తెలుగు కొమ్మమీద వాలిన మలయాళ “రామచిలుక”

సాహిత్యం హోమ్

అందమైన పక్షుల్లో రామచిలుక ఒకటి. ఆశ్చర్యం కాదు కానీ, ఆనందమే. ఇప్పుడు దాని శరీరం ఒక కథల సంపుటిగా మారింది. ఒంటిమీద ఈకలు పేజీలుగా, వాటి వర్ణాలు కథలుగా పలకరిస్తున్నాయి. కథలలోని పాత్రలకు, చిలుక పలుకులు గాత్రధారణ చేయటం ఇందులోని విశేషం. చిలుకకు ఉండే బలమైన వంకీ తిరిగిన ముక్కు, ప్రతి కథలోనూ బలమైన సన్నివేశాలకు తాను ప్రతీకగా నిలిచింది. చిలుకలు జ్యోతిష్యంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ కథల రామచిలుక జ్యోతిష్యం చెప్పదు కానీ, మానవజాతి మనస్తత్వ చిత్రపటాలను అద్భుతంగా చిత్రీకరిస్తోంది. వెరసి “రామచిలుక” అనువాద సంపుటిలోని కథలు, పాఠకుల మనసు కొమ్మలమీద నిత్యం పలకరించి, పలవరింపజేసే దృశ్యాలకు స్వాగతం పలుకుతున్నాయి.

మలయాళం నుంచి తెలుగులోకి 44 గ్రంథాలను అనువాదం చేసి, కేంద్ర సాహిత్య అకాడమి వారి అనువాద పురస్కారం, 2022లో గీతం యూనివర్సిటి వారి గౌరవ డాక్టరేట్ అందుకున్న ‘ఎల్.ఆర్. స్వామి’, ఈ కథలను మలయాళం నుంచి నేరుగా తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కథల మూల రచయిత ‘పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై, ప్రస్తుతం వీరు గోవా గవర్నరుగా వున్నారు. వారు రచించిన 150 వ పుస్తకం ఇది.

చిలుకల గుంపు వచ్చి వాలినప్పుడు, అందులో ఆడ, మగ చిలుకలను వెంటనే గుర్తించటం కష్టం. ఈ సంపుటిలోని ‘గాయం’ కథలో తరవాడులో స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి వచ్చిన ‘లక్ష్మీనాయర్’, ‘న్యాయం’ కథలో పొయ్యికి కట్టెల కోసం చెట్టుకొమ్మలు విరుస్తున్న ఆదివాసి ‘కావిరి’, ‘రామచిలుక’ కథలో పడవ ఎక్కుతున్న ‘పౌళా’, ‘సాయం సంధ్య’ కథలో ఇల్లు తాళం వేసిన తరువాత కడుపు తరుక్కుపోయిన ‘కళ్యాణి’, ‘స్త్రీ నైజము’ కథలో యెర్రటి నెత్తురు బొట్టుబొట్టుగా రాలుతున్న తన ఊర్ధ్వ భాగంపై తల్లి ఇచ్చిన గుడ్డల పాకెట్ వేసి నొక్కి బాధతో పడుకున్న ‘బొమ్మి’…ఈ స్త్రీమూర్తుల హృదయ స్పందనలోని ధ్వని తరంగాల తరంగదైర్ఘ్యాలను లెక్కకట్టగానే ఈ సంపుటి ముఖచిత్రం మీద వాలింది, ఆడ రామచిలుకనే నిర్ధారణ నాముందు సంతకాలు పెట్టింది. అన్ని కథల్లోలాగా ఈ కథల్లో సైతం పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలకు తగిన సంభాషణలు, ఎత్తుగడలు, ముగింపులు అన్నీ ఉన్నాయి. వాటికి తోడు పాఠకులెవరూ ఊహించని వర్ణనలు, తోటలు, లోయలు, వాగులు, నదులు, సముద్రాలు మాత్రమే కాకుండా కవితాత్మక, కళాత్మక, మార్మిక, మనోహర దృశ్యాలెన్నో రచయిత కలంనుండి కథాకళి కమనీయ నృత్యానికి సిద్ధమయిన అనుభూతి, అక్షరాలనిండా పందిర్లతో ఆహ్వానం పలకటం, ఒక సరికొత్త కథల రచనకు స్వీకారం చుట్టిన పరిమళం పాఠకులను మనసారా ఆలింగనం చేసుకుంటోంది. రచయిత అనుభూతులో, అనుభవాలో, కల్పనలో తెలియదుకానీ, తెలిసిందొక్కటే… ఈ కథల్ని చదవటం ద్వారా పాఠకుడి సాహిత్య అభిరుచి సంతృప్తికరమైన స్థాయిలో తేరులో ఊరేగటం, పలకరించే జ్ఞాపకాలలో ఒకటిగా మిగిలిపోతుంది.
_____________
ఒక్క నిజం మనిషిని రారాజును చేస్తే, ఒక అబద్ధం అదే మనిషిని జీవితాంతమూ నేరస్థుడిలా నిలబెడుతుంది. ఆ తప్పుకు కోర్టులు విధించే శిక్షకంటే భయంకరమైన శిక్ష మనిషికి మనసు విధిస్తుంది. ‘గాయం` కథలో ‘లక్ష్మీనాయర్’ ఆడిన ఒక అబద్దం తన అమ్మమ్మ చావుకు కారణమయింది. తాను ఘోరమైన నేరం చేశానని ఆమె పడే వేదనను రచయిత చిత్రీకరించిన విధానం, ‘లక్ష్మీనాయర్’ పాత్రపట్ల మన సానుభూతి ప్రకటితమయ్యేలా చేస్తుంది. ఆమె కన్నీళ్లను తుడువటానికి ప్రతి పాఠకుడు తల్లిపాత్రను పోషించటానికి సిద్ధపడుతాడు.
_____________

ఉరితీయబడుతున్న న్యాయం చేసిన ఆఖరి కేకల ఆర్తనాదం ‘న్యాయం’ కథలో బిగ్గరగా మనకు వినిపిస్తుంది. ఆదివాసి ‘కావేరి’ ఖాకీ దుస్తుల్ని చూసి భయంతో వణికిపోయే దృశ్యంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఆదివాసీలు నివసించే అడవిప్రాంత వాతావరణాన్ని అత్యంత సహజంగా చిత్రీకరించిన ఈ కథలో, అంతే సహజంగా ఆదివాసీల జీవితం, పోలీసుల దౌర్జన్యం, పేదల కన్నీళ్లు, అమాయకుల అణచివేత… ఇత్యాదులన్నీ సజీవంగా మనకు అతిసమీపంగా నిలబడి కరచాలనం చేస్తాయి.

మనిషి, యాంత్రిక జీవిత సంకెళ్లలో బంధీగా వుండటానికి తన సమ్మతిని శాశ్వతం చేసుకున్నాక, వాట్సఫ్, ఫేస్ బుక్ లాంటి వలల్లో చేపల్లా చిక్కి, స్వర్గాన్ని ఊహించుకుంటూ, వాస్తవ అనుభూతుల వసంతాలకు దూరంగా బ్రతకటం ఎంత దురదృష్టమో వివరించిన కథ “చేప చిక్కాలంటే..”. ఈ కథను తమ శ్వాసల్లోకి ఆహ్వానించుకున్న ప్రతి పాఠకుడు…‘ఒక పెద్ద చేప దగ్గర నిలబడి ఫోటో తీయించుకున్న మనవడి పాత్రలోకి పరకాయప్రవేశం చేయటానికి తన సంసిద్ధతను వ్యక్తం చేస్తాడు. ఈ కథ ద్వారా ఫేస్ బుక్ కి అతీతమైన ప్రపంచాన్ని పరిచయం చేసి, అందులోకి సాదరంగా ఆహ్వానించిన రచయిత సామాజిక బాధ్యతకు తలవంచి నమస్కారం చేస్తున్నాను. అనుబంధాలు మనుషులతోనే కాదు పక్షులతోనూ పెనవేసుకున్నప్పుడు, ఆ బంధం మనిషి ఊపిరిలో ఒక భాగమవుతుందని రాజముద్రను ముద్రిస్తోంది ‘రామచిలుక’ కథ. రాజభవనం నిండా ఎంత రాచరికం వున్నాసరే, అతడికి రామచిలకంటేనే ప్రాణం. అందుకు కారణం లేకపోలేదు. పీడకలలనుంచి తనను స్వాంతన పరిచింది ఆ రామచిలకే. ఔద్యోగిక పర్యటనకు అతడు వెళ్లేముందు రామచిలక ఆలనాపాలనా గురించే దిగులుపడ్డాడు. ఊరు వెళ్లిన తరువాత ఫోన్ చేస్తే “మీరు అలా వెళ్లిపోగానే, చిలుక ఎగిరిపోయిందని నౌకర్లు చెప్పారు”. శ్వాస ఆడని క్షణాలను మొదటిసారి అనుభవించిన ఆ బంధం, తేరుకుని… “వస్తుంది, రామచిలుక మళ్లీ వస్తుంది. విషాదంలోపడి కొట్టుకుంటున్నప్పుడు ఆప్యాయంగా లాలించటానికి ఖచ్చితంగా వస్తుంది ఆ రామచిలుక” అన్న ఓదార్పు మాటలతో ఈ కథకు తెరపడుతుంది. కానీ తెర పడని అద్భుతమైన వర్ణనలు, దృశ్యాలు, మనోవికాస సన్నివేశాలు, మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే మాటల వరుసలు, చేరువగా చేరి చెవుల్లో గుస, గుసలాడే చారిత్రిక విషయాలు రామచిలుకలై మన మనసు కొమ్మల మీద ఊగుతూనే వుంటాయి. ఒక కథా రచనలో కళాత్మక వైభవం పరాకాష్టకు చేరిన ఒక మెరుపుల సమూహాన్ని ఈ కథలో మనం దర్శించుకోవచ్చు.

ఇదే వరుసలో నడిచిన మరో కథ “సాయం సంధ్య”. కన్న బిడ్డల ఆదరణకు దూరమైన ఒక తల్లి. తాను పెంచుకున్న ఆవుతో వున్న జన్మ, జన్మల బంధాన్ని ఈ కథలో చిత్రీకరించిన తీరు, ఈ కథను రాసిన కథకుడ్ని శిఖరాగ్రస్థాయిలో దర్శించుకునేలా చేసింది.

“ఆత్మఛాయ’ కథలో కాపలావాడి పదేళ్ల కొడుకు మామిడికాయను దొంగతనం చేసినా, మనముందు దోషిగా కనిపించడు. ‘మామిడి మొక్కకు కొన్ని మాంత్రిక శక్తులున్నాయని, ఆ చెట్టుకు కాసిన కాయలు తింటే మన కొరికలు నెరవేరుతాయని, అందుకే ఆ మామిడికాయను దొంగతనం చేసి తిన్నానని నిజం చెబుతాడు. ఇంతకీ వాడి కోరికలు ఏమిటంటే, పరీక్షల్లో మొదటి ర్యాంకు రావాలని. ఇది చదివి పాఠకుడు నవ్వుకోడు. వాడ్ని అభినందిస్తాడు. ఈ కథలో ఈశాన్య ప్రాంతంలో వున్న ఒక రాష్ట్రానికి హెడ్ అయిన పాత్ర, అంతా ఆలకించి, మామిడికాయ మంత్రాలు ఫలించి, మొదటి ర్యాంకు రావాలంటే ఏ నియమాలు పాటించాలో బోధించిన విధానం మన చేత కరచాలనం చేయిస్తుంది.
_____________

ఊరు నిద్రపోతున్నప్పుడు అడవిలోని చెట్లు, మొక్కలు, పగటివేళకన్న ఉత్సాహంతో గాలిలో గెంతుతూ, వెదురుమొక్కలు గాలిలో వాటేసుకొని ప్రేమగీతం ఆలపిస్తున్న దృశ్యాన్ని అందించిన ‘స్త్రీ నైజము’ కథలో అమ్మాయి పెద్దపిల్లగా మారిన సందర్భంలో, కులపెద్ద ఆదేశాల ప్రకారం ఇంటికి దూరంగా చెక్కకోళ్ళుతో నిర్మించిన ఒక తాత్కాళిక నివాసంలో చిమ్మచీకటిలో భయంగా గడిపే ఒక బాలిక ఆందోళనను అక్షరీకరణం చేసిన విధానం, పాఠకుల జాలిచూపులు ఆమె చుట్టూ ఒక రక్షణ కవచంగా నిలవడం కథా రచయితగా శ్రీధరన్ పిళ్ళై సాధించిన విజయాలలో ఒకటిగా నిలుస్తుంది.
_____________

రచయిత స్వీయానుభావాలతో పురుడుపోసుకున్న ఈ సంపుటిలోని ఏడు కథలలో రచయిత జ్ఞానం, ప్రతిభ, సృజనాత్మకత పోటీపడుతున్నాయి. ఈ కథల్లో మనుషుల బాహ్య జీవితాన్ని మాత్రమే కాకుండా, అంతరంగిక జీవితాన్ని కూడా ఆవిష్కరించిన విధానం, బౌద్ధ, జైన సాహిత్య తొలిదశల్లో వచ్చిన రచనా వైభవాలను గుర్తు చేస్తున్నాయి. ఇందుకు మంచి ఉదాహరణగా ‘రామచిలుక’, ‘స్త్రీ నైజము’ కథలు తమ స్థానాలను కొనసాగిస్తూ వున్నాయి. చాలా కథల్లో రచయిత మనసు మనతో మాట్లాడుతుంది, రచయిత నేత్రాలు కన్నీరు కారుస్తాయి, రచయిత గుండె చప్పుడు ప్రతి అక్షరం కదలటానికి శ్వాసగా తాను మారిపోవటం ఈ విశిష్ట రచనలోని ప్రత్యేకత. ఇతర ప్రాంతాలకు పరిచయంలేని ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, చారిత్రక విషయాలను కథల వేదికగా పరిచయం చేసిన ప్రతి సందర్భం ఒక సువర్ణశోభిత చిత్రపటంగా మన చేతుల్లో వాలిపోతోంది.

ఈ మలయాళ కథలను తెలుగులోకి అనువాదం చేసిన డాక్టర్ ఎల్.ఆర్ స్వామి, అనువాద ప్రక్రియలో విశేషమైన అనుభవాన్ని తన ఖాతాలో జమచేసుకున్న సాహితీవేత్త. ఈ కథల అనువాద స్థాయిని కొలిచే కొలతబద్దలకోసం ఎవరైనా వెతికితే, ఈ కొలతలకు అందని అందమైన ఒక అనువాద సాహితీ స్వరూపం మేరుపర్వతంలా మనముందు నిలుస్తుంది. ఈ కథా సంపుటి మూల రచయిత పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై, తెలుగు సేత ఎల్.ఆర్. స్వామి గార్ల సాహిత్య ప్రతిభకు తెలుగు సాహితీలోకం తరుపున మరోసారి హృదయపూర్వక అభినందనలు.

 

 

 

 

-డాక్టర్ కె.జి. వేణు,
98480 70084

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *