నేటి తరం ప్రతినిధి రేవంత్

తెలంగాణ

చంద్రబాబు మారాలి
యం.వి.రామారావు/ప్రత్యేక ప్రతినిధి
విభజన చర్చల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అచ్చం నేటి తరం ప్రతినిధిగా ప్రవర్తించాడు.వారిద్దరూ గతంలో సన్నిహితులైనా రేవంత్ ప్రొటోకాల్ వరకూ పాటించి,అనంతరం రోమ్ లో రోమన్ లా ప్రవర్తించడం విశేషం. పాతతరం చంద్రబాబు మరింత మారాల్సిఉందని మొన్నటి సీఎంల సమావేశంతో వెల్లడయింది. సీఎంల సమావేశం తరువాత ఎక్కువగా రేవంత్ డిమాండ్లే పత్రికల్లో వచ్చాయి.బాబుకు రేవంత్ కాళోజి పుస్తకం ఇచ్చి ‘వంగతోట కాడ బావ కాదని ‘ చెప్పకనే చెప్పాడు. చర్చల్లో స్థిరాస్తుల విషయంలో రాజీ లేదనే చెప్పారు.తీసుకున్న భద్రాచలం మండలంలోని ఐదుగ్రామాలను ఏపీ వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసారు.గతంలో అసెంబ్లీలో విశాఖ ఉక్కు ఉమ్మడి ఆస్తియని,కడపలో స్థలం ఇస్తే సోలార్ ఉత్పత్తి చేసుకుంటామని ప్రకటించడం గమనార్హం.చంద్రబాబు చర్చల్లో నాగార్జునసాగర్ విషయం శ్రీశైలం విద్యుత్ ప్రస్తావించపోవడంపై వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆవేవి ప్రస్తావించక తెలుగురాష్ట్రాలు చల్లగా ఉండాలని రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లని బాబు అనడం గమనార్హం. ఆయన తెలంగాణ మీద ప్రేమను వదులుకోలేకపోతున్నారని ఆయన మాటల వల్ల అర్ధమవుతున్నది. ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పుడు బాబు హైటెక్ సిటీకి అంకురార్పణ చేయడం,ఐటీ కంపెనీలను ఆహ్వానించడం నిజమే కావచ్చు. కాని నేడు రాష్ట్రం విడిపోయింది.మనం ఉద్యోగం చేసే ఊరు మారినప్పుడు ఆ ఊరితో ఉన్న అనుబంధం తలచుకుని బాధపడతాం. ఆ తరువాత కొంతకాలానికి ప్రస్తుతమున్న ప్రదేశంతో కొత్తగా అనుబంధం పెంచుకుంటాం. అలాగే రాష్ట్రాలు విడిపోయిన తరువాత దాన్ని మధురస్మృతిగా ఉంచుకోవాలి. కాని బాబు గత రెండురోజుల హైదరాబాద్ పర్యటనలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లి మళ్లీ తెలంగాణలో టీడీపీకి మంచిరోజులు వస్తాయని అనడం సందర్భోచితంగా లేదు. అంత ప్రేమ,నమ్మకం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయమని నాయకులు,కార్యకర్తలు అడిగితే ఎందుకు పోటీ చేయలేదనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆనాడు కేసీఆర్ ఓడిపోవాలని,ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని బాబు తీసుకున్న నిర్ణయం మంచిదే కావచ్చు.కాని నేడు ఏపీ సీఎంగా ఆయనమీద గురుతర బాధ్యత ఉంది.దాన్ని మరవరాదు. కేవలం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.అప్పుడే ఆయన,పార్టీ అస్థిత్వం నిలుస్తుంది.పక్క చూపులు,ఇతర వ్యవహారాలు లాభించవు. లేకపోతే 2019లో జరిగినదే పునరావృత్తం అవుతుంది.ఇప్పటికే జగన్ అవకాశం కోసం కాచుకొని ఉన్నాడు.జగన్ కు 39శాతం ప్రజల మద్దతు ఉందని మరవరాదు. ఇప్పటికీ జగన్ మద్దతుదారులు,సానుభూతిపరులు చాలామంది కాచుకుని ఉన్నారు.వీటన్నిటి నేపథ్యంలో బాబుకు రాష్ట్రం మినహా మరో ఆలోచన కలలో కూడా రాకూడదు.విభజన చర్చల్లో పట్టువిడుపు ఉండాలి.తన కున్న అనుభవంతో రేవంత్ తో సామరస్యపూరకంగా పరిష్కరించుకోవాలి. 40ఏళ్ల అనుభవం ఉన్న చాణిక్యుడు బయటకు వచ్చి ఈ చర్చలు ఫలించేలా చేసి మరోసారి ఆ క్రెడిట్ దక్కించుకోవాలి. దానిమీదే దృష్టి పెడితే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *