ఆధునిక టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఎంతో పురోగతిని సాధించినప్పటికీ, అవి చేసే లాభాలతో పాటు నష్టాలను కూడా మనం భరించాల్సి వస్తుంది. టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది.సక్రమంగా వినియోగిస్తే పురోభివృద్ధికి తోడ్పుతుంది.కానీ దాన్ని దుర్వినియోగ పరిస్థితి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేడు ఈ టెక్నాలజీ తెచ్చిన సౌకర్యం మూలంతో అరచేతిలో ఆన్రాయిడ్ ఫోను ఉంది. అంతర్జాలం డేటా చౌకగా అందుబాటులోకి వచ్చింది.దీనితో సామాజిక మాధ్యమాలను విరిగా వాడుతూ మానవులు వాళ్ల విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు. ఈ సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మెసేజ్లను వచ్చినవి వచ్చినట్లు వాటిలో నిజా నిజాలు మంచేదో, చెడేదో రూడీ చేసుకోకుండానే ఇతర గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తున్నారా.. అయితే ఇకపై ఇలా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే, ఎందుకంటే? నకిలీ వార్తలు అర్థసత్యాలు, అసత్యాల మెసేజ్లను వ్యాప్తి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ఒక ఒకవేళ ఈ పరిణామాలపై నేరం నిరూపితమైతే మూడేళ్ల శిక్ష పడేందుకు ఆస్కారం కూడా ఉంది. ప్రస్తుతం ప్రజలకు నిత్య జీవితంలో సామాజిక మాధ్యమాలతో విడదీయరాని బంధం ఏర్పడింది. అదే అదునుగా వీటి ద్వారా కొందరు వాస్తవాల కంటే! వదంతులను అర్థసత్యాలను, అసత్యాలను ఎక్కువగా వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటి కారణంగా ఇబ్బందులు ఉండటంతో వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్ సీ ఆర్ బీ )నివేదిక ప్రకారం.. గత ఏడాది నకిలీ అర్ధ,అసత్య వార్తలు సమాచార వ్యాప్తికై అత్యధిక కేసులను తెలంగాణలో నమోదయినాయి. గత ఏడాది ఈ నకిలీ వార్తల ప్రచారానికి సంబంధించి రాష్ట్రంలో 264 కేసులు, రెండవ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 147 కేసులు నమోదు అయ్యాయి. దేశం మొత్తం మీద ఈ తరహా కేసులు 858 నమోదు కాగా, ఇందులో నాలుగో వంతు ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే కావడం గమనార్హం. ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తే అవి తట్టుకోలేని అనేకమంది మానసిక వేదనకు గురైన సంఘటనలను చూసినం.ఇలా అమానవీయంగా వదంతుల ప్రచారం చేయడం క్షమించరాని నేరమని గ్రహించండి.
ఇదిలా ఉంటే.. డీప్ ఫేక్ పరిజ్ఞానం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నట్లు వీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు ఈ మధ్య అనేక సంఘటనలు చూస్తున్నాం. సాంకేతిక విప్లవం సామాజిక మాధ్యమాలను సామాన్యుడి చేరువ చేసింది. సులభంగా వాడే అవకాశం రావడంతో దాని మాటన రకరకాల ప్రచారాలకు తెరలేస్తుంది. ప్రజల అభిప్రాయాలను సైతం మార్చే స్థాయికి సామాజిక మాధ్యమాలు చేరుకున్నాయంటే? అతిశయోక్తి కాదు. దీనికి డీప్ ఫేక్ వంటి పరిజ్ఞానం తోడవడంతో ఏ విషయాన్ని అయినా సరే తమకు కావలసిన విధంగా మార్పులు చేసి సామాజిక మాధ్యమాల్లో గుపించడం పరిపాటిగా మారింది. ఇటీవల ఓ హీరోయిన్ కు సంబంధించిదంటూ సృష్టించిన డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం మనకు తెలిసిందే. అనని విషయాన్ని అన్నట్టుగా, చిత్రీకరిస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా మతాలు,వర్గాలు మధ్య వైరం సృష్టించేందుకు కొందరు పనిగట్టుకొని వదంతులను, అర్థసత్యాలను,అసత్యాలను సృష్టిస్తూ ఉంటారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా సామాజిక మాధ్యమాలను ప్రత్యర్థులపై దుష్ప్రచారాన్ని ఆయుధాలుగా మలుచుకుంటున్నాయి. వదంతులు, అర్థసత్యాలు, అసత్యాలను వ్యాప్తి చేయడం భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 505 ప్రకారం నేరం. దీనికి ఐటీ చట్టం జోడించి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో నేరం నిరూపితమైతే మూడేళ్ల వరకు శిక్ష పడుతుంది. తెలంగాణలోని కొన్ని దృష్ట్యాంతాలను పరిశీలిస్తే ఓ మహిళ రాజకీయ నేతకు విదేశాల్లో ఖరీదైన ఇల్లు ఉన్నాయంటూ తమ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేసినందుకు హైదరాబాద్, హుజరాబాద్ లకు చెందిన ఇద్దరు విలేకరులకును పోలీసులు అరెస్ట్ చేశారు.ఓ కలెక్టర్ కు కరోనా వచ్చిందని వార్తలు ప్రచారం చేసిన వ్యక్తిపై నిర్మల్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఒకప్పుడు ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసిన చాలామంది చూసి చూడనట్లు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు ఎవరికి వారు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో తప్పుడు వార్తలను, అర్థసత్యాలను, అసత్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వార్తలు సృష్టించడమే కాదు వాటిని ప్రచారం చేసిన పోలీసులకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని నేడు సామాజిక మాధ్యమాలను విరివిగా చూస్తున్న విలువైన కాలాన్ని వృధా చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ వాస్తవాన్ని గ్రహించాలి. చేతిలో సెల్ఫోన్ చౌకగా (డాటా) సౌకర్యం వచ్చిన ప్పటినుండి, వయసు తారతమ్యాలు లేకుండా రాత్రి పగలనకుండా పోర్న్ వీడియోలు చూస్తూ అనేక అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి.
ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాల్సిన యువత, విలువైన కాలాన్ని వృధా చేస్తూ సమాజంలో నైతిక విలువలకు తిలోదకాలిస్తూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఇలా మద్యం మత్తు తోడవడంతో సమాజంలో ఆధునిక టెక్నాలజీ తోడ్పాటుతో అనేకదాష్టికాలకు,దుర్ఘటనలకు,అత్యాచారాలకుపాల్పడుతున్నారు. యూనివర్సిటీల్లో,కాలేజీల్లో యువత చదువులు పక్కనపెట్టి డ్రగ్స్ (మారకద్రవ్యాల)కు అలవాటపడి విలువైన కాలాన్ని, వయస్సును వృదాచేస్తున్నారు. ఇలాంటి వాటి మూలంగా మానసికంగా, ఆరోగ్యపరంగా బలహీనంగా తయారవుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వం మాధకద్రవ్యాల(డ్రగ్స్) మద్యపానం విపరీత వినియోగంపై కఠినంగా వ్యవహరించి డ్రగ్స్ రహితంగా తెలంగాణ ఏర్పాటుకు పూనుకోవడం అభినందనీయం.అలాగే పోర్న్వీడియాల నిషేధిస్తూ, విలువలతో కూడిన సమాజం ఏర్పాటుకు అసత్య ప్రచారాలు సామాజిక మాధ్యమాలలో కట్టడి చేస్తూ నైతిక విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మనిషి అనైతిక ప్రవర్తన,అసత్య ప్రచారం మారణాయుధాల కంటే ప్రమాదంకరం అని భావించి నేరాలకు గురికాకుండా ఆధునిక టెక్నాలజీని జ్ఞాన విస్తృతిక ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
మేకిరి దామోదర్,
సామాజిక విశ్లేషకులు,వరంగల్,ఫోన్:9573666650.