కోనసీమ అందించిన కొద్దిమంది ప్రతిభావంతులైన దళిత రచయితలలో శ్రీ కానేటి కృష్ణమీనన్ (కె.కె.మీనన్) ముందు వరుసలో ఉంటారు.వామపక్షభావాలు గల రైతు కుటుంబంలో జన్మించడం వల్ల దళిత జీవన విధానంలో పెరగడం వల్ల హైస్కూల్ స్థాయిలోనే రచనా వ్యాసంగం మొదలై గురువుల ప్రశంసలు అందుకున్నారు. ఏజీ ఆఫీసులో ఉద్యోగిగా ‘రంజని సాహిత్య సంస్థ’ ద్వారా కీ.శే.శ్రీ ఇసుకపల్లి దక్షిణామూర్తి, కీ.శే శ్రీ జి.రామమూర్తి వంటి పెద్దల ప్రోత్సాహంతో ‘రంజని’ సంస్థకు అపారమైన సేవలు అందించటమే గాక, నవల /కథ,రచనా వ్యాసంగాన్ని మెరుగుపరుచుకుని, దాదాపు 80 కథలు,6 నవలలు రాశారు. శ్రీ పేర్వారం జగన్నాధం గారు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి గా ఉన్నకాలంలో ‘కీర్తి పురస్కారం’ శ్రీ సి.నా.రె. ద్వారా అందుకున్నారు- సంపాదకులు
“ప్రయోగశాల దగ్గర నిలబడి తన వెనక వున్న విజ్ఞానాన్ని గురించి అవగాహన వుండి, రాగల సమాధానాలకు సమాజంపై ఉండగల ప్రభావాన్ని వాస్తవికంగా ఊహించి సాహిత్య రూపం ఇవ్వడం వైజ్ఞానిక నవలాకారుడి పని. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటి, సమకాలీన విజ్ఞాన శాస్త్రాన్ని గురించి స్థూలంగానైనా సమగ్రమైన పరిజ్ఞానం వుండటం. రెండవది, రాబోయే వైజ్ఞానిక పరిణామం వాస్తవికంగా వూహించడం. ఊహ తప్పకుండా వుంటుంది కానీ అది వాస్తవికంగా వుండాలి ” అంటారు ఒక సందర్భంలో కె.బాలగోపాల్.తెలుగులో వైజ్ఞానిక కథలూ,నవలలూ రాసిన వాళ్ళే తక్కువ. కొందరు రాసినా అది కేవలం ఊహపై ఆధారిత రచనలుగానే భావించవచ్చు.
కానేటి కృష్ణ మీనన్ (కె కె మీనన్) రాసిన ‘క్రతువు’ నవల కొంత భిన్నమైనది. ఎందుకంటే కథాక్రమంలో రచయిత ప్రస్తావించిన అనేక అంశాలు కథాకాలానికి చాలా నవీనమైనవి. అంతేకాక తర్వాతి కాలంలో ముఖ్యంగా భారతదేశంలో కూడా వైద్యశాస్త్రంలో అభివృద్ధి చెంది,సమాజంలో అత్యవసరమైనదిగానూ, అతి సామాన్య అంశంగానూ కాలక్రమేణా పరిణామం చెందినదిగా మారటం కాకతాళీయం కావచ్చు.
గణాంక శాఖలో అంకెలతో ఆడుకునే కె. కె. మీనన్ ఇంత కూలంకషంగా పరిశోధనాత్మకంగా అనేక వివరాలను సేకరించి నిజమైన వైద్య శాస్త్రజ్ఞుడే అని పాఠకులకు అనిపించేలా రాయటం ప్రశంసనీయం.
ఆంధ్రప్రభ వారపత్రికలో వైజ్ఞానిక సీరియల్ నవలగా ‘క్రతువు’ ను పత్రిక సంపాదకులు వాకాటి పాండురంగారావు గారు ఎంపిక చేసినప్పుడే సరోగసీ మీద వచ్చిన ఈ నవల సంచలనం కలిగించింది.
ఇక కథలోకి వస్తే దివిసీమ ఉప్పెనలో తల్లిదండ్రులను, సోదరినీ కోల్పోయిన ప్రమీల ఎమ్మెస్సీ చదువు కారణంగా విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టల్ లో ఉన్న కారణాన ప్రాణాలు దక్కించుకుంటుంది.అనుకోని పరిస్థితులలో ఒంటరి కావటం కొంత నిర్వేదానికి గురౌతుంది.
ఒకసారి వార్తాపత్రికలో ‘అద్దెకు గర్భం కావాలి’ అనే ప్రకటన చూసి, కొంత కుతూహలంతోను, తనకోసం బాధపడేవారు లేరు కదా అనే ఆలోచనతోనూ బొంబాయి వెళ్ళటానికి నిర్ణయించుకుంటుంది.
గర్భంతో ఉన్న భార్య ప్రమాదంలో చని పోవటంతో భాగ్యవంతుడైన రమేష్ తన భార్య గర్భంలోని పిండాన్ని ప్రముఖ గైనకాలజిస్ట్ సహాయంతో శీతలీకరించి వారసుడికోసం తపన పడటం,తదనంతరం ప్రమీల ద్వారా వారసుడినే కాక అనేక మలుపులతో కథ సాగి ప్రమీలనే భార్యగా స్వీకరించడం ఇదే కథ.
విశాఖ సముద్రాన్ని హాస్టల్ గది కిటికీ నుండి వీడియో తీసినట్లుగా వర్ణించటంతో నవల మొదలు పెట్టటంలో కొంత ఔచిత్యం కనిపిస్తుంది. కథానాయిక కొండంత మనోబలం కలది. గుండెల్లో లోపల ఎంత చీకటి వున్నా బయటకి నవ్వుతూ తిరిగే ప్రమీల హృదయం సముద్రమంత లోతూ, గాంభీర్యం కలదిగా నవల ఆసాంతం చిత్రించారు రచయిత.
అండాలను సేకరించి ఫలదీకరణం చేసే శాస్త్రజ్ఞుడు గోవిందరావు పరిశోధనలను పాఠకుడు కూడా ఆ వెనకే నిలబడి చూస్తున్నంతగా అనుభూతి చెందుతారు. 1996లోనే మొదటి క్లోనింగు గొర్రెపిల్ల డాలీని ఉత్పత్తి చేసిన స్కాట్లాండు ప్రయోగశాలలోనే ఉన్నట్లు చదువుతూచదువుతూ పాఠకులూ కలగంటారు. జన్యుపరిశోధనల పట్ల గోవిందరావుకి గల అంకితభావానికి అచ్చెరువొందుతారు.
ముందు ఎలుకల మీదా,తర్వాత పశు సంవర్థకశాలలో పనిచేసి రెట్టించిన ఉత్సాహంతో మానవ అండాలను కూడా ప్రయోగశాలలోనే ఫలదీకరణం చేయబూనిన గోవిందరావుతోపాటే ఆ ప్రయోగాలనూ పాఠకులూ ఆసక్తికరంగా తెలుసుకుంటారు.
1978లో మొదటి టెస్టు ట్యూబ్ బేబీ అవతరణ చాలామందికి గుర్తుండే ఉంటుంది.ఈ విషయం ఆరోజుల్లో పెద్దసంచలనం. పేట్రిక్ స్టెప్టో అనే శాస్త్రజ్ఞుడు గోవిందరావూ, మూబ్ ఎడ్వర్డ్ అనే బ్రిటీష్ గైనకాలజిష్టు డా.ఇందిరానే నేమో అనిపించేలా కథనం సాగుతుంది.అదేవిధంగా లాప్రోస్కోపు వాడకం కూడా కథా కాలంనాటికి కొత్తే. ఆ విషయాలన్నీ చాలా వివరంగా చర్చించారు రచయిత.
ఇదే విధంగా ప్రమీలను తమ పరిశోధనకు తీసుకొని డా.ఇందిరా, డా.గోవిందరావు కలసి చేసిన, సాధించిన టెస్టుట్యూబ్ బేబీ కథే ఈ “క్రతువు” అనే వైజ్ఞానిక నవల. ఈ యజ్ఞం చేసినది డా. ఇందిర అనే గైనకాలజిష్టు, డా. గోవిందరావు అనే జన్యు సైంటిస్టు అయితే, చేయించినది మాత్రం కె.కె.మీనన్ అనే రచయితే.
సాధారణంగా ఇటువంటి సైంటిఫిక్ నవలలను పాఠకులను రంజింపజేసేలా రాయటం అంటే రచయితకు కత్తి మీద సామే. గ్రహాంతర వాసులు,గ్రహాంతర యుద్ధాలు వంటి వాటిని ఆసక్తికరంగా రాయొచ్చునేమో.ఎందుకంటే అవన్నీ వూహాజనితాలే కనక.
కానీ వైద్య శాస్త్రానికి సంబంధించిన వాటిని కథాంశాలుగా తీసుకుని రాయాలంటే శాస్త్ర విజ్ఞానం ముఖ్యంగా అవసరం, వాస్తవికతకు దూరంగా ఉండకూడదు. కనుకనే మీనన్ గారు బ్రిటీష్ గ్రంథాలయానికి వెళ్ళి, అంతకుముందు జరిగిన జన్యు పరిశోధనల గురించి, అప్పటికే బ్రిటన్ లో జరిగిన టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రయోగం గురించి తనకు కావలసిన సమాచారాన్ని అంతటిని సేకరించి, అవసరమైన చోట్ల డాక్టర్ల సలహాలను స్వీకరించి ఒక వైద్యశాస్త్ర పరిశోధనాత్మక గ్రంథంలా తీసుకు రావటానికి మీనన్ గారు కూడా ఒక యజ్ఞం చేసే వుంటారు.
ఇందులో సామాన్య పాఠకులకు ఆసక్తి కలగటానికి కావచ్చు.ఆస్తిపరుడైన రమేష్ కు వారసుడు జన్మిస్తే తమకు ఆస్తి దక్కే అవకాశం పోతుందని కొందరు దాయాదులు సినిమా ఫక్కీలో బెదిరింపులకు పాల్పడటం, కొంత డ్రామా అనంతరం వాళ్ళ కుట్ర బయటపడి పోలీసులకు చిక్కటం కథలో చొప్పించారు రచయిత. కానీ అది నవల ప్రయోజనాన్ని ఏమీ దెబ్బతీయదు.
డా. గోవిందరావు చేసిన, చేస్తున్న ఆయా పరిశోధనలోని అంశాల వారీగా క్రమపద్ధతిలో వివరించినా అది డా. ఇందిరతో గానీ, ప్రమీలతో గానీ సంభాషణా రూపకంగా చెప్పటం వలన రచయిత తనకు తెలిసినదంతా పాఠంగానో ఉపన్యాసంగానో చెప్పాడనే భావన పాఠకులకు రాదు. పాఠకులు కూడా ఆ పరిశోధనలో మమేకం అయ్యేలా ఆసక్తి కలిగించేలా చెప్పటంలో రచయిత విజయవంతమయ్యారని ఖచ్చితంగా చెప్పవచ్చును.
ఈనవలలో మరొక ఉప కథ డా. ఇందిర జీవితానికి సంబంధించినది. దీనిని కూడా రచయిత సమయోచితంగానే ప్రస్తావించి చివరకు సుఖాంతం చేస్తారు.
ప్రమీల గర్భధారణ సమయంలోనూ, ప్రసవానంతరంలోను ఆమె మానసికస్థితిని, స్త్రీ సహజమైన స్పందనలను మీనన్ గారు ప్రతిభావంతంగా అక్షరీకరించారు.
అందుకే “హింస,సెక్సు,అనవసరమైన రొమాన్స్ మొదలైనవి చొప్పించకుండా ఒక రచన చేయటమేకాక, సాహిత్యంలో క్వాలిటీకీ,పాపులారిటీకీ సమన్వయం చేయగల నైపుణ్యం రచయితకి ఉంద”ని మధురాంతకం రాజారాంగారు కె.కె.మీనన్ ని ప్రశంసించారు.
తన ప్రయోగంలో తల్లిగా మారిన ప్రమీలను ఇష్టపడిన గోవిందరావుని మృదువుగా తిరస్కరించిన ప్రమీల వ్యక్తిత్వాన్ని,తన జీవితాన్ని ఎలా మలచుకోవాలో, జీవితాంతం సుఖమూ శాంతినీ,ఆనందాన్ని గౌరవప్రదంగా ఎలా పొందాలో తెలిసిన వ్యక్తిగా తీర్చిన తీరు అభినందించదగినది.
అందుకే ‘అటు విజ్ఞానం,ఇటు జీవితం- ఈరెండు భిన్నధృవాల మధ్య అద్భుతమైన సృజనాచాతుర్యపు సేతువు ఈ నవల. క్రతువు ఈ దశాబ్దపు చెప్పుకోదగిన నవలల్లో ఒకటి అని తెలుగు వారందరూ గర్వంగా చాట వచ్చును” అంటారు వాకాటి పాండురంగారావు తన ముందుమాటలో.
ఇన్ని ప్రత్యేకతలు కలిగినది కనుకే తెలుగు సాహిత్యంలోని సైన్స్ ఫిక్షన్ విభాగంలో పి.హెచ్.డి చేసేవారికి ఈ “క్రతువు” నవల సూచించబడింది.
ఆనాటి ఆకాశవాణి (హైదరాబాద్) సీనియర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీమతి సరోజా నిర్మలగారు ‘క్రతువు’నవలను ప్రముఖ రచయిత,బహుముఖ ప్రజ్ఞాశాలి జీడిగుంట రామచంద్రమూర్తి గారిచే నాటకీకరణం చేయించి ధారావాహికగా ఆకాశవాణిలో ప్రసారం చేశారు. 2014లో ప్రముఖ అనువాదకులు జి.పరమేశ్వర్ గారు క్రతువు నవలను హిందీలోకి అనువదించారు.
టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి పాఠకుల్లో అంతగా అవగాహన లేని రోజుల్లో వెలుగు చూసిన ‘క్రతువు’ నవల తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి సరోగసీ మీద వచ్చిన రచనగా చెప్పుకోవాలి.
(ఆగస్ట్ 1, కె కె మీనన్ 12వ వర్ధంతి)
– శీలా సుభద్రాదేవి
81068 83099