ఆశలను చిగురించే సరికొత్త పదాల పలకరింపుల ‘సామభేద’

సాహిత్యం హోమ్

కాలంతో పాటు మానవ సమాజంలో వస్తున్న గణనీయమైన మార్పులు వర్తమాన కవుల అభివ్యక్తుల్లో చోటు చేసుకుంటాయి. సంక్లిష్టమైన జీవనయానంలోని అమానవీయమైన కోణాలను, జీవన్మరణ పోరాటాలను, సాహిత్యంలో వినూత్నంగా వెల్లడించడానికి సృజనకారులు ప్రయత్నిస్తుంటారు. కళ్ళ ముందు దృశ్యమానమవుతున్న విభిన్న సంఘటనల పూర్వాపరాల నేపథ్యాల నుండి రాయాలనే తపన వారిని నిలువనీయదు. ఆశలను చిగురించే సరికొత్త పదాల పలకరింపుల కవితా పాదాలు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. సున్నితమైన భావాలను, సమరశీలమైన దృక్పథాన్ని, ఒక కన్నతల్లి ప్రేమను, గతి తప్పిన జీవితాలకి గురి తప్పని కవితా వాక్యాలను ‘సామభేద’ కవితా సంపుటి ద్వారా కవయిత్రి ఫణిమాధవి కన్నోజు వెల్లడిస్తున్నారు.

__________

‘ఈ దుఃఖం ఏ కాలికో చేతికో తగిలే గాయం వల్ల పుట్టింది కాదు. మనుషుల్ని చూసి పుడుతున్న దుఖం. పిల్లల పట్ల అమానుషాల్ని చూసి ఆర్ద్రతతో పొంగే దుఃఖం. స్త్రీలపట్ల విలువలేని తనం చూసి ఆక్రందనై అరచే దుఃఖం. పౌరుల పట్ల కనీస బాధ్యత మరిచే స్వార్ధ రాజకీయాల హంగామా చూసి ఆవేశమై పారే దుఃఖం. ప్రజాస్వామ్యం స్వభావం మరుగవడం పట్ల దుఃఖం. ఇవన్నీ తెలిసి ఇంట్లో టీవీ ముందు రిమోట్ పట్టుకొని మార్చిమార్చి వార్తలు చూస్తూ నిస్త్రాణగా కూర్చోవడం పట్ల మరింత దుఃఖం. ఈ గాయాలకు నీ నా భేదం లేదు. ప్రపంచమంతటి గాయాలు మనవే’ అంటూ ఆమె రాసుకున్న ఈ వాక్యాలు ఈ కవితా సంపుటి నేపథ్యాన్ని తెలుపుతున్నాయి. ఈ సంపుటిలోని 73 కవితలు ఒక్కొక్కటి ఒక్కొక్క దుఃఖానికి వ్యక్తీకరణగా నిలిచాయి. ప్రతి కవితా వస్తువులో మానవీయమైన తడి స్పర్శిస్తున్నది. ఒక తండ్లాట కనిపిస్తున్నది. జీవితం పట్ల అపారమైన తల్లి ప్రేమ కనిపిస్తున్నది.

_____________

ఎవరి గురించైనా వ్యాఖ్యానం చేసేటప్పుడు వారి చుట్టూ అల్లుకున్న పరిస్థితులను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. మనిషికి మనిషికి భిన్నమైన ఆలోచనలు ఉన్నట్టుగానే, కవికి కవికి మధ్యన వ్యక్తపరిచే భావాల తీరు విభిన్నంగానే ఉంటుంది. మనం చూసే దృష్టితోటే వాళ్ల దృక్పథమేమిటో అవగతమవుతుంది. ‘వెలుగు’ అనే కవిత ద్వారా జీవితంలో నీ స్థానం ఎక్కడ ఉంటుందో అని తెలుసుకోమంటున్నారు కవయిత్రి. ఈ కవితా వాక్యాలను ఒకసారి పఠిస్తే చాలు మనకు అర్థమైపోతుంది. నీకు సరైన చూపు కావాలంటే నీ చుట్టూవున్న కిటికీ అద్దాలను పగలగొట్టాల్సిందేనని అంటున్నారు.

నీ జీవితం ఎక్కడ ఉందో
ఆ స్థానం నుంచే నిలబడి
చుట్టూ నువ్వు మాట్లాడతావు
ఆ స్థానం నుంచే
అవసరమైతే
ఆ కిటికీని బద్దలు కొడతావు..

నువ్వు ప్రశ్నిస్తున్నావంటే ఆలోచిస్తున్నావు అన్నమాట. ఆలోచనలు ఒక దగ్గర ఉండనీయవు. అన్యాయాలపై, దుర్మార్గాలపై, అణచివేతలపై, అత్యాచారాలపై నిలదీయకుండా ఉండలేవు. అందుకే ప్రశ్నించే వారిని సాధ్యమైనంతవరకు నిరుత్సాహ పరుస్తూనే ఉంటారు, మన అనుకున్న వాళ్ళందరూ. అందుకని ఎవరు సహకరించినా సహకరించకపోయినా ధైర్యంగా కలంతో ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తుంటారు కవులు. కవి అంటేనే ధైర్యానికి బహువచనం. ‘హౌను నేను ఖండించాలి అనుకుంటున్నా’ కవితలో ఆమె తన నిర్ణయానికి కుటుంబం నుండే మద్దతు దొరకదని తెలిసి కూడా ప్రశ్నించడాన్ని మానుకోనని సాహసంగా ప్రకటిస్తున్న కవయిత్రితో మనం కూడా కలిసి నడుద్దాం. అన్యాయాన్ని నిలదీద్దాం.

నాకు తెలుసు/ఈ మాటలు విని ముందు నా ఇంటి నుంచే నాకు వ్యతిరేకత మొదలవ్వచ్చు/మా అమ్మే ఫోన్ చేసి/నీకెందుకే ఇవన్నీ/ నీ సంసారం నువ్వు చూసుకోక అనొచ్చు/నాకు అత్యంత సన్నిహితులు శ్రేయోభిలాషులే/నా క్షేమం కోరి నన్ను మందలించవచ్చు/ నువ్వేం చేయగలవు/నువ్వు ప్రశ్నించడంతో అంతా మారిపోతుందా జాగ్రత్త అని’

నవ మోసాలు మోసి, పురిటి నొప్పులను భరించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఆ బిడ్డ జీవితం మధ్యలోనే రాలిపోతే ఆ తల్లి దుఃఖం వర్ణనాతీతం. ఆ కన్నతల్లి మనసు ఆ బిడ్డ చుట్టూనే తిరుగుతుంది. ఆ జ్ఞాపకాల సుడిలో తిరుగుతూ తనను తాను మరిచిపోతుంది. ప్రతిక్షణం ఆ బిడ్డ చేతలు, మాటలు దృశ్యమానమవుతుంటే ఆగని కన్నీళ్లతో ఆ తల్లి అనంతమైన ఆవేదనను అనుభవిస్తుంది. ఫణి మాధవి ఆ బాధను అనుభవించారు. నెమ్మది నెమ్మదిగా ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ అక్షరాల్లో బంధించారు. భౌతికంగా ఆ బిడ్డ తన ముందు లేకపోయినా ఆమెతో గడిపిన క్షణాలను ‘జ్ఞాపకాల జాబిలి నవ్వు’ కవిత ద్వారా ఈశ్వర స్నిగ్ధను సజీవం చేశారు. ఒక భయంకరమైన ప్రళయకాల తుఫాను ప్రకృతిని ధ్వంసం చేసినట్టుగా అకాల మరణం కూడా మనిషిని నిలువెల్లా ధ్వంసం చేసిపోతుంది. ఆ బిడ్డ తిరుగాడిన ప్రతి చోటును తలుచుకొని తల్లడిల్లిపోతుంది, తల్లి మనసు. అందుకే ఈ కవిత చదువుతున్నంత సేపు కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు. చివరికి నువ్వు చిరంజీవి అని తన బిడ్డపైనున్న అజరామరమైన తల్లి ప్రేమకు నీరాజనంగా ఈ కవిత నిలిచింది.

‘ఏ రూపుల్లోనున్నావో/ఏ గాలుల్లో కలిశావో అపుడపుడూ/బొజ్జలో కదులాడుతూనో కళ్ళనుండి దుంకుతూనో/అల్లరల్లరి చేస్తుంటావ్/వెళ్ళీ ఉన్నట్లుంటూ నువ్వు/ఉండి లేనట్టుంటూ నేను/ఇన్నాళ్ళంటూ నువ్ లేని తనాన్ని లెక్కించే /వృథా ప్రయాసలే కానీ/ నీ జ్ఞాపకాల/జాబిలి ఉదయించని క్షణమేదీ/నా పెదవిపై చిరునవ్వై/నువ్వు చిరంజీవివే కదా బిడ్డా!!’

_____________

మన చుట్టూ ఉన్న సమాజమెప్పుడు మనం అనుకున్నట్లుగా ఉండదు. కులాల, మతాల, ప్రాంతాల వంటి గొడవల పట్టింపులతో అల్లకల్లోలంగా ఉంటుంది. అందరూ సమానమే అయినా ప్రతి దానికి కొన్ని కొలమానాలు ఉన్నట్లుగా ఇక్కడ కులమానాలు, మతమానాలు, ప్రాంతమానాలు ఉంటాయి. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టినట్టుగా ఈ కులాల మతాల పట్టింపులతో జీవితాల్ని సర్వనాశనం చేస్తున్న వాళ్లకు ప్రత్యేకమైన వ్యాక్సిన్ కనిపెట్టాలని బలంగా కోరుకుంటున్నారు కవయిత్రి. మనం కోరుకోవాల్సింది స్వచ్ఛమైన సమాజాన్ని కదా. అందుకు నిదర్శనమే ‘ఓ వ్యాక్సిన్ కావాలి ‘ కవిత. ఈ కవితా పాదాలను ఒకసారి చదివితే ఆమెతో మనం ఏకీభవించకుండా ఉండలేము.

______________

‘మానవత్వాన్ని పరీక్ష నాళికలో పెట్టి/శాశ్వతంగా రూపుమాపే పనిలో/ ప్రభువులంతా తలమునకలై ఉన్నారు/ఇదే సరైన తరుణం/ ఈలోగా/మనమంతా
ఏ మౌఢ్యమూ దరిచేరనివ్వని/సౌభ్రాతృత్వపు వ్యాక్సిన్ వేసేసుకోవాలి/ఏ కార్పణ్యాల కత్తులు తెంపలేని మానవహారాలమవాలి’

మనం ఎంత కాదనుకున్నా కొన్ని సంఘటనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనుకున్నట్లుగానే, దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయనకు ఒక దగ్గర మాత్రమే ప్రత్యేకమైన స్థానాన్ని ఎందుకు ఇవ్వాలి?. జనన మరణాలకు అతీతుడు కదా. ఆ చోటునే ఎందుకు తనదని పూజలు చేయాలి. దీని వెనుక ఉన్న రాజకీయ పరమార్ధాలు ఏమిటి. మనందరికీ తెలిసిన విషయమే. భక్తి భావజాలంతో మెజార్టీ ప్రజల మనోభావాలను రక్షిస్తున్నామని చెప్పుకునే రాజకీయంలో ఒక మసీద్ కాలగర్భంలో కలిసిపోయింది. ఒక మసీదు కూల్చి దాని స్థానంలో దేవుడిని ప్రతిష్టించి పూజలు చేయడం తదితర అంశాల నేపథ్యంతో రాసిన కవితనే ‘యాదృచ్ఛికం’. దాని వెనుక జరుగుతున్న మారణహోమాన్ని నిరసిస్తున్న కవిత ఇది.

కలడో లేడో/ కలదో లేదో/కలయో నిజమో/ కలయే తప్ప నిజం కాదో/ దేశమంతా కమ్మిన/ సుదీర్ఘ చీకటిలో బలవంతపు/ దీర్ఘ రాత్రి మైకంలో యాదృచ్ఛికపు కల/ఒకప్పుడీ దేశాన/న్యాయాలయాలుండేవిట!?/ఇంతకీ/శవాల గుట్టలపై నిర్మాణానికి నిఘంటువులో/సమాధి అనే అర్థమేగా!? రేపు/అక్కడ జరగబోయే పూజలన్నీ స్మృత్యంజలులేగా!?’

మనది అచ్చమైన వ్యవసాయక దేశం. రైతు కష్టపడితేనే మనకు ఇంత ఆకలి తీరుతుంది. ఆ రైతు ఆకలిని తీర్చవలసిన ఈ దేశ పాలకులు అతనిని మరింత అగాధంలోకి నెట్టి వేస్తున్నారు. మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నడిపిన ఉద్యమానికి మద్దతుగా రాసిన కవిత ‘అన్న ముద్దులు అగ్గికొండలవుతున్నాయ్ ‘.

కాదేది కార్పోరేటర్పణకు అనర్హం అంటూ
వాణిజ్య సామ్రాజ్య విస్తరణకు మట్టినర్పిస్తున్నవ్
కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు
నీ కుర్చీ కింది నేల గుంజుకుంటున్నావ్
బిడ్డ జాగ్రత్తా!!
కలుపు తీసిన చేతులు కొడవళ్ళయితున్నయ్!!
పంటచేలన్నీ పిడికిళ్ళవుతున్నయ్!!

ఈ కవితా సంపుటిలో ‘ అక్షయపాత్ర, యోధ, మనుసుల్లెక్క బతకనియ్యరాదె, కొన్ని నవ్వులు ఒక నేను, చైతన్య స్వప్నం, అంతం కాదిది ఆరంభము కాదు, వెన్ను చూపకు’ వంటి కవితలు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి. సుప్రసిద్ధులైన సాహితీవేత్తలు నగ్నముని, శిలాలోలిత, కవి యాకూబ్, వంశీకృష్ణల ముందు మాటలు అర్థవంతంగా వున్నాయి. శోకం నుండి శ్లోకం పుట్టి తొలి కావ్యం ఆవిర్భవించినట్లుగా ఫణి మాధవి కన్నోజు కవిత్వం కూడా దుఃఖం నుండే వెలువడింది. ఆర్తితో వినిపిస్తున్న ఈ కవిత్వాన్ని అందరం చదవదగినది.

– గోపగాని రవీందర్
94409 79882

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *