మ‌ర‌పురాని మ‌ధుర గీతాల సృష్టిక‌ర్త‌… వేటూరి

సినిమా హోమ్

(జ‌న‌వ‌రి 29న వేటూరి జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేకం)

మానసవీణలు మధురగీతాలు పాడాయి….
“వెల్లువొచ్చి గోదారమ్మా వెల్లకిలా పడింది.”
గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రనా ఎందువలన? అని సందేహాలు కలిగాయి….
నెమలికి నేర్పిన నడకలు, మురళికి అందని పలుకులు…
అందానికి అందమైన పుత్తడి బొమ్మలు దొరికారు….
తకిట తకిట తందానాలు, జగడ జగడ జగడాలు, మసజసతతగ శార్ధూలాలు,గసగసాల కౌగిలింతలు తెలుగు పాటను శృంగారభరితం…రసవంతం చేశాయి….
ఇలాంటి మ‌ర‌చిపోలేని, మ‌రుపురాని ఎన్నో గీతాల‌కు సృష్టిక‌ర్త వేటూరి సుంద‌ర రామ‌మూర్తి.
వేటూరి అని ముద్దుగా పిలుచుకునే వేటూరి సుంద‌ర రామ మూర్తి తెలుగు సినిమా సాహిత్య పూదోటకు మకుటం లేని చక్రవర్తి . ఎన్నో వేల పాట‌ల‌కు ప్రాణం పోసిన మ‌హా క‌వి. గుడి ఎనక నా సామీ అంటూ శృంగార భ‌రిత గీతం రాసినా ఆయనే శంకరాభరణం రాసినా ఆయనే.. అన్నీ ఆయనకే సాధ్యం.
తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 1974 లోవచ్చిన ‘ఓ సీత కథ తో సినీ గీతాల రచన క్రొత్త మలుపు తిరిగింది.
ఆ పదవిన్యాసంలో..ఆ నవ్యతలో, ఆ వైవిధ్యంలో, ఆ నిర్భయ పదసృష్టిలో…ఆ ప్రభంజనంలో.. సినీ కవిత నాలుగు దశాబ్ధాల పాటు ఉర్రూత లూగింది.
ఆయన రాకముందు ఎందరో మహామహులు సినీ గీతాలు, సాహిత్యవిలువలతో వ్రాశారు. నీతులు రాశారు. బూతులు రాశారు. కానీ వేటూరి రాకతో రసవద్గీతలు , భగవద్గీతలు కూడా ప‌దునైన ప‌దాల‌తో ప‌ల‌క‌రించాయి, పున్నాగపూలు సన్నాయి పాడాయి..కోకిలమ్మకు పెళ్ళి కుదిరింది…కోనంతా పందిరయ్యింది…చిగురాకులు తోరణాలయ్యాయి.
సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించిన గొప్ప క‌వి ఆయ‌న‌. సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, శంక‌రాభ‌ర‌ణం… ఇలా ఎన్నో మ‌హ‌త్త‌ర సినిమా పాట‌ల‌కు జీవం పోసి, ప్రేక్ష‌కుల గుండెల్లో ప‌ది కాలాల పాటు ఆ పాటలు గుర్తుండిపోయేలా చేసిన మ‌హా ర‌చ‌యిత వేటూరి.
వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించారు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, విజ‌య‌వాడలో డిగ్రీ పూర్తిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.
సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించిన మ‌హా క‌వి ఆయ‌న‌. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు.
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.

వేటూరి మాతృదేవోభవ చిత్రానికి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే… అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను జాతీయ‌ పురస్కారం ల‌భించింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం వేటూరి వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
“ఆరేసుకోబోయి పారేసుకున్నాను. “.. “నరుడి బతుకు నటన” ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి. అక్ష‌రాల‌నే ప‌దాలతో నాట్యం చేయించిన వేటూరి క‌లం నుంచి ఇలాంటి మ‌ధుర‌మైన , మ‌ర‌పురాని పాటలు వంద‌ల‌కొద్దీ ఉన్నాయి. పాటల‌తో పాటు
ఆయ‌న క‌లం నుంచి అనేక ర‌చ‌న‌లు కూడా వెలుగు చూశాయి. వీటిలో సిరికా కొలను చిన్నది ఒక‌టి.
ఆయ‌న రేడియో కోసం రాసిన సంగీత నాటిక ఇది. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ ఇది. వేటూరి క‌లం నుంచి జాలు వారిన మ‌రో మ‌ణి మ‌కుటం కొమ్మ కొమ్మకో సన్నాయి. వేటూరి కలం నుండి పల్లవించిన ఎందఱో సినీ మహనీయుల ప్రస్తుతి వ్యాసాలే ఈ కొమ్మ కొమ్మకో సన్నాయి. శ్రీశ్రీ త‌రువాత తెలుగు చిత్ర సీమ‌కు జాతీయ స్థాయిలో గౌర‌వాన్ని తీసుకొచ్చిన వేటూరి ర‌చించిన మ‌హ‌త్త‌రమైన పాట‌ల‌కు జ‌న‌నీరాజ‌నాలు ప‌ట్టారు. ప్ర‌భుత్వం, ప్ర‌యివేటు సంస్థ‌లు అనేక పుర‌స్కారాల‌తో స‌త్క‌రించాయి.
ఆయ‌న ఎనిమిది నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. వీటితో పాటు వంద‌ల‌కొద్దీ స్థానిక పుర‌స్కారాలు సొంతం చేసుకున్నారు.
ఉత్తమ సాహితీ సుగందాలు గుబాళించే అజరామర సినీ గీతాలను తెలుగు కళామతల్లి చరణ సుమాలుగా అర్పించిన నవనవోన్మేష మూర్తి, విశిష్ట రచనా స్ఫూర్తి వేటూరి. ఆ మ‌హాక‌వి
75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయ‌న కలంనుంచి జాలువారిన ఎన్నో పాట‌లు ఇప్ప‌టికీ ప్రేక్ష‌క హృద‌యాల‌లో స‌రిగ‌మ‌లు ప‌లికిస్తూనే ఉన్నాయి. అలాంటి మహనీయుడు, గొప్ప క‌వి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంద‌న‌డంలో అతిశ‌యోక్తి క‌నిపించ‌దు.

… దాస‌రి దుర్గా ప్ర‌సాద్‌