‘నికషం ముగిసింది’, ‘చావు బావురుమంది’

సాహిత్యం

మనకు కనిపించని విషయాలపైకి నా టార్చ్ లైట్ ఎందుకంటే ఇందుకే. మామూలు విషయాలు చెప్పడానికి చాలామంది ఉన్నారు. జీవితాన్ని, ప్రపంచాన్ని సౌందర్యవంతం చేయడానికి, మనసును చల్లబరచడానికి, ఉపశమనంగా రాయడానికి కోట్లాదిమంది రచయితలు ఉన్నారు. నాలాంటివాడు మధ్యలో ఎక్కడో ఉంటే తప్పేంలేదు కదా. ఇప్పుడు కాదు,ఇంకెన్ని రాసినా నేను డార్కర్ సైడ్ ఆఫ్ లైఫ్ గురించే రాస్తాను. ఈ లాబరింత్ (Labyrinth) ను నేను ఎక్స్ ప్లోర్ చేస్తూనే వెళ్తున్నాను. బయటకు దారి దొరుకుతుందేమో తెలీదు. దొరకదేమో కూడా. By the Time I’ll be dead.నేను చనిపోయిన తరువాత ఏమవుతాను అన్నది అస్తిత్వవాదం ప్రకారం నాకు సంబంధం లేదు. నా రచనలన్నీ నేను బతికుండంగానే తగలబెట్టినా కూడా నాకే ప్రాబ్లం లేదు.

I want to speak out my inner self. That’s what I’m doing and I’ll be doing. – కాశీభట్ల వేణుగోపాల్

కాశీభట్ల వేణుగోపాల్ కథలు అర్ధం కావు అని చాలామంది అంటారు. ఆ మాట ఆయన అమితంగా ప్రేమించే అక్కలు ఇద్దరు జయక్క, సావిత్రక్క కూడా “వాడి రచనలు చాలా మందికి అర్ధం కానట్టే మాకూ కావు. అయితే పాత్రల సంభాషణలు చదువుతోంటే మాత్రం వాడు మా ఇంట్లో మాట్లాడినట్టే ఉంటుంది” అన్నారు కాశీభట్ల వేణుగోపాల్ కథలకు రాసిన ముందుమాటలో. ఇంట్లో మాట్లాడుకునే మాటలే అయితే మనకు ఎందుకు అర్ధం కావు? మన మాటలే మనకు అర్ధం కానంత సంక్లిష్టతలోకి మనం వెళ్లిపోయామా? ఒక వేళ వెళ్ళిపోతే ఆ సంక్లిష్టతకి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలు నాకు వేణుగోపాల్ రచనలు చదువుతున్నప్పుడు తరచుగా ఎదురవుతూ ఉంటాయి. కానీ లోతులకు వెళ్ళినకొద్దీ నాకు అర్ధం అయిన విషయం ఏమిటంటే “అర్ధం కావు” అనే మాటల మాటున మన జీవితంలోని అర్ధరాహిత్యాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నామని. వేణుగోపాల్ వెలువరించే ప్రశ్నలను గుర్తించడానికి నిరాకరిస్తున్నామని.

మనిషి ఆలోచనాతత్త్వం నీతి, నియమాలు,పాప పుణ్యాలు, మంచీ చెడులు, చీకటి వెలుగులు అన్నవాటికి లొంగదు. ఆ ఆలోచనా తత్త్వాన్ని విశ్లేషించడమే వేణుగోపాల్ రచనలు చేసేపని. సూటూ,బూటు వేసుకుని సర్వాలంకార భూషితమై నాగరికులుగా మనల్ని మనం గుర్తించుకుంటూ,క్షణానికి శత సహస్ర పర్యాయాలు ఆత్మవంచన చేసుకునే మనకు ఎవరైనా ఎదురొచ్చి మన అలంకారాలన్నీ, తుడిచేసి,మన వలువలు,మిధ్యావిలువలు వొలిచేసి మన నగ్న స్వరూపాన్ని మనముందే నిలబెడితే మనం తట్టుకోలేము. అదుగో..! ఆ తట్టుకోలేని తనం నుండి పారిపోలేక, దాన్ని లోలోపల సంలీనం చేసుకోలేక వొడ్డునపడిన చేప పిల్లల్లా తన్నుకులాడి తల్లడిల్లుతాము. కనుకే కన్వీనియెంట్ గా “ఆయన రచనలు అర్ధం కావండీ ” అనే మాట మాటున దాక్కుంటాము.

కాశీభట్ల వేణుగోపాల్ కథల్లో ఏముంటుంది?

“ఈ యాభయ్ రెండేళ్ల జీవితంలో చాలా దూరం నడిచొచ్చా. అందిన మేరా శారీరకానందాలని దొరకబుచ్చుకున్నాను. ప్రపంచాన్ని వీలయినంత మేర చూసాను. నాకున్న భాషా పరిజ్ఞానాన్ని వుపయోగించి భాషను ధ్వంసం చేస్తూ తోచిన రాతలు రాయడం మొదలుపెట్టా. మత విశ్వాసాలు లేనితనం,శృంగారం పట్ల నాకున్న అభిప్రాయాలు,నాకున్న వ్యసనాలు, చీకటి జుగుప్స నే చూసిన అసహ్య ప్రపంచపు నగ్న రూపాలను చూపుతూ తెలుపుతూ నే రాసే రాతలు మొదట పత్రికలు ప్రచురించడానికి వెనుకాడినా చిన్నచిన్నగా ప్రచురించడం ప్రారంభించాయి. విధ్వంసక రచయితగా, సభ్యాసభ్యతలు సంస్కారము లేని రచయితగా వ్యసనాలకు పంచవర్ణాలు పులిమేవాడిగా చాలామంది భద్రలోక జీవులు ఛీత్కరించినా కొద్దో గొప్పో చిన్న సైజు మేధావిగా పేరు తెచ్చుకున్నా. ఒక్కో రచనా బయటపడుతుండగా నా లోపల ఆ మేర శూన్యం ఆవరించడం. అట్లాగున ఇప్పుడు చాలామటుకు శూన్యమే .. “

ఈ వాక్యాలు అన్నీ వేణుగోపాల్ ఘోష కథలోని ఒక రచయత మోనోలాగ్. నిజానికి ఆ మోనోలాగ్ కథలోని పాత్రది కాదు. అచ్చంగా వేణుగోపాల్ దే. అలా కథ రాసి వేణుగోపాల్ శూన్యం కావడమే కాదు, చదివిన పాఠకుడిని కూడా శూన్యం చేస్తాడు. అదుగో అలా మనుషులు శూన్యం కావడం అనే అత్యున్నతమైన తాత్వికావస్ధలోకి వెళ్లడం ఎవరికీ ఇష్టం ఉండదు కనుక వేణుగోపాల్ అర్ధం కావడం లేదు అనే నెపం ఒకటి పెరిఫెరల్ గా వేసేసి తమ భద్రలోకపు జీవితంలోకి తామూ జారుకుంటారు.

మనమంతా జనన మరణాల మధ్య జీవితం వుంది అనుకుంటాము కానీ, ఆ వున్నది ఏదో జీవితం కానే కాదు. మనకి జననమూ తెలియదు., ఎప్పుడొస్తుందో తెలియని మరణమూ తెలియదు. రెండు చీకటి బిందువులని ఓ వెలుతురు గీతతో కలపడమంత అవివేకం ఉండదు. ఒక జ్ఞాన బిందువు దగ్గర మొదలయిన జీవితం మరొక నిర్వేద జ్ఞాన బిందువు దగ్గర ఆగిపోతుంది. ఇదంతా ఒకానొక అఖండ చైతన్యంలో భాగంగానే జరుగుతుంది కనుక డెబ్బయి ఏళ్ళు బతికినా, వందేళ్లు బతికినా మనిషి జీవితం చాలా కురచ అనే అనిపిస్తుంది. ఏక కాలంలో పొడవైన, కురచనైన బతుకులో జీవించే క్షణాలు చాలా అరుదుగా, అనాహూతంగా వస్తాయి. అలా వస్తాయి అన్న ఎరుక, చైతన్యమే జీవితం.అదొక ప్రవాహం.ఎప్పుడో,ఎక్కడో,అనాదిలో పుట్టి అనంతంగా సాగుతున్న ఆ చైతన్య ప్రవాహమే జీవితం.వేణుగోపాల్ కథలు పాఠకుడిలో ఆ చైతన్యాన్ని కలిగిస్తాయి.

“సామాజిక స్పృహ వుండాల్సిందే. అలా అని అదే రాయాలి, అలాగే రాయాలి అని నిర్దేశిస్తే సృజన దెబ్బతింటుంది. రొడ్డ కొట్టుడుగా మారుతుంది. అతిసామాజిక స్పృహవల్ల తెలుగు సాహిత్యం కండీషన్‌ అయిపోయిందని నా ఉద్దేశం. తెలుగు సాహితీ ప్రయాణం వైష్ణోదేవీ గుహల్లోంచి చేస్తున్న ప్రయాణంలా ఉంది. ఒక వైపు జరిగితేనేమో కమ్యూనిస్టు ప్రభావాల గోడ. మరో వైపు జరిగితే మత భావాల గోడ. ఈ రెండూ దారిని యిరుకుగా చేసేశాయి. సాహిత్యాన్ని నిలువ నీటిగా చేసేశాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే విశ్వ సాహిత్య పఠనం నన్ను నదీ ప్రవాహంలాంటి సాహిత్యం వైపు మళ్ళేలా చేసింది. అందుకే నాపైన పాశ్చాత్య రచయితల ప్రభావమే ఎక్కువగా వుంది. మరీ ముఖ్యంగా కాఫ్కా, నెబకోవ్‌ నన్ను సమ్మోహితుణ్ణి చేసినట్టే జర్మన్‌,ఫ్రెంచ్‌, రష్యన్‌ రచయితల రచనలు కూడా నన్ను ఆకట్టుకున్నాయి.” అని చెప్పిన వేణుగోపాల్ కి తొలి గురువు అమ్మ కాశీభట్ల హనుమాయమ్మ.

తొమ్మిది నెలల వయసప్పుడే స్పష్టంగా మాట్లాడుతుంటే రఘువంశంలోని శ్లోకాలను నేర్పించిందట. ఆ తరువాత అమరకోశం. అక్కలు గ్రంథాలయానికి వెళ్లే అలవాటు చేస్తే చదువు అలవాటుగా మారింది. మొదటి కథ “రంగనాయకి లేచిపోయింది ” 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక ప్రచురించింది. ఒక పదహారేళ్ళ అమ్మాయి హఠాత్తుగా కనపడకుండా పోతే సమాజంలోని భిన్న వర్గాలు,విభిన్న లేయర్లు ఎలా ప్రతిస్పందిస్తాయి అన్నది ఆ కధాంశం. కవిత్వం,కథ,నవల ఏది రాసినా వేణుగోపాల్ శైలి ప్రత్యేకమైనది. అది ‘ఓపెన్‌ థాట్‌ రైటింగ్‌’. నిద్రకూ,మెలకువకూ మధ్య ఒక అవస్థ ఉంటుంది. ఆ స్థితిలో బాహ్య, బాహు అంతర్గతాన్ని సృజిస్తే అది చాలా సంక్లిష్టంగా వుంటుంది. అదే చైతన్య స్రవంతి శైలీ కథనంలా వుంటుంది ఒక్కొక్క సారి మ్యాజిక్ రియలిజంలాగాను ఉంటుంది. అది చిత్ర లేఖనంలో సాల్విదార్‌ దాలీ చేశాడు. నేను సాహిత్యంలో చేయాలని ప్రయత్నించాను.ఈ ఓపెన్ థాట్ ప్రాసెస్ ను చిత్రలేఖనంలో సాల్వెడార్ డాలీ అనుసరిస్తే సాహిత్యంలో వేణుగోపాల్ అనుసరించారు.

వేణుగోపాల్ ను తెలుగు సాహిత్య సమాజం చూసీచూడనట్టు వదిలి వేయడానికి ప్రధాన కారణం మాత్రం తన ఇతివృత్తాలే. కూతురిలో భార్యను చూసే తండ్రి (ఇన్సిస్ట్ ) మంచుపువ్వు అయితే పసిపిల్లల మీద సెక్స్ వాంఛ (ఫిడో ఫీలియా )ఛాయామాత్రంగా కనిపించే కథ నికషం.

వేణుగోపాల్ రచనలు చదవడం నాకొక వ్యసనం.ఏ స్థితిలో ఉన్నా,ఎలా వున్నా ఆయన ఒక ఆలోచనను మనసులో వదులుతుంది. “జీవితం అన్ని పార్శ్వాలలోనూ ఆనందాన్ని వెతకడం అంత అవివేకం మరొకటి ఉండదేమో.నిజం!నిజం! ప్రతి ముఖమూ ప్రమోదమైతే జీవితం అసలు ముఖాన్ని కోల్పోయి డ్రామా కంపెనీల డప్పు అయిపోతుంది” అంటారు ‘తపన’ లో. ఇవాళ సమాజంలో ఏ మనిషికీ తనదయిన ముఖం లేదు. ఈ ప్రపంచమొక పెద్ద డ్రామా కంపెనీగా మారి తనను తాను మోసం చేసుకుంటోంది.స్మృతి నుండి విస్మృతిలోకి, విస్మృతి నుండి చేతనలోకి,చేతన నుండి యాంత్రిక దుర్భలత్వంలోకి దొర్లిపోయే తెలుగు జీవితాలకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన వాడు కాశీభట్ల వేణుగోపాల్.

-వంశీకృష్ణ,
95734 27422

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *