కవిత్వం అనుభవసారం! బతుకులోని కష్టనష్టాలు తెలిసి అనుభవసారంతో కవిత్వం రాస్తున్న కవి లేదాళ్ళ! శైలీరమ్యత పాటిస్తూ,పదలాలిత్యంతోపాటు లయ, ప్రవాహశీలతలు కవి ప్రతిభకు గీటురాళ్లుగా భావించే కవులలో రాజేశ్వరరావు మొదటి వరుసలో వున్నవాడు.లేదాళ్ళకు ఇది మూడవ కవితా సంపుటి, ఇంతకుముందు ‘కందిలి, మౌనముని అనే కవిత్వ సంపుటులు వెలువరించారు. లేదాళ్ళ స్వతంత్రమైన భావాలున్న కవి ! ఆయన కవితా వస్తువులు అన్నీ ఆయన జీవితంలోంచి తీసుకున్నవే! అందుకే చదువరుల హృదయాలకు, మనసులకు దగ్గరగా ఉంటాయి!
ఒక కవితా సంపుటికి శీర్షికను నిర్ణయించేటప్పుడు ఎన్నోవిధాలుగా ఆలోచిస్తాడు. ఒక్కోసారి శీర్షికే ఆ కవితా సంపుటిని చదవడానికి పాఠకులను ప్రోత్సహిస్తుంది. ఈ టైటిల్ కవితలో అమ్మను, కవి ఎలా ఆవిష్కరిస్తాడో చూడండి.
“అమ్మకో జత చెప్పులు కొనాలి/ఎలాగైనా/
అనుకునేవాణ్ణి చిన్నప్పుడు…” చిన్నతనంలో బీదతనంలో ఉన్నప్పుడు చిన్నవిషయం అయినా అది పెద్ద కోరికనే కవికి! బీదతనంను గుర్తుకు చేసుకుంటూ, “అమ్మ ఆకలి తీర్చలేని ఒకానొక రోజు గుర్తొచ్చి/
దుఃఖిస్తా/ నిదుర నిండిన కళ్ళతోనూ!” అంటాడు. ‘మరొకసారి / అమ్మ కాళ్ళకు / కొనలేని మెత్తని చెప్పులు గుర్తొచ్చి/ కన్నీటి ప్రవాహమవుతాను’ అంటాడు. ఇది బతుకులోని దైన్యం. ఒక జ్ఞాపకం కన్నీళ్ళ పర్యంతంగా. “పాడైపోతాయని అమ్మ చెప్పుల్ని తడవకుండా/ చేతిలో పట్టుకొని నడిచేది కొన్నిసార్లు/ఇప్పుడా చెప్పులు గూట్లో స్తబ్దంగా కనిపిస్తాయి” ఇలా ఒక దృశ్యాన్ని, అమ్మ రూపాన్ని మన కళ్ళముందు దృశ్యమానం చేస్తాడు కవి.
‘ఒక పద్యాన్ని నేను రాసుకోవాలి ‘ అనే కవితతో మొదలవుతుంది ఈ కవితా సంపుటి. ఇక్కడ పద్యం అనేమాట వాడడం బాగుంది. నిజానికి అన్నీ వచన పద్యాలే. ఈ కవితలో: చీమ కాలు విరిగిన చప్పుడు గురించో / రాత్రి అరిచిన కీచురాయి ఆవేదన గురించో/మానవ మేధకందని ఒకానొక దుఃఖిత హృదయాన్ని గురించో/ఒక పద్యాన్ని నేను కన్నీటి సిరాతో రాసుకోవాలి” అంటాడు లేదాళ్ళ! కన్నీటి సిరా అనే పదం చాలామంది కవులు రాశారు. కానీ బతుకు బరువులు మోసినవారు, కష్టాలు కన్నీళ్ళ విలువ తెలిసినవారు మాత్రమే రాయగలరు ‘కన్నీటి సిరాతో’ అనేమాట! ఈ కవితలో ఈ పదం వాడటం వలన కవిత చాలా బలంగా వచ్చిందనిపించింది.
”కాదేదీ కవితకనర్హం’ అన్నట్లు ఈ కవి తీసుకున్న కవితా వస్తువులు సామాన్యమైనవి. యాపపుల్ల, రేకుల ఇల్లు, కదిలె దండెం, దువ్వెన, వంటబ్రాహ్మడు, గూర్ఖా, మొక్కి చీపురుకట్ట, గిరక, నర్సవ్వ, అంకూసమ్మ హోటల్’ ఇలా అతని కవితలే అతని నేపథ్యాన్ని గూర్చి తెలియజేస్తాయి. అతనిచేత మంచి కవిత్వం రాయించాయి.
‘యాపపుల్ల’ అనే కవితలో సముద్రమంతటి భావాలు ఉన్న పదాలను ఎంత చాకచక్యంగా వాడుతాడో ఈ వాక్యం చదివితేనే తెలుస్తుంది . ‘ఒకప్పుడు బతకడమే గగన సదృశ్యమయ్యేది’ ఈ ఒక్కవాక్యం చాలు అతని నేపథ్యాన్ని పట్టివ్వడానికి.
“నాన్న ఎవుసారికి / అమ్మ ఒక్కొక్క ఆభరణమూ, అవుసుల వాళ్ళింటికి / వెళ్ళినప్పుడు / పోనీలే ! ఈ ఏడాదైనా నా పిల్లల కడుపు నిండుతుంది అనుకునేది”.ఇది వ్యవసాయం చేసే రైతు బతుకులోని కష్టం, అమ్మ నగలు అమ్మి వ్యవసాయం చేయడం గురించి, “పోతూ పోతూ కాలగమనంలో అమ్మకు కొత్త ఆభరణాలొచ్చి చేరాయి ముక్కుకూ చెవులకూ చిల్లులు పూడుకు పోకుండా వేపపుల్లలు!” అంటాడు హృదయ విదారకంగా. వేపపుల్ల అంటే పళ్ళు తోముకునే ముఖంపుల్ల అనుకుంటాం మనం.కాని ఇక్కడ చెవులు పూడుకుపోకుండా పెట్టుకునే వేపపుల్లలు గురించి కవి మాట్లాడుతారు. చెవులు పూడుకపోకుండా బతుకును, సంప్రదాయాన్ని కాపాడుకోవడం కదా జీవితం అంటే! ఎందరి బిడ్డలకు, తల్లులకు తెలుస్తాయి ఇలాంటి సూక్ష్మ విషయాలు.
తను ఉపాధ్యాయుడు కాబట్టి ప్రైవేట్ టీచర్ గురించి చెప్తూ, “యాజమాన్యపు ఒత్తిడికి / పనిగంటల పెంపునకు /జీతాల తగ్గింపునకు / సెలవుల్లేని సేవకు/ నిలువునా తలాడిస్తూ / వాళ్ళకు కోపం వచ్చినా/ తనకు రోషమొచ్చినా తానే నిష్క్రమించే / ఉదారుడౌతాడు” అంటాడు. అనుభవంతో చెప్పిన మాట కాబోలు.
“నర్సవ్వ” అనే కవితలో తన్నుతాను చూసుకొంటాడు కవి, నర్సవ్వ యాదిలో…
“అప్పుడు నేను పదేండ్ల పిల్లగాడ్ని /పిర్రలమీద చినిగిన లాగుండె/ జబ్బల మీద కుట్టిన అంగుండె” …..”పిల్లగానికి అంగిలాగుల్లేవని /నాల్గు జతలు కుట్టిచ్చింది నర్సవ్వ/ గట్లెర్క నాకు నర్సవ్వ”…..”ఆమె మా పెద్దక్కోలింట్ల/ పనిమనిషి పెండ్లి జేస్కోలె/ అక్కతోనే సోపతై ఉన్నది/ ఆమె ఇంటికి పెద్దగోడలెక్కరా! అంటుండే అక్క”. కరోనా కాలంలో నర్సవ్వ చనిపోయినపుడు, అచ్చమైన తెలంగాణ భాషలో రాజేశ్వరరావు నర్సవ్వను యాది చేసుకున్నడు. అనుభవంలోకి వచ్చిన విషయాలపై, కళ్ళముందు కనిపించే మనుషులపై కవిత రాసే లేదాళ్ళ,
‘చీకటి’ మీద కూడా కవిత రాశాడు. “కవిత్వమూ, జీవితమూ ఒక్కటే!
అభిరుచి, అనుభవం ఉన్నంత మాత్రాన
సాఫీగా సాగిపోవు కదా!” అంటారు బతుకును నెమరువేసుకుంటూ…. అలా చెపుతూ “సిల్లీగా కొన్నిటిమీద రాయం / అవి మనసును తొలిచేస్తున్నా సరే!”. కొద్దిగా నర్మగర్భంగానే చెపుతున్నాడు కవి. చీకటి ఏదో తెలుసుకొమ్మన్నట్లు, “చీకట్లో చదువలేం ముఖాల్ని, పుస్తకాల్ని / అయినా / చీకట్లో ఉన్నవారి గురించి ఎవరు రాస్తారు చెప్పండి?…..” అంటూ.. “చీకటి ఒక తీరని ఆకలి” అంటారు! చీకటి లాంటి కొన్ని విషయాలపై మనం రాయలేం అన్నట్లు!
ఇక ‘గిరక’ మీద కవిత రాశాడు అనుభవాల్ని నెమరేసుకుంటూ,-“తిరగడమే గిరక వంతు / అరగడమెప్పుడూ ఉండేదే / తరాలుగా గిరక అరిగిపోతూనే ఉంది / దిగాలుగా బ్రతుకు వెళ్ళదీస్తూనే ఉంది/ నాన్న అనే బిళ్ళ దూలంపై / అమ్మలా/ గిరక” అంటాడు. చాలా బాగా పోలిక చెప్పాడు గిరకపై అమ్మా నాన్నలను పోల్చుతూ. ఇంకా గిరక గురించి “బొక్కెన నీటిని మోసుకచ్చినట్లు / కళ్ళు నీళ్ళను మోసుకస్తాయి / నూతి లాంటిదే జీవితమూనూ / లోతుగా / చీకటిగా / మునకలు వేయడమే” అంటూ బతుకు తత్వాన్ని విశదపరుస్తాడు కవి.
లేదాళ్ళ తన కవిత్వంలో వాడిన పదాలు కొన్ని తెలంగాణ ప్రాంతంలో నిత్య జీవితంలో వాడేవి, జనసామాన్యమైనవి! అలాంటి కవితే “కల్యామాకు చెట్టు” అందరి భాషలో కరివేపాకు చెట్టు, “కల్యామాకు చెట్టు/ దానికీ నాకు ఏదో సాదృశ్యత గోచరిస్తుంది” అంటూ.. “రోజూ తెంపే రెమ్మల వల్లేమో కుబ్జగానే మిగిలిపోయింది/చిగురులు పెట్టనివ్వండి, కాస్తంత ఎదుగనివ్వండి/ అన్నట్లు జాలిగా చూసేది నా వంక”.. అంటూ “నువ్వు రెమ్మల్నీ దాచుకోలేవు / నేను ఆర్థికంగా ప్రోది చేసుకోలేను” అని తనకుతాను కల్యామాకు చెట్టుతో పోల్చుకుంటాడు.
_____________
“వాడికి ఆకలేసింది” అనే కవితలో… కరోనా కాలంలో బడిదిక్కు వచ్చిన పిల్లవాడిని చూస్తూ టీచర్ “ఒరేయ్, ఎందుకొచ్చినవ్ / కరోనా భయం లేదురా నీకు” అంటే “బడెప్పుడు చాలయితది సార్” అన్నాడు పిలగాడు.”ఉన్నప్పుడు బాగానే చదివినవ్ తియ్/ టీవీలో వస్తాయి పాఠాలు వినుపో/ హేళనగా వినిపించిందో స్వరం”. మరి “బువ్వ?” అన్నాడు పిలగాడు..కడుపులో దేవినట్లయ్యింది టీచరుకు’…-నిజంగా ఆకలి అన్నింటిని మింగేస్తుంది కదా!
_____________
బతుకు ‘అన్వేషణే’ ఎవరికైనా! . కవికి కూడా కొన్ని భావనలు ఉంటాయి, కొన్ని నిర్ణయాలు ఉంటాయి, తన పథము గురించి, పని గురించి.. ‘అన్వేషణ’ అనే కవితలో ఇలా అంటాడు కవి “మేఘాల్ని కప్పుకొని నిలబడ్డ / అద్భుతమైన ఆకాశం గురించి,/ రంగులై తిరుగుతున్న / ఆలోచనల సీతాకోకచిలుకల గురించి కలలు కంటాను” అంటూ..ఇంకా “నేను నిద్దురకూ మెలకువకూ / మధ్య మిగిలిన అగాథంలో / వెలుతురుకై అన్వేషిస్తుంటాను” అంటారు.
ఈ కవికి జీవితంపై, కవిత్వంపై కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. తనదైన మార్గంలో, తనదైన బాటలో, తనకు తెలిసిన, అనుభవంలోకి వచ్చిన విషయాలనే అతడు కవిత్వం చేశాడు. ఇవి ఆవేశంలోంచి వచ్చిన కవితలు కూడా మరియు ఆలోచనల్లోంచి, అనుభవంలోంచి వచ్చిన కవితలు కూడా. అందుకే ఇవి బతుకు రంగును పులుముకొని ఉన్నాయి.
కవికి జీవిత అనుభవం ఒక్కటే చాలదు. విస్తృత అధ్యయనం కావాలి. ఎన్ని భాషలు వస్తే అంత సంతోషం! చివరికి ఒక్క మాతృభాష అయినా చాలు, విస్తృత అధ్యయన శీలిగా తనకుతాను మార్చుకుంటూ రాసుకుంటూ పోతే, కవితలు వజ్రపు తునకలై రాటుదేలుతాయి! లేదాళ్ళ కవిత్వంలో అక్కడక్కడ మెరుపులు ఉన్నాయి. మెరుపుల్లాంటి దైన్యమైన సంఘటనలు ఉన్నాయి. వాటిని పట్టుకొని దృశ్యమానం చేస్తున్నాడు. ఆ వాక్యాలు. సంఘటనలు మనల్ని పట్టుకుంటాయి. కదిలిస్తాయి.
అరవై నాలుగు కవితలున్న ఈ సంపుటిలో వివిధ పోటీల్లో బహుమతులు పొందిన కవితలు పదమూడు వరకు ఉన్నాయి.యువప్రాయంలోని అనుభవాలను జోడించుకొని మంచి కవిత్వం రాస్తున్న లేదాళ్ళ కవిత్వం చదవడం ఒక సృజనానుభవం.
-సబ్బని లక్ష్మీనారాయణ,
మొబైల్:8985251271











