“కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తరుగు లేదు, విశ్వనరుడ నేను”
అంటూ విశ్వమానవతను ప్రకటించాడు మహాకవి జాషువా. తాను నమ్మిన విలువల్ని సిద్ధాంతాల్ని తన రచనల ద్వారా నిక్కచ్చిగా ప్రకటించాడు. ప్రపంచం తనను ఎలా చూసినా పర్వాలేదు అన్నాడు. పంచముడివి, అంటరానివావిడి అన్నా పట్టించుకోలేదు. కసరి బుస కొడుతున్న నాగరాజుల వైపు కవితా దివిటీలను విసిరాడు. నేను విశ్వ నరుడను అని ప్రకటించాడు. కేవలం విశ్వమానవతను ప్రకటించమే కాకుండా తన కవితా ప్రస్థానమంతటా జాగరూకుడై కవిత్వమై ప్రతిస్పందించాడు.
__________
జాతీయ ఉద్యమ కాలంలో జాతి జనుల్లో భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే విషయాల్ని తన కవిత్వంలో పొందుపరిచాడు. సింధు,గంగా నదులు జీవజల క్షీరాన్ని నిరంతరాయంగా ప్రవహింప చేస్తూ తమ సంతానాన్ని పోషించుకుంటున్నాయని, పచ్చి బాలింతరాలుగా తనను కన్న దేశాన్ని కీర్తించాడు. తద్వారా ప్రజల్లో జాతీయతను పాదుకొల్పిన కవి జాషువా. దేశాన్ని గతంలో పాలించిన రాజుల వైభవాన్ని,తాత్త్విక మార్గ దర్శకులుగా ఉండిన మహనీయుల విశ్వవిఖ్యాతిని, ప్రజలకు కనువిప్పు కలిగించే విధంగా కవిత్వం రాసిన పద్యాల పరుసవేది జాషువా. బుద్ధ భగవానుని తాత్త్విక చింతనలోని సారాంశాన్ని వర్ణిస్తూ ‘రెండువేల ఐదు వందల ఏండ్లు గడిచిన నీ కమనీయ బోధలకు నిగ్గు రవ్వంత కూడా తగ్గలేదు’ అంటాడు. అశోకుని వంటి మహా చక్రవర్తుల గుండెలను సైతం పెళ్ళగించి అహింసా సిద్ధాంతం వైపు మళ్ళించాయని పేర్కొన్నాడు. మరో సందర్భంలో భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని విశ్వసభల్లో చాటిన మహనీయుడు వివేకానంద గురించి, నయాగరా జలపాతంలా సాగిన ఆయన వాగ్దాటిని ఆయన మాటల్లోని తాత్త్వికతల లోతుపాతుల్ని కీర్తిస్తూ “వివేకానంద” అనే ఖండికను రచించాడు.
__________
పేదరికం అవమానాలతో కుంగిపోక ధీరోధాత్తునిలా ఎదురుకొని విశ్వనరుడి స్థాయికి ఎదిగాడు. సమసమాజ స్థాపనే లక్ష్యంగా విశ్వ మానవీయతను చాటిన జాషువా తన వ్యక్తిగత జీవన యానాన్ని గురించి కూడా ప్రస్ఫుటమైన ప్రకటన చేశాడు.
నివసించుటకు చిన్న నిలయ మొక్కటిదక్క
గడన సేయుట కాశపడను నేను
ఆలు బిడ్డలకునై యాస్తిపాస్తుల గూర్ప
పెడత్రోవలో పాదమిడను నేను
నేనాచరించని నీతులు బోధించి
రాని రాగము తీయలేను నేను
సంసార యాత్రకు చాలినంతకు మించి
గుడ్డి గవ్వయు గోరుకొనను నేను..
అంటూ తన జీవనగమ్యాన్ని పటాటోపాయాలు లేకుండా ప్రజలకు చెప్పాడు. విశ్వ మానవతకు దర్పణం పట్టిన జాషువా కర్మ సిద్ధాంతం పేర జరుగుతున్న హింసను కవిత్వం చేశాడు.
కర్మ సిద్ధాంతమున నోరు కట్టి వేసి
స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు
కర్మమన నేమొ దానికీ కక్ష యెమొ
ఈశ్వరునిచేత ఋజువు చేయింపవమ్మ..
అంటూ కర్మ సిద్ధాంతాన్ని వామపక్ష భావజాల దృక్పథంలో ఖండించాడు. వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో ఉన్న తొమ్మిది యుగాలకు చక్రవర్తిగా, నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించబడ్డాడు. తెలుగుదనాన్ని తన పద్యంలో జాలువార్చి స్వచ్ఛమైన తెలుగు భాషకు ప్రాణ ప్రతిష్ట చేశాడు. అటు సాంప్రదాయ సాహిత్య సంస్కారాన్ని, ఇటు ఆధునికతను మేళవించి తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగించాడు. జాషువా పద్యం జానపదుల నాలుకలపై జీవించి ఉంది. తెలుగు భాష మాట్లాడే ప్రతి పౌరుడు జాషువా పద్యాన్ని ఆలపించే ఉంటాడు. మాట మాత్రంగానైనా వినైనా ఉంటాడు. తెలుగుభాషలో ఇంతటి ప్రాచుర్యం పొందినవాడు మహాకవి జాషువ తప్ప మరొకరు లేరు అని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించను.
జాషువా సాహిత్యంలో భారత పురాణ పురుషులు,సవర, మాంధాతి వంటి చక్రవర్తుల ప్రశంస ప్రశస్థిలతో పాటు ప్రపంచ శాంతికి సత్యం అహింస వంటి ఆయుధాలను అందించిన గౌతమ బుద్ధుడు, అహింసామూర్తి మహాత్మాగాంధీ, సామాజిక తాత్త్వికుడు అంబేద్కర్ వంటి మహనీయులు అంతా దర్శనమిస్తారు. బుద్ధుని బోధనలోని అహింసా తత్త్వాన్ని, విశ్వమానవ ప్రేమను, ఏసుక్రీస్తు బోధనలోని శాంతి, కరుణ, సత్యం, సౌశీల్యాన్ని, జాషువా దేశ ప్రజల్లో జాతీయతను పాదుకొల్పేవిగా పేర్కొన్నాడు.
మహాకవి జాషువా దృష్టిలో జాతీయత అంటే అన్ని మతాలు సహనంతో కలగలిసి జీవించడం. నీవలే నీ పొరుగు వాడిని ప్రేమించటం. ఈ సైధ్ధాంతిక సారాంశాన్ని మహనీయుల నుండి గ్రహించిన జాషువా సామాజిక సంక్షేమం, సమానత కోసం కవిత్వం రాశాడు. “కాంతిశీకుడు” రచన ద్వారా “కపాలం” ద్వారా మాట్లాడుతూ సమాజంలోని అసమానతలు తొలగిపోయి విశ్వమానవతా భావం, విశ్వసోదరభావం, పెంపొందినప్పుడే జాతీయతా భావం, ఆవిర్భావం జరుగుతుందని చెప్పాడు.
‘నా జాతి నా యూరు నా దేశమని పొంగు
స్వాభిమానము శూన్యమయిన దాకా
విశ్వ భ్రాతంబు వెలయించు నైక్యసం
ఘావాప్తి దిశల పెంపారు దాకా’ అంటాడు.
మరోవైపు హంగ్రీథర్టీస్ లో ప్రపంచ వేదిక మీద నెలకొన్న ఆకలి, దారిద్ర్యం మహాకవిని కదిలించాయి. ఈ నేపథ్యాన్ని భూమికగా “అనాథ” కావ్యాన్ని రచించాడు. ఒక వ్యక్తి జీవించటానికి కావలసిన ప్రాథమిక అవసరాలు కూడు, గూడు, గుడ్డ అందరికీ అందుబాటులో లేవు. ఒకడికి అమృత భోజనం, మరొకనికి గంజిబువ్వ, ఇంకొకనికి విలాసవంతమైన భవంతి, వేరొకనికి పూరి గుడిసె, కొందరికి సౌఖ్య విలాసాన్నిచ్చే వస్త్రాలు, కొందరికి ముతక పంచెలు, మనుషులంతా ఒకటే అయినప్పుడు ఇంతటి తారతమ్యం ఎందుకని ప్రశ్నించాడు.
“ఎవడా రోగించునమృత భోజనంబున గలిసినో ఈ లేమ గంజి బువ్వ/ఎవడు వాసము సేయు శృంగార సౌధాన మునిగేనో యిన్నారిపూరిగుడిసె/ఎవని దేహము మీది ధవళాంబరములలో నొదిగెనో యిన్నాతి ముదుక పంచె/ఎవడు దేహము సేర్చు మృదుతల్పములలోన కెక్కెనో యీయమ్మ కుక్కిపడక” అన్నాడు.
జపాన్ రాజు, నేతాజీ భావజాలానికి ఆకర్షితుడైన సందర్భాన్ని జాషువా ప్రత్యేక ఔన్నత్యంతో వివరించాడు. నాడు బుద్ధుడు జన్మించి అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధిస్తే నేడు కాలానుగుణంగా అవసరమైన రీతిలో హింసను ప్రబోధింపడానికి నేతాజీ జన్మించాడని చెప్పాడు. ఇది నేతాజీ దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. నేతాజీ కావ్యానికి ఉన్న మరో ప్రత్యేకత జాషువా ఈ ఖండకావ్యాన్ని తన తండ్రికి అంకితం ఇచ్చాడు.
మహాత్ముడి అకాల మరణానికి దిగ్భ్రాంతికి గురైన జాషువా “బాపూజీ” లఘుకావ్యాన్ని రచించాడు. గాంధీజీ అహింసా సిద్ధాంతాల పట్ల అత్యంత ప్రేమాదరణను కనబరిచిన జాషువా ఈ కావ్యానికి ముందు మాటగా వినతిని రాస్తూ “ప్రపంచ చరిత్రలో నెట్టివాడు నేయుగమునగడింపని యమరకీర్తి నాతడార్జించి, అనుంగుబిడ్డలగు భారతీయుల కంకిత మొనర్చినాడు. ప్రతిఫలముగా తనకు లభించినది బలవన్మరణము భస్మరూపము అది తలంపరాని విషమ ఘడియ.” నాడు రాలిన యశ్రుకణములే ఈ కావ్యము అంటాడు.
జాషువా దృష్టిలో జాతీయత, విశ్వ మానవతా ప్రాధాన్యాలు. తాను నిత్యం అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొన్నా తను మాత్రం జాతీయతా దృక్పథంతోను, విశ్వ మానవ తత్పరతతోనూ, తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. మహాకవి జాషువా దృష్టిలో జాతీయత విశ్వ మానవతా రెండూ నాణ్యానికి బొమ్మ బొరుసు వంటివి. తాను జీవించినంత కాలం ఈ సైధ్ధాంతిక భూమికకు కట్టుబడి పని చేశాడు. కాబట్టే బుద్ధ భగవానుడిని మహాత్ముడును ఆయన ఆరాధ్యులుగా భావించాడు.

-డాక్టర్ నూతక్కి సతీష్
సహాయ ఆచార్యులు,న్యాయ విభాగం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
చరవాణి: 98486 93298











