రోహిత్‌-కోహ్లి రికార్డులు బ్రేక్‌!

క్రీడలు

జింబాబ్వే పర్యటనలో భారత్‌ ఘనంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన టీమిండియా రెండో టీ20లో పంజా విసిరింది. 100 పరుగుల తేడాతో జింబాబ్వేను శుభ్‌మన్‌ గిల్‌ బృందం చిత్తుగా ఓడిరచింది. ఆల్‌రౌండ్‌షోతో సత్తాచాటింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (100బీ 47 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. శుభ్‌మన్‌ గిల్‌ (77 నాటౌట్‌బీ 47 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్‌), రింకూ సింగ్‌ (48 నాటౌట్‌బీ 22 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) సత్తాచాటారు. అభిషేక్‌తో కలిసి రుతురాజ్‌ 137 పరుగులు, రింకూతో కలిసి 87 పరుగుల భారీ భాగస్వామ్యాల్ని నెలకొల్పాడు. అనంతరం ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ వెస్లీ మధెవెర్‌ (43బీ 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌. ముకేశ్‌ కుమార్‌ (3/37), అవేశ్‌ ఖాన్‌ (3/15) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. రవి బిష్ణోయ్‌ (2/11) రెండు, సుందర్‌ (1/28) ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా, తొలి టీ20లో డకౌటైన రింకూ సింగ్‌ ఈ మ్యాచ్‌లో సత్తాచాటి పలు రికార్డులు బద్దలుకొట్టాడు.
14వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన రింకూ ఫినిషర్‌గా మరోసారి నిరూపించుకున్నాడు. 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఆఖరి 20వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ క్రమంలో తన స్ట్రైక్‌రేటును మెరుగుపర్చుకున్న రింకూ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 16 నుంచి 20 ఓవర్ల మధ్య కనీసం 250 పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో అత్యధిక స్ట్రైక్‌ రేటు సాధించిన రెండో ప్లేయర్‌ రింకూ ఘనత సాధించాడు. రోహిత్‌, కోహ్లి స్ట్రైక్‌రేటు అధిగమించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ 228.81 స్ట్రైక్‌రేటుతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో రింకూ సింగ్‌ (221.55), రోహిత్‌ శర్మ (201.51), విరాట్‌ కోహ్లి (192.54), యువరాజ్‌ సింగ్‌ (179.81) ఉన్నారు. ఇక ఆఖరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో రింకూ నాలుగోస్థానంలో నిలిచాడు. హార్దిక్‌ పాండ్య (32 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (24), ఎంఎస్‌ ధోనీ (19), రింకూ సింగ్‌ (17) సిక్సర్లు బాదారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *