సాహితీ సారధి – దాశరధి

సాహిత్యం

సాహిత్యానికి పెద్ద పీట వేసి, కీర్తి శిఖరం మీద కూర్చోపెట్టి, తనదైన శైలిలో కవిత్వాన్ని సృజియించిన సాహితీ సారధి దాశరధి యొక్క ఘనతను ఏమని వివరించాలి. ఏమని పొగడాలి? కవిత్వానికి అవధులు లేవంటూ పులుగు, పువ్వు, సముద్రగర్భం లోతు, సాయం సంధ్యా సమయపు ఆహ్లాదం ఇలా దేనినీ విడవకుండా అన్నీ కవిత్వానికి అర్హులే అన్నట్టు కొనియాడిన సాహిత్య వారధి.. దాశరధి. అభ్యుదయ కవి, ఆంధ్రకవితా సారధి బిరుదాంకితుడిని ఏ పదాలతో స్తుతించగలం. అభ్యుదయ, భావ, ప్రాచీన కవిత్వ కేసరి. మహబూబ్ నగర్ జిల్లాలో చిన్న గూడూరులో జన్మించి, సాహిత్యానికి పెద్ద పీట వేసిన సాహిత్యనిధి దాశరధి. 1925 సం.లో జులై 22వ తేదీన జన్మించారు. భాషలు ఎన్ని నేర్చినా మాతృభాష తెలుగుపై మక్కువ ఎక్కువ. అనన్య సామాన్యమైన భాషా సాధికారత ఆయన సొంతం. ధిక్కార స్వరానికి, కలానికి చెరగని చిహ్నం. నా తెలంగాణా కోటి రతనాల వీణ అంటూ గొంతెత్తి చాటి, అగ్నిధారలను కురిపించిన రవి.. దాశరధి. తెలంగాణా ప్రజల వ్యధ, కన్నీటిని కలంతో ప్రపంచానికి అందించిన మానవతావాది. పదాలను సూటిగా ప్రయోగిస్తూ అనంతమైన అర్ధాన్ని అందించటంలో దిట్ట. జన హృదయాల భావన, ఆర్తి దాశరధికి మాత్రమే సాధ్యం. తెలంగాణ సాహిత్యంలో చెరగని ముద్ర…. దాశరధి. గడచిన కాలాన్ని స్మృతికి తెచ్చుకుంటూ ‘ఆనందవిషాదాలంటూ, శృంగారము, వీర రసాలు రెండూ తన హృదయాన్ని పొంగిస్తాయం’టూ ఆనందానుభూతిని ప్రకటించారు. ఆయన సమస్త సాహితీ ప్రక్రియలలో ఇదే ఒరవడి దృగ్గోచరమవుతుంది అనటం అతిశయోక్తి కాదు.

వైవిద్యభరితమైన కవితా వస్తువులతో కథలు రాయడం, నాటికలు రచించడం మరియు వందకు పైగా చిత్రాలు గీతాలు రచన ఆయన బహుముఖీనత్వానికి నిదర్శనం.తన అక్షరాలతో మాలలు కట్టి కవిత్వాన్ని అందలం ఎక్కించడం ఈయన ఘనతగా చెప్పవచ్చు. కలంతో ఉద్యమ కవిత్వం ఉద్రేకముతో ప్రవహింప జేసినా, హృదయములో భక్తితో కూడా రసజ్ఞత ప్రవహింప చేయడం ఇతని ప్రత్యేకత. ప్రతీ గేయం శ్రోతల మదిలో చెరగని ముద్రవేసింది. “నడిరేయి ఏ జాములో” అంటూ ఓ పేద భక్తురాలి ఆవేదన, ఆర్తిని కళ్ళకు కట్టినట్టు కర్ణపేయం, కనులకు దృశ్యమానం చేశారు దాశరధి. ప్రశ్నించే తత్వం అతని వ్యక్తిత్వం. కాలాన్ని కట్టిపడేసే మధుర గీతాలను ఎన్నింటినో రాసి చెరగని ముద్రను వేసి సినీ అభిమానులు మన్ననలను అందుకున్నారు. ఖుషీఖుషీగా నవ్వుతూ, ఆవేశం రావాలి.. ఆవేదన కావాలి.. ఇలా ఎన్నో గేయాలకు ప్రాణం పోసారు . పాఠకుడి మదిలో నిలిచి పోయారు. ‘ఆ చల్లని సముద్ర గర్భము’ అనే గీతములో లేవనెత్తిన ప్రశ్నలు దశాబ్దాలు గడిచినా సమాధానాలు లేని ప్రశ్నలుగా నేటికీ మిగిలిపోయాయి. ఇదో విషాదం. నాటి, నేటి సమాజ పాలనా వికృతికి నిదర్శనం. దాశరధి చిరస్మరణీయుడు.

(జూలై 22 దాశరథి గారి 99వ జన్మదినం)

యం. లక్ష్మి
రామచంద్రపురం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *