మహా ఉంటే మూడు నాలుగేళ్లు వుంటాయేమో. నాయనమ్మ చిటికెన వేలు పట్టుకుని చిదంబరంలోని తిలై నటరాజ దేవాలయంలోకి అడుగుపెట్టింది ఆ చిన్నారి. ఆ చిన్ని కళ్ళకి ఆ దేవాలయం పరమాద్భుతంగా కనిపించింది. ఎటు చూసినా అందమైన శిల్పాలే. విప్పారిన నేత్రాలతో ఆ శిల్పాలను చూస్తూ ఉండిపోయింది. నాయనమ్మ చిటికెన వేలును ఆ చిన్నారి చేయి తనకు తెలియకుండానే వదిలివేసింది.నాయనమ్మ పూజ ముగించి చూస్తే పక్కన చిన్నారి లేదు. కంగారుగా దేవాలయ ప్రాంగణంలో వెతకసాగింది. ఒక శిల్పం దగ్గర ఆ చిన్నారి తనను తాను మరచి ఒక తన్మయత్వంతో చూస్తూ నిలబడి ఉంది. ఆ క్షణంలో నాయనమ్మకి తెలియదు ఆ చిన్నారి భవిష్యత్ లో దేశం గర్వించదగిన గొప్ప నర్తకిగా మారబోతున్నదని.
****
చిత్తూరు జిల్లాల్లోని మదనపల్లి దగ్గర చిన్న పల్లెటూరు. ముంగర గోవిందమూర్తి అంటే ఆ వూళ్ళో పెద్ద పేరు. ఆయన గొప్ప సంస్కృత పండితుడు. స్వామి దయానంద సరస్వతి అనుయాయి. ఆయన కొడుకు ముంగర కృష్ణమూర్తి కూడా తండ్రిలాగే, పండితుడు,కవి. అలా సంస్కృతం, తెలుగు, తమిళ భాషా సంప్రదాయాలు ముప్పేటలుగా ప్రవహించే కృష్ణమూర్తి కుటుంబంలో డిసెంబర్ 20, 1940 పౌర్ణమినాడు ఒక ఆడపిల్ల పుట్టింది. సంస్కృత సాహిత్యంలో పాండిత్యం ఉన్న తండ్రీకొడుకులు ఇద్దరూ ఆ ఆడపిల్లకి ‘యామినీ పూర్ణ తిలకం’ అని పేరు పెట్టారు. ‘యామినీ పూర్ణ తిలకం’ను రుషీ వ్యాలీలోని ప్రసిద్ధమైన కృష్ణమూర్తి స్కూల్ లో వేశారు తల్లితండ్రులు. చదువు మీద కాక యామిని దృష్టి అంతా డాన్స్ మీద ఉండేది. చిన్నప్పుడు ఎప్పుడో నటరాజ దేవాలయంలో చూసిన ఆ నర్తకి భంగిమ ఆమెకు పదేపదే గుర్తుకు వచ్చేది. చివరకు ఒక రోజు యామిని “నాన్నా ! నేను డాన్స్ నేర్చుకుంటాను ” అన్నది.
కూతురు అడిగిందే తడవుగా కాపురాన్ని చెన్నై కి మార్చి, రుక్మిణీ దేవి అరండేల్ స్థాపించిన కళాక్షేత్రంలో చేర్పించాడు.రుక్మిణీ దేవి శిక్షణలో యామిని గొప్ప భరత నాట్య కళాకారిణిగా శత సహస్ర వికసితదళ పద్మమై వికసించింది. కుట్రాల కురవంజి నృత్య రూపకాన్ని రుక్మిణీ దేవి వంసతవల్లి గానూ , ఆమె చెలికత్తెగా యామిని చిదంబరంలో ఒకసారి ప్రదర్శించారు. అది యామిని ఆరంగేట్రం. అక్కడినుండి ‘యామినీ పూర్ణ తిలకం’ కాస్తా ‘యామినీ కృష్ణమూర్తి’ గా మారి ఇక వెనుకకు చూడలేదు.
****
రసిక రంజనీ సభలో బాల సరస్వతి చేసిన నాట్యాన్ని చూసి అప్రతిభురాలైపోయింది. అది 1954లో కావచ్చు.బాలసరస్వతి దగ్గర శిష్యరికం చేయాలనీ నిర్ణయించుకుంది. ఆ సంగతి తెలిసి తండ్రి కృష్ణమూర్తి బాల సరస్వతి నట్టువనార్ కంచీపురం ఎల్లప్ప పిళ్ళైని ఒప్పించి యామినికి ట్యూషన్ చెప్పే ఏర్పాటు చేసాడు. బాలసరస్వతితో కలసి ఎల్లప్ప పిళ్ళై ప్రదర్శనలకు వెళితే,ఆ సమయంలో తంజావూర్ కిట్టప్ప పిళ్ళై ఆమెకు నాట్య రహస్యాలు చెప్పేవాడు. ఆ తరువాత మైలాపూర్ గౌరీ అమ్మాళ్ కి సేవ చేసి ఆమెను మెప్పించి కొన్ని అరుదైన “పదములు, జావళీలు” నేర్చుకుంది.
గొప్ప గొప్ప గురువుల సాహచర్యంలో గొప్ప భరత నాట్య కళాకారిణిగా ప్రదర్శనలు ఇస్తూ, పేరు ప్రఖ్యాతులు పొందిన యామిని ని ఉద్దేశించి పండిట్ రవి శంకర్ “She is not a normal dancer. She is a rakshasi, a demon (in a good sense) hers was what we can call “Asura Saadhakam” అన్నాడు.యామిని కృష్ణమూర్తి గురించి బాగా తెలిసిన క్రిటిక్ విజయసాయి.. “ఢిల్లీ లో ఒకసారి నేను ఆమె విరిబోణి వర్ణం రిహార్సల్ చేస్తుంటే చూసాను. ఆ వర్ణం చాలా కాంప్లికేటెడ్ రిథమిక్ పాట్రన్స్ తో కూడుకుని ఉంటుంది.అది చేయడానికి గొప్ప శక్తి కావాలి. కానీ యామిని ఆ మొత్తం వర్ణాన్ని రెండున్నర గంటలలో పూర్తి చేసి,ఒక గ్లాస్ మంచినీళ్లు తాగి మళ్ళొకసారి చేయడానికి సిద్దపడి పోయింది. నాకయితే మతిపోయింది. ఆమెకు ఆ స్టామినా ఎక్కడ నుండి వచ్చింది “? అని ఆశర్యపోయాడు.
***
“చిత్తూరు జిల్లా మదనపల్లి మీది. ఆంధ్రా అమ్మాయి.తెలుగు మాతృభాష. “మీరేమిటి కూచిపూడి వదిలివేసి, భరత నాట్యం వెంట పడ్డారు ?” అని ప్రశ్నించారు వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఒకేసారి కృష్ణమూర్తి ని ఆయన ఇంట్లోనే. కూచిపూడి నేర్చుకోవాలి అనే కోరికకు యామినిలో అక్కడ,అప్పుడు బీజం,పడింది. ఆ రోజులలో కూచిపూడికి పెద్ద పేరు ప్రఖ్యాతులు లేవు. దాన్ని క్లాసికల్ డాన్స్ గా కాక,కేవలం ఒక జానపద నృత్యంగానే భావించేవారు. కేంద్ర నాటక అకాడెమీ కూడా కేవలం నాలుగు నాట్య రీతులనే క్లాసికల్ గా గుర్తించేది . అందులో కూచిపూడి లేదు. యామిని మనసులో బీజం వేసి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు వదిలివేయలేదు.ఒక రకంగా చెప్పాలి అంటే వెంటపడ్డారు అంటే అతిశయోక్తి కాదు. అలా కూచిపూడిలోకి వచ్చేసింది యామిని. ఆధునిక కూచిపూడి నాట్యానికి కర్త,కర్మ, క్రియలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులనదగిన చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల శర్మ,వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిల దగ్గర నాట్యం నేర్చుకున్న మొదటి మహిళ యామినీ కృష్ణ మూర్తి.
. “భామాకలాపం” లో సత్యభామగా ఆమె అభినయానికి జనం మంత్రముగ్ధులు అయ్యేవాళ్ళు. అది ఎంతవరకు వెళ్ళింది అంటే సత్యభామ పాత్ర పోషణకి ప్రసిద్ధులైన వేదాంతం సత్యనారాయణ శర్మ గారిని ఎవరో ఒకసారి “సత్య భామ” పాత్రను ఎవరైనా స్త్రీ గనుక ప్రదర్శించవలసివస్తే ఎవరు దానికి న్యాయం చేస్తారు ?” అని అడిగారట. ఆయన తడుముకోకుండా “యామిని” అని జవాబు ఇచ్చారట. అంతటితో ఆగకుండా ఆమె ప్రదర్శించిన భామాకలాపాన్ని చూసాక ఆమె అభినయంలో సరికొత్త న్యూనస్ చూశానని ఒక రకంగా తనకు కొంత ఈర్ష్య కలిగిందని చెప్పారట. కామన్ వెల్త్ దేశాల మహాసభ సందర్భంగా లండన్ లో మొట్టమొదటి సారి కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించింది యామిని.
______________
ఉద్దండులైన వేదాంతం, చింతా, పసుమర్తిల దగ్గర కూచిపూడి నేర్చుకున్నట్టు గానే ఒడిస్సీ కూడా గురు చరణ్ పంకజ్ దాస్, గురు దేవ ప్రసాద్ దాస్, కేలూ చరణ్ మహాపాత్ర ల దగ్గర నేర్చుకుంది. ఒడిస్సీ లో ఆమె ప్రదర్శించే గీత గోవిందం లాంటివి ప్రేక్షకులను గొప్పగా ఆకర్షించడానికి కారణం సంస్కృతం మీద ఆమెకు వున్న పట్టు. ఆమె ఒడిస్సీ ప్రదర్శనలు చూసి ప్రభావితం అయిన రీతా దేవి, ఇంద్రాణి రెహమాన్ ఒడిస్సీ నేర్చుకుని గొప్ప ఒడిస్సీ నాట్య కోవిదులుగా ప్రఖ్యాతి చెందారు.
______________
ఆమె ప్రదర్శనలో ఉండే ఒక మార్మికత, యుఫోరియా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.ఒక సారి రక్షణదళాల కోసం ఆమె భరత నాట్య ప్రదర్శన చేస్తూ ఉండగా ముందు వరుసలో కూర్చుని చూస్తున్న ఒక గర్భిణీ స్త్రీ, ఆ ప్రదర్శనకు తన్మయత్వం చెంది తనను తాను మైమరచిపోయిందట. అంతేనా? తనకంటూ అమ్మాయి పుడితే ఆ అమ్మాయిని కూడా నాట్య కళాకారిణిని చేస్తాను అని చెప్పిందట. ఆ తరువాత ఆమెకు నిజంగానే పాప పుట్టింది. ఆ పాపకి చిన్నప్పటి నుండే యామిని భరత నాట్యంలో శిక్షణ ఇచ్చింది. ఆ పాప ఇప్పుడు భరత నాట్యంలో దేశం పట్టనంత పేరు. ఆ పాప ఎవరో కాదు రమా వైద్యనాథన్.
ఆమె ప్రదర్శన ఒప్పుకుంటే ఒక సాయంత్రంపూట భరత నాట్యంలో వర్ణం, కూచిపూడిలో భామాకలాపం, ఒడిస్సీలో జయదేవుడి అష్టపదులు ప్రదర్శించేది. అంటే ఏకకాలంలో మూడు క్లాసికల్ డాన్స్ లతో ప్రేక్షకులను రంజింప చేసేది. ఆమెకు ఆ శక్తి ఎక్కడ నుండి వచ్చింది. ఆమె మాటలలోనే ‘Like a bee on a flower, I would go to different people and pick their best. I had a good idea what each teacher had. I did not want to stay with one stream and wanted to go to many streams and find salvation’.
మూడు దశాబ్దాలపాటు భారత దేశం మొత్తాన్ని తన నాట్యాభినయంతో మంత్ర ముగ్ధులను చేసింది యామినీ కృష్ణ మూర్తి. ఆమె ప్రతిభకు తగిన పురస్కారాలు చాలా లభించాయి. అతి చిన్న వయసులో ‘పద్మశ్రీ’(1968)వచ్చింది.‘పద్మ భూషణ్’ (2001)వచ్చింది.‘పద్మ విభూషణ్’ (2016)వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆస్థాన నర్తకి పదవి ఇచ్చి గౌరవించింది.పాషన్ ఫర్ డాన్స్ అనే శీర్షికతో ఆమె బయోగ్రఫీ వచ్చింది. యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ స్థాపించింది. ఆమె చివరి ఇంటర్వ్యూలలో ఒకసారి “యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ భరత నాట్యం లో ఒక రమా వైద్యనాథన్ సృష్టించినట్టుగా కూచిపూడిలో ఒక గొప్ప నర్తకిని సృష్టించలేక పోయింది. కూచిపూడి ఇతర నాట్యాలలాగా కాదు. వాచకం,అభినయం,తెలుగు భాషలోని సూక్ష్మస్థాయి ఈస్థటిక్స్ తెలిసి ఉంటే కానీ కూచిపూడి పట్టుపడదు. ఇప్పుడు కూచిపూడి ప్రదర్శనలు ఇస్తున్న వాళ్లనే చూడండి. రెండు సార్లు మీరు ఒక నర్తకి నాట్యం చూస్తే చాలు ఆమె ఎప్పుడు ఏమి చేస్తుందో మీరు మూడో సారి చెప్పేయగలరు.నాట్యం చేస్తూనే ఇంప్రొవైజ్ చేయాలి. భావంలో అభినయంలో ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ గా ఉండాలి. అది లేకపోతే చేసే నాట్యాన్ని కూచిపూడి అనే అంటారు కానీ దానిలో ఆత్మ ఉండదు” అంటారు.నిజం ఆ ఇన్నోవేటివ్ నెస్ లేకపోతే ఏ నాట్యరీతి అయినా మనోధర్మాన్ని ప్రకటించలేదు.
చాలా తక్కువమంది వెళ్ళిపోయినప్పుడు శూన్యం ఏర్పడింది అంటాము. అలాంటి శూన్యం ఇప్పుడు యామినీ కృష్ణమూర్తి వెళ్లిపోవడంతో ఏర్పడింది.
(ఆగస్ట్ 3,2024వ తేదీన తన 83వ ఏట తుదిశ్వాస విడిచిన యామినీ కృష్ణమూర్తి గారికి నివాళితో)
-వంశీకృష్ణ,
95734 27422