ఆఫ్రికన్ ప్రజల గుండె చప్పుడు గూగీ వా థియోంగో

సాహిత్యం

“మన జీవితాలు ఒక యుద్ధభూమి. ఈ యుద్ధ భూమి పైన మానవత్వాన్ని నిర్ధారించడానికి ప్రతిజ్ఞ చేసిన శక్తులు, దానిని నాశనం చేయడానికి నిశ్చయించిన శక్తుల మధ్య నిరంతర యుద్ధం జరుగుతుంది. దాని చుట్టూ రక్షణ గోడను నిర్మించడానికి ప్రయత్నించేవారు, దానిని కూల్చివేయాలని కోరుకునేవారు, దానిని రూపొందించాలని కోరుకునేవారు,దానిని విచ్ఛిన్నం చేయడానికి కట్టుబడిన వారు..మన కళ్ళను తెరవడానికి, మనకు వెలుగును చూపించడానికి, రేపటిని చూడడానికి ప్రయత్నించేవారు, మనలను కళ్ళు మూసుకునేలా నిద్ర పుచ్చి ఊయలలో ఉంచాలని కోరుకునేవారు. ఈ విరుద్ధ శక్తుల మధ్య నిరంతరంగా యుద్ధం జరుగుతూనే ఉంటుంది’ అంటారు గూగీ వా థియోంగో. ‘డెవిల్స్ ఆన్ ది క్రాస్’ లో.

తన ఎనభయ్ ఏడేళ్ల వయసులో అమెరికా జార్జియాలోని బుఫోర్డ్ లో చివరి శ్వాస విడిచిన గూగీ వా థియోంగో ఆఫ్రికన్ ప్రజల గుండెచప్పుడు. సమకాలీన సాహిత్య ప్రపంచంలో అతనితో పోల్చదగిన రచయిత మరొకరు లేరు. ఒక భాషను చంపడం అంటే ప్రజల సామూహిక జ్ఞాపకాల ఖజానాను చంపడమే అని ఎలుగెత్తి చాటిన గూగీ, ‘డీ కాలనైజింగ్ ది మైండ్, ది పాలిటిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ఆఫ్రికన్ లిటరేచర్’ తో సంచలనం సృష్టించాడు. ఆ పుస్తకం కేవలం ఆఫ్రికాలోనే కాక మిగతా ప్రపంచం అంతా ఒక పఠనీయ గ్రంథంగా మారిపోయింది.

గూగీ కెన్యాలోని కియాంబు జిల్లాలోని లిమురు సమీపంలోని కమిరుతులో జనవరి 5, 1938న జన్మించాడు. అతడి అసలు పేరు జేమ్స్ గూగీ 1970లో తన పేరులోని జేమ్స్ ను వదిలించుకుని ‘గూగీ వా థియాంగో’ గా మార్చుకున్నాడు. గూగీ తండ్రికి నలుగురు భార్యలు. ఇరవై ఎనిమిది మంది పిల్లలు. మూడవ భార్య వంజికకు గూగీ జన్మించాడు. అంత పెద్ద కుటుంబంలో పుట్టడం, పూట గడవకపోవడం బాల్యం అంతా కష్టాలతోనే గడచింది. గూగీ చదువుకోసం కుటుంబం రోజువారీ ఖర్చులను తగ్గించుకుని మిషనరీల బోర్డింగ్ స్కూల్ లో చదివించింది. గూగీ మిషనరీ స్కూల్ లో ఉండగానే అతడి కుటుంబం మౌమౌ తిరుగుబాటులో చిక్కుకుని కాంప్ కి తరలించబడింది. అక్కడ ఉండగానే తన సోదరుడు గిటాగో బ్రిటీష్ సైనికుల బుల్లెట్లకు బలై చనిపోయాడు.

________________

ఉగాండాలోని మాకేరెరే యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు జరిగిన రచయితల సమావేశంలో గూగీ మొదటి నవల ‘వీప్ నాట్ చైల్డ్’ మాన్యుస్క్రిప్ట్ అప్పటికే ప్రముఖ నైజీరియన్ రచయితగా పేరొందిన చినువాఅబే కి చూపిస్తే బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా అబే కొన్ని సూచనలు చేసి బ్రిటన్ లోని ఒక పబ్లిషర్ కి పంపారు. అలా ‘వీప్ నాట్ చైల్డ్’ వెలుగులోకి వచ్చింది. తూర్పు ఆఫ్రికా నుండి వచ్చిన మొట్ట మొదటి ఆంగ్ల నవల అది.
_______________

బ్రిటీష్ వలస పాలనలో కెన్యా అనుభవించిన వినాశకర పరిణామాల తాత్విక మూలాలను ఈ నవల అన్వేషిస్తుంది. సాంప్రదాయక గ్రీకు సంస్కృతికి, బ్రిటీష్ వలసవాద సంస్కృతికి నడుమ వున్న సాంస్కృతిక ఘర్షణకు అణచివేతకు ఈ నవల అద్దం పడుతుంది. ఆశ జన్మించింది. కానీ ఆశ ధైర్యంగా ఉంటే తప్పకుండా చంపబడుతుంది. అందుకే ఆశ అత్యంత బాధాకరం “Hope was born. But hope, if it is bold, is bound to be killed. That’s why hope is so painful” అన్న వాక్యం నవల ఇతివృత్తమైన ఆకాంక్ష, సంఘర్షణ, వలసాధిపత్య అణచివేతల కఠిన వాస్తవాలను దృశ్యమానం చేస్తుంది. ఇది ప్రధాన పాత్రధారి జోరోగో యొక్క ప్రయాణం. అతడి కలలు, మౌమౌ తిరుగుబాటు, కెన్యాలోని వలస పాలన యొక్క హింస, అన్యాయాలను ప్రతిభావంతంగా చిత్రీకరిస్తుంది. వ్యవస్థాగత అవరోధాలతో నిండిన ప్రపంచంలో ఆశ యొక్క తీపి-చేదు స్వభావాన్ని గ్రహిస్తుంది, ‘వీప్ నాట్ చైల్డ్’ తరువాత మరో రెండు నవలలు ‘రివర్స్ బిట్వీన్’ (Rivers Between), ‘ఏ గ్రైన్ ఆఫ్ వీట్’ (A grain of wheat) కూడా గూగీ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

1977లో గూగీ వలసాధిపత్య ప్రభావాన్ని తిరస్కరించి, తన ఆఫ్రికన్ గుర్తింపును తిరిగి స్వీకరించే ఉద్దేశపూర్వక చర్యగా తన పేరు మార్పును ప్రకటించుకున్నాడు గూగీ. ‘జేమ్స్’ అనే పేరు బ్రిటిష్ నడిపిన పాఠశాలల్లో ఇవ్వబడిన క్రైస్తవ పేరు. దీనిని గూగీ సాంస్కృతిక ఆధిపత్య చిహ్నంగా భావించాడు. ‘గూగీ వా థియోంగో’ అనే పేరును స్వీకరించడం ద్వారా, తన గీకుయు వారసత్వాన్ని కొనసాగించాలి అనుకున్నాడు. ఇక్కడ ‘గూగీ’ అతని పేరు మరియు ‘వా థియోంగో’ అనగా గీకుయులో ‘థియోంగో కుమారుడు’ అని అర్థం. ఈ మార్పు ఆఫ్రికన్ సాహిత్యాన్ని, సంస్కృతిని వలసాధిపత్యం నుండి విముక్తి చేయడం కోసం ఒక బలమైన సంకేతంలా పనిచేసింది.

ఇంగ్లీష్ ఆధిపత్యాన్ని నిరోధించడానికి, స్థానిక భాషలను ప్రోత్సహించడానికి ప్రధానంగా గీకుయులో రాయాలనుకున్న గూగీ నిర్ణయం సాంస్కృతిక భాషా విముక్తి కోసం అతడి నిబద్ధతకు ఉదాహరణగా నిలిచింది. గూగీ తన మిగతా రచనలు అన్నీ తన మాతృభాష గీకుయులోనే రాశాడు. ఆ తరువాత అవన్నీ ఆంగ్లంలోకి అనువదింపబడి ప్రపంచ సాహిత్య పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి. కెన్యా జైలులో వున్నప్పుడు టాయిలెట్ టిస్యూ పేపర్ మీద ‘ది డెవిల్ ఆన్ ది క్రాస్’ రాశాడు. వరవరరావు 1980లలో జైలులో ఉన్నప్పుడు దానిని ‘మట్టికాళ్ళ మహారాక్షసి’ గా మన తెలుగులోకి అనువాదం చేశారు.

కెన్యాలో ప్రభుత్వం మారినాక గూగీ జైలు నుండి విడుదల అయ్యాక ప్రవాసంలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇరవై రెండేళ్లకు కానీ అతడు తన మాతృభూమి మీద అడుగు పెట్టలేదు. అప్పుడు అతడికి అపూర్వ స్వాగతం లభించింది. కానీ మళ్ళీ దాడి జరిగింది. ఆ దాడిలోనే అతడి భార్యను రేప్ చేశారు దుండగులు. అదంతా పొలిటికల్లీ మోటివేటెడ్ అంటారు గూగీ.

గూగీ ఆంగ్ల భాషకు వ్యతిరేకి ఏమీ కాదు. భారతదేశ పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చినప్పుడు యిచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘మాతృభాష రాకుంటే ఏ భాషా రాదు’ అని వ్యాఖ్యానిస్తూ తనకు స్ఫూర్తినిచ్చిన టాగోర్ ఉదంతాన్ని వివరించాడు. ఒకప్పుడు రవీంద్రనాథ్ టాగోర్ దగ్గరకు ఒక భాషా పండితుడు వచ్చాడట. నాకు ఫ్రెంచ్ తెలుసు, రష్యన్ తెలుసు అంటూ మాట్లాడుతూ ఉంటే టాగోర్ అతడిని ఆపి ‘నీకు నీ మాతృ భాష వచ్చా?’ అని అడిగారట. ఆ పండితుడు రాదు అని చెప్పడంతో ‘అయితే నీకు ఏ భాషా రానట్లే’ అని అన్నాడట. మనిషి ఎన్ని భాషలు అయినా నేర్చుకోవచ్చు కానీ మాతృ భాషను వదలొద్దు అంటారు గూగీ.

“What is the difference between a politician who says Africa cannot do without imperialism and the writer who says Africa cannot do without European language’ అని గూగి తన ‘డి కాలనైజింగ్ ది మైండ్’ లో గట్టిగా ప్రశ్నించాడు. ‘విజర్డ్ ఆఫ్ ది క్రో’ లో గూగీ “ఆధునిక ప్రపంచం ప్రైవేట్ మూలధనం ద్వారా సృష్టించబడిందని వాళ్లంటున్నారు.

ఉదాహరణకు, భారత ఉపఖండం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజమాన్యంలో ఉంది, ఇండోనేషియా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజమాన్యంలో ఉంది, మా పొరుగువారు బ్రిటిష్ ఈస్ట్ ఆఫ్రికా కంపెనీ యాజమాన్యంలో ఉన్నారు, కాంగో ఫ్రీ స్టేట్ ఒక వ్యక్తి సంస్థ యాజమాన్యంలో ఉంది. కార్పొరేట్ మూలధనానికి మిషనరీ సొసైటీలు సహాయం చేశాయి. అప్పట్లో ప్రైవేట్ మూలధనం ఏమి చేసిందో, అది మళ్లీ చేయగలదు. థర్డ్ వరల్డ్‌ ను ఎలాంటి మచ్చ, లోపం లేదా కళంకం లేకుండా పశ్చిమ దేశాల రూపంలో యాజమాన్యం చేసి, పునర్నిర్మించగలదు. గతంలో మిషనరీ ఛారిటీలు చేసిన పనిని ఇప్పుడు ఎన్జీఓలు చేస్తాయి. ప్రపంచం ఇకపై ఇరవైయవ శతాబ్దంలోని పాత ఈస్ట్, వెస్ట్ మరియు దిశలేని థర్డ్ అనే విభజనలతో కూడి ఉండదు. ప్రపంచం ఒక కార్పొరేట్ గ్లోబ్‌ గా మారుతుంది, ఇది ఇన్కార్పొరేటింగ్ మరియు ఇన్కార్పొరేటెడ్‌గా విభజించబడుతుంది. మొదటి స్వచ్ఛంద కార్పొరేట్ కాలనీగా మారడానికి, కొత్త గ్లోబల్ ఆర్డర్‌ లో మొదటిదిగా..ఎన్జీఓలు సామాజిక సేవల బాధ్యతను తీసుకోవడంతో, దేశం మీ రియల్ ఎస్టేట్‌గా మారుతుంది” అంటారు.

‘విజర్డ్ ఆఫ్ ది క్రో’ ను గూగీ 2006లో రాశారు. మన దేశంలో కూడా నూతన ఆర్ధిక విధానాలు మొదలయిన తరువాత ప్రపంచమొక విశ్వగ్రామం అనటాన్ని అందుకు అనుగుణంగా మన ఆర్ధిక విధానాలను సవరించుకోవడాన్ని మనం చూశాం. పాతికేళ్ల తరువాత భారతదేశంలో, ఆంధ్రదేశంలో జరుగుతున్న, జరిగిన పరిణామాలను చూస్తే ఆ మాటలు నిజమే అని అనిపిస్తే గూగీ తప్పేమీ లేదు.

_______________

తమ వలసలను స్థాపించుకున్న దేశాలనుండి వలసవాద దేశాలు వెళ్ళిపోయి దేశాలు విముక్తం అయినా ఆ వలసవాద అవశేషాలు ఎలా నూతన స్వాతంత్ర్య దేశాలను పీల్చి పిప్పి చేస్తాయో గూగీ తన ‘రక్త రేకులు’ (పెటల్స్ ఆఫ్ బ్లడ్) లో వివరిస్తాడు. మునీరా (ఉపాధ్యాయుడు), కరెగా (కార్యకర్త), వంజా (బార్‌ మెయిడ్), అబ్దుల్లా (మాజీ మౌమౌ యోధుడు) అనే నాలుగు ప్రధాన పాత్రలుగా ఇల్మొరోగ్ అనే ఊహాత్మక గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని దృశ్యమానం చేస్తాడు.

_______________

ఇప్పుడు మనం విదేశీ పెట్టుబడులకోసం అర్రులు చాస్తూ భూమిని,విద్యుత్ ను, అన్ని రకాల సహజ సంపదలను గుంపగుత్తగా ధారాదత్తం చేయడానికి ఎలా పాకులాడుతున్నామో, కెన్యాలో కూడా స్వతంత్రం వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అలా వెంపర్లాడింది. ఇల్మొరోగ్ గ్రామంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు..దాన్నొక వాణిజ్య కేంద్రంగా మార్చాయి, కానీ స్థానికులు మాత్రం చెప్పలేని దోపిడీకి గురి అయ్యారు. అచ్చు ఇప్పుడు భారత దేశంలో జరుగుతున్నట్టు గానే. డెరెక్ వాల్కాట్ ‘ది స్వామ్ప్’ కవితలో నుండి ‘పెటల్స్ ఆఫ్ బ్లడ్’ అనే పదబంధాన్ని తన నవలకు తీసుకున్నాడు గూగీ.

తెలుగు వాళ్ళతో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న గూగీ మరణం ఆఫ్రికన్ సమాజానికే కాక మొత్తం ప్రపంచానికీ, ప్రత్యేకంగా తెలుగు సమాజానికి పూరించలేని లోటు. గూగీ భావనల వెలుగులో తెలుగు సమాజం మరిన్ని పోరాటాలకు సిద్ధం అవుతుందా? వేచి చూడాలి.

-హర్షనేత్ర