ఇవాళ సాహితీ ప్రపంచానికి తెలిసిన ప్రసిద్ధ వరిష్ఠ కవి నాగరాజు రామస్వామి గారు. ఆయన తాజాగా వెలువరించిన విశ్వకవుల పరిచయ వ్యాస సంపుటి క’వన’ కోకిలలు.ఈ పుస్తకం రాసింది నాగరాజు రామస్వామిగారే అయినా పుస్తక ప్రసవ శైశవమంతా నా చేతుల మీద జరిగింది. ఒక్కొక్క వ్యాసం ఒకటికి నాలుగు సార్లు శల్యపరీక్ష చేసి చదవటం జరిగింది. కనుక నాకు నాలుగు మాటలు రాయాలనుంది, అని రామస్వామి గారితో అంటే నువ్వు రాస్తే ఏం బాగుంటుంది ?. మన వాళ్ల గురించి మనమే రాసుకోవడం స్వోత్కర్ష అవుతుంది కదా ! అన్నారు. నిజమే కాదనను , కాని నేను ‘ఒక పాఠకుడిగా స్పందించే అధికారం ఉండకూడదా’ అని అంటే ఏమో నీ ఇష్టం అన్నారు. నేను వాలాయించి రాయడానికే సిద్ధపడ్డాను. ఎందుకంటే నేనెన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను.ఎన్నో అనుభూతులను ఆత్మగతం చేసుకున్నాను. అవన్నీ అందరితో పంచుకోవడం ఆనందకరమైన విషయం కదా !
424 పేజీల్లో 67 మంది ప్రపంచకవుల గురించి కవి జీవిత విశేషాలు, నాటి ఆ దేశ కాలమాన సామాజిక పరిస్థితులతోపాటు వారి ప్రసిద్ధ రచనల గురించి తెలియజేస్తూ అందులోని కొన్ని మేలిమి కవితల స్వీయానువాదాలను పొందుపరిచారు నాగరాజు రామస్వామి గారు. గ్రీసు, ఇటలీ, ఫ్రాన్స్ ,పాలస్తీనా,జపాన్, జర్మనీ, చైనా, రష్యా, ఆఫ్రికా, అమెరికా, మెక్సికో, క్యూబా, అర్జెంటీనా, సోమాలియా, ఇంగ్లండ్, ఇండియా ఇలా ఇంకెన్నో ప్రపంచ ప్రసిద్ధ దేశాల విశిష్ట కవులను ప్రస్తావిస్తారు ఈ సంపుటిలో .
కాలానికి కాకుండా కావ్యతత్త్వానికి ప్రాధాన్యత ఇచ్చే దిశలో అటు క్రీస్తు పూర్వం 800కు చెందిన హోమర్ నుండి వర్తమాన రచయిత్రి జబీరా ఫజిలీలి దాకా ఎంపిక చేసిన కవులు, కవయిత్రులు వున్నారు. విదేశీ కవన కోకిలలు, విశ్వకవన కోకిలలు (నోబెల్ పురస్కార గ్రహీతలు), స్వదేశీ కవనకోకిలలు అన్న మూడు విభాగాలలో తాను అధ్యయనం చేసిన విశిష్ట కవుల గురించి తమ కోణంలో ప్రస్తుతీకరించటం జరిగింది.
గతంలో ‘అనుధ్వని, అనుస్వరం ,అనుస్వనం, ఈ పుడమి కవిత్వం ఆగదు,కీట్స్ కవితా వైభవం, పురివిప్పిన పొరుగు స్వరం’ వంటి అనువాద కవితా సంపుటులలో దేశ విదేశ కవుల కవితల అనువాదాలతో పాటు మెక్సికన్ కవి ఆక్టోవియో పాజ్ నోబుల్ పురస్కారం పొందిన అధివాస్తవిక రచన సన్ స్టోన్ ను ‘సూర్యశిల’గా అనువదించిన అనుభవం కలిగిన వారు రామస్వామి గారు. అలాగే రవీంద్రుని గీతాంజలిని కూడా తమదైన శైలిలో అనువదించటం జరిగింది.ఇదీ నోబెల్ పురస్కారం పొందిన రచనయే. అలాగే తమిళ నాళాయిర పాశుర గ్రంథాన్ని ‘కల్యాణ గోద’ గా, బులుసువెంకటేశ్వర్లు గారి పద్యకావ్యం ‘నీలమోహనం’ ను ఆంగ్లంలో బ్లూ ప్లజన్స్ గా అనువాదం చేసి వెలువరించడమే గాక తెలుగు,ఆంగ్లంలో కూడా స్వీయకవిత్వ సంపుటాలను వెలువరించిన విద్వత్కవి, ఆరితేరిన అనువాదకులు రామస్వామిగారు. గతంలో కేవలం అనువాద కవితలు మాత్రమే వెలువరిస్తే ఈసారి ఆయా కవితల మూల రచయితల జీవన గమనాలు, శైలులు, వాదచ్ఛాయలు,కవితల నేపథ్యాలు తెలియ పరిచారు. వీరి కవన కోకిలలతో పాటు వీరి అనువాద కృతులను కూడా చదువగలిగితే విశ్వసాహిత్యం పోకడ సగం ఒంటబట్టినట్లే. ఈ కవన కోకిలలు గ్రంథంలో చోటుచేసుకున్న 67 మంది మాత్రమే ప్రపంచ ప్రసిద్ధ కవులా ? అనే ప్రశ్న కొందరికి ఉదయించవచ్చు. ఇంకా చాలా మంది ప్రసిద్ధ కవులు ఉండవచ్చు. కానీ ఇప్పటివరకు తాను చదివిన వారిలో ఈ గ్రంథంలో ప్రస్తుతం వీరికి చోటునిచ్చారు. అందరినీ చదివి అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు కదా!
___________
విశ్వనాథ సత్యనారాయణ వంటి విశిష్ట కవి పాఠాలు విని ,విద్యార్థి దశలో విరివిగా తెలుగు పుస్తకాలు చదివి తెలుగు సాహిత్యంపై ప్రేమ పెంచుకొన్నారు రామస్వామి గారు. వీరు ఉద్యోగ రీత్యా పలు దేశాలు సందర్శించడం వలన విశ్వ సాహిత్యాధ్యయనం చేసే అవకాశం కలిగింది. తన అనుభవాలను అరవై ఐదవ ఏట నుంచి ‘ఓనమాలు’తో మొదలిడి ‘కవనకోకిలలు’ దాకా సాహిత్య సృజనగా వ్యక్తమౌతున్న, తెలుగు వారు గర్వించదగిన విశ్వస్థాయి కవి రామస్వామి గారు. ఆక్టోవియోపాజ్ ఆంగ్లంలో రచించిన వచన కవితను తెలుగులోకి ‘సూర్యశిల’ పేరుతో అనువాదం చేసిన సంపుటికి ముందు మాటరాస్తూ ఇలాంటి అరుదైన కవి మన తెలుగు రాష్ట్రాలలో లేరని చార్మినార్ ఎక్కి ప్రకటించాలని ఉంది అని వాడ్రేవు చిన వీరభద్రుడు గారు అన్న మాట గుర్తుకు వస్తుంది.
___________
ఈ ‘కవన కోకిలలు’ గ్రంధంలో.. 2800 సంవత్సరాల కిందటి సనాతన గ్రీకు కవి హోమర్ ను మన కనుల ముందు నిలబెట్టి ఆయన గురించి మాధ్యమాల ద్వారా లభించిన సమాచారంతో తన కవిత్వాన్ని చర్చిస్తారు రామస్వామి గారు. హోమర్ అనే కాదు, రోమన్ క్లాసిక్స్, కవి వర్జిల్,ప్రేమకు మరో పేరైన శాఫో,గ్రీకు తాత్వికుడు, హిరాక్లిటస్, అమెరికన్ వచనకవితా వైతాళికుడు వాల్ట్ విట్మన్ ఇలా ముప్పై మంది విదేశ కవన కోకిలలు ఈ కవితా సంకలనంలో మనకు దర్శనమిస్తారు. రాబర్ట్ క్రాఫోర్డ్, డికిన్సన్, కల్లెన్ బ్రాయింట్,చైనా కవిత్రయం వాంగ్ వీ,లీపో,తుఫులు, మాయా ఆంజలోవ్, బషో,సైగ్యో హోషి,హాన్ షాన్, ఎడ్గార్ అలెన్ పో, హద్రావి, ఆస్కార్ వైల్డ్, మహమూద్ గార్నిష్, రిల్కే, బోదలేర్, షెల్లీ ఇలా అనేక దేశాల కవుల వద్దకు తీసుకెళ్తారు మనల్ని రామస్వామి గారు.
జర్మన్ రొమేనియా నోబెల్ లారియేట్ హెర్టా ముల్లర్ మొదలుకొని,కవితాత్మక జీవన నాటక కర్త వోలె షోయింకా దాకా పదమూడు మంది నోబెల్ పురస్కార గ్రహీతల గురించి పరిచయం చేస్తారు విశ్వకవుల విభాగంలో.
లూయిస్ గ్లక్, ట్రాన్స్టోమర్,ఇలియట్, వాల్కాట్ , ఆక్టేవియో పాజ్ , సేట్స్ మొదలైన వారంతా నోబెల్ పురస్కార గ్రహీతల విభాగంలో మనకు పరిచయమవుతారు వీళ్లంతా. వీళ్ల కవిత్వం ఎందువల్ల ఆ పురస్కారానికి ఎంపిక కాబడిందో తెలిపి, వారి కవిత్వాన్ని మన తెలుగుదనంతో మన ముందుంచుతారు.
మూడవదైన చివరి విభాగం స్వదేశ కోకిలలులో ఇరవైనలుగురు స్వదేశీ కవులు,కవయిత్రుల పాత కొత్తల మేలు కలయికగా మనకు వారి గురించి వారి కవిత్వం గురించి పరిచయం చేయటం, వివిధ భారతీయ భాషల కవితల అనువాదాలు అందించటం, చాలా శ్రమతో కూడుకున్న పని.
గమ్మత్తైన విషయం ఏమిటంటే విదేశీ కవుల పేర్లు విని ఉంటామేమో కాని కొందరు మనదేశ కవుల, కవయిత్రుల పేర్లు ఎన్నడూ విననివి కూడా ఉంటాయి. 13వ శతాబ్దపు కవయిత్రి ఆండాళ్ ను విశ్వ కవుల వేదికలోనికి చేర్చాలన్న రామస్వామిగారి ఆశయం అభినందనీయమనిపిస్తుంది. అలాగే సమకాలీన కశ్మీరీ, బెంగాలీ కవయిత్రులను వారి రచనలను పరిచయం చేసి మనల్ని నివ్వెర పరుస్తారు. సరోజినీ దేవి, అరబిందో, టాగోర్, నజ్రుల్ ఇస్లామ్, అమృతా ప్రీతమ్,కమలా దాస్,జీబనానంద దాస్, జయంతి మహాపాత్రో ఇలా పొరుగు రాష్ట్రాల కవుల కవిత్వ పరిమళాలను తెలుగు వారికి పంచుతారు.
విశ్వ వ్యాప్తమైన వస్తువు ప్రేమ, యుద్ధము, విప్లవం, తిరుగుబాటుతనం, మైథాలజీ, అధివాస్తవికత, సంప్రదాయం, ప్రకృతి మొదలైన వాటి గురించి విశ్వ వ్యాపిత కాలాతీత కవుల రచనలు.. సాహిత్య జిజ్ఞాసువులకు పలు తెరగుల ‘కవన కోకిలలు’ పుస్తకం నిండా గోచరిస్తాయి.
సాహితీ జిజ్ఞాసువులు చదివి తమ స్వంత గ్రంధాలయంలో భద్రపరచుకోదగినది మాత్రమేగాక, స్నాతకోత్తర సాహితీ విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా ఉండతగిన గ్రంధమిది.
క‘వన’కోకిలలు (ప్రపంచ కవుల పరిచయ వ్యాసాలు),పేజీలు 424,వెల రూ. 300/-
ప్రతుల కొరకు: 97015 22234 సంప్రదించవచ్చు.
– ‘వాధూలస’
97015 22234