ఎనభయ్యో దశకంలో ఆధునిక సమాజంలోనూ, సాహిత్యరంగంలోనూ అనేకానేక మార్పులు వచ్చాయి.అనేక ఉద్యమాల కారణంగా సాహిత్యరంగం ప్రతిస్పందించటం వలన కవిత్వంలోనూ, వచనసాహిత్యంలోనూ ఆయా ఉద్యమ ప్రభావాలు తొంగిచూసాయి.
ఆర్థికంగా కాలానుగుణ మార్పులకు, సాహిత్య ఉద్యమాల వలన సాహిత్య పరమైన ప్రభావాలకు లోనై రచనలు చేసిన వారిలో ఇంద్రగంటి జానకీబాల కూడా ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు.
పాటలు, చిన్నచిన్న రచనలు అప్పుడప్పుడు చేసినా 1970లో కథారచనతో పూర్తి స్థాయిలో సాహిత్య రంగంలోకి వచ్చిన జానకీబాల పన్నెండు నవలలు,ఏడు కథల సంపుటాలు,ఒక కవితా సంపుటి సృజనాత్మక రచనలుగా జానకీబాల సాహిత్య ఖాతాలో చేర్చుకున్నారు.అవి కాకుండా సినీ నేపధ్యగాయనీల అంతరంగ పరిశోధనగా రాసిన కొమ్మా కొమ్మా కోకిలమ్మ అనే పుస్తకమే కాక,”యశస్విని” శీర్షికతో భానుమతి,”నాయిక” శీర్షికతో జయలలిత, శ్రీరంగం గోపాలరత్నం, దుర్గాబాయి దేశముఖ్ ల జీవిత గాథాచిత్రాలను రచించారు. సంగీత రాగాల ఆధారంగా వచ్చిన సినిమా పాటల విశ్లేషణలను “రాగరంజితం” పుస్తకంగా వెలువరించారు.గాథాతారావళిగా ఒకప్పటి పాతతరం కథకుల అపురూప కథలను తెలుగు విద్యార్థి మాసపత్రికలో ధారావాహికగా రెండేళ్ళపాటు పరిచయం చేసారు.అప్పుడప్పుడు వివిధ పత్రికల్లో సమకాలీన సమస్యలపై రాసిన వ్యాసాల్ని “అన్యస్వరం” పేరిట పుస్తకరూపంలో తెచ్చారు. ఈ విధంగా ఇంద్రగంటి జానకీబాల గత యాభై ఏళ్లకు పైగా నిరంతరాయంగా సాహితీసృజన చేస్తూనే ఉన్నారు.
జానకీబాల కథలలో 1970-90 వరకూ వచ్చినవి పరిశీలిస్తే ఎక్కువగా ఆర్థికంగా, సామాజికంగా బలహీన వర్గాల జీవితాలను, ఉద్యోగం, కార్యాలయావరణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను బలి,దేవమ్మ,వెలుగును మింగిన చీకటి వంటి కథల్లో చిత్రించారు.
“బలమైన లక్ష్యం , మంచి వస్తువు ఎన్నుకుంటే టెక్నిక్కు,శిల్పం ఆ ఊపున అవే వచ్చి కూర్చుంటాయి . ఇందులో మంచి లక్షణాలున్న కథలు చాలా ఉన్నాయి. కథల్లో రచయిత్రి అర్థవంతమైన ఆలోచనలు తెలుస్తున్నాయి ” అని 1980లో వచ్చిన తొలి సంపుటికి ముందుమాట రాసిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు అభినందించారు.
చదివించాలన్నా,చదువుకోవాలనే ఆశ ఉన్నా అవకాశం దక్కనివ్వని పందికొక్కుల ఉదంతాల్ని, అందని ద్రాక్షలుగా మారిన ప్రభుత్వ పథకాల్ని కథల్లో ప్రస్తావించారు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళతో కూడిన కాంపౌండుల్లో భిన్నభిన్న మనస్తత్వాలు,విభిన్న జీవన విధానాలు కలిగిన బతుకులను కొన్ని కథల్లో అక్షరీకరించారు.అటువంటి కథల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మంచికథ ‘పక్షి ఎగిరిపోయింది’. ఇందులో ఒక్కొక్క కుటుంబం గురించి రచయిత్రి చెప్పిన తీరు, ఆ యిళ్ళ సమాహారం ఒక సమాజ వ్యవస్థని రూపుకడుతుంది.
ఎనభై దశకానికి ముందు రచయిత్రుల్లో ఉద్యోగినులు తక్కువ.అప్పట్లో వచ్చిన కథలు కూడా ఎక్కువగా సహోద్యోగులతో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అంశాలతోనే వచ్చాయి.జానకీబాల కొంతకాలం రోడ్డు రవాణా సంస్థలో పనిచేయటం వలన అనేక కథల్లో బస్సు ప్రయాణం నేపధ్యంలోనే కాక సంస్థలోని అనేక లొసుగులు కథల రూపంలోకి తీసుకు వచ్చారు.
స్క్రాప్ అమ్మకాలతో రెండుచేతులతో సంపాదించడమైనా , డీజిల్ గోల్మాలైనా, ఉద్యోగులు ఉచితపాసుల భాగోతమైనా, అవసరమైన ముఖ్యమైన ఫైల్ బయటపడిన అట్టహాసమైనా ఇలా చాలా కథలు ధైర్యంగా రాసారు . అవి చాలా వరకు సాధారణ పాఠకులకు తెలియనివి. తెలుసుకో వలసినవి.
1990ల తర్వాత ఒక స్త్రీవాద సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేయడంతో జానకీబాలపై ప్రభావం కలిగించడం వలన దృక్పథంలో వచ్చిన మార్పు ఆమె రచనలపై కూడా పడింది. అందువలన 1990ల తర్వాత రాసిన రచనల్లో కుటుంబపరంగా, సమాజపరంగా ఎదుర్కొన్న వివక్షలకు స్త్రీ పడే సంఘర్షణ ఎత్తి చూపే విధానమే కనిపిస్తుంది తప్పితే పేజీలకు పేజీలు రచయిత్రి తనవాదనను సమర్ధించుకునే ప్రయాసలు కన్పించవు.అందుకనే జానకీబాల రచనలు తనచుట్టూ కుటుంబాల్లో, తనపరిసరాల్లో జరుగుతున్న విషయాలలాగే చదువుతున్నంతసేపూ పాఠకులు భావిస్తారు
మధ్యతరగతి కుటుంబాల్లోని కుటుంబ అనుబంధాల్ని,అనురాగాల్ని ,దిగువ తరగతి చిరుద్యోగుల జీవితాల్ని విచ్ఛిన్నం చేస్తున్న సామాజిక అంశాల్ని స్పృశిస్తూ,మారుతున్న తరాలలోని ఆలోచనల్ని క్రమపరిణామాల్నీ చర్చించేలా కథల్నైనా నవలల్నైనా జానకీబాల రాయటం గమనార్హం.
అయితే ఈ రచయిత్రి రచనల్లో పాఠకులలో ఆవేశాలు కానీ,ద్వేషాలు రగుల్కొల్పటం కానీ లేకుండా ఆలోచింపజేసేలా సున్నితమైన అనుభూతిని మాత్రమే అందిస్తాయి ఈ రచయిత్రి రచనలు.
“కనిపించే గతం ” పేరుతో రాసిన నవల కొంతవరకూ ఆత్మకథాత్మకమే అయినా చాలా సంయమనంతో చదువుతున్నంతసేపూ పాఠకులను అందులో మమేకం అయ్యేలా చేస్తుంది.
“స్త్రీ పురుషులు ఒకరిపట్ల ఒకరికి కలిగిన అనురాగాన్ని,ప్రేమని పదిలంగా దాచుకుని భౌతికంగా దూరమైనా జీవితాంతం ఒకరినొకరు ఆరాధిస్తూనే గడిపే ప్రేమే నీలిరాగం” అంటారని ఒకసారి ఉషశ్రీ గారు చెప్పగా విని ఆ నీలిరాగం అనే మాటకు ప్రభావితురాలై “నీలిరాగం ” నవల రాశానంటారు జానకీబాల.
ఉత్తరాది యాత్రలో భాగంగా కాశీవెళ్ళటం నేపధ్యంలో ఒక ట్రావెలాగ్ లా రాస్తూనే దానితో సమాంతరంగా తటస్థపడిన సన్నివేశాలూ ఎదురు పడిన వ్యక్తులు ఆమె జీవితంలో మరిచిపోయిన గాయాల్ని రేపిన విషయం మొదలైన వాటితో అనూహ్యమైన సంఘటనలతో ” దేవకీ, వాళ్ళకి, అన్నయ్య ” నవల రాసారు జానకీబాల.
జానకీబాల రచనావిధానంలో ఒకప్రత్యేకత– ఏదైనా ఒక విషయాన్ని సూటిగా చెప్పుకుండా సింబాలిక్ గా చెప్పేవిధానం ఒకటైతే రచనల్లో ఉపయోగించే మరొక విధానం సామాన్య విషయంగానే ముగింపులో గాని, మధ్యలో గానీ, సంభాషణా వాక్యాలుగా లేదా స్వగతంగా పాత్రల ద్వారానే అంతరార్థం చెప్పిస్తారు.
రచయిత్రి వివిధ అంశాల్ని ప్రస్తావించినా, తరిచి చూస్తే దాదాపు ఆమె రచనలన్నింటా స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన సున్నితమైన అనుబంధం, అనురాగం అనేవి వర్తమాన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితుల్లో ఎన్నిరకాలుగా విడిపోతున్నాయో,ఎలా చీలిపోయి ఉన్నాయో, కనపడని తెరలు వారిమధ్య ఎలాంటి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి అనేది అంతర్లీనంగా,అంతర ప్రవాహంగా ఉంటాయి.
“స్త్రీకి అవసరమైన స్వతంత్ర ప్రవృత్తిని గాఢంగా వాంఛిస్తూనే ఆమెని బంధించి వుంచే స్వభావాన్ని విశ్లేషించగల రచయిత్రి జానకీబాల ” అంటూ ప్రశంసించే శ్రీకాంతశర్మ గారి మాటలు ఆమె రచనలు చదివిన వారికి అక్షరాలా నిజమనిపిస్తాయి
జానకీబాల రచనల్లో కూచోబెట్టి వినిపించే నీతిబోధలుండవు.సమాజాన్ని ఆదర్శాలతో బాగుచేసేస్తానన్న ధోరణి ఉండదు.మానవ మనస్తత్వాల్ని,ప్రజాజీవన విధానాల్ని, సంఘర్షణల్నీ ,సమస్యల్ని ఎత్తి చూపిస్తారు.ఆ క్రమంలో కొన్నిచోట్ల హాస్య,వ్యంగ్య ధోరణిలో చురకల్లా తగుల్తాయి.మరి కొన్నింటిలో గుండెని ఆర్తిగా తడుముతాయి.
ఇంద్రగంటి జానకీబాల గారు కవయిత్రి అని చాలామందికి తెలియదు .1992 లోనే “మనశ్శల్యాలు” అనేపేరిట కవితాసంపుటి వేశారు. మనశ్శల్యాలు పేరున రాసిన కవిత చాలు ఆమె కవితా శబలత తెలియడానికి –
” మెత్తని కుషన్ లాంటి/మనసులోకి దిగిపోతాయి/ఎన్నో సూదుల్లాంటి/బాధలు జ్ణాపకాలు/గుచ్చిన ప్రతి గుండుసూదీ/తల మాత్రం పైకి పెట్టి/అదును కోసం చూస్తుంది/కొనగోరు తగిలితే చాలు/కోటి గతాల వ్యథల ప్రతినిధిగా/చప్పుడు లేకుండా పైకి వస్తుంది ” అంటూ జానకీ బాల రాసిన ఈ కవిత స్త్రీవాద చైతన్యానికి ఒకమచ్చుతునక .
‘ఎప్పుడూ అనుకోలేదు’ అనే కవితలో .. “నిన్ను తలచి విలపించటం మాత్రమే మిగిలినప్పుడు- “జ్ఞాపకానివై మిగిలిన / ఓ నా బాల్యమా /వెళతానని ఎందుకు /ఒక్కమాట చెప్పావుకాదు ” అంటూ కవితలో ఆసాంతం కోల్పోయిన బాల్య క్రీడల్నీ తలపోసు కుంటారు .
మరో కవిత “నిద్ర”లో..”మూసిన కనురెప్పల వెనుక/కాటుక కన్నీళ్ళు ఘనీభవించిన చీకటిలో/నిద్రాసముద్రాన్ని ఈదుతున్నానం”టారు ఈ కవయిత్రి.
ఇటువంటి మంచి కవితలను రాసిన జానకీ బాల ఎందుచేతనో తర్వాత కవిత్వం జోలికి పోకుండా కథలు,నవలలూ సంగీత ప్రాధాన్య రచనలు వైపు మళ్ళిపోయారు.
ఇంద్రగంటి జానకీబాల తన నిర్విరామ సాహిత్య ప్రస్థానంలో అనేక ప్రక్రియల్లో ఒకఛాయగా కాక తనకంటూ ఒక ముద్రను సాధించటానికి కృషి చేసారు.సాధించారు కూడా.
రచయిత్రులు అందరూ తమకు రావాలని అభిలషించే శ్రీమతి సుశీలానారాయణరెడ్డి పురస్కారం ఈ నెల 22 వతేదీన అందుకోబోతున్న ఇంద్రగంటి జానకీబాల గారికి ఆత్మీయంగా అభినందనలు.
-శీలా సుభద్రాదేవి
81068 83099