయిత్రి అయిన ప్రపుల్ జయకర్ వెలిబుచ్చిన గౌరవాభిప్రాయం చదివాక అందరం వస్తం.

రామాయణంలో హనుమంతుడు సముద్రం దాటేప్పుడు అశక్తతను బయట పెడితే, సుగ్రీవ, జాంబవాదులు అతని బలపరాక్రమాలను కీర్తిస్తుంటే, హనుమ..బలాఢ్యుడై లంఘించిన తీరు మస్తిష్కంలో కదలాడుతుంటది ఈ పుటల్లోకి వెళుతుంటే. రోగిని బాగు చేసి తీరాలనే వైద్యుని నిశ్చయం, పలు చికిత్సా మార్గాలను కనుగొనే ప్రయత్నం లాంటిది కూడా గమనిస్తం.

ప్రాకృతిక అంశాలను, మానసిక రుగ్మతలను, సాహిత్య పరిమళాలతో రంగరించి ఉద్దీపన, ఉత్తేజిత ప్రభావాన్ని చెరగని ముద్రగా వేసిన లేఖల వేకువ పొద్దులివి.

“-మానసికంగా విరిగి ముక్కలై పోకుండా తట్టుకునే మృదుత్వం-వెదురులా వంగే గుణం వుండాలి. పర్వతాలు ఏకాంతంగానే వుండాలి. పర్వతాల మధ్య వర్షం, ప్రశాంతంగా వున్న కొలనులో వాన చినుకులు పడటం ఎంతో రమణీయంగా వుంటుంది. -వాతావరణం మనల్ని ఎంతలా తాకి ఊపివేస్తుందో గమనిస్తే చాలా వింతగా వుంటుంది. -నది ఎంత మనోహరంగా వుంటుంది! సమృద్ద జలాలతో విశాలంగా పరచుకొని ప్రవహించే నది లేని దేశం దేశమే కాదు…” ఇట్లా కంటి ముందటి ప్రాకృత సత్యాలతో ధైర్య వచనాలు సాగుతయి.

“-ఆలోచనకు ఒక మూలమో లేదా కొన్ని మూలాలో ఉంటాయి. అసలు ఆలోచనే ఇంకొక దానికి మూలం అవుతుంది. -మనం ఏమిటి అనేది అర్థం చేసుకోవడం సృజనాత్మకతను వెలికి తీసుకొస్తుంది. -జీవితం అంటేనే అనుభవాల వల్లరి. -సుప్త (అవ్యక్త) చేతనలో సమూలమైన మార్పు రావడం అన్నింటికంటే ముఖ్యం. -మనసు సౌందర్య, వికృతాలలో ఒక దానిని గట్టిగా పట్టుకొని, మరొక దానిని దూరంగా త్రోసి వేస్తూ, రెండింటి మధ్య పోరాటం జరపడం ఎందుకు?..” ఇత్యాది వాక్య సంపదను మానసిక, జీవిత అంశాలతో ముడిపెట్టి, బలహీన మనస్కురాలైన ఆమెను తిరిగి చైతన్య బాటలో నడిచేందుకు సమాయత్త పరచటం చూస్తం.

జీవికి జీవితాన్ని జీవించటం రాదని, అశేషమైన సంపదలు, సౌభాగ్య నిధులు వున్నప్పటికీ కూడా. ఆ సమృద్దతతో హృదయాలను ఎలా నింపుకోవాలో మనకు తెలియదని, అంతర్గతంగా పేదవారం, ప్రేమించటం, ప్రేమను పొందటం, ప్రేమను నింపుకోవటం పట్ల మనం షరతులను పెట్టుకుంటాం అనే సత్యాన్ని బయట పెడ్తరు. మనిషికి పరిపూర్ణమైన సంతోషాన్ని తీసుకొచ్చే ఏకైక విప్లవం(!) అదే అని నిర్ద్వందంగా ప్రకటిస్తరు.

స్పష్టత, తిరుగుబాటు తనం, తెలివితేటల ప్రస్తావన చేస్తరు. స్పష్టతలో అన్నీ చక్కబడతాయని రాస్తూనే, మనలో ‘ఉన్నది’ ని పరికించి చూడటానికి తెలివితో కూడిన తిరుగుబాటు తత్వం వుండి తీరాలని అంటరు. ఇక్కడ అడ్డుగా వున్న అవరోధాన్ని చూసి భ్రమ పడకుండా వుండే తెలివితేటలని అర్థం. ఒక చక్కని పోలిక “ప్రవహించే నదికి ఆటంకం తగిలితే, తన బలంతో ముక్కలు ముక్కలు చేసేస్తుంది” అంటూ “నది తిరగబడుతుంది” అనే తిరుగుబాటు తత్వం అవసరమని ప్రబోధిస్తరు.

విసుగు, అలవాటు, ఒకే గాడి, మూస వెరసి రొటీన్ జీవితానికి, అసలు “విస్మయపడే తత్వమే” పోగొట్టుకున్న మనిషికి పరమావసరమైనది “నవ్యత్వము, తాజాదనము” అనే గుణం అలవరచుకొనే ఆవశ్యకత తెలుపుతరు.

సౌందర్యం రెండు రకాలని, బాహ్య, అంతర్గత సౌందర్యాలుగా పేర్కొంటూ, బాహ్యాన్ని ఎంత పెంచి పోషించుకున్నా అంతరంగంపై దృష్టి పెట్టకుంటే బాహ్య సౌందర్యం కూడా చెడిపోతుందంటూ, ఆపిల్ పండు లోపల ఉన్న పురుగే ఆ పండులోని రసాన్ని హరించి వేస్తుందని ఉదహరిస్తరు.

నిజాయితీతో కూడిన పరిపూర్ణ ప్రబోధం, నిర్ధిష్టమైన అనుసరణీయ మార్గనిర్దేశం, ఆచరణాభిలాషను రేకెత్తించే సాత్విక విశదీకరణ ఈ ఉపన్యాసకుని గొప్ప లక్షణంగా గుర్తింపు కొస్తది పఠనంలో.

అత్యాధునిక సమాజంలో విషాదమో, మూర్ఖత్వమో ఏమిటంటే, ప్రకృతి విధ్వంసం, మతాల, దేవుళ్ళ విశ్వాసం అతిగా ప్రబలిందని వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. వీరి వైఖరి ఇందుకు భిన్నమైనదనే రుజువు ఇందులో వున్నది.

“ప్రకృతిని ప్రేమించలేనప్పుడు మనిషిని కూడా ప్రేమించలేము. మన దేవుళ్ళు చాలా కుంచించుకొని పోయి అల్పులుగా తయారయారు” అన్న వాక్యాలు పట్టిస్తయి.

జీవితాన్ని సజావుగా జీవించనీయని అతి పెద్ద సమస్య అసంతృప్తి. దీన్ని లేవనెత్తుతూ,కమ్యూనిజం, మతవ్యవస్థలు, ఒక సిద్దాంతం వాదం కానీ అసంతుష్టి లేకుండా చేయలేవు అని తీర్మానిస్తరు. అసంతృప్తిని అర్థం చేసుకోవాలి గానీ నిరసించకూడదు. ఒక దిశగా మళ్ళించాలనీ ఆపేక్షించకుండా దాని దారితెన్నులు గమనిస్తూ, ఒంటరిగా మనసులో ఏ ఆలోచనా లేకుండా వుండిపో! అంటరు.

“బతుకు నడక ఒక ఎరుకతో

కొనసాగాలంటూ, ఒక సౌభాగ్యవంతమైన రోజు అంటే ఏ నిర్బంధాలు, ఏ భయాలు, ఏ పోల్చిచూడటాలు, ఏ సంఘర్షణలు లేకుండా ఊరికే ఎరుకతో స్పృహగా వుండటం. అంటే సృజనాత్మకంగా వుండటం. ఎరుక అనే ఆ నిజాన్ని, దాని అవసరాన్ని గ్రహించటం ప్రధానం.” అన్న మాటలు మానసిక దృఢత్వం, జీవిత స్థిరత్వం వైపు పురికొల్పేవి.

జీవనం మెరుగు కోసం తెలివితేటల్తో ఆర్థిక సంపాదనా కొలమానంగా చూస్తం. పరువు మర్యాదలు సంపాదించడంగా భావిస్తం. కానీ వీరు తెలివితేటల్ని భయం నుండి పూర్తిగా విడుదల పొందడంగా స్పష్టపరుస్తరు.

ఫలానా వానిగా అవాలి, సాధించాలి అనే ఇచ్ఛా సంకల్పం ‘నా’ అనే కేంద్రంగా మొదలై ఒక్కొక్కసారి ఆశాభంగమై, తీవ్ర వేదనామయ లోయలో పడే అవకాశ ముంటుందని, ఆ తాత్పర్యాన్ని గమనింపులోకి తెచ్చుకుని, క్షణక్షణమూ స్పృహతో వుండాలని మేల్కొల్పుతరు. ఇక్కడ బుద్దుడు కూడా గుర్తొస్తరు.

ఒక లేఖలో “విద్య అంటే అర్థం ఏమిటి?” అనే వివరణలో చదవటం, రాయటం, ఏదో కౌశలాన్ని నేర్చి, ఆ తర్వాత జీవనోపాధికి సమాజం మీద తోయటం మాత్రమేనా? మనిషికి బాహ్యంగా విద్య నేర్పించి, అంతరంగాన్ని వదిలేస్తే ఎలా అని విచారిస్తున్నాను అంటరు. ఆంతరికంగా ఎప్పటికీ స్వేచ్ఛగా వుండటమే, వుండటానికి గొప్ప శ్రద్ద, వివేకము అవసరమని, అది ఇవ్వగలిగేదే నిజమైన విద్య అని నిర్వచిస్తరు.

విద్యాంశాన్నే ప్రస్తావిస్తూ, సృజనాత్మకత, పోల్చి చూడటం మధ్య వైరుధ్యాన్ని విప్పి చెప్పుతూ, “మనం ఏమిటి అనేది అర్థం చేసుకోవడం సృజనాత్మకతను వెలికి తీస్తుందని, పోల్చిచూడటం పోటీ తత్వానికి, నిర్ధాక్షిణ్యతకు, ఆకాంక్షలకు దారి తీస్తుందని, కానీ ఇదే అభివృద్దికి మార్గమని అనుకుంటాం, కానీ ఇంతకు మునుపు కనీ వినీ ఎరుగని యుద్దాలను, దురవస్థలను ఈ అభివృద్దే తెచ్చిపెట్టిందని స్పురణకు తెస్తరు. పోటీతత్వ విద్యావిధానం నుండి దూరంగా పిల్లల్ని పెంచాలని వాంఛిస్తరు.

మానసిక స్థితి గతుల్లోకి వెళుతూ, నకారాత్మక, సుప్తచేతనావస్థ, అజ్ఞేయ స్థితులకు లోబడిన మనిషిని, అధిగమించే, సంస్కరించే ప్రభావశీల సూచనలను విశదీకరిస్తరు.

జిడ్డు కృష్ణమూర్తి గారు గొప్ప తాత్విక, సామాజికవేత్త. గురువు వెంబడో దేవుని వెంబడో పడటం, శోధించటంకంటే ఆత్మ శోధన, స్వీయ విచక్షణ, సత్యాసత్యాల వివేచన, సాధన ఆవశ్యకతను అట్లే ప్రకృతి ఆరాధ్యతను, పాఠాలను జీవన గమనంలోకి ముఖ్యంగా మానసంలోకి ఇంకించుకొనే ప్రక్రియే లేఖల సారాంశంగా చూడొచ్చు.

చలం అనువాద రవీంద్ర గీతాంజలి ఎంతటి ప్రాశస్త్యమున్న గ్రంథమో జిడ్డు గారి ఈ గ్రంథం కూడా అంతగా ఎన్నదగినది. రవీంద్రులు దేవుడితో మొర పెట్టుకుంటే, కృష్ణమూర్తి గారు మిత్రురాలికి సాంత్వనగా రాసింది.
___________________

భారతావనిలో పుట్టి, విదేశాల్లో ఎక్కువ పర్యటిస్తూ వుండి, జీవిత పరిసమాప్తి అక్కడే జరిగినా, పాశ్చాత్య పోకడలు లేని వీరి రచనల్లో భారతీయాత్మ, మానవాభిముఖంగా ప్రాకృతిక ధర్మం, పదపదాన పరిఢవిల్లడం చూస్తం. ఏ సిద్దాంతాలతోనో, ఏ మహాత్ముల మహత్మ్యం చేతనో సమాజ, దేశ, ప్రపంచ ముఖ చిత్రం మారటం సాధ్యపడదని, మానవ ‘అంతరంగ పరివర్తనే’ సంపూర్ణ విప్లవానికి, సర్వతోముఖ అభివృద్దికి కీలకమని సిద్దాంతీకరిస్తరు.
____________________

జీవితాన్ని బాగు చెయ్యాలనే సంసిద్దత, కాల పరీక్షకు నిలబడిన సంయమనం, బాధిత పక్షాన సౌహార్ధ్రత ఈ లేఖల పాయల్లో సుజల ధారలుగా ప్రవహించటం ఒక ఎత్తైతే, అనువాద మధురిమ తెలుగుకు పొదిగిన ఆభరణంగా మరో ఎత్తు.

జీవిత సఫలతకు అడ్డంకి అయిన మానసిక పర్వతాన్ని కొంచెం కొంచెంగా ధ్రవీభూత పరచి, మనిషిని నిజమైన, స్వేచ్చ, స్వచ్ఛశీలతల ఆనందజీవిగా మలచటం, ఈ మహనీయుడు ఈ భూతలానికిచ్చిన అసామాన్య అక్షర సంపదతో సాధ్యమని, ఈ చిరు పొత్తం ప్రత్యక్ష సాక్ష్యం.

కోట్ల ఆస్తిని, జగద్గురువు బిరుదును తృణీకరించిన ఈ నిర్వికల్ప నిరామయ ప్రబోధకుని మిత్రురాలూ అయిన ప్రపుల్ జయకర్ తో తన చివరి మాటలు..“pupil, tonight I shall go for a long walk in the mountains. The mists are rising.”

 

 

– దాసరాజు రామారావు
96182 24503