కవిత్వ నిర్వచనం, దాని నిర్మాణం పట్ల ప్రాచీన లాక్షణికుల నుండి ఆధునిక కవుల వరకు కొత్త కొత్త వ్యూహాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. వస్తువుకి అనుగుణమైన రూపాన్నీ, శిల్పాన్నీ ఎన్నుకోవడంలోనే కవి ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొంతమంది మంచి వస్తువుని తీసుకున్నా, దాన్ని తగిన శిల్పంలో అభివ్యక్తీకరించలేరు. అలాగే, శిల్పం తెలిసినా వస్తువుని దానికి అనుగుణంగా వాడుకోవడం కూడా తెలియని వాళ్ళున్నారు. శిల్పం కోసమో, ప్రయోగం కోసమో రాసే కవులు వస్తువుని నిర్లక్ష్యం చేస్తారు. వీటిని వచన కవిత్వం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు లాక్షణికులు చర్చిస్తూనే ఉన్నారు. వస్తురూపాల పేరుతో సృజనలోకంలో జరిగిన చర్చ సామాన్యమైంది కాదు. చివరికి వాళ్ళంతా వస్తువుకే ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్నారు.
_________________
సమకాలీన వచన కవిత్వాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న వాళ్ళలో జి.లక్ష్మీనరసయ్య, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, పాపినేని శివశంకర్, బి.తిరుపతిరావు, సంగిశెట్టి శ్రీనివాస్, నారాయణశర్మ, యాకూబ్, వంశీకృష్ణ, ఎం.ఎం.వినోదిని, పి.శ్రీనివాస్ గౌడ్, బొల్లోజు బాబా, కోయి కోటేశ్వరరావు, సుంకర గోపాల్, కె.జి.వేణు, దాసరి అమరేంద్ర, పెరుగు రామకృష్ణ, శైలజా మిత్ర, పల్లెపట్టు నాగరాజు, తగుళ్ళ గోపాల్, తండా హరీష్ గౌడ్, కెంగార మోహన్ ఇలా ఇంకా చాలా మంది కనిపిస్తున్నారు.
___________________
మొదటి తరం విమర్శకులు ప్రాచీన సాహిత్యంపైనా, కొంతమంది రెండింటినీ సమప్రాధాన్యంలో విమర్శ చేశారు. రెండు, మూడవ తరానికి చెందిన విమర్శకులు, కవులు వచన కవిత్వ వస్తు, నిర్మాణాలను సీరియస్ గానే పరిశీలిస్తున్నారు. కొంతమంది పత్రికల్లో ధారావాహికంగా రాస్తుంటే, మరికొంతమంది ఫేస్ బుక్ ని శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకుంటున్నారు.
ముందుమాటల్లో కూడా ఈ దిశగా చర్చ చేస్తున్నవాళ్ళున్నారు. ఈ దిశగా వచ్చిన ఒక మంచి పుస్తకం కెంగార మోహన్ గారి ‘చెమట చెక్కిన వాక్యం’ శీర్షికలోనే శ్రామిక వర్గ దృష్టితో రాసిన సాహిత్యాన్ని పరామర్శించే పుస్తకం అని తెలుస్తుంది. దీనిలో అరవైమంది పుస్తకాలపై సమీక్షల్లాంటి వ్యాసాలున్నాయి. ప్రతి వ్యాసంలోను కవిత్వవస్తు, నిర్మాణాలపై చర్చించే కొత్త కొత్త అంశాలుండటం విశేషం. సాధారణంగా వ్యాసాల శీర్షికలుగా కవితా పాదాలనే ఎంచుకోవడం ఆయన శైలిలోని ప్రత్యేకత. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రసిద్ధ కన్నడ రచయిత కుం.వీరభద్రప్ప ‘తెలుగు సాహిత్యాన్ని తన కవితల ద్వారా విస్తరించిన వారు. వీరంతా తమ నిరంతర చైతన్యంతో సాహిత్యంలో సామాజిక స్పృహను చాటుతున్నార’ని వ్యాఖ్యానించారు. డా.కె.నాగేశ్వరాచారి, వొరప్రసాద్ వంటి వారంతా ఈ పుస్తకానికి సైద్ధాంతిక సమన్వయంతో ముందుమాటలు రాశారు.
ఈ గ్రంథం సమకాలీన తెలుగు సాహిత్య విమర్శలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుంది. రచయిత అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా తనకున్న అనుభవాన్ని, సామాజిక స్పృహను జోడించి, కవిత్వంలోని అక్షరాల వెనుక ఉన్న ఆవేదనను, శ్రమను (చెమటను) సహృదయంతో విశ్లేషించారు. ఈ సంపుటిలో ఉన్న ప్రతి వ్యాసంలోనూ ఒక్కొక్క కవి/ రచయిత/ రచయిత్రి దృక్పథాన్ని ఎంతో లోతుగా, బ్యాలెన్స్డ్ గా పాఠకుల ముందుంచారు. ఇందులో డా.సి.నారాయణరెడ్డి, అద్దేపల్లి రామమోహనరావు, కె. శివారెడ్డి, అఫ్సర్, ఎండ్లూరి సుధాకర్ వంటి దిగ్గజ కవుల నుండి వర్తమాన యువ కవులు, రచయితల వరకు, రెండు తరాలను సమన్వయం చేస్తున్న వారి రచనలను విశ్లేషించారు. తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం సృష్టించిన నాగప్పగారి సుందర్ రాజు సాహిత్య దృక్పథాన్ని ఎంతో చక్కగా అంచనా వేశారు. అనేకమంది రచనలపై లోతైన విశ్లేషణ చేశారు. ముఖ్యంగా రాయలసీమ కరువు బతుకులు, దళిత అస్తిత్వ వాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణ ప్రభావాలను ప్రతిబింబించే కవితా సంపుటాలకు ఈ పుస్తకంలో పెద్దపీట వేశారు.
ఈ పుస్తకంలో రచయిత మోహన్ ప్రస్తావించిన రచయితలు, రచయిత్రులు కొన్ని ధోరణులకు ప్రాతినిధ్యం వహిస్తారన్నట్లుగా కూడా అనిపిస్తుంది. అద్దేపల్లి (ప్రపంచీకరణ), శివారెడ్డి (ప్రగతిశీల కవిత్వం), అఫ్సర్, షేక్ కరీముల్లా (డయాస్పోరా, ముస్లిం మైనారిటీ), ఎండ్లూరి సుధాకర్, నాగప్పగారి సుందర్ రాజు ( మాదిగ సాహిత్యం), పల్లెపట్టు నాగరాజు, పలమనేరు బాలాజీ (రాయలసీమ, దళిత జీవితం)… ఇలా ఈ పుస్తకంలోని రచయిత/ రచయిత్రుల భావజాలం, అస్తిత్వ వాదాలు, ధోరణులకు ప్రాతినిధ్యం కూడా కనిపిస్తుంది. మరణించిన నాగప్పగారి సుందర్ రాజు, కెరె జగదీశ్ ల గురించి రాసిన వ్యాసాలు వారికి గొప్ప నివాళి.
మణిపూర్ లో జరిగిన మారణకాండను అత్యంత శక్తివంతంగా కవిత్వం చేసిన కవి చౌశా. ఈ కవినీ, కవిత్వాన్ని రచయిత ఇలా వ్యాఖ్యానించారు. ‘ఈ దారుణ మారణకాండకు సంబంధించి ప్రతి అంశాన్ని కవి చౌశా కవితలుగా రాశాడు. చాలా స్పష్టతతో అవగాహనతో ఈ వర్తమాన ప్రపంచంలో ఏం జరుగుతున్నదో దానికే కవి అక్షరరూపం ఇచ్చాడు. కాలంతో పోటీ పడుతున్న యువకుల్లో కొందరికి వెంటనే గుర్తింపు కావాలనే కోరిక వుంటుంది. అలా వుంటే మంచి కవిత్వాన్ని ఎలా రాయగలరని భయమేస్తుంది. కాని ఈ కవి ఇలా కాదు. నిరంతరం వర్తమాన సమాజాన్ని, సమాజంలోని సంక్లిష్టతల్ని, కవిత్వంగా రాస్తున్నాడు. కవిత్వాన్వేషణ భిన్నంగా సాగిస్తాడు. రాజకీయ వ్యతిరేక కవిత్వం అనడం కంటే అమానవీయ ఘటనలు ఏవి విన్నా కనబడ్డా అది కవి చౌశా చేతిలో కవిత్వమైపోతుంది.’’ ఇలా ఈ పుస్తకంలో ప్రతి కవి గురించీ ప్రస్తావించుకోవాల్సినన్ని వ్యాఖ్యానాలున్నాయి.
తెలుగు కవిత్వం సామాజిక మాధ్యమాల పుణ్యమా అని పుంఖానుపుంఖాలుగా వస్తున్నా, అందులో అధ్యయనం లోపించి పలుచని కవిత్వం ఎక్కువగా కనిపిస్తోందనే కెంగార మోహన్ అభిప్రాయంలో ఎంతో వాస్తవం కూడా ఉంది. కవిత్వం రాయడమంటే కేవలం అక్షరాలతో మాయ చేయడం కాదనీ, అది సమాజ గర్భంలోంచి పుట్టి, గుండెను తాకేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కవిత్వానికి నిర్దిష్టమైన మౌలిక సూత్రాలు, ప్రాపంచిక దృష్టి, ప్రజాస్వామిక దృక్పథం ఉండాలని నొక్కి చెబుతూ, కవులకు అధ్యయనంపై ఉండాల్సిన అవగాహనను కూడా ఈ పుస్తకం ద్వారా వ్యక్తీకరించారు. ప్రతి వ్యాసంలోను ఆధునిక విమర్శకుల అభిప్రాయాలను ప్రస్తావిస్తూ సమన్వయం చేయడం వల్ల ఒక అకడమిక్ విశ్లేషణ పద్థతిని కూడా అనుసరించారు. సమకాలీన కవిత్వాన్ని సుసంపన్నం చేస్తున్న మరికొంతమందికి కూడా ఈ పుస్తకంలో చోటుంటే మరింత సమగ్రమయ్యేది. అయితే ప్రగతిశీల దృక్పథాన్ని ప్రతిఫలించేవారికే లేదా అటువంటి రచనలనే దీనిలో తీసుకున్నా,రనుకుంటే సరిపోతుంది.
_________________
రచయిత ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కేవలం ఆలంకారిక సూత్రాలు, సిద్థాంతాలు మాత్రమే సరిపోవనీ, చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక దృక్కోణాన్ని కూడా ప్రదర్శించినప్పుడే ఆ కవిత్వానికి సజీవత్వం సిద్ధిస్తుంటారు. అందువల్ల చార్లెస్ డార్విన్, కారల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి మహనీయుల సిద్ధాంతాలను అధ్యయనం చేయాలని మోహన్ సూచించారు. వస్తువు, శిల్పం, శైలి, కవిత్వ భాషల మధ్య సమన్వయం కుదిరినప్పుడే అది ఉత్తమ కవిత్వం అవుతుందని ఆయన విశ్లేషించారు. తన విమర్శనా వ్యాసాల ద్వారా కవులను ప్రేరేపించి, సమాజానికి మేలు చేసే చిక్కని సృజన వైపు మళ్లించాలనే తాపత్రయమే ఈ ‘సాహిత్య పరామర్శ’కు మూలమని ఈ పుస్తకాన్ని చదివితే తెలుస్తుంది.
___________________
లోసారి సుధాకర్, జి. వెంకటకృష్ణ వంటి కవుల రచనలలోని మనోవైజ్ఞానిక కోణాలను, సామాజిక ధిక్కార స్వరాలను మోహన్ పదునైన విశ్లేషణతో పాఠకులకు అందించారు. కవిత్వ వస్తువులోని గాఢతను గుర్తిస్తూనే, దాని అభివ్యక్తిలోని శిల్పాన్ని ‘చెమట చెక్కిన వాక్యం’గా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ కవి పాబ్లో నెరుడా, ఇరానియన్ కవి అబ్బాస్ కియారోస్తమి కవిత్వాన్ని కూడా పరిచయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వెలువడిన శ్రామిక దృక్పథాన్ని రుచి చూపించగలిగారు. ఇది సమీక్ష స్వభావం ఉన్న విమర్శ గ్రంథంగా కనిపిస్తుంది.
సమకాలీన కవిత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారికి ఒక దిక్సూచిగా కెంగార మోహన్ గారి ’చెమటచెక్కిన శిల్పం’ గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. సాహిత్యానికున్న సామాజిక ప్రయోజనాన్ని కూడా సాధికారికంగా తెలియజేస్తుంది.

– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
పూర్వ అధ్యక్షులు, తెలుగుశాఖ,
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్
