గోధుమలను కూడా పంపిణీ చేసే ఆలోచన
అధికారులతో సవిూక్షలో మంత్రుల నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. సన్నబియ్యంతో పాటు సబ్సిడీ ధరలకు గోధుమలు పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై అధికారులతో మంత్రి చర్చించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ డీలర్లను మంత్రి హెచ్చరించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుందని హావిూ ఇచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని, డీలర్‌షిప్‌ను రద్దు చేయడమే కాకుండా జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశానికి హాజరైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ… మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత లోపించిందని.. సరిపడా బియ్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ సమస్యలను పరిష్కరించి పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యత మెరుగుపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అంత్యోదయ కార్డుల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. మహాలక్ష్మీ పథకానికి సంబంధించి రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పౌర సరఫరాల శాఖ విస్తృత ప్రచారం కల్పించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. లబ్దిదారులందరికీ మెసేజ్‌లు పంపి ప్రచారం కల్పించాలన్నారు. చౌక ధరల దుకాణాల్లో 1,629 ఖాళీలు ఉన్న విషయంపై మంత్రి ఆరా తీశారు. వెంటనే ఆ స్థానాలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక అందజేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంత్రికి హావిూ ఇచ్చారు.