మహిళకు భద్రత కల్పించ లేమా!

ఎడిటోరియల్

*మహిళల మనుగడ గాలిలో దీపంగా మారింది..
*నిందితులకు శిక్ష పడుతుందనే భయం లేదు,చట్టాలు చట్టుబండలై,నేరస్తుల చుట్టాలవ్వడంతో.. *కుటుంబం,సమాజం,పాలకులు బాధ్యత వహిస్తే,సమున్నత విలువైన సమాజం సాధ్యమే.. **మహిళ ఆగ్రహిస్తే సృష్టికి, మానవజాతికి పుట్టగతులు ఉండవు..

మన దేశాన్ని “భారతమాత”గా, సమాజంలో మహిళను తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, కన్న బిడ్డగా సమన్నతంగా, సముచితంగా గౌరవ మర్యాదలు అందుకోవలసిన నాగరిక సమాజం మనది. కానీ నేడు మనిషి విచక్షణ కోల్పోయి మహిళలపై ఇంటా,బయట కనీస భద్రత లేని తీరుతో హింస, హత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి. మానవ మృగాల నుంచి అనేక విధాలు(రకాలు)గా అకృత్యాలకు నిలయంగా,అనాగరికత ముఖచిత్రంగా మారుతోంది. ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధ పాలనలో ఆడపిల్లలు,మహిళలపై అమానుష అకృత్యాలకు బరితెగిస్తు,తెగబడుతున్న కీచకులకు సకాలంలో కఠిన శిక్షలు విధించలేనప్పుడు, లింగ వివక్షను సమూలంగా సమాజం నుండి నిర్మూలించినప్పుడు చట్టబద్ద పాలన ఎలా అవుతుంది?. కలకత్తాలోని ఆర్,జీ వైద్య కళాశాల ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై ఘోరాతి ఘోరంగా,అమానుషంగా హత్యాచార ఘటనకు పాల్పడిన రాబందులకు శిక్ష పడుతుందా.. చట్టాలు చట్టుబండలై, నేరస్తులకు చుట్టాలవుతున్నాయని యావత్ దేశం దిగ్భ్రాంతికిలోనవుతుంది.గత 12 ఏళ్ల క్రితం దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో “నిర్భయ” పై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా గగ్గోలు రేపింది. స్త్రీలకు సరైన రక్షణ కల్పించలేని వ్యవస్థల అసమర్ధతను చీత్కరిస్తూ ఆనాడు యువత పెద్ద ఎత్తున ఉద్యమించింది.ఇకపై అటువంటి ఘోర కృత్యాలు దేశంలో చోటు చేసుకోకుండా చూస్తామంటూ మాటలేన్నో చెప్పిన నాటి పాలకులు హడావుడి చట్టాలను పదును పెట్టారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కీచకులకు కట్టిన శిక్షలు ప్రతిపాదించారు. అయినా ఆ తర్వాత కూడా హైదరాబాద్లో “దిశ”ఉదంతం చూసినాము.ఇలా మహిళలపై అకృత్యాలు నిత్యం దేశంలో జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా “శిక్ష పడుతుందనే భయం లేకనే ” ఇంత అమానువీయంగా వ్యవహరిస్తున్నారు. ఆనాడు తో పోలిస్తే పరిస్థితులు ఇంకా అధ్వానంగా తయారయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారమే 2012లో దేశవ్యాప్తంగా స్త్రీలపై దాదాపు పాతికవేల అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. 2022లో అవి 31,516కు పెరిగినాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ ,మహారాష్ట్ర ,హర్యానా ,ఒడిశాలో మృగాళ్లు స్వేచ్ఛా విహారం చేస్తున్నట్లు సర్కారీ నివేదికలే వెల్లడిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలను స్త్రీలపై లైంగిక దాడులు ఎక్కువగానే జరుగుతున్నాయి.గృహహింస, అపహరణ,హత్యాచారం,బాలికలు,మహిళల అక్రమ రవాణా,లైంగిక వేదింపుల వంటివి ఏడాదికి ఏడాది అధికమవుతున్నాయి. ఇది మహిళలకు ప్రాణ సంకటంగా,ప్రగతికి ఆటంకంగా మారుతుంది.ఇదిలా ఉంటే బాలికలు, మహిళలపై నమోదవుతున్న అనేక అనేక నేర ఘటనలు అసలు వెలుగులోకి రావడం లేదు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడమే అందుకు ప్రధాన కారణం. వారు ధైర్యంగా ఫిర్యాదు ఇచ్చిన సందర్భాల్లోనూ కేవలం1.6 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలాంటి అలసత్వం మూలంగా దేశంలో మహిళలు,బాలికలపై హింస అంతకంతకు పెరిగిపోతోంది. కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన “భారత్ లో మహిళలు-పురుషుల పరిస్థితి-2023” నివేదిక ప్రకారం మహిళలపై జరిగిన దారుణాలపై విచారణకు వచ్చిన ఉదంతాల్లో కేవలం 2 శాతం లోపు కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఇలా అనేక రకాలుగా స్త్రీలపై జరిగే హింస, లైంగిక దాడులు, అత్యాచారాలు, బలవంతపు వివాహలు, సైబర్ వేధింపులు, అక్రమ రవాణా, దాష్టీకాలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక పరిస్థితులు వారి ఎదుగుదలకు ప్రధాన అవరోధంగా మారుతుందని నివేదిక వివరించింది. దాన్ని అంతం చేయడం ద్వారానే అతివల సాధికారికతకు అడ్డంకులు తొలగుతాయని ఆ నివేదిక పేర్కొంది. ఈ ఘటనల్లో బాధితుల్లో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల లోపు మహిళలలే అధికంగా ఉండడం, బాధితుల్లో పనిచేసే వారి ఎక్కువమంది పై ఇలాంటి ఘటనలు జరిగుతున్నాయి. ఇంటా, బయట పనిచేసే చోటుకు వెళ్తున్నప్పుడు అఘాయిత్యాలకు బలవుతున్నారు. రాత్రిపూట పని వేళలో, పనిచేసే ప్రదేశాలు కూడా అత్యాచారం కారణమవుతున్నాయి. హత్యాచార నిరోదానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఘటనలు జరగడం మాత్రం ఆగడం లేదు. ఘటనల్లో చాలావరకు, ఎక్కువగా వెలుగుచూడడం లేదు. తమపై జరిగిన హింసాత్మక ఘటనలు బయటపెట్టడం తమకు కలంకంగా, అవమానంగా మారుతుందనే భయాందోళన, అపోవులతో చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు.భారతదేశం ప్రగతి పథంలో ఆర్థిక శక్తిగా దూసుకుపోతుందని గొప్పలు చెప్పకున్నా!. పాలకులారా ఆర్థిక కార్యకలాపల్లో అన్ని రంగాల్లో, విభాగాల్లో మహిళా భాగస్వామ్యం పెరగాలి. అది సాధ్యపడాలంటే? పని ప్రదేశాల్లో సురక్షితం కావాలి. కానీ అన్ని చోట్ల విపరీతమవుతున్న లైంగిక వేధింపులు, మహిళా అభ్యున్నతికి ఆటంకంగా నిలుస్తున్నాయి. సమాజాన్ని వెనక్కి నడిపించే ఇటువంటి వాటిని అరికట్టాలంటే?పని ప్రదేశాల్లో ఇంటా, బయట లైంగిక వేధింపులు నిరోధక చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి.ఫాస్ట్ ట్రాక్లో కేసులను సత్వరం విచారణ జరిపి దోషులను కఠినమైన శిక్షలు విదించాలి.సమాజంలో నైతిక విలువలు పెంపొందించడంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దేశానికి తల వంపు తెస్తున్న ఈ హత్యాచార విష సంస్కృతికి రూపుమాపినప్పుడే ఈ దేశం బాగుంటుంది.మహిళలు ఆగ్రహిస్తే ఈ సృష్టికి ,మానవ జాతికి పుట్ట గతులుండవు. పాలకా.. పొలిటికల్ మైలేజ్ వీడుమా?ఓ ఆధునిక సమాజమా! విద్యాబుద్ధులతో చైతన్యవంతులై కూడా( కొందరు) అనాగరికంగా విచక్షణ కోల్పోయి మహిళలపై నీచాతి నీచమైన అమానుష ప్రవర్తన వీడండి. సమాజంలో నైతిక విలువలు పెంపొందించడంలో పాలకులు పాలితులు తమ తమ బాధ్యతలను తూ చ తప్పక పాటిస్తే, మనం ఆశించిన సమున్నత విలువైన సమాజం ఏర్పడుతోంది..

 

మేకిరి దామోదర్,

సోషల్ ఎనలిస్ట్,

 9573666650.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *