భద్రగిరిలో కల్యాణం… కమనీయం

తెలంగాణ హోమ్

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం
ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్‌
హాజరైన మంత్రులు భట్టి, పొంగులేటి, పలువురు విఐపిలు
కళ్యాణోత్సవానికి బారీగా తరలివచ్చిన భక్తులు
నేడు స్వామివారి పట్టాభిషేక మహోత్సవం
భద్రాచలం : భద్రగిరిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కళ్యాణోత్సవానికి భక్తుల బారీగా హాజరయ్యారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. శుభ మూహూర్త సమయాన సీతమ్మ మెడలో రామయ్య పుస్తె కట్టడంతో కళ్యాణ క్రతువు పూర్తయ్యింది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరిగింది. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథులా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్‌ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు.. రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. తర్వాత కల్యాణ మూర్తులను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల మధ్య మిథిలా మైదానంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. రజత సింహాసనంపై సీతారామచంద్ర స్వాములను ఆసీనులను చేశారు. తిరువారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి మండప శుద్ధి చేశారు. ’యుంజానహః ప్రథమం’ అనే మంత్రాని పఠిస్తూ వేద పండితులు ప్రజా సంపతర్థ్యం ’శ్రీయం ఉద్వాః హిష్షే’ అన్న సంకల్పంతో స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణలు జరిపారు. మోక్షబంధం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ గావించారు. వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించి ప్రవరలు వినిపించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పాదక స్నానం జరిపి వరపూజ కార్యక్రం జరిపారు. కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి ధరింపజేశారు. అర్చక స్వాములు స్వామి వారికి నూతన వస్త్రాలను అలంకరించారు. అభిజిత్‌ లగ్నం సమయంలో సీతారాముల ఉత్సవమూర్తుల శిరసుపై జీలకర్రబెల్లం ఉంచి.. అనంతరం భక్తరామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కల్యాణ వేడుకలో వేలాది మంది భక్తులు వీక్షించి పరవశించి పోయారు. కల్యాణం జరిగిన మిథిలా మైదానంతో ఆలయ పరిసరాలన్నీ రామనామ స్మరణతో మార్మోగాయి. కల్యాణోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ పీఎస్‌ నరసింహా, హైకోర్ట్‌ జడ్జి భీమపాక నగేష్రా రామయ్య కల్యాణాన్ని వీక్షించారు. కల్యాణ వేడుక సందర్భంగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టాభిషేక కార్యక్రమం జరుగనున్నది. కళ్యాణోత్సవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దంపతులు, మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు దంపతులు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దంపతులు హాజరయ్యారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ పి.ఎస్‌. నర్సింహా, హైకోర్ట్‌ జడ్జి భీమపాక నగేష్రా కళ్యాణంలో పాల్గొన్నారు. రామయ్య కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్టాల్ర నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీరామనామస్మరణతో మిథులా స్టేడియం మారుమ్రోగింది. భక్తులంతా శ్రీరాముడి కళ్యాణాన్ని వీక్షిస్తూ పరవశించి పోయారు. సీతారామచంద్రుల కళ్యాణం కోసం మిథిలా కళ్యాణ మండపం లో 24 సెక్టార్స్‌ ఏర్పాటు చేశారు. 31 వేల మంది భక్తులు కళ్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే 1800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. కాగా.. కళ్యాణోత్సవం సందర్భంగా మిథులా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్‌ దీపాలతో కళకళ లాడుతోంది. గురువారం శ్రీ రామ పట్టాభిషేకం జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *