మహిళా ఇంజినీర్లు అరుదుగా కనిపించిన కాలంలో, ఏకంగా రహదారులు-భవనాల శాఖలో ఇంజినీరుగా పని చేసి, తన ఆధ్వర్యంలో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు వేయించారు పసుమర్తి పద్మజ వాణి. అక్కడితో ఊరుకుంటే ఈమెని గురించి ఎక్కువమందికి తెలియకపోను. ఆ రోడ్డు నిర్మాణ అనుభవాలకి ఇతరత్రా ఆలోచనల్ని జతచేసి కవిత్వంగానూ, కథలుగానూ మలిచారు. ఎప్ప్పుడో 1981 లో మొదలు పెట్టి 2011 వరకూ అప్పుడొకటి ఇప్పుడొకటిగా రాస్తూ వచ్చిన తొమ్మిది కథలని కలిపి మొన్నీమధ్యనే ‘బతుకు రాదారిలో..’ పేరిట కథాసంపుటి తీసుకొచ్చారు. పుస్తకంలో ఈ పేరుతో ఒక్క కథ కూడా లేదు కానీ, ఏకంగా మూడు కథలకి నేపథ్యం రహదారుల నిర్మాణమే. తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా కథా సాహిత్యంలో ఎవరూ తలకెత్తుకోని సబ్జెక్టు. ఇతివృత్తంలో పోలిక తప్పిస్తే, మూడు కథలకీ పోలిక లేదు. ఆ మాటకొస్తే, మొత్తం తొమ్మిది కథలూ వేటికవే ప్రత్యేకం.
చదివినప్పుడు మాత్రమే కాదు, మొత్తం పుస్తకాన్ని పూర్తిచేసి పక్కన పెట్టాక కూడా మర్చిపోలేని కథ ‘ఎత్తు గుండెలు’. టెక్నాలజీ అభివృద్ధి చెందాక అప్పటివరకూ కష్టమైన ఎన్నో పనులు సులభమయ్యాయి. కొన్ని వృత్తుల్లోని రిస్క్ శాతం బాగా తగ్గింది. అయితే, రోడ్ల నిర్మాణానికి సంబంధించి మాత్రం రావాల్సినంత మార్పు రాలేదనిపిస్తుంది. నాలుగున్నర దశాబ్దాల క్రితం రాసిన ఈ కథలో వర్ణించిన విధంగానే ఇప్పటికీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆ కార్మికుల ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ నేటికీ అలాగే వున్నాయి. తండ్రి మందలింపుల తాలూకు అసహనంతో కాంట్రాక్టర్ కొడుకు సైట్ (రోడ్డు నిర్మాణం జరిగే చోటు)కి రావడంతో మొదలయ్యే కథ అనేక మలుపులు తిరుగుతుంది. ‘పిశాచి శవంలా భారంగా కదిలింది’ లాంటి వాక్య విన్యాసాలున్నాయి. ఈ కథ చదివిన తర్వాత, పాఠకులకి ఎక్కడైనా రోడ్డు పనులు తారసపడితే తప్పకుండా కాసేపాగి పరిశీలనగా చూస్తారు తప్ప, మునుపటిలాగా విసుగ్గా కదలిపోరు.
_________________
రహదారి పనులకి ఎదురయ్యే అవాంతరాలతో మొదలయ్యి, గ్రామ రాజకీయాల మీదుగా సాగి, ధర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల జరగబోయే నష్టాలపై చైతన్యం దగ్గర ముగిసే కథ ‘ఒక ఆకుపచ్చదనం కోసం’. పనుల నాణ్యత విషయంలో స్థానికులు, రాజకీయ నాయకుల నుంచి ఎదురయ్యే ప్రశ్నల మొదలు, వాటిని ఎదుర్కోడంలో జరిగే ఆఫీసు రాజకీయాల వరకూ అనేక అంశాలని స్పృశించారు రచయిత్రి.
_________________
వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా కథలో భాగం చేయడం వల్ల, పాఠకులకి వార్తలు చదువుతున్నట్టో, ఉపన్యాసం వింటున్నట్టో కాక, కథ చదువుతున్న అనుభూతి పొందుతూనే కొత్త విషయాలు అనేకం తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇబ్బంది పెట్టిన గ్రామస్తులనుంచే మద్దతు దొరకడం, కొందరు రాజకీయాలు చేసిన ఆఫీసు నుంచే మరికొందరు సరిగ్గా సమయానికి సాయానికి రావడం లాంటి సన్నివేశాల ద్వారా కథని ఆశావహంగా నడిపి, ముగించారు.
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్ళని చర్చించిన కథ ‘ఈ అమృతం చాలుతుందా’. నిజానికి పద్మజ వాణి రాసిన ఏ కథా కేవలం ఒకే విషయం చుట్టూ తిరగదు. ఈ కథ కూడా సెల్ ఫోన్ కెమెరాల దుర్వినియోగం మొదలు, గిరిజన ప్రాంతాల్లో గంజాయిసాగు వరకూ అనేకానేక అంశాలని చర్చిస్తుంది. వీటన్నింటినీ కథలో భాగం చేయడంలో రచయిత్రి నేర్పు కనిపిస్తుంది. ‘ఒక ఆకుపచ్చదనం కోసం’ కథలో కనిపించే ఇంజనీరింగ్ స్టాఫ్ ఈ కథలోనూ కనిపిస్తారు, పేర్లతో సహా ఏమార్పూ లేకుండా. అడవి అందాలనీ, అక్కడి రాజకీయాల వికృత రూపాన్నీ వెనువెంటనే చూపించే కాంట్రాస్టు గుర్తుండిపోతుంది. ప్రభుత్వం వారి కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి ప్రచారం కోసం రాశారేమో అనిపించే కథ ‘చేజారని స్వర్గం’. ఇది నవతరం పాఠకుల ఊహకి ఏమాత్రం అందుతుందన్నది సందేహమే. టీవీ సీరియళ్ల మీద సెటైర్ గా రాసిన ‘సీ..మా..’ కూడా హాస్యంగా మొదలై, మధ్యలో మలుపు తిరిగేస్తుంది.
వస్తువులోనూ, నడకలోనూ కూడా ప్రత్యేకంగా అనిపించే కథ ‘వల’. ఉద్యమకారులు కెరీరిస్టులుగా మారిపోవడాన్ని గురించి సూక్ష్మస్థాయి పరిశీలన ఈ కథ. ఆధునిక కాలంలో కలిగినింటి ఆడపిల్ల పెళ్లి అనే ఇతివృత్తం చుట్టూ అల్లిన కథ ‘సహజమే.. కానీ’. కథ పూర్తి చేశాక కూడా, ఈ ‘కానీ…’ వెంటాడుతుంది. సంపుటిలో తొలికథ ‘చిలుకలు వాలిన చెట్టు’ పాఠకులని ఒక భవన నిర్మాణ స్థలికి తీసుకుపోతుంది. తడి సిమెంటు వాసన నాసికని సోకుతుంది. కూలీల పరాచికాలు చెవులకి వినిపిస్తాయి.
చివరి కథ ‘కళ్ళల్లో పెళ్లిపందిరి’ భద్ర జీవితపు స్త్రీ పురుషుల వివాహ సమస్య. నాయిక, నాయకుడిని మోహించడం, అతడు తిరస్కరించడం, అనూహ్యంగా నాయకుడు జబ్బు పడడం, నాయిక తన సేవలతో అతడి మనసు గెలవడం ఈ రెండు కథల్లోనూ ప్రధానంగా కనిపించే పోలికలు. ఒక వృత్తాన్ని పూర్తి చేయడం కోసం ఈ కథల్ని సంపుటిలో మొదటా, చివరా ఉంచారా అని సందేహం కలిగింది.
పఠనానుభవానికి వస్తే, ‘బతుకు రాదారిలో’ సంపుటిలో ఏ కథ చదవడమూ కూడా సాఫీగా సాగే హైవే ప్రయాణం కాదు. ప్రతి కథా అనేక మలుపులు తిరుగుతూ ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. పాత్రలని మంచివి, చెడ్డవి అని బేరీజు వేసేసి తీర్పులు చెప్పకపోవడం బాగుంది. ఒక ముగింపుకి తీసుకు వెళ్లడం కోసం కథని చెప్పడం కాకుండా, తాను అనుకున్నవన్నీ చర్చించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కథలని రాశారనిపించింది. జీవం ఉన్న పాత్రలు, నాటకీయత మోతాదు మించని సంభాషణలు, అవసరం మేరకి కనిపించే వర్ణనలు ఈ ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని హాయిగా పూర్తి చేయడానికి దోహద పడ్డాయి. రోడ్ల నిర్మాణం అనే అరుదైన వస్తువు చుట్టూ కథలు అల్లిన పద్మజ వాణికి ఇచ్చే అభినందన ఈ కథలని చదవడమే. రచయిత్రి ( ఫోన్ నెంబర్: 82474-99024) స్వయంగా ప్రచురించుకున్న ఈ 144 పేజీల పుస్తకం వెల రూ. 150. విశాలాంధ్ర, నవోదయ, నవ చేతన, నవ తెలంగాణ బుక్ హౌసుల్లోనూ కాపీలు లభిస్తున్నాయి.

– కె.ఎన్. మురళీ శంకర్
94401 34256
