గ్లోబలైజేషన్ ఫలితంగా ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. వస్తు సేవల పరస్పర మార్పిడికి, ఉత్పత్తికి, మార్కెటింగ్ అవసరాల కోసం వివిధ దేశాల అంతర్జాతీయ విధివిధానాలు సరళీకరించబడ్డాయి. ఈ కోవలోనే 90వ దశకం తర్వాత భారతదేశంలో కూడా సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చాయి. అభివృద్ధి పేరిట ప్రపంచ స్థాయి టెక్నాలజీని అందుకునే నెపంతో జరిగిన ఈ మార్పు భారతీయ గ్రామీణ సంస్కృతిపై, జీవన విధానంపై, ఆర్థిక అంశాలపై, వృత్తులు, వ్యవసాయం ఇత్యాది రంగాలపై పెను ప్రభావాన్ని చూపింది. అప్పటి వరకు స్వయం ప్రకాశితమైన గ్రామీణ వ్యవస్థ కుదేలయింది. ఈ విధ్వంసాన్ని సామాజిక స్పృహ ఉన్న రచయితలు ఎందరో తమ రచనల్లో కళ్లకు కట్టినట్లు చూపారు.
కవిత, కథ, నవల.. ప్రక్రియ ఏదైనా ప్రపంచీకరణ మూలాలను, దాని పరిణామాలను సాహిత్యంలో చర్చించారు. ఈ కోవలోనే తెలంగాణ గ్రామీణ జీవన వ్యవస్థపై ప్రపంచీకరణ ఫలితాలను తమ కథల్లో చర్చించిన వారు డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి. వీరు రాసిన “విసుర్రాయి”, “మింగుతున్న పట్నం”, “వ్యాపారమృగం”, “మరో మార్క్స్ పుట్టాలె”, “నిత్య కల్లోలం” కథా సంపుటాలలో గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలు.. సాధారణ జన జీవనంపై ఎంత తీవ్ర ఫలితాన్ని చూపించాయో చక్కగా విశ్లేషించారు. సుజాతారెడ్డి కథల్లో ప్రపంచీకరణ దృక్పథాన్ని విప్పి చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం.
~~~~~~~~~~~~
బహుళ జాతి కంపెనీల వ్యాపారం కోసమే ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే విస్కీ, బ్రాందీ, గుట్కా వంటి మత్తు పదార్థాలను పల్లెలకు సైతం విస్తరింప చేశారు. వీటివల్ల కలిగే ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్న ఓ గాయని ఆ వ్యాపారస్తుల కర్కశత్వానికి ఏ విధంగా బలయిందో తెలిపే కథ ‘వ్యాపారమృగం’. ఈ కథకు కార్యక్షేత్రం భువనగిరి పరిసరాలు. భువనగిరి ప్రాంతంలో హత్యకు గురైన బెల్లి లలిత సంఘటన ఈ కథకు స్ఫూర్తి అని తెలుస్తున్నది.
~~~~~~~~~
ప్రపంచీకరణ ఫలితంగానే పుట్టుకొచ్చిన అధునాతన వ్యాపారం రియల్ ఎస్టేట్. ఈ వ్యాపార విస్తృతి కోసం చేసే ప్రచారాలు కొన్నిసార్లు గోబెల్స్ ను తలపిస్తాయి. ఇటీవల కాలంలో యాదాద్రి అభివృద్ధి చెందుతుందని అక్కడ పెట్టుబడి పెడితే సిరుల వర్షం కురుస్తుందని రియల్ ఎస్టేట్ సంస్థల ప్రకటనలకు మోసపోయి పెట్టుబడి పెట్టిన అనేకమంది దిగువ, మధ్య తరగతి ప్రజలు ఆ ప్లాట్ ల ధరల్లో ఎదుగుబొదుగు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న వైనం గమనిస్తున్నాం. రైతుల వద్ద నుండి అతి చౌకధరలకు ఎకరాల కొద్దీ కొని ఇక్కడే రాజధాని నగరం వస్తుందని, ఈ భూమి పక్కనుండే జాతీయ రహదారి వచ్చే అవకాశం ఉందని, లేదా విమానాశ్రయం సమీపంలోనే వస్తుందని విపరీతమైన ప్రచారాలు కల్పించి సామాన్యుల బలహీనతలను సొమ్ము చేసుకుని కోట్లకు పడగలెత్తే రియల్ ఎస్టేట్ వ్యాపారుల భాగోతాన్ని బట్ట బయలు చేసిన కథ ‘వ్యాపార వియ్యం’. తమ వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందడానికి కులం అడ్డు కాదని, వ్యాపారానికి కులం ప్రాంతం అనే అవరోధాలు ఉండవని ఈ కథ ద్వారా రచయిత్రి తెలియజెప్పారు.
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వివాహ సంబంధాలు చూడడానికి ఆయా కుటుంబాల మంచి చెడ్డలు, వధూవరుల ఈడుజోడు మాత్రమే చూసేవారు. మానవీయ బంధాలు ఆర్థిక బంధాలుగా మారుతున్న ఈ కాలంలో ఈడుజోడు కంటే ముఖ్యంగా ఆర్థిక అంతస్తు భేదాలను చూస్తున్నారు. కాస్ట్ తో పాటు క్లాస్ కూడా చూస్తున్నారని చెప్పే కథ “లో’కాస్’!”.
ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా మానసిక బంధాల కంటే ఆర్థిక బంధాలే ప్రభావితం చేస్తున్నాయని, తన పేదరికం కారణంగా తాను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆత్మహత్య చేసుకునే ఓ యువకుని కథ “ఎక్కలేని మెట్లు”.
యాంత్రీకరణ పెరిగిన తర్వాత చిన్నాచితక, బడుగుజీవుల ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నది. అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణల పేరిట సన్నకారుజీవుల చిన్నచిన్న వ్యాపారాలన్నీ ధ్వంసం అయ్యాయి. పదిమంది చేసే పనులు ఒకే మిషన్ చేసే కాలం వచ్చినాక ఆ పదిమంది పనివాళ్ళు వీధిన పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దీనస్థితులను కళ్ళకు కట్టిన కథ ‘న్యూ ఆనంద్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్’. ఈ కథ ద్వారా రచయిత్రి ఆధునిక అభివృద్ధికి వ్యతిరేకం అనుకోలేము కానీ అభివృద్ధి మానవీయ దృక్పథంతో సాగాలనే ఆకాంక్ష ఈ కథల్లో ప్రతిఫలిస్తోంది.
కాలిఫోర్నియాకు వెళ్లిన కంప్యూటర్ ఇంజనీరు..పల్లెల్లో దొరికే తాటి ముంజల రుచిని కోరుకునే యువకుడి కథ ‘ముంజలు’. నేటితరం.. పల్లెలకు దూరం అవుతుందనే ఆవేదన ఈ కథలో కనిపిస్తుంది. ఒకప్పుడు గ్రామాల్లో ఎవరి వృత్తులను వాళ్ళు నిర్వహించే సంప్రదాయం ఉండేది. ఆధునిక కాలంలో వృత్తులు కార్పోరేటీకరణ చెందిన తర్వాత ఎవరైనా ఏ వృత్తి అయినా చేపట్టవచ్చు అనే పరిస్థితులు వచ్చాయని ప్రపంచీకరణ తెచ్చిన మార్పులలో సానుకూలతను ప్రకటించే కథ ఇది.
ప్రపంచీకరణ ప్రభావం జనజీవనంపై తీవ్రంగా ఉంది అంటూ సుజాతారెడ్డి చిత్రించే కథలు ‘మరో మార్క్స్ పుట్టాలె ‘ అనే సంపుటిలో అధికంగా కనిపిస్తాయి. ఈ యాంత్రిక జీవన విధానంలో భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన కొరవడుతున్నది. ఒకరిపై మరొకరి ఆధిపత్య ధోరణి సహించలేని వారు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. భర్త నిర్లక్ష్యానికి గురైన ఓ యువతి అతడి స్వార్థానికి అహంభావానికి మానసికంగా కృంగిపోయి తన కన్నకూతురినే చంపుకునే స్థాయికి దిగజారిన వైనాన్ని “ఉన్మాదంలోకి..” కథలో రచయిత్రి అద్భుతంగా చిత్రించారు.
_______
రాబోయే అభివృద్ధిని ముందుగానే పసిగట్టిన రాజకీయ నాయకులు.. రైతులను మభ్యపెట్టి వారి భూములను చౌక ధరలకు కాజేసి, వాటిని ప్లాట్లుగా మార్చి, కోట్లను సంపాదిస్తున్న వైనం నేటి ప్రపంచీకరణ ఫలితమే. అందుకే నాయకులు ఓట్ల కోసం నిలబడేది, వాళ్ల ఆస్తుల సంపాదనకే గాని దేశం అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు కాదని, కంప్యూటర్లో వైరస్ ప్రవేశిస్తే మొత్తం సిస్టం చెడిపోయి, పనిచేయకుండా అయితదని, అట్లా దేశ వ్యవస్థ అనే సిస్టంను పనిచేయకుండా చేస్తున్న వైరస్ రాజకీయ నాయకులు అని సుజాత రెడ్డి ‘వైరస్’ కథ ద్వారా తేల్చి చెప్పారు.
_______
1990 దశకం తర్వాతనే రాజకీయాలలో వ్యాపారాత్మకత పెరిగిపోయింది. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా వ్యాపారమైనాయి. పదవి కోసం, ఓట్ల కోసం తన కన్న వారిని కూడా కడతేర్చడానికి వెనుకాడని రాక్షసత్వం సమాజంలో వేళ్లూనుకున్నది. తన ప్రత్యర్థిపై గెలవడానికి తన సొంత కుమారుడిని హత్య జేయించి ఆ సానుభూతితో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన కుటిల రాజకీయ నాయకుని కథ ‘యజ్ఞ బలి’.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సామాన్యులకు ఎరవేసి వాయిదాల రూపంలో వాళ్ల కష్టార్జితం కాజేసి చివరకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేస్తున్న అనేక సంఘటనలు ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం. ఈ దగాను తెలియజేస్తూ ముదిగంటి సుజాతారెడ్డి రాసిన కథ ‘భూమి లేచిపోయింది’.
బ్యూరోక్రసీలో నిర్లక్ష్యం, అవినీతి పెరిగిపోయినప్పుడు సాధారణ ప్రజల సమస్యలు తీర్చడానికి దళారీల వ్యవస్థ ఏర్పడుతూ వస్తుంది. తాను పోగొట్టుకున్న పాస్పోర్టు నిజాయితీగా పొందవలసి ఉన్నప్పటికీ అధికారుల అలసత్వం కారణంగా బ్రోకర్ ద్వారా పొందవలసిన పరిస్థితి ఏర్పడిన వైనాన్ని “సారీ తప్పలేదు” కథలో గమనించవచ్చు. అమెరికా మొదలైన దేశాలకు వలస వెళ్లడం పట్ల భారతీయులు చూపిస్తున్న ఆసక్తిని, భారత దేశంలో పెరిగిపోతున్న లంచగొండితనాన్ని రచయిత్రి ఈ కథలో చర్చించారు.
ఇదే అంశంతో మరొక కోణాన్ని చర్చించిన కథ ‘బ్రెయిన్ డ్రెయిన్’. మాతృభూమికి సేవ చేయాలని, మాతృభూమి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఎంతో ఆసక్తితో అమెరికాలో లక్షల రూపాయల జీతాలను వదులుకొని భారతదేశానికి వచ్చిన ప్రవాస భారతీయులకు సరియైన సహకారం అందక, వాళ్ళ ఉత్సాహం నీరు కారిపోయి, చివరకు అమెరికాకు వెళ్ళిపోయే కథ ఇది. ఈ కథకి ‘ప్రపంచీకరణమా నీవెక్కడ?’ అనే మరొక పేరు కూడా ఉంది.
___
ఈ కార్పొరేట్ యుగంలో సినిమా రంగం కూడా వంశపారపర్యంగా మారిపోతోంది. హీరోల కొడుకులే హీరోలు అవుతున్నారు. నిర్మాతల కొడుకులే నిర్మాతలు అవుతున్నారు. దూరపు కొండల వంటి రంగుల ప్రపంచమైన సినిమా రంగాన్ని నమ్ముకుని వచ్చి అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి మోసపోయిన అమ్మాయిల దీనగాథను చిత్రించిన కథ “దోపిడీ! దగా!”. ఉద్యోగ ఉపాధ్యాయ రంగాల వంటి సంఘటిత రంగాలు హక్కుల కోసం పోరాటం చేస్తుంటే అసంఘటిత రంగంలో మోసపోతున్న అబలల పరిస్థితిని గురించి ఆలోచింపజేసే కథ ఇది.
___
కంప్యూటర్ రంగంతో ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు అన్ని రంగాలను శాసిస్తున్న రంగం సాఫ్ట్వేర్. నేటి యువత కూడా సాఫ్ట్వేర్ రంగంపై ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. బహుళ జాతి కంపెనీల గుప్పెట్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ రంగంలో నయా వెట్టిచాకిరి వ్యవస్థ కొనసాగుతోంది. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాలకు బదులుగా పన్నెండు గంటలు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సమస్యలను చక్కగా చర్చించిన కథ ‘మరో మార్క్స్ పుట్టాలె’. సాఫ్ట్వేర్ కార్మికుల శ్రమ దోపిడీని అరికట్టడానికి మరో కారల్ మార్క్స్ పుట్టవలసిన అవసరం ఉంది అంటారు రచయిత్రి.
ఇవే కాక ప్రభుత్వ అవసరాల కోసం ఓ సన్నకారు రైతుభూమిని అక్రమంగా గుంజుకున్న కథ “సీతయ్య చెల్క”. తమ మార్కెటింగ్ మాయాజాలంతో వస్తు ఉత్పత్తులను అమ్ముకోవడానికి బహుళ జాతి కంపెనీలు చేసే ప్రయత్నాలను చెప్పే మార్కెట్ మాయాజాలం కథ. భూమిపై మమకారాన్ని వదులుకోలేని రైతు కథ “పేగు బంధం” మొదలైన కథల్లోనూ సుజాత రెడ్డి ప్రపంచీకరణ దుష్ఫలితాలను, సమాజంపై వాటి ప్రభావాలను చర్చించారు.
ముదిగంటి సుజాతారెడ్డి తన కథల్లో ఆధునిక జీవితంలో వస్తున్న పెనుమార్పులను, సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్న వ్యవసాయ రంగాన్ని, మానవ సంబంధాల్లో వస్తున్న అవాంఛనీయ మార్పులను, ప్రపంచీకరణ ఫలితంగా చెదిరిపోతున్న విలువలను, అందుకు తగ్గ పరిష్కారాలను సందర్భానుసారం చక్కగా విశ్లేషించారు. సుజాతారెడ్డి కథలు వారి సామాజిక స్పృహకు, సునిశిత పరిశీలనా దృష్టికి తార్కాణాలు. తెలంగాణ సారస్వత పరిషత్ వారు ఇటీవల సుజాతారెడ్డి గారి ఏరిన కథలను రెండు సంపుటాలుగా ప్రచురించారు. ప్రతుల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్:040-24753724
– డాక్టర్ సాగర్ల సత్తయ్య
79891 17415