కథలు మట్టిలోనుంచి పుట్టినప్పుడు, ఆ పరిమళం విశ్వవ్యాప్తమవుతుంది. అందులో అక్షరాలు వుండవు. అన్నీ అనుభవాలే. వాక్యాలు చదువుతూ వుంటే, ఎవరో చేయిపట్టుకుని అప్పటి చరిత్ర రహదారుల మీద నడిపించినట్లుగా వుంటుంది. ఆ స్పర్శనిండా కథకుడి గుండెలోని శబ్దాలు కథలోని, పాత్రలై పలకరిస్తూ వుంటాయి. పరవశించిపోతున్న పాఠకుడి పాదముద్రలు ప్రతి కథ గడపముందు, తన గుర్తుల్ని వ్రేలాడదీసుకుంటూ వెళ్తూవుంటాయి. ఈ కథల్ని పాఠకుడు చదివినప్పుడు, అతడి మనసు తాళపత్రాలమీద చెదరిపోని ఓ అద్భుతమైన అనుభూతి ఒక కావ్యంలా శాశ్వతం చేసుకుంటుంది. మళ్లీ, మళ్లీ జ్ఞాపకాల వేదికల మీద ఆ కథలన్నీ కథాకళి నృత్యానికి సిద్ధమవుతాయి. వెరసి మట్టివాసనతో పలకరించే కథలు, పాఠకులను నిద్రలో సైతం ప్రేక్షకుల్లా కూర్చోపెట్టి, తమలోని కథనాన్ని ఓ కమ్మని గేయంలా వినిపిస్తూ వుంటాయి. అటువంటి సాధికారిత కథల జాబితాలోకి చేరిన ఆణిముత్యమే సడ్లపల్లె చిదంబరరెడ్డి కలం నుంచి వెలువడిన “మట్టి మొగ్గలు (మనిషి కథలు)” కథా సంపుటి.
‘ఇంకా నేను బ్రతికి వుండడం… బాల్యం నుంచీ నన్ను గమనిస్తున్న వారికే కాదు, నాకూ ఆశ్చర్యమే…’ అంటూ మొదలైన కథకుడి అంతరంగం, ఈ సంపుటి సృజన నేపథ్యానికి సవరించుకున్న విశేషాలను ఒక జలపాతం హోరులా అందించింది.
_____
1993లో ‘రెడ్డీ! నీవు రైతుజీవితం తెలిసిన గ్రామీణుడివి. ఆ అనుభవాలను కథలుగా మారిస్తే బాగుంటుందన్న…” మధురాంతకం రాజారాం గారి మాటలు, మంత్రాల రూపాలై, ఒక మహెూత్తర సాహిత్య సాధనకు పునాదిరాళ్లుగా మారటం, ఒక సాహిత్య పంటకు తగిన మాగాణి పొలాన్ని అందించినంత ఆనందంగా వుంది. సింగమనేని గారు అనారోగ్యంతో మంచం పట్టిన చివరి దశలో ‘సడ్లపల్లీ!! ఇదీ నిజమైన ఆధునిక కథ…’ అంటూ ఈ రచయిత రాసిన ‘ఇదీ కథ’ ను మెచ్చుకుంటూ అందించిన ప్రశంసలు, ఈ సంపుటిలోని కథల ప్రవాహానికి ఈత నేర్పించిన గురువుల్లా మిగిలిపోయాయి.’నీవింకా కొత్తగా రాస్తున్న వాడివేమీ కాదు! నీ కథల గురించి నీవే నాలుగు మాటలు రాయడం మంచిది…’ అంటూ కేతు విశ్వనాథరెడ్డి గారు పలికిన ఒక తిరుగులేని తీర్మానం ఈ కథలకు ముఖద్వారంగా ముస్తాబు కావటం, రచయిత కలం శరీరానికి అత్తరును అద్ది, ఒక గొప్ప రచనా శిల్పానికి తిలకం దిద్దినట్లుగా వుంది.
_____
పొయ్యిమీద మట్టి అటకలో తెర్లుతున్న ఎసరులోకి జారుతున్న రాగిపిండి, ఈ కథల నేపథ్యానికి తన గొంతును సవరించుకుంటోంది. కునుకు తీస్తే గ్రుడ్లు నలుపు తిరిగి పురుగులు బయటికి వస్తూ రాయలసీమ దైన్యానికి సాక్షి సంంతకాలు చేస్తున్నాయి. పేడను, దిబ్బకు మోసి, పశువులకు మేతవేసి, మండుటెండలో పనులన్నీ ముగించి కూర్చున్న పల్లెటూరి మనిషి వొంటిమీద కారుతున్న చెమట బిందువులన్నీ, కథలలోని సన్నివేశాలకు నవారు మంచాలు అల్లుతున్నాయి. నెర్రలు చీలిన బీళ్లు, ఎండిన పైర్లు, ఎర్రటి దుమ్ము, ముళ్ల కంపలు, బోడికొండలు, బావుల్లోని ఎండమావులు… తమలో తాము పోటీపడుతూ కథల్ని చదివించే తత్వానికి తంబూరా తీగల్ని సవరించుకుంటున్నాయి. రాయదుర్గం పాలెగాడు రంగప్పనాయుడి పెండ్లాము రాములమ్మ, ఆయప్పకి తలకాయలో పేనులు కుక్కుకొంటున్న దృశ్యాలు, కథల సహజత్వ చిత్రీకరణకు తేరును సిద్ధం చేసుకుంటున్నాయి. “కాలాన్ని బట్టి జనాల బుద్దులు మారుతాయో, లేకుంటే జనాలని బట్టి దానికే కాలం మారుతుందో తెలియదుగాని…” అంటూ వినిపిస్తున్న కథలలోని కథనం, ఒక సాహిత్య సార్వత్రికతను సొంతం చేసుకునే పత్రాలమీద సంతకాలు పెడుతోంది. ఆ ఎనుమును అంతదూరంలో తోలుకొని వస్తుండగానే ‘అది మా తాతయ్య ఎనుమే’ అంటూ పిల్లాడు ఎగురుతూ చరిచిన చప్పట్ల శబ్దం, రచయిత కలం శ్వాసను మోసుకొచ్చినట్లుగా వుంటుంది. ‘చెప్పుల్లేకుండా కాలేజీకి ఎలా వెళ్లేది? తనూ ఒక జత దొంగిలెస్తే!! ఎవరైనా గమనిస్తే! అమ్మో తలెత్తుకు తిరగ్గలనా?…’ అంటు పలకరించే మనుషుల మనస్తత్వ చిత్రపటాలు వందలకు, వందలు ఈ మట్టిమొగ్గల కథలనిండా వ్రేలాడుతున్నాయి.
ఈ కథల ప్రపంచంలోకి నాలుగు అడుగులు ముందుకేసి నిలబడ్డాను. “వారే అల్లుడా! పట్నం నుంచి మనుమడొచ్చాడు. వాడి అంగీ అట్ల వుతికి పెట్టప్పా…” అంటూ ‘మట్టిమొగ్గలు’ కథలో నల్లక్కవ్వ, చాకలి కొండయ్యతో పలికిన మాటల్లోని వరుసల బంధం, మానవసంబంధాల గుభాళింపుకు వింజామరలు వీచినట్లుగా వుంది. …’కన్నీళ్లు’ కథలో తోటపని చేయటానికి వచ్చిన అభాగ్యుడ్ని పరిచయం చేస్తూ… ‘ముడతలు పడిన నల్లని శరీరం, నెరసిన తల, మాసినగడ్డం, ఎముకలు, వాటికంటుకున్న ఎండిన చర్మం తప్ప ఆ శరీరంలో రక్తమాంసాలు ఉన్నట్లు తోచదు…’ ఇలా ఈ కథల సంపుటిలోని అన్ని పాత్రల పరిచయానికి ‘సహజత్వం’ తన కొలతలను సిద్ధం చేసుకున్నట్లుగా వుంటుంది. సీమలోని సాధారణ బ్రతుకులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లతో పాటు పల్లెతనాన్ని, ప్రకృతి లాలిత్యాన్ని రక్షించే, కోటలాంటి కానుగ తోపులు, భూమితల్లి హృదయం తడిని కాపాడే ఒండుమన్ను మేటలు, కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ఉత్తరంగా ప్రయాణించే పెన్నానది పలకరింపులు, వరినారుకోసం నీళ్లలో బాగా నానబెట్టి గోనె సంచుల్లో బిగదీసి వుంచిన వడ్లు, ఎనుములు, ఎద్దులు, గొర్రెలు, గుర్రాలు, మాగాణి భూముల్లో మాత్రమే పెరిగే సీకాయ తీగలు… ఒకటేమిటి! ఒక మనిషి జీవితంతో స్నేహం చేసిన క్షణాలన్నీ, అప్పటి సమాజ చరిత్రతో కలిసి ‘మట్టిమొగ్గలు’ సంపుటిలో అక్షరాలై, వాక్యాలై, చివరకు కథలుగా మారి, కాలాన్ని తన చిరునామాగా మార్చుకుని, కదిలి, కదిలిస్తూ, చదివేవారి కనురెప్పల మధ్య కన్నీరును ఊటలా ఉబికేలా చేస్తూ, కథల నిర్వచనానికి, ఒక నిఘంటవులా ఈ కథలు నిలిచిపోతున్నాయి.
ఈ సంపుటిలో చోటుచేసుకున్న సామాజిక కథల్లో అన్నీ సహజసిద్ధమైన సన్నివేశాలే. పాత్రలు, ఆ పాత్రల ఔచిత్యం, మనస్తత్వం…అన్నీ సరైన కొలతలతో కథా శిల్పానికి కట్టిన పట్టువస్త్రాల్లా మెరిసిపోతున్నాయి. అవ్వా, మనుమల అనుబంధాలే కాదు, ‘రైతులంటే పల్లెటూరి అనాగరికులని అందరూ అనుకోవచ్చు కానీ కొండారెడ్డిని చూస్తే మాకు మొక్కాలనిపించేది’ అంటూ… ‘పశువులు’ కథలో మూగజీవుల గుండెచప్పుడును స్పష్టంగా వినిపించాడు రచయిత. ‘విధ్వంస దృశ్యం’ కథనిండా కరువు, కాటకాల పాదముద్రలు కనిపిస్తే, ‘కన్నీళ్లు’ కథలో ‘కన్నీరే మీ మనసును తేలిక పరుస్తుందంటూ’ ఓదార్పు చేతుల స్పర్శ మనల్ని తాకుతోంది. దాదాపు రెండువందల గడపలున్న పల్లెలోని చేతివృత్తుల వారి కడగండ్లను, గుండెలు కరిగించేలా సాగిన కథ ‘ఇదీ కథ’. ఈ కథ చాలాకాలం మనల్ని వెంటాడుతూనే వుంటుంది. రైతుల జీవన పోరాటాలను వివరించే రైతు కథలనిండా అన్నీ వ్యధలే. పంట నిండుగా పండితే చాలు ‘జీవితం ధన్యమైపోయినట్లు భావించే రైతు, తిరిగి మట్టితల్లి గర్భంలో మానవ బీజమై చేరిపోయే దృశ్యాన్ని మేథావుల్ని సైతం ఆలోచింపజేసే రీతిలో చిత్రీకరించిన ‘రైతు హృదయం’ కథ, ఉన్నత ప్రమాణాల మెరుపులతో పాఠకుల మనసులను పులకరింప చేస్తోంది.
_____
సామాజిక బాధ్యతగా రచయిత అందించిన ‘పర్యావరణ కథలు’ మానవ కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ, రాబోయే ప్రమాదాల హెచ్చరికల్ని పాఠాలుగా బోధిస్తున్నాయి. పురాణాలలోని నందనవనం ఊహాగానాన్ని, వసంతం వస్తే చాలు నిజంచేసే ‘కానుగులపల్లె’, ఇప్పుడది ‘కొల్లబోయిన పల్లె’గా ఎందుకు మిగిలిపోయిందో వివరించిన ప్రయత్నంలో కాలుష్యం కారణంగా ‘కళ’ కోల్పోయిన వందలాది గ్రామాల నీడలు ఈ కథలో కన్నీరులో తడుస్తూ కనిపిస్తున్నాయి.
_____
రచయిత ఈ సంపుటి వేదికగా అందించిన ‘వ్యంగ్య, హాస్య’ కథలలో కేవలం నవ్వును తెప్పించే రాతలే కాదు, నవ్వులపాలు కాకుండా జీవితాలను నడిపించుకోగలిగిన నాణ్యమైన సూత్రాలు సైతం మనతో కరచాలనం చేస్తున్నాయి. కోకిల పాడినంత తియ్యగా ‘ప్రజల సహజ పదజాలంతో’ నడిచిన కథలనిండా సీమ మనుషుల గుండె చప్పుడు, నేరుగా గొంతులో నుండి మాటగా మారి వెలువడిన ప్రతి సందర్భం, ఆ ప్రాంత మాండలికాన్ని, ఆ చరిత్రను పల్లకీలో ఊరేగించిన దృశ్యాలకు పాఠకుడిగా తలవంచి నమస్కారం చేస్తున్నాను. కవిత్వీకరించిన రచనల క్రింద అందించిన ‘కవిత్వం’ మరియు ‘అంతరం’ రచనలు, రచయిత సామర్థ్య వైభవాన్ని తివాచీలమీద సగౌరవంగా నడిపించినట్లుగా వుంది.
దాదాపు 460 పేజీలతో వెలువడిన సడ్లపల్లె చిదంబరరెడ్డి ‘మట్టిమొగ్గలు’ సంపుటిలోని కథలన్నీ సాహితీ సౌరభాలే. తెలుగునేల సగౌరవంగా గర్వించదగ్గ సాహిత్య సంపద ఈ సంపుటి. కథల్లో మనుషుల మనస్తత్వాలు, జీవితాలే కాదు, గడిచిపోయిన ఆ ప్రాంత చరిత్ర ఆనవాళ్లు, మన చేతి వ్రేళ్లను పట్టుకుని నడిపిస్తున్నాయి. ప్రతి కథలోనూ రచయిత జీవితం, అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు తొంగిచూస్తూనే వున్నాయి. సుదీర్ఘమైన జీవిత సారాన్ని, సారవంతమైన కథలుగా పండించిన సీమ రచయిత చిదంబరరెడ్డి కృషికి, సమస్త సాహితీలోకం తరుపున హృదయపూర్వక అభినందనలు అందజేస్తున్నాను.
-డాక్టర్ కె.జి. వేణు,
98480 70084