తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ సాహితీమూర్తులలో డా॥ అద్దేపల్లి రామమోహనరావు ఒకరు. ప్రజలే చరిత్ర నిర్మాతలని ప్రకటించటానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా ఎంచుకున్న జగమెరిగిన సాహితీస్రష్ట ఆయన. మనిషిని వ్యాఖ్యానించటమే కవిత్వమన్న నిర్వచనానికి గట్టి పునాదులేర్పరచిన సాహిత్య తాత్త్వికుడు అద్దేపల్లి. జీవితమనే బావినుంచి బక్కెట్లకొద్దీ సారస్వత సాహితీ సంపదను అందించిన కవి, గజల్ గాయకుడు, ప్రముఖ విమర్శకుడు అద్దేపల్లి. సమాజంలో తాను ఒక భాగమై, తన అస్తిత్వాన్ని, ఆలోచనను, తాత్వికతను విశ్లేషించటానికి సాహిత్యాన్ని మార్గంగా ఎంచుకున్న అద్దేపల్లి కలం నుండి సృజించబడిన సాహిత్యం, ఆకుపచ్చదనంతో ఒక సజీవ సముద్రంలా తెలుగునేల అంతటా తన ఉనికిని ఉన్నత ప్రమాణాలతో జైత్రయాత్ర కొనసాగించిన ఛాయాచిత్రాలు సాహిత్య చరిత్రలో ఘనంగా నమోదుగావించబడ్డాయి.
___________
జాతి వ్యతిరేక శక్తుల మీద యుద్ధం చేయటానికి జాతి వెన్నెముకను ఖడ్గంగా మార్చుకున్న కవి డా. అద్దేపల్లి. మట్టిలో తన వ్రేళ్లని దేశమంత లోతుగా పాతిపెట్టిన ప్రజాకవి ఆయన. కవిత్వాన్ని కొందరు ప్రేమిస్తారు. మరికొందరు అభిమానిస్తారు. ఇంకా కొందరు ఆరాధిస్తారు.కాని కవిత్వాన్ని శ్వాసగా మార్చుకున్న సాహిత్య సంచారి డా. అద్దేపల్లి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. “నాకు జీవితం,కవిత్వం వేరువేరు కాదు / జీవితం నన్ను ఉక్కు గోళ్లతో రక్కితే / కారే నెత్తురే నా అక్షరాల్లో ప్రవహిస్తుంది…” అంటూ.. ” నాకు కవిత్వం, నేను పీల్చే ఊపిరి / నాకు కవిత్వం,నా బ్రతుకులోని పోరాటం” అంటారాయన. ఇది కేవలం కాగితపు ప్రకటనగా మాత్రమే మిగిలిపోలేదు. సజీవమైన ఆయన నిత్య ఆచరణలో ఒక గీతంగా వినిపిస్తూనే వుండేది
___________
తెలుగు అక్షరమాల మీద అద్దేపల్లి వారికున్న మక్కువ,ఎందరో కవులకు గొప్ప ప్రేరణగా ఉండేది.తల్లిగర్భంలో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ ఆకారాన్ని చూసినపుడు, అద్దేపల్లి వారు పొందిన భావన ఎలా ఉండేదంటే..”అమ్మ కడుపులో తొమ్మిది నెలలు/పిడికిళ్లు బిగించుకొని కూర్చున్న శిశువు/తెలుగు అక్షరంలా కనిపిస్తోంది” అంటారు ఒకచోట.
1991 లోనే అద్దేపల్లివారు తన అక్షరాలను సంధించే విధానాన్ని ఇలా చెప్పారు…”అక్షరాలను నా అస్తిత్వపు కొలిమిలో/పుటంపెట్టి ఆ బాణం మొనకి పూశాను/ఆ మొన గుచ్చుకున్న గుండెలన్నీ/ పుస్తకాల పుటలై/జనం కళ్ళల్లోకి ఎగురుతున్నాయి …” అంటారు. కవిత్వం రాసేవాళ్లను ప్రోత్సహించటంలో అద్దేపల్లి వారిది ప్రథమస్థానం. అదే సమయంలో ఆయన అందించే సాహిత్య హితువు, అందరూ తప్పకుండా ఆచరించతగ్గ స్థాయిలో వుండేది.
‘మనిషిని ప్రేమించటం మొదలు పెట్టాకే/ కవిత్వం రాయటం మొదలు పెట్టు/నీ కన్నీళ్లతో ఎదుటివాడి గుండె గాయాన్ని/ కడిగినపుడు మాత్రమే నువ్/గొప్ప కవిత్వాన్ని రాయగలవ్..!” అంటూ, అసలు కవి అన్నవాడు ప్రాథమికంగా ఏం చేయాలో చాలా స్పష్టంగా ఈ క్రింది కవితా పాదాలలో చెప్పారు…”అక్షరానికి పాలు తాపి, పదం చేయాలి/పదానికి అన్నం పెట్టి,వాక్యం చేయాలి/వాక్యానికి శిక్షణ ఇచ్చి కవిత్యం చేయాలి/కవిత్వానికి జీవితాన్నిచ్చి ఆయుధం చేయాలి…” ఇలా అనేక సందర్భాలలో అద్దేపల్లి వారు అందించిన ఈ సూచన గొప్ప సాహిత్య సృజనకు ఎంతగానో ఉపయోగపడింది.
ఏ దేశమయినా తనదైన సంస్కృతిని ఒక తరం నుంచి, మరో తరానికి అందిస్తూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. అలాంటి దేశంలోకి రుణాలు అందిస్తున్న నెపంతో దళారిదేశం ప్రవేశించి చాకచక్యంగా విషసంస్కృతిని ప్రవేశపెట్టే విధానాన్ని ఆద్దేపల్లివారు వివరించిన తీరు,మన హృదయాలను నేరుగా తాకి మెదళ్ళలో సంచలనమైన కదలికకు తెరతీస్తుంది.”ఇస్తున్నదేశం/తీసుకుంటున్న దేశంలోకి/ డబ్బు కాలువల్ని త్రవ్వినపుడు /కెరటాల మీదుగా/తమ సంస్కృతిని కూడా సరఫరా చేస్తాయి/ఇస్తున్న వాడి సంస్కృతి/ తీసుకుంటున్న వాడి సంస్కృతిలోకి/బ్లాక్ షుగరులా కరిగిపోతుంది….” అంటారాయన.
ఈ దేశ ప్రభుత్వాల, నాయకుల అండదండలతో చెలరేగిపోతున్న ఆ దళారీ దగాను ఒక్క మాటలో చెబుతూ.. “నా పెరట్లోని వేపచెట్టు పీక్కుపోయి /తిరిగి నాకే ఆ గింజలమ్మే మాయగాడు వాడు” అంటూ, దేశం నిండా జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని వివరిస్తూ… “భారతజాతి తలమీద/అంతర్జాతీయ పాదముద్రలు వాలుతున్నాయ్/పులుల కోరలు మాత్రమే/మేకల మెడల్ని ప్రేమగా కౌగిలించుకుంటాయి/ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు,పోతున్నాడు/రక్త సంధ్యను మాత్రమే/మనిషి కళ్లల్లో కట్టేసుకొన్నాడు…” అంటూ.. “రేపటి పంటల్ని కోసుకోవటానికి కత్తులు పట్టుకొని గట్టుమీద నిలబడుతున్నాడు వాడు” అని.ప్రపంచీకరణ దుష్ఫలితాలను దుయ్యబడతారు.చివరకు మనిషి నెత్తురును సైతం తమ ప్రయోజనాలకోసం ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలిపిన తీరు, ఒక గొప్ప సాహిత్య ప్రామాణిక స్థాయిని ఆయన కవితల్లో తెలియజేస్తోంది.
ఉగాది అంటే ఏమిటో సరిక్రొత్త భాష్యాన్ని చెబుతూ…”ఉగాదినాడు కాలాన్ని కొలుద్దాం/ కొలవటం అంటే పూజించటం కాదు/ఏడాది పొడవునా/దేహంనిండా ఎన్ని గాయాలయ్యాయో/లెక్కపెట్టటం…” అని అంటారాయన. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం దశలు ఈ దేశంలో ఏ స్థితిలో ఉన్నాయో చెబుతూ..”ఇక్కడి బాల్యం ఇంట్లోకంటే / చెత్తకుప్పల మీదనే/జీవితాల్ని వెతుక్కోంటుంది/ఇక్కడి యవ్వనం జీవితం కంటే/మరణాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంది/ ఇక్కడి వృద్ధాప్యం / యౌవనాల రాళ్ల దెబ్బలు తగిలి/వృద్ధాశ్రమాల్లో తలదాచుకొంటుంది…” అంటూ, మొత్తం మీద ఈ దేశ జాతి ఎంత నిర్వీర్యమైన స్థితిలో కొట్టుమిట్టాడుతుందో … ఆలోచించమని అద్దేపల్లివారి కవిత మనల్ని ఆదేశిస్తోంది.
ఏ మనిషైనా సరే ‘పాటను తన తల్లి ద్వారా మాత్రమే పరిచయం చేసుకుంటాడు. అద్దేపల్లివారు అన్నట్లు “పాట జీవితంలోంచి వస్తుంది / జీవితం లోతులు గట్టిగా అరిచినపుడు వస్తుంది / మరణం గొంతు నులిమే / జీవితం వేసే కేకలోంచి వస్తుంది / పాట గొంతులోంచి కాదు / జీవితంలోంచి వస్తుంది..” అలాంటి పాటలకే జీవం ఉంటుంది, జీవితాంతం ఆ రాగాలు, అనురాగమంత ఆత్మీయంగా మన జీవితాలతో కలిసిపోతూ ఉంటాయి అంటారాయన.
నేల,నింగి సాక్షిగా తనకు నచ్చని భావాలను తనలోనే దాచుకోవటం అద్దేపల్లివారికి మింగుడు పడని విషయం. అక్షరాలతో అగ్నికణాలను ఎలా కురిపిస్తారో, వ్యంగ్య బాణాలను సైతం అలాగే సంధిస్తారు. బహుళజాతి కంపెనీలకు తొత్తులై,విదేశీ శక్తులకు ఊడిగం చేసే ఈ దేశ నాయకుల వ్యవహారాలు, ఎలాంటి రూపాన్ని కలిగి ఉంటాయో ఒక పద్యంలో ఇలా చెపుతున్నారు. “నేను వేశ్యల్ని కలిసేటపుడు/ తప్పక కండోమ్ తోడుగుతానని ప్రమాణం చేస్తున్నాను/వేశ్యల దగ్గరికి వెళ్లకపోతే/ కండోమ్ ల అమ్మకం కావు కాబట్టి/వేశ్యల దగ్గరికి వెళ్లమని/అందర్ని ప్రోత్సాహిస్తానని/ ప్రమాణం చేస్తున్నాను/నేను కండోమ్ లకి విపరీతంగా ప్రచారమిచ్చి / బహుళ జాతుల ఫ్యాక్టరీలకి/బాగా సహకరిస్తానని/ప్రమాణం చేస్తున్నాను….” అంటూ పదునైన వ్యంగ్య బాణాలను అద్దేపల్లివారు చాలా సూటిగా తన కవితల్లో ప్రయోగించారు.
అద్దేపల్లివారి కవిత్వంలో అవసరాన్నిబట్టి చమత్కారాలు చక్కగా చోటు చేసుకుంటూ ఉంటాయి. చలికాలంలో ఢిల్లీలో తొందరగా ఉదయించని సూర్యుడ్ని ప్రస్తావిస్తూ… “మంచు ఆకాశాన్ని కప్పుకొని/సూర్యుడు నిద్రపోతాడు” అంటారు. ఈ చలికాలంలో ఉతికేసిన బట్టలు ఆరని స్థితిని గురించి ఒక చోట తన చమత్కారాన్ని ఇలా విసురుతారు… “ఇల్లాలు ఆరేసిన బట్టలు/ ఎన్నో రోజులుగా/ మంచును తింటూ, ఆరటం మరచిపోయి అలా పడివుంటాయ్” అంటారు.
ఆ చలికాలంలో మనుషులను గురించి చెబుతూ.. “సూర్య కిరణాల్ని పీల్చక పోవటం చేత/అందరూ స్లోమోషన్ లో కదుల్తూ కనిపిస్తారు” అంటూ ఒక చక్కటి చమత్కారాన్ని ఆ కవితలో అందించారు.
__________
కాలక్షేపం కోసం పేజీలను నింపే కవిత్యం కాదు అద్దేపల్లి వారిది. కవి సమాజాన్ని శ్వాసిస్తాడు,శాసిస్తాడు,లాలిస్తాడు, దండిస్తాడు. తన చుట్టూ ఉన్న సమాజం మీద విపరీతమైన మమకారాన్ని పెంచుకుంటాడు.విషాదంతో సమాజం కార్చే కన్నీళ్లకు తన కళ్లని స్థావరంగా చేర్చుకుంటాడు.అరుస్తాడు,ఏడుస్తాడు, కేకలేసి నినాదాలు చేస్తాడు. ఇదంతా ఒక చైతన్యం కోసం, ఒక కదలిక కోసం, ఒక మార్పు కోసం,ఒక శాంతి కోసం చేస్తాడు. ఇవన్నీ అద్దేపల్లి వారి కవిత్వంలో మనకు కనిపిస్తాయి.
__________
నిజాయితీపరమైన ఆలోచనల వెల్లువ..ఆయన రాసిన ప్రతి కవితలో మనల్ని పలకరిస్తుంది.మనల్ని ఆ ఆలోచనలను అనుసరించే అనుచరులుగా మారుస్తుంది. సమకాలీన అనుభవాలకు, జరుగుతున్న సంఘటనలకు ముఖ్య వాహికగా అద్దేపల్లి వారి కవిత్వం నిలబడుతుంది. నిండా పచ్చదనాన్ని నింపుకున్న ఆయన కవిత్వానికి శ్రమించటమే తప్ప విశ్రాంతి ఎక్కడా వుండేది కాదు. నిత్య జ్వలిత కవనమే జెండాగా, ఎజెండాగా తన జీవితాంతమూ కొనసాగించిన అద్వితీయ సాహితీవేత్త డా. అద్దేపల్లి రామమోహనరావు.
‘సాహిత్య ప్రపూర్ణ’ డా. కె.జి. వేణు,
98480 70084
(సెప్టెంబర్ 6, అద్దేపల్లి రామమోహనరావు 88వ జయంతి)