‘దిగులు చూపుల పద్యం’ డా.సుంకర గోపాల్ కవితపై వ్యాఖ్యానం.
కవితాతత్వం తెలుసుకుని ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని తూకం వేసి మరీ మంచి కవిత్వం రాస్తున్న గోపాల్…కవితా వస్తువుకు తగిన భావచిత్రాలను, పదచిత్రాలను, కవిత్వంలో విరివిగా విరబూయిస్తాడు. కవితా వస్తువుపట్ల స్పష్టత, అవగాహన, ప్రత్యేక శ్రద్ధతో కూడిన శైలీ విన్యాసం ఈ కవి బలం. సాహిత్య వ్యాసాలూ అంతే. చదువు విశిష్టత తెలిసినవాడు. శ్రమతత్వంతో కూడిన పట్టుదల, దేనినైనా, ఎలాగైనా సాధించాలనే తపన..జీవితంలో తాను ఎదిగిన తీరును పట్టి చూపుతుంది. ఈ కవి సృజనను పాఠకులు విస్తృతంగా చదువుతున్నారంటేనే అది తన విస్తృతాధ్యయనం,ప్రతిభ కారణం అనవచ్చు. తన మొదటి కవితా సంపుటి “మా నాయిన పాట” ను సాహితీ లోకం అక్కున చేర్చుకుంది. రెండవ ముద్రణకు కూడా నోచుకుంది.
***
ఒక కవితకు వ్యాఖ్యానం చేయాల్సి వచ్చినప్పుడు-ముందుగా కవితను రాసిన సందర్భం,ఎప్పుడు రాయబడింది, ఎవరిని ఉద్దేశించి రాయబడింది, రాసినప్పటి పరిస్థితులు,అప్పటి కవి ఉద్వేగ స్థితి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలను చదువుకోసం హాస్టల్ కు పంపడం,అదీ వేసవి శలవులు తర్వాత ఇతర ప్రదేశాలకు పంపడం అంటే తల్లిదండ్రులకు దిగులుగానే ఉంటుంది. ఈ కవితా సందర్భంలో చదువు కోసం బిడ్డను హాస్టల్ కు పంపే సందర్భంలో ఒక తండ్రి గుండె లోతుల్లో ఉప్పొంగే భావనలకు, బిడ్డ తమను వదిలివెళ్తున్న క్షణాల విలవిలల దృశ్యానికి ఒక చక్కటి అక్షర రూపం ఈ కవిత.
____________________
దిగులు చూపుల పద్యం
***
పిల్ల, హాస్టల్ కెళుతోంది
కురవడానికి సిద్ధంగా ఉన్న
మేఘం లా ఉంది నా ముఖం(1)
వాళ్ళ అమ్మ ముఖంలో
తీగల మీద వాలిన
జిట్టపిట్టల్లా కనీళ్లు(2)
మా రాత్రులు గుర్తుకొస్తున్నాయ్
మాటలతో పండిన రాత్రులు
అలా వంగి
మా ఇంట్లో వినిపించే కథలు విన్న
చంద్రుడు
కిటీకి లో నుంచి
లోపలికి తొంగి చూసే
మనోరంజ మొక్క (3)
మా ఉదయాలు
జ్ఞప్తికొస్తున్నాయ్
టీ తాగుతున్నప్పుడు
మాతో కలిసి
కిరణాల గుడికట్టిన సూర్యుడు
ఎదురింటి అద్దాల నీడ తో అల్లిన బొమ్మ
మా కబుర్లు వింటూ
ఆనందించిన నీడలు
మెరుగుపడ్డ క్షణాలు
ఈ రాత్రికి
మాతో పాటే చంద్రుడికి నిద్ర పట్టదు
కోడిపిల్ల ల్లా కదిలే చుక్కలు
మా ఇద్దరి మధ్య
ఖాళీలో దిగులు కదులుతోంది
హాస్టల్ కిటీకి లోనుంచి
ఒక జత కళ్ళు బయటకు చూస్తున్నట్టే(4)
ఇంటి
తలుపు తీయడానికి
నాలుగు చేతులు
ఉవిళ్ళూరుతుంటాయి(5)
– సుంకర గోపాలయ్య,
94926 38547
(జూన్ 9,2025 ఆంధ్రజ్యోతి ‘వివిధ’ లో ప్రచురించిన కవిత)
__________________________
శబ్దాల వలయాల్లో ఒక ప్రేమ, ఆప్యాయతల కలయికగా ఆవిర్భవించిన ఈ కవితలో పదాల వాడకంలో ఎటువంటి అలంకారాల హంగుల్లేని స్వచ్ఛమైన వ్యక్తీకరణతో శిల్పం అలరారింది.
“కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘంలా ఉంది నా ముఖం” (1)— ఈ ఉపమానం తండ్రి గుండె పటంలో నిండుకుండలా తొణికిసలాడుతూ ఉన్నది. ఇది కవి ఒక శక్తివంతమైన రూపకం ద్వారా అంతరంగిక దిగులను మేఘంగా మారుస్తాడు.ఇది భావనకు బహిరంగ ఆకారంగా మారుస్తుంది.
“తీగల మీద వాలిన జిట్టపిట్టల్లా కనీళ్లు”(2) — తల్లి ముఖానికి అందమైన, ఆవేదన కలిగించే చిత్రణ ఇది.
“కిటికీ లో నుంచి లోపలకి తొంగిచూసే మనోరంజ మొక్క”(3) ఇది ఒక అభినవ రూపకం.అది కేవలం మొక్క కాదు..అది జ్ఞాపకాల చైతన్యం, కుటుంబ స్పర్శను సూచించే జీవితదృశ్యం. ఈ వాక్యంలో చక్కటి రూపక ప్రయోగం జరగటమే కాకుండా రోజువారి దృశ్యాలలో నుంచే భావనల్ని ప్రవహింప చేయడం ద్వారా మంచి శైలి,శిల్పాన్ని సాధించారు కవి. దీనిని సున్నితమైన వచన కవితా శైలిగా చెప్పవచ్చు.
“హాస్టల్ కిటికీలో నుంచి ఒక జత కళ్ళు బయటకు చూస్తున్నట్టే”(4) ఇది చాలా శక్తివంతమైన దృశ్యం. వెళ్ళిపోయిన బిడ్డ, ఇంటిని చూచే కాంక్షను చాలా భావోద్వేగంతో చిత్రించినట్లుగా ఉంది. పిల్లలపై తల్లి తండ్రుల ప్రేమ, విడిపోవలసిన క్షణాల్లో ఏర్పడే ఓ వెలితి, నిత్యజీవితపు స్మృతులైన టీ తాగిన ఉదయం, కబుర్లు, చెట్ల నీడలు, అద్దాలపై నీడలు ఇలా అనేకమైన భావాలు ఈ కవితలో దృశ్యమానమైనాయి.
“నాలుగు చేతులు తలుపు తీయడానికి ఉవిళ్ళూరుతుంటాయి” (5)— ఈ పంక్తి వేదనను అంతిమంగా పలికిస్తుంది. ఇంట్లో నిండి ఉన్న శూన్యతను గుర్తుచేస్తుంది.
ఈ కవితలో ప్రధానంగా కనిపించే భావం
‘విడిపోవడం’ అనే జీవనానుభవాన్ని తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న విధంగా చిత్రీకరించడం..బిడ్డలు హాస్టల్ కి వెళ్తుండగా తల్లిదండ్రుల్లో ఉద్భవించే మానసిక దిగులు, జ్ఞాపకాల మెలకువ, బంధంలోని నిశ్శబ్ద బాధ, ప్రేమతో కూడిన ఖాళీ — ఇవన్నీ సున్నితంగానూ, భావ గాఢత(Thematic Depth)తోను వ్యక్తమయ్యాయి.
రూపకాలు (Imagery):
ఈ కవితలో వాడిన ప్రతీ దృశ్యం ఒక భావనకు ప్రతీకగా నిలుస్తుంది.“ కోడిపిల్లల్లా కదిలే చుక్కలు” ఇది పిల్ల వెళ్ళిపోయిన తర్వాత కుటుంబపు శూన్యతను ప్రతిబింబించే సౌందర్యదృశ్యం.“తలుపు తీయడానికి నాలుగు చేతులు ఉవిళ్ళూరుతుంటాయి” అనే వాక్యంలో చిన్నపిల్లలను ఆత్మీయంగా హత్తుకోవాలన్న తల్లిదండ్రుల అంతర్గత తపనకు ప్రకటన.ఈ రూపకాలు గౌరవనీయమైన తల్లిదండ్రుల ప్రేమను అందంగా ఆవిష్కరిస్తాయి.
ఆధునిక విమర్శా కోణంలోంచి ఈ కవితను చూసినప్పుడు ఇందులో స్ట్రక్చరలిజం (Structuralism)పరంగా కవిత అంతా “ఇల్లు” vs “హాస్టల్”, “అంతరంగిక జీవితం” vs “బాహ్య జీవిత అవసరాలు” అనే రెండు విరుద్ధ ధ్వనుల మధ్య నిర్మితమై ఉంది. ఈ కవిత ఒక బిడ్డ ప్రయాణానికి వేదికగా ఉంది.
ఫెమినిస్టు విమర్శ (Feminist Angle)పరంగా అమ్మాయి హాస్టల్ కు వెళ్తుండడాన్ని తల్లి ఒక ఆధ్యాత్మిక కోణంలో విడిపోవడంగా చూస్తోంది. ఇది వ్యక్తిగత బాధతో పాటు అమ్మానాన్నల పాత్రకు సంబంధిత సామాజిక చైతన్యాన్ని కూడా వెలికి తీస్తుంది.
పోస్ట్-మోడర్న్ ధోరణి (Postmodernism) పరంగా చూసినప్పుడు భావనల సరళి, కాలక్రమ వైచిత్ర్యం, అర్ధవంతమైన ఖాళీలతో కూడిన నిర్మాణం మొదలైనవన్ని పోస్ట్ మోడ్రన్ లక్షణాలు. ఈ లక్షణాలను ఈ కవితలో మనం గమనించవచ్చు.
చివరిగా, ఈ కైతలో వాడిన పదాలు..వస్తువుకు తగినట్లుగా ఉండి, సందర్భోచితంగానూ,భావం మరియు స్పష్టతతోనూ,కవిత చదువుతుంటే సహజంగా, అప్రయత్నంగా సాగింది. కవిత చాలా “ప్రత్యక్ష” మైనదిగా ఉన్నప్పటికీ, దాని అంతర్భావ విశాలత ప్రశంసనీయంగా ఉండి తన వైయక్తికానుభవాన్ని స్వచ్ఛమైన రూపంలో కవిత్వంగా అన్వయించటం జరిగిందా అన్నట్లుగా ఉంది. సాహిత్యపరంగా బలంగా ఉన్న ఈ కవిత తల్లిదండ్రుల మనసు పలికే శబ్దాలకు ప్రతిరూపం. ఇది ఒక జ్ఞాపకాల నదీ ప్రవాహం. వచన కవితా శైలిలో, ప్రతి పాదానికి మనసు తడిచేలా ఉన్న ఈ కవిత, ఆధునిక భావబౌద్ధికతకు, జీవిత అనుభవానికి చక్కటి కలయిక. ఈ కవితను ఆత్మాశ్రయతత్త్వానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇంతా చెప్పాక కవితలో లోటుపాట్లు ఏమీ లేవా అంటే.. కవికి,తన బలాబలాలు ఏమిటో తెలుసు. కవికి ఉన్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, శైలిని గౌరవిస్తూనే ఈ పరిశీలనలు చేయడం జరిగింది.
ఎవరైనా ఒక కవిత రాసినప్పుడు అన్ని వాక్యాలూ, కవిత్వంతో జవజవలాడాలి అంటే కుదరని పని. నా వరకైతే ‘చెడు చెవిలో చెప్పాలి,మంచి పదిమంది ముందు చెప్పాలి’ అన్నారు కదా పెద్దలు. ఆ సూత్రం ఇక్కడ కూడా అన్వయించుకొని కవితను నాదైన దృక్కోణంలో వ్యాఖ్యానించాను. సమీక్షకులు,పరామర్శకులు,విమర్శకులు తమదైన దృక్కోణంలో దీనిని చూడవచ్చు.
ఇంతకు ముందు
1.ఏటూరు నాగేంద్రరావు
2.అవ్వారు శ్రీధర్ బాబు
3.డా.పసునూరి రవీందర్
4.డా.ర్యాలీ ప్రసాద్ గార్ల కవిత్వంపై పరామర్శ చేయడం జరిగింది.
ఈ పరంపరలో ఇప్పుడు ఇది ఐదవది.
# విల్సన్ రావు కొమ్మవరపు
