జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు వచ్చిన వారికి ల్యాప్‌టాప్‌లు అందజేత
సృజనక్రాంతి/అమరావతి : పలువురు విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ల్యాప్ ట్యాప్‌లు పంపిణీ చేశారు. వీరంతా జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన దివ్యాంగ విద్యార్థులు. ఇటీవలే ఆ విద్యార్థులకు నారా లోకేశ్ కారణంగా మేలు చేకూరిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ ఆదేశాల మేరకు సత్వరం జీవో 225 విడుదల చేయడం వల్ల.. రాష్ట్రంలోని కొంత మంది దివ్యాంగులైన విద్యార్థులు ఎంతో సాయం పొందారు. ప్రభుత్వం జారీ చేసిన ఆ జీవో వల్ల ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు పొందారు. దీంతో ఆ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేశ్ నివాసానికి వచ్చారు. జీవో జారీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి లోకేశ్ అభినందించారు. వారికి ఉచితంగా ల్యాప్ టాప్‌లను అందించారు. ’సింపుల్ గవర్నమెంట్ ` ఎఫెక్టివ్ గవర్నెన్స్’ విధానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా చెప్పారు. ‘అధికారులతో యుద్ధ ప్రాతిపదికన జిఓ 225 విడుదల చేయించడంతో ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన 25మంది దివ్యాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఉండవల్లి నివాసానికి వచ్చి నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులందరినీ అభినందించాను. వారికి ల్యాప్ ట్యాప్‌లను బహుకరించాను. సింపుల్ గవర్నమెంట్ ? ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే మా లక్ష్యం అని వివరించాను‘ అని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విజయవాడకు చెందిన మారుతీ పృథ్వీ సత్యదేవ్ అనే దివ్యాంగ విద్యార్థి జేఈఈ అడ్వాన్స్ లో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఆ ప్రకారం అతనికి చెన్నై ఐఐటీలో సీటు దక్కాల్సి ఉంది. కౌన్సిలింగ్ రౌండ్ `1లో ఐఐటీ మద్రాసులో సత్యదేవ్ కు సీటు వచ్చింది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఇంటర్ మెమోని అప్‌లోడ్ చేయడంలో సమస్య ఎదురైంది. ఏపీ ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ స్జబెక్ట్ లలో ఒకదానికి మినహాయింపు ఉంటుంది. అలా మినహాయింపు ఉన్న స్జబెక్టు విద్యార్థి రాయరు కాబట్టి.. సర్టిఫికేట్‌లో ఎప్పటినుంచో ’ఇ’ అని మాత్రమే ఉంచుతున్నారు. దీన్ని ఐఐటీ మద్రాస్ అంగీకరించ లేదు. తనకు సహాయం చేయాలని విద్యార్థి ఈ ఏడాది జూన్ 22వ తేదీన మంత్రి లోకేష్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ సెకండ్ లాంగ్వేజ్ లో ఇ కి బదులుగా కనీస మార్కులు పొందుపర్చాని బోర్డు అధికారులకు ఆదేశించారు. దీంతో 35 మార్కులుగా పేర్కొంటూ.. మెమో జారీ చేసినా ఐఐటీ నుంచి అంగీకారం రాలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక జీఓ ఉండాలని షరతు విధించారు. దీంతో వెంటనే జీఓ విడుదల చేయాల్సిందిగా లోకేశ్ ఆదేశాలిచ్చారు. అలా మొత్తం 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీ లాంటి విద్యాసంస్థల్లో సీట్లు వచ్చాయి.