తెలుగులో తొలి కథా రచయితలు ఎవరు? వాడుక భాష అమలుకు ఆద్యులు ఎవరు? అసలు సిసలు తెలుగు భాషా వైతాళికుడు ఎవరు? ఈ ప్రశ్నలు చర్చకు వచ్చినప్పుడు, చరిత్రకు ఆధారం లేకుండా, కేవలం అస్తిత్వం కోసం లేదా ప్రాంతీయ/వర్గ స్వార్థాల కోసం మూడు నాలుగు పేర్లు ముందుకు వస్తుంటాయి. వాస్తవానికి నిలబడని ఇటువంటి ప్రచారాలు తెలుగు వారి దురదృష్టమే. బ్రౌన్ దొరకు ఇదొక శాపం.
సి.పి. బ్రౌన్ తెలుగు భాషకు నిజమైన వైతాళికుడు కాదా?
1817లో తెలుగు అక్షరాలు నేర్చుకోవడం ప్రారంభించిన బ్రౌన్, 1822 నాటికే అనర్గళంగా తెలుగు మాట్లాడటం నేర్చుకున్నారు. 1824లోనే తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు నిర్మాణాన్ని చేపట్టారంటే, ఆయనకు తెలుగు పట్ల ఎంతటి ప్రేమాభిమానాలు, ఎంతటి కార్యదీక్ష ఉన్నాయో అర్థమవుతుంది. ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం నిఘంటు నిర్మాణాన్ని చేపట్టడం, తెలుగు పట్ల ఆయన అభిమానాన్ని నిరూపించే చిన్న ఉదాహరణ మాత్రమే.
వేమన సాహిత్య సముద్ధారకుడు
ఆలనాపాలనా లేక, నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వేమన పద్యాల సేకరణను బ్రౌన్ ప్రారంభించారు. ఉద్యోగపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే, 1824 మార్చి 5 నాటికి వేమన పద్యాల ఆంగ్ల అనువాదాన్ని పూర్తి చేశారు. 1829లో సేకరించిన పద్యాలను “వేమన పద్యములు” పేరిట మద్రాసులోని కాలేజీ తరపున అచ్చు వేయించారు. అప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన వేమన పద్యాలకు ఆయన కారణజన్ముడిగా అవతరించారు. మిణుకుమిణుకుమంటున్న ఆంధ్ర సాహిత్య దీపాన్ని ప్రజ్వలింపజేసిన వేమన సాహిత్య సముద్ధారకుడు సి.పి. బ్రౌన్. ఆయన ప్రజల నాలుకపై నడయాడే పలుకుబళ్లను, సామెతలను, చాటువులను సేకరించారు. 8 కథా కావ్యాలకు, 41 ద్విపద కావ్యాలకు వెలుగు చూపగలిగారు. 84 శతకాలను సేకరించి, వాటిలో 10 శతకాలను ముద్రించారు.
తెలుగు కథకు తొలి రూపకర్త
తెలుగులో తొలి కథ అనగానే మూడు ప్రాంతాల నుంచి మూడు పేర్లు వినిపించడం మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి, తొలి కథా సంకలనం సి.పి. బ్రౌన్ కొలువులోనే వెలువడింది. ఆయనే 1855లో స్వయంగా ‘పాపులర్ తెలుగు టేల్స్’ అనే పేరుతో ముద్రించారు. వసుచరిత్ర, పల్నాటి వీర చరిత్ర గ్రంథాల పరిష్కార కృషిలో ఆ దొరకు సాయపడిన తాతాచార్యులు చిత్ర విచిత్రమైన కథలను చతురంగా చెప్పి ఆనందపరిచారు. ఆ కథలనే బ్రౌన్ రాయించి ‘తాతాచారి కథలు’ పేరుతో ముద్రించారు. అదే సమయంలో, రావిపాటి గురుమూర్తి శాస్త్రి కూడా అనేక కథలను రచించినప్పటికీ, అవి బ్రౌన్‌కు అంతగా రుచించలేదు. కానీ అందులో రెండు కథలను మాత్రమే ఈ సంకలనంలో జత చేశారు. నిజానికి తొలి కథా రచయిత తాతాచార్యులే. ఇదే విషయాన్ని, భారతీయ భాషల్లోని తొలి కథలు అనే కావ్యంలో కూడా ‘తాతాచారి కథల’నే తొలి కథలుగా గుర్తించారు. దీనికి మనం బ్రౌన్‌కు జేజేలు చెప్పాల్సిందే.
వాడుక భాషకు ఆద్యుడు
వాడుక భాష విషయానికొస్తే, బళ్ళారిలో జరిగిన మొదటి పండితుల సమావేశం కన్నా ముందుగానే బ్రౌన్ వాడుక భాష పట్ల ఆకర్షితులయ్యారు. కావ్యాలు, గ్రంథాలు సామాన్య ప్రజలకు చేరువు కావాలంటే వాడుక భాష అని ఆయన ప్రకటించారు. ఆయన పండితులను కూడా చైతన్యపరిచారు. రావిపాటి గురుమూర్తి శాస్త్రి కథలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవని భావించి, తాతాచారి కథలను అచ్చులోకి తీసుకురావడానికి ముఖ్య కారణం ఇదే. ఆ రోజుల్లోనే వాడుక భాషకు ప్రాముఖ్యత ఇచ్చిన వాడుక భాషా ఆద్యుడు సి.పి. బ్రౌన్.
బాలశిక్ష మరియు తొలి యాత్రా గ్రంథం
వజ్జల సీతారామశాస్త్రి ద్వారా మొదటి ‘బాలశిక్ష’ వెలువరించేందుకు బ్రౌన్ కృషి చేయించారు. బాలలకు ప్రథమ శిక్షణకై, ఒక విజ్ఞాన కోశం రచించాలని ఆయన 1820లోనే శాస్త్రి గారి చేత ఈ బాలశిక్షను రాయించారు. అది 78 పేజీల నుండి 98 పేజీలకు విస్తరించి, నేటికీ మనకు పెద్ద బాలశిక్షగా కనిపిస్తూ ఉంది. ఆ పుస్తక ఆకర్షణ ఇప్పటికీ తగ్గలేదు.
తొలి యాత్రా కావ్యం కూడా బ్రౌన్ ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయన వద్ద పనిచేస్తున్న ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన తరువాత (1836లో దివంగతులయ్యారు), అదే యాత్రలో సభ్యుడిగా ఉన్న నారాయణ శాస్త్రి చేత ఆ యాత్రా కావ్యాన్ని పూర్తి చేయించి, 1838లో సంకలనకర్తగా ముద్రింప చేశారు. ఇదే తొలి యాత్రా గ్రంథంగా కూడా ఇప్పటికీ గుర్తింపు పొందుతూనే ఉంది.
________________
పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా తెలుగులోకి అనువదించడంలో సి.పి. బ్రౌన్ ప్రోత్సాహం బలంగా ఉంది. ‘అరేబియన్ నైట్స్’ కథలను పురాణం వెంకట కృష్ణశాస్త్రి చేత తెలుగులోకి అనువదింపజేసి 1840లో ముద్రించగలిగారు. అందులో భాష కఠినంగా ఉండటంతో, పుష్కలర్ ద్వారా దానిని సరళమైన భాషలో సరిదిద్ది అచ్చు వేయించారు. దాన్నే కంజీవరం రామశాస్త్రి ‘యవన యామిని వినోదము’ అనే పేరుతో ముద్రించారు. ఈ గ్రంథాలు లండన్ ఇండియా కార్యాలయంలోని గ్రంథాలయంలో ఉన్నట్లు ఆరుద్ర కూడా పేర్కొన్నారు.
________________
చరిత్ర, సాహిత్యానికి మూలబిందువు
బ్రౌన్ సేకరించిన శ్రీమద్రామాయణము శుద్ధ ప్రతిని పురాణం హయగ్రీవ శాస్త్రికి ఇచ్చి తెలుగులోకి అనువదింపజేశారు. దానిని వారి ‘వివేక దర్శనం’ అనే సొంత అచ్చుకూటమిలో కూడా ముద్రించారు. అలాగే, పోతన విరచిత ఆంధ్ర మహాభారతంను కూడా బ్రౌన్ దొర ప్రోత్సాహంతోనే రాయించడమే కాకుండా, కడప జిల్లా ఒంటిమిట్టలోని రఘునాయకుడికి అంకితం ఇవ్వబడింది.
సాంఘిక చరిత్ర నిర్మాణానికి, సాహిత్య చరిత్ర రచనకు, దేశ చరిత్ర నిరూపణకు, భాషా పరిణామ పరిశీలనకు, బ్రౌన్ లేఖలు మూలబిందువులుగా నిలిచాయి. చరిత్రకు సంబంధించిన మెకంజి కైఫీయత్తులను సేకరించి, ప్రతులు రాయించి, చరిత్రకు ఉపయోగపడే వాస్తవాలు ఎన్నిటినో అందించిన వ్యక్తి బ్రౌన్ కాదా!
స్వార్థ చింతనల శాపం
బ్రౌన్ సేవలను తెలుగువారు ఎప్పుడూ మరిచిపోకూడదు. కానీ, కొంత స్వార్థ చింతనలు అనేక విధాలుగా బ్రౌన్ కృషికి తూట్లు పొడుస్తున్నాయి. అంతేకాకుండా, బ్రౌన్ లండన్ వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి ఆయన గ్రంథాలు కూడా చౌర్యం జరిగాయి. ఈ విషయం ఆయనే స్వయంగా రికార్డు చేశారు. ఆయన దగ్గర పనిచేసిన పండితులు కూడా ఈ గ్రంథ చౌర్యానికి పాల్పడినట్లు ఆ తర్వాత కాలంలో వెల్లడవుతూనే ఉంది. ఇంతటి కృషి చేసిన సి.పి. బ్రౌన్ తెలుగు భాషా వైతాళికుడు కాకుండా ఎలా పోతారు? తెలుగు భాష పట్ల, వాడుక భాష పట్ల అభిమానం ఉన్నవాళ్లు, ప్రేమించేవాళ్లు అంగీకరించవలసిన పరిపూర్ణ సత్యం ఇది.
-ఈతకోట సుబ్బారావు
94405 29785
