సమరోత్సాహపు శరాలు కంచరాన కవిత్వాక్షరాలు

సాహిత్యం

ప్రకృతిలోని పుట్టా, చెట్టూ, కొండ, లోయ, నది మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. వాటి సౌందర్యాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని పోలికలతో విడమర్చి చెప్పిన కూడా ఇంకా కొన్ని మాటలను వినాలని అనిపిస్తుంది. వాటితో మనకు విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. కవి కూడా అంతే. తన కవిత్వం ద్వారా అనుభవంలోకి వచ్చిన ప్రతి అనుభూతిని అక్షరమయం చేస్తాడు. ఒక కవితగా రూపుదిద్దుకున్నాక కూడా మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. ఒక పట్టాన అతనికి సంతృప్తి కలగదు. తిరిగిన దారే కావచ్చు, చదివిన వాక్యమే కావచ్చు, తనతో మమేకమైన ప్రతి అనుభవసారాన్ని కవిత్వమయం చేస్తాడు.ఆ వాక్యాల వెంట మనమంతా ఎంతో ఆత్రుతతో పరిగెడుతుంటాం.ఎన్నో అనుభూతులకు లోనవుతుంటాం.మనల్ని కుదురుగా కూర్చోనివ్వవు. విషాదకరపు దుఃఖాలతో విలవిల్లాడుతుంటాము. గడిచిన జీవితపు అంతర్ బాహిర్లోకాల సమన్వయమే కవిత్వం.

‘నాగలి వెంట నడిచే కవిని నేను’ అని ప్రకటించుకున్న కంచరాన భుజంగరావు కవిత్వం మనల్ని ఒకచోట కుదురుగా కూర్చోనివ్వదు. గత రెండు దశాబ్దాల ఉత్తరాంధ్ర జీవితమే కాదు కష్టజీవుల బతుకు చిత్రానికి అద్దం పడుతూ ‘నీటి గింజల పంట’ పేరుతో కవితా సంపుటిని వెలువరించారు. వర్తమాన సామాజిక అంశాలను అధ్యయనం చేస్తు తనదైన దృష్టి కోణం నుంచి రాసిన 59 కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. ప్రతి కవితలోని మానవీయమైన దృక్పథం మనల్ని ఆకట్టుకుంటుంది. ఒక యువకవి అంతరంగ సవ్వడులను జాగ్రతగా వినాలి. ‘స్వప్నాల కుండపోత నా కవిత్వం’ అంటున్న కవితో కరచాలనం చేద్దాం.

ఆదిమానవుని కాలం నుండి నేటి అంతర్జాల మానవుని వరకు అడవితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. అడవిలో తిరిగినప్పుడల్లా ఒక కొత్త జీవితానికి ఊపిరి పోస్తుందని కవి ఆశాభావం వ్యక్తం చేస్తుంటాడు. ‘పచ్చందనాల పిలుపు’ లోని ఈ కవితా పాదాలు చదువుతుంటే మనకు ఒక్కసారైనా అడవిని చూడాలనిపిస్తుంది.

‘అడవిలో ఆరారా తిరిగి రావాలి గాని/ఒళ్ళంతా సరికొత్త చివురింత/ అడవిలో నడవడమంటే /నాలోకి నేను నడిచి వెళ్ళడమే!/వనంలో తిరగడమంటే /చూపులతడి గెలుచుకోవడమే!/ చెట్లమధ్యకలా సాగిపోవడమంటే /గుండె పొలంలో కొత్త చేను నాటుకోవడమే!/ ఎక్కడ ఏ ప్రత్యేకత దాగుందో కానీ/చెట్టు దాటి మరో చెట్టును చేరేసరికి /అడుగులు తేలికవుతాయి/ లోయ దాటి మరో లోయను చేరేసరికి /మనసు కొత్త జీవమై మొలకెత్తుతుంది/ ఎక్కడెక్కడి పక్షులో కువకువ గింజల్ని చల్లి/అద్భుత వర్ణాలై అడవికి రెక్కలు తొడగడం చూస్తే/నేనో కొత్త మనిషినౌవుతాను’

కవి కలల ప్రపంచం విభిన్నమైనది. కొందరు ఆ పద్మవ్యూహంలోనే చిక్కుకుపోయి విలవిల్లాడి పోతారు. కొందరు తమదైన వ్యూహాలను రచించుకొని తప్పించుకుంటారు. సమాజమెప్పుడూ గెలిచిన వారి మాటకే విలువనిస్తుంది. ఓడిపోయిన వాని అనుభవాలను పట్టించుకోదు.అందరం ఒకే ప్రాంతంలో జీవిస్తున్నప్పటికీ ఎవరి ఆశయాలు వారికి ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడమే ముఖ్యం.
____________
కాలమెంతగా కాటేసినా తన పనితనాన్ని వదులుకోడు రైతు. భూమికి రైతుకు అవినాభావ సంబంధం. భూమి రైతును ప్రేమిస్తుంది. రైతు భూమిని ప్రేమిస్తాడు. వారిద్దరి మధ్య నిత్యం మాటల యుద్ధం రగులుతూనే ఉంటుంది. ఓటమిని ఎవరూ ఒప్పుకోరు. ప్రయత్నాలు మాత్రం విడువరు. ఒక్కోసారి రైతు విజయం సాధించవచ్చు. ఒక్కోసారి భూమి విజయం సాధించవచ్చు. నేలను నమ్ముకున్న రైతు నేలను అమ్ముకోడు. రైతు స్పర్శ లేని నేల పచ్చదనంగా ఉండలేదు.ఈ విషయం కంచరానకు తెలుసు. అందుకే ఇలా అంటున్నారు.
____________

‘మనసున్న మన్ను/మనిషిపై చిలికే మమత గురించి’ నాకు తెలుసు అంటున్నారు. ఒక వైవిద్యభరితమైన సమాజాన్ని ప్రభావితం చేయడానికి అనువుగా ‘ఉదాహరణనౌతా’ అంటున్నా ఈ కవితా పాదాలను ఒకసారి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుందాం.

‘పరిశీలించిన ప్రతి చోటా.. /పరిశోధించిన ప్రతిసారీ../బ్రతుకు భూమిక మట్టేనన్న గ్రహింపుకొస్తాను/ఏ నాగరికతల వికాస వేదికైనా మన్నేనని/నిరంతరాయంగా ఎలుగెత్తుతాను/తడిస్పర్శకు పులకల మొలకయ్యే తల్లితనానికి/నన్ను నేను ఒక ఉదాహరణగా మలుచుకుంటాను’

మనం జీవిస్తున్న సమాజాన్ని గురించి, ఎప్పటికప్పుడు దాన్ని పోకడల గురించి వివేచనాత్మకమైన అభిప్రాయాలతో తను రాసిన రచనల ద్వారా వ్యక్తం చేసేవారు కవులు,రచయితలు. ఒక స్పష్టమైన భావజాలంతో సామాజిక పరమైన చైతన్యాన్ని అందించే రచనలు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తాయి. కాలాన్ని తట్టుకొని నిలబడ్డ రచనలు కొత్త తరాలకు ఊపిరి పోస్తుంటాయి. అందుకనే ఈరోజు కవులు, రచయితల మీద గురుతరమైన బాధ్యతలున్నాయి. సమాజాన్ని తప్పుదోవ పట్టించే రచనలు కాలగర్భంలో కలిసిపోతాయి.

పీడనను ధిక్కరించి, ప్రజాస్వామిక విలువలకు పట్టం కడుతున్న కవుల, రచయితల గురించి కంచరాన ‘వ్యూహాత్మక వ్యాక్యాలు’ పేరుతో అర్థవంతమైన కవితను రాసారు. ఈ కవితలోని ఒక్కొక్క కవితా పాదం చదువుతుంటే సమాజ నిర్మాణంలో కవులు రచయితల యొక్క ప్రాముఖ్యతను బోధపరుస్తుంది. పాలకవర్గాలకు లొంగిపోకూడదనే హెచ్చరికను కూడా నర్మగర్భంగా వ్యక్తం చేస్తాడు కవి. కవి అంటేనే ఒక అనధికార శాసనకర్త అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఈ కవిత ద్వారా చెప్పకనే చెప్తున్నారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నవతరానికి ఒక ప్రబోధ గీతంలా అందిస్తున్నారు. కీర్తికోసమో, సంపదల కోసమో భావాలను తాకట్టు పెట్టొద్దని కోరుకుంటున్నాడు కవి.

‘కోట్ల పుటల పుస్తకంలో వ్యూహాత్మక వాక్యాలు మీరు/దేశ సార్వభౌమత్వ ప్రతీకలు మీరు/సరిహద్దులు కాచే సాయుధులు మీరు వీరిని మనం కవులు రచయితలని పిలుచుకుంటాం/వీరి వెన్నెముకలు ఎంత నిటారుగా ఉంటే/మనకంత స్వేచ్ఛ ఉన్నట్టు!

ఉత్తరాంధ్ర ఉద్యమాలతో ఎరుపెక్కిన ప్రాంతం. ఆదివాసి గిరిజన తెగల ప్రజలు భూమికోసం భుక్తి కోసం పాల్గొన్న చారిత్రాత్మకమైన ఉద్యమాలు కొత్త చూపునిచ్చాయి. ఉత్తరాంధ్ర నుండి వెలువడిన సాహిత్యం అత్యంత ప్రతిభావంతమైనది. కవిత్వంలో గాని కథల్లో గాని నవలల్లో గాని పోరాటపు ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి. కంచరాన కవిత్వంలో ఆ పోరాటాల స్ఫూర్తి, ఆ ప్రజల జీవితాల్లోని ఆర్తి మనల్ని ఆకట్టుకుంటుంది. ‘పెదవులు పగిలిన పొలాల నోటి వెంట/భళ్ళున కారే నాగలి రక్తం/ఇక్కడొక తెరిపిలేని దుఃఖం దాఖలా’.. అంటూనే ‘నాగధార రెప్పల కిందున్న/నీటి గింజల పంటకు/బొడ్డుపేగు తెగ్గోస్తున్న/ఇసుక పూల జిగటలో/మా పేద రంగు బతుకు/సుంకం లేని ఒక ఎగుమతి సరుకు’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కవి.

ఒక్కొక్కసారి కరువు లేదా అతివృష్టి వల్ల సర్వం కోల్పోతున్న ప్రజల దుస్థితికి అద్దం పడుతున్న కవిత ఇది. ఒకవైపు ప్రకృతి కన్నెర్ర మరొకవైపు పాలకుల దుర్నీతి విధానాల వల్ల నష్టపోతున్న రైతన్నల దుఃఖమయ బతుకు చిత్రాన్ని వర్ణిస్తున్నాడు. బతుకుదెరువు కోసం వలస పోతున్న తీరును అక్షరాల్లో చిత్రీకరిస్తున్నాడు. గ్లోబలీకరణ ప్రమాదాలను హెచ్చరిస్తున్నాడు కవి. సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన వాళ్ల బతుకు చిత్రాన్ని సానుకూల దృక్పథంతో ముగించిన ఈ కవితా పాదాలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటాయి.

‘సూర్యుడు నిదుర లేవాలన్నా/ పరగడుపున మా చెమట చుక్కలు కొన్ని/ అతడి గొంతులో పడాల్సిందే/మా రెక్కల్ని మేం నమ్ముకోవాలే గానీ/నింగి నీదడం పెద్ద కష్టమేం గాదు మాకు’

ఈ ప్రపంచాన్ని తమ వెంట నడిపించగల శక్తి ఉన్నవాళ్లు ప్రజా కళాకారులు. ఇక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా వాళ్ళ గొంతు పాడుతుంది. ధైర్యంగా ప్రశ్నిస్తారు వాళ్ళు. అందుకే పాలకవర్గాలకు వాళ్ళంటే గిట్టదు. చైతన్యాన్ని రగిలించే సాంస్కృతిక యుద్ధ సైనికులు వాళ్ళు.అలాంటి ప్రజాకళాకారుల గురించి ‘వారు పాడుతుంటే’ అనే పదునైన కవితను రాసారు కంచరాన. ప్రతి వాక్యం మనల్ని ఉత్తేజితులను చేస్తుంది.

‘దొంగ చీకట్లను తరిమే గూర్ఖాల వాళ్ళోస్తారు/

ఒకే దేశం ఒకే తెరమీద దానీ బానీ జాదూగర్ లాంటి/తెర వెనుక భాగోతాలను విడమరిచి చెప్తారు/నిత్యము యుద్ధాన్ని వెంటేసుకు తిరుగుతారు/వాళ్లు భేరీలు మోగించేంత వరకూ/యుద్ధభూమి సైతం నిర్నిద్రంగా వేచి చూస్తుంది’

ఈ కవితా సంపుటిలోని కవితలన్నీ మనలను ఆలోచింపజేస్తూనే ఉంటాయి. ఏ కవితకు ఆ కవిత ప్రత్యేకంగా నిలుస్తుంది. అక్షర జ్ఞానం లేని కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన కవి కంచరాన. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకు యానం చేస్తున్న అసంఖ్యాకమైన సామాన్యుల పక్షాన నిలబడి జంగు సైరన్ మోగిస్తున్న ఈ కవితో మనమంతా చేతులు కలుపుదాం. సమరోత్సాహపు శరాలైన కంచరాన భుజంగరావు కవిత్వాక్షరాలను అక్కున చేర్చుకుందాం.

 

– గోపగాని రవీందర్
94409 79882

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *