హైదరాబాద్ : ఈదురుగాలులకు బీభత్సానికి తెలంగాణలో 9 మంది మృతిచెందారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి పదేళ్ల చిన్నారితో పాటు నలుగురు మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు శివారులో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పొలంలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కిందకు అక్కడే పని చేస్తున్న తొమ్మిది మంది వెళ్లారు. గాలి బలంగా వీయడంతో షెడ్డుపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది. దీంతో గోడ పక్కనే ఉన్న యజమాని మల్లేశ్, అతని పదేళ్ల కుమార్తె సహా అక్కడ పని చేసే మరో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కాగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు తెలకపల్లి మండల కేంద్రంలో లింగాల రోడ్డులో పిడుగుపాటుకు గురై 13 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బిజినెపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో కూడా పిడుగుపడి మరో వ్యక్తి చనిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంతటి చౌరస్తాలో కారులో కూర్చున్న వేణుగోపాల్‌పై పక్కనే ఉన్న రేకుల షెడ్డు కూలడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో గాలి దుమారంతో కూడిన వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగిపోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలోని కీసర నుంచి షామీర్ పేట వైపు వెళ్లే రోడ్డులో ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వారిపై చెట్టు పడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి.