స్ఫూర్తి కందివనం రచించిన ‘చైత్ర’ నవల ఓ మామూలు మధ్య తరగతి అమ్మాయి జీవితం. తన జీవితంలో ఎదురైన పలు చేదు సంఘటనలను, తొంగిచూసిన విషాద అనుభవాలను ఎంతో మానసిక ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలో తనకు తోడ్పాటు అందించిన టీచర్ లక్ష్మి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. కథను నడిపించిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక్క తండ్రి మినహాయిస్తే, ఆమె జీవితంలో ప్రతి ఒక్కరు వెన్నంటి ఉండి, భుజంతట్టి నడిపించిన తీరు పాఠకుల మనసులను కట్టిపడేస్తుంది. తీవ్ర భావోద్వేగాల మధ్య అనేక మలుపులు తిప్పి, అంచెలంచెలుగా చైత్రను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళి చివర్లో విషాదాంతంతో నవలను ముగిస్తుంది. కానీ, దేశానికి మాత్రం సుఖాంతమైన సత్ఫలితాన్ని విజయం రూపంలో అందించి ఊపిరి తీసుకునేలా చేస్తుంది.
____________
ఎన్ని కష్టాలు సమస్యల రూపంలో తలెత్తినా, వాటిని సవాలుగా స్వీకరించి అధిగమిస్తూ, తన జీవిత లక్ష్యం ముందు మిగతావన్నీ స్వల్పమే అనిపించేలా చైత్ర పాత్రని తీర్చిదిద్దారు రచయిత్రి. నేటి యువతరం స్త్రీజాతికి ఆదర్శప్రాయంగా నిలిపారు. దీనిలో చైత్ర పాత్ర ఎంతో సాహసోపేతంగా సాగిపోతుంది. చిన్నచిన్న సమస్యలకే ఓటమి భయంతో, పిరికితనంతో మానసికంగా కృంగిపోతూ తమ జీవితాల్ని అర్ధాంతరంగా ముగించుకునే ఈ నవతరం పిల్లలకి ‘చైత్ర’ నవల నిజంగా ఒక గొప్ప ప్రేరణ, స్ఫూర్తిదాయకం, ఆలంబన. అవసరానికి అడిగిందల్లా కొని పెట్టి, అతి గారాబంతో పిల్లల జీవితాల్ని పెడదోవ పట్టించే నేటి తల్లిదండ్రులకి ఈ నవల ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది.
____________
పాలమూరు జిల్లాకి చెందిన జమిస్తాపూర్ అనే ఓ మారుమూల గ్రామంలో హోరుగాలి, వాన తీవ్రతల మధ్య అట్టడుగు కుటుంబంలో జన్మించిన ఓ ఆడబిడ్డ పుట్టుకతో ఈ కథ మొదలవుతుంది. పితృస్వామిక వ్యవస్థలోని పురుషాధిక్య సమాజ ధోరణికి ప్రతీకగా తండ్రి యాదయ్య పాత్రని మలిచారు రచయిత్రి. లింగవివక్షతలో భాగంగా పసికందైన ఆడశిశువుపై పుట్టుకతోనే చిన్నచూపుని ప్రదర్శిస్తుంటే, అది క్రమేపి అతనిలో ద్వేషంగా మారిపోతుంది. ఆ విధంగా అది పెరిగి పెద్దదై ఆ పసికందు జీవితాన్ని ఎలా వెంటాడి కబళిస్తూ వచ్చిందో ఈ కథ చెబుతుంది. ఈ చిన్నచూపు అక్షరాస్యతలేని ఓ నిరుపేద కుటుంబాన్ని మానసికంగా పీడిస్తూ, సంఘర్షణగా మారి, అడుగడుగునా వేధిస్తుంటుంది. ఇలాంటి ఒత్తిళ్ళ మధ్య ఆమె బతుకు దినదిన గండంగా, నరకప్రాయంగా మారి, పలురకాల క్షోభలకు, అవమానాలకు, అసహనాలకు గురిచేస్తూ చివరిదాకా ఆమెని వెంటాడుతుంది.
దీనికి విరుద్ధంగా తల్లిపాత్రలో గౌరి సున్నితత్వం, ప్రేమ, అమ్మతనం, జాలిగుండె ఈ నవలకి ముఖ్యభూమిక పోషించింది. ఇదే స్వభావాన్ని పోలిన ఉపాధ్యాయిని లక్ష్మి అందించిన ప్రేరణ, ఆదరణ, చొరవ, ఆపేక్ష, నిస్వార్థ దృష్టి, సహాయసహకారం ఈ కథాంశానికి ఓ ప్రధానపార్శ్వం. భర్త చైతన్య ప్రదర్శించిన తెగువ, త్యాగనిరతి, పరోక్ష తోడ్పాటు, అండదండలు చైత్ర మనుగడకు మార్గదర్శిగా, దిక్సూచిగా నిలుస్తాయి. చివర్లో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ్ గుప్తా పాత్ర ఆమెను ప్రోత్సహించి ప్రేరేపించిన తీరు కొత్తకోణంలో ఆలోచింపజేస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే.. చైత్ర పాత్రలో స్వభావరీత్యా లక్ష్యసాధనలో దర్శించే పోరాటతత్వం, సానుకూల దృక్పథం, వ్యవహారశైలి, ఆలోచనా తీరు, పట్టుదల, కఠోర దీక్ష, దేశభక్తి, కార్యాచరణ, మంచితనం, పరోపకార దృష్టి, నాయకత్వ లక్షణాలు పాఠకుల్ని అమితంగా ఆకర్షించి ఆకట్టుకునేలా చేస్తాయి.
చైత్రకి మొదటి నుండి చదువంటే చాలా ఇష్టం. దానికోసం తల్లి కూలి పనులకి వెళ్లి, పాలవ్యాపారం చేసి కష్టపడుతుంటే, చైత్ర ఇంటింటికి వెళ్లి ఆ పాలు పోసి, వచ్చిన సంపాదనతో తన తండ్రికి తెలియకుండా కొంచెం సొమ్మును వెనకేసుకొచ్చి, దానితో చదువుకుంటుంది. కానీ, కూతురు చదువుకుంటుంటే ఓర్వలేని యాదయ్య ఆమెను ప్రోత్సహించకపోగా, ఆపెయ్యడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. గౌరి, లక్ష్మి ల సహకారంతో, పదో తరగతి వరకూ ఎలాగోలా లాక్కొస్తుంది. కానీ, సరిగ్గా పబ్లిక్ పరీక్షల మధ్యలో చైత్రను పరీక్ష రాయకుండా తనచావు పేరుతో బెదిరించి ఆమెను ఊళ్ళో లేకుండా పట్నంలో పనికి కుదురుస్తాడు. అయిష్టంగానే దిగులుతో పనిలో చేరిన చైత్రకి ఆ ఇంటి యజమాని కొడుకు పృథ్వి చూపు ఆమెపై పడడంతో, లాగిపెట్టి కొట్టి ఇంటిబాట పడుతుంది.
ఆ తర్వాత లక్ష్మి చలవ వలన పదో తరగతిని పూర్తి చేస్తుంది. ఇలా కాదని ఈసారి భార్య ఆరోగ్యం పాడైపోయి, కొద్ది రోజుల్లో చనిపోతుందని అబద్దమాడి కూతురికి బలవంతంగా పెళ్లి చేస్తాడు. చైత్ర భర్త చైతన్య మొదట్లో జులాయిగా తిరిగినా, ఓ రోజు భార్య.. బట్టల షాపులో పనిచేస్తుండడం చూసి, తన బాధ్యతను గుర్తించి పేపర్ బాయ్ గా చేరిపోతాడు. దీనికి ఆమె తల్లిదండ్రులు పరమేశ్వరి-లింగయ్యలతో పాటు ఆడపడుచు పుష్ప కూడా ఎంతో సంబరపడతారు. చైత్ర కూడా ఉద్యోగం మానేసి లక్ష్మి టీచర్ సాయంతో అక్కడే కాలేజీలో మళ్లీ చదువుకోవడం మొదలుపెడుతుంది.
ఈ ప్రయత్నంలో భాగంగా చైత్ర, దేశ రక్షణలో జవానుగా సేవ చేయాలన్న తన జీవిత లక్ష్యానికి కట్టుబడి ప్రయత్నాలు ఆరంభిస్తుంది. కానీ ఆ తర్వాత ఆమె కలలో కూడా ఊహించని ఓ పరిణామాన్ని ఎదురుకుంటుంది. దాంతో మానసికంగా ఎంతగానో కుమిలిపోతుంది. ఆ విధంగా ఇక ఇక్కడి నుంచి చైత్ర జీవితంలో పుట్టుకొచ్చే అనేక మలుపులు, వాటిని ఆమె ఎదురుకునే తీరును, అదంతా ఇలా చెప్పడం కంటే పాఠకులే చదివి నేరుగా అనుభూతి చెందాల్సిందే.
మనసుకు హత్తుకునేలా రాసిన చైత్ర రచనా శైలి, దానిని నవలగా మలిచిన తీరు, ఎంచుకున్న కథా వస్తువు.. వాస్తవానికి దగ్గరగా, సహజంగా ఉన్నాయి. ఒక చలనచిత్రంగా మలచగలిగేంత విశాల దృక్పథ ఇతివృత్తం దీనిలో అంతర్లీనంగా ఇమిడివుంది. సాంకేతికపరమైన సమాచారంపై పట్టుతోపాటు, విషయావగాహన చాలా మెండుగా కలిగిన రచయిత్రి స్ఫూర్తి. చెయ్యితిరిగిన అనుభవశాలిలా కథ అంశాన్ని పలుకోణాల్లో విమర్శనాత్మక దృష్టితో, ఆధునిక శైలిలో చిత్రించడంలో ఈమె సఫలీకృతమైంది అని చెప్పవచ్చు. తెలంగాణా మాండలికంతో కళ్ళెదుట జరుగుతున్న దృశ్యానుభూతిని పాఠకుల్లో నింపుతుంది.
____________
అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతితో పాటు, తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారం కూడా ‘చైత్ర’ నవలకు లభించాయి.ప్రేరణ కరువైన కొంతమంది స్నేహితుల బతుకుల్లో కొత్తవెలుగుల్ని నింపడానికి ఈ పుస్తకాన్ని ఒక బహుమతిగా ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
____________
అణగారిన మారుమూల పల్లెల్లో వికాస దశను కోల్పోయి, నిర్వేదంతో నిస్పృహతో అచేతనంగా పడి, నిస్సహాయంగా కాలం వెళ్లదీస్తున్న యువ మహిళాతరానికి, లక్ష్యసాధనే జీవిత ధ్యేయంగా మలచుకున్న వాళ్ళకి ఈ ‘చైత్ర’ నవల అందించిన చైతన్యం అంతా ఇంతా కాదు. దీనిని పూర్తిగా చదివి ఆస్వాదిస్తేగాని ఈ ప్రేరణలో ఉన్న పరోపకార దృష్టి మనకు అర్థం కాదు. ఈ ప్రయత్నంలో విజయంతో ముందడుగు వేసిన వర్థమాన రచయిత్రి స్ఫూర్తి కందివనం.
తన తొలి ప్రయత్నంలోనే ఎంతో అరుదైన గౌరవం, గుర్తింపును పొంది, ఎంతోమంది పాఠకాభిమానుల్ని సొంతం చేసుకుని, తెలుగు సాహితీమాగాణంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న ఒక మంచి కథా, నవలా రచయిత్రి స్ఫూర్తి కందివనం. ఆమె కృషి నిరంతర చైతన్యస్రవంతిలా కొనసాగాలని, సృజన సాహిత్యంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం.
(చైత్ర: నవల, రచయిత్రి: స్పూర్తి కందివనం, ప్రతుల కొరకు:స్ఫూర్తి కందివనం,96527 45117 లో సంప్రదించవచ్చు)
– ఎన్.లహరి,హైదరాబాద్
98855 35506