ప్రాంతాలతో సంబంధం లేకుండా సామాన్య ప్రజల జీవితాలెప్పుడూ దుఃఖభరితాలే. వాళ్ళకెన్ని సమస్యలైనారాని, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఆత్మ నిబ్బరాన్ని విడువరు. ఆ సామాన్య ప్రజల యొక్క సజీవమైన కథనాలే మనకు స్ఫూర్తివంతమైనవని చెప్పకనే చెప్తున్నారు ప్రముఖ కవి, కథా రచయిత, వ్యాసకర్త, సంపాదకులు పి.శ్రీనివాస్ గౌడ్. 12 కథలతో ‘మార్జినోళ్ళు’ కథల సంపుటి ఆన్వీక్షికి ప్రచురణగా వెలువడింది.
రచయిత దృష్టి కోణం నుండి ఈ కథలను పరిశీలించినప్పుడు అనేక విషయాలు మనకు అవగతమవుతాయి. ప్రజల జీవన్మరణ సమస్యలను మానవీయమైన దృక్పథంతో చిత్రీకరించారు.
ఒక చోటులో ఎప్పటి నుంచో ఉన్న వాళ్లంతా ఉన్నపళంగా ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికని వెళ్తారు. ఉండడానికి చోటు లేక, చేసుకోవడానికి పని లేక, ఆ కుటుంబాలు పడే బాధలు వర్ణనాతీతం. అట్లాంటి ఒక దుఃఖమయమైన యదార్ధ గాథకు అక్షరీకరణ ‘మార్జినోళ్లు’ కథ. రైల్వే లైన్ పక్క పొంటి ఆనుకొని ఉన్న స్థలంలో జీవనం గడుపుతున్న ఆ కుటుంబాల్ని అధికారులు ఖాళీ చేయాలని నోటీసులిస్తారు. స్వామి నాయుడు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటారు. అక్కడ ఆ భూ కబ్జాదారుల దాడులకు గురవుతుంటారు గుడిసెవాసులు. సాదాసీదా బతుకుల్లోని ఆశల గూర్చి వివరించిన కథ ఇది. ఈ కథలోని కథానాయకుడు కోటేష్. తన వాళ్ళకు ఒక దారిని చూపించాలని తాపత్రయపడుతుంటాడు. తరతరాల తమ బతుకును ఒక దగ్గర ఉండనీయకుండా చేస్తున్న వ్యవస్థ మీద ఆగ్రహాన్ని ప్రకటిస్తాడు. రైల్వే మార్జిన్ లో పెరిగిన కోటేష్ ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ, రైల్వే అధికారుల చుట్టూ, తెలిసిన రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతాడు. స్వామి నాయుడు వంటి బడా బాబుల కన్ను ఈ భూమి మీదనే ఉంటుంది. వీళ్లను ఖాళీ చేయించాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తుంటారు. ‘ఇప్పటికీ ఏ రోజుది ఆరోజు వెతుక్కునే పనేనయ్యా . మనం బాగుపడేది ఇంకెప్పుడు..? మనలో మనల్ని విడదీసి వినోదం చూసినోళ్ళే గానీ, బతుకుల్ని బాగు చేసేవోళ్లు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళున్నారా..? కుడిమిస్తే. పండుగనకుండా మనం కలిసి ఒక కట్టుగా ఉండేదెట్టో ఆలోచించండి…’ అంటున్న అన్న కోటేశు మాటల్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కలిసి ఉంటేనే సాధించగలుగుతామనే సందేశాన్ని అందిస్తున్న కథ ఇది.
______
ఈ కథల సంపుటిలోని స్త్రీల పాత్రలు ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొనేవిగా ఉన్నాయి. కష్టాలకు కుమిలిపోతూ కాకుండా లేచి నడక సాగించే విధంగా స్త్రీ పాత్రలను చిత్రీకరించారు. రచయిత చూసిన కొన్ని జీవితాలకు నమూనా ఈ కథలు అనిపిస్తాయి.
_______
‘పీటముడి’కథలో లక్ష్మికి మాటలు రాని కూతురు నర్మదా ఉంటుంది. ఆమెకు వినపడుతుంది కానీ మాట్లాడలేదు. పాఠశాలలో మాటలు రావని బడికి రావద్దంటారు. ఈ అమ్మాయి బాధను ఎట్లా తీర్చాలని బాధపడుతూ ఉంటుంది నర్మద తల్లి. ఆ ఊరికి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి మీ అమ్మాయికి మాటలు వస్తాయని, మేము దానికి ప్రయత్నం చేస్తామని అంటారు. రేపు ఆసుపత్రికి రమ్మని బస్సు చార్జీలు ఇచ్చి వెళ్తారు. ఆ డబ్బుల్ని తన భర్త తాగడానికి వాడుకుంటాడు. ఈ అమ్మాయిని హాస్పిటల్ కు తీసుకపోవద్దు, ఇట్ల ఉంటనే మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫించన్ వస్తుందని, బాగు చేయించి చేస్తే పెళ్లి చేసుడు కష్టమని అంటాడు. ఆ ఊరు సర్పంచి నాకు తెలియకుండానే మీరే అన్ని పనులు చేసుకుంటే సరిపోతుందా నాకు కూడా చెప్పాలని నర్మద తల్లి లక్ష్మితో అంటాడు. పక్కింటి నరసమ్మ ఏమైన కానీ నువ్వు అమ్మాయిని హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించమని, నీ బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలని పట్టుబడుతుంది. ఆడదాని బతుకులోని చిక్కుముడులను ఒక్కొక్కటిగా దాటుకుంటూ పోవాలని , తీయడానికి రాని పీట ముడులను మనమే మెల్లగా ఓర్పుగా తీసుకుంటూ పోవాలని లక్ష్మికి ఉద్బోధ చేస్తుంది నరసమ్మ. తరతరాలుగా స్త్రీలు ఎన్నో బాధలు పడుతూ, తమ బిడ్డల్ని, తమ కుటుంబాన్ని కాపాడుతూ వచ్చారని ఈ సమస్యలు కొత్త కాదని చెప్తుంది ఆమె. ‘నా బిడ్డ నాలుక ముడి విప్పడానికి ఎన్ని పీటముడులనైనా విప్పుతానని గట్టిగా మనసులో అనుకుంటుంది లక్ష్మి. తెలియని కొత్త చైతన్యాన్ని పొంది ముందుకు నడుస్తుంది.
గుడిలో అమ్ముకోవడానికి కొబ్బరికాయల పాటను పాడి నష్టపోయిన ఒక సంధ్య కథ ‘దేవుళ్ళాట’ . గుడి పూజారులు, ధర్మకర్తల మధ్యన వచ్చిన అభిప్రాయభేదాలతో ఈ అవకాశం ఆమెకు వస్తుంది. సంపాదనకు అలవాటు పడ్డవాళ్ళు ఆమె బేరాన్ని సక్రమంగా చేసుకోనియ్యరు. ఆ గుడిలో రాజకీయాల వల్ల ఆమె జీవితంలో మరింత నష్టపోతుంది. ‘ఎందుకొచ్చామో .. సముద్రం మధ్యలోకి వచ్చాం.. పడవకి చిల్లు పడి మునిగిపోతన్నాం.. చిల్లు పూడ్చుకొని ముందుకు పోవాలి గానీ.. మునిగిపోతా అక్కడే వుంటమా..? ముందుకు పోక తప్పదు కదా..” అన్న మాటలు ప్రేరణగా నిలుస్తాయి.
మనిషి చనిపోతే పూడ్చడానికో కాలేయడానికో స్థలాలు లేకుండా చేస్తున్నారని ‘సమాధి’ కథ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తారు కథా రచయిత. కులాల వారీగా వున్న స్మశాన స్థలాలను కూడా ఆక్రమించి కాలనీలను నిర్మిస్తుంటే చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. నిర్వీర్యమైన ప్రజా చైతన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ కథలోని ముగింపు వాక్యాలు మనల్ని వెంటాడుతుంటాయి. ‘మడిసి బతకడానికి నానా చావులు చావాల్సి వత్తన్న చోట చచ్చినా పాతేయడానికి పిడికెడు స్మశానం కరువైపోయిన కానికాలం వచ్చింది. మనిషి ఇప్పుడు విలువలన్నీ సమాధులైన స్మశానం..’పనికి బతుకు ఆధారం. పని లేకపోతే వాళ్ల జీవనం గడవడమెట్లా? ‘దిక్కు తెలీని పక్షులు’ కథ ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. ఒక లిక్కర్ షాప్ ఆధారంగా గుడ్లను అమ్ముకొని బతికే ఎంకటమ్మ, తులసమ్మ, కనకయ్యలు స్వగతంగా వాళ్ల దుఃఖాన్ని మనముందు పరుచుకుంటారు. ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడుపుతుందని తెలిపాక అగమ్య గోచరం వాళ్ళ జీవితాలు. సూరిబాబు బతుకు పోరాటానికి కరోనా అడ్డుగా వచ్చింది. కరోనాకాలంలోని దయనీయమైన బతుకు చిత్రాలకు ఈ కథొక మచ్చుతునక.
ఈ కథల సంపుటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథ ‘ నా కొడుకు లచ్చిమి’. గుండెలు పిండే కథ ఇది. రవణం పిన్ని ప్రేమగా సాదుకుంటున్న ఒక బర్రె కథ. అది సూడితో ఉండి కనబడకుండా పోతుంది. ఎక్కడ తప్పిపోయిందోనని చుట్టుపక్కల ఊర్లల్లో వెతుకుతూ, కలిసిన వాళ్లందర్నీ అడుగుతూ ఉంటారు. చివరికి ఒక దగ్గరున్నట్టు జాడ తెలుస్తుంది. రవణం పిన్ని కుటుంబం ఒకప్పుడు బాగానే ఉండేది. రోజురోజుకు జీవన పరిస్థితులు క్షీణించి రోజు గడవడం కష్టమైన సమయంలో ఈ బర్రె కొడుకు లెక్క ఆదుకున్నదని ఆమెకు విపరీతమైన అభిమానం. అది కనపడకపోతే రవణం ప్రాణమంతా గిలగిల కొట్టుకున్నది. మనుషులైనా పశువులైనా కడుపుతో ఉన్నప్పుడు తన వాళ్లతో ఉండాలని ముచ్చట పడుతుంది. అందుకనే ఆడపిల్ల కడుపుతో ఉంటే పుట్టింటికి తీసుకొస్తారు. అందరి మధ్య సంతోషంగా గడిపి పండంటి బిడ్డకు జన్మనిస్తుందని. బర్రెను తీసుకోని రావడానికి వెళ్ళినప్పుడు తోటి బర్లతో కలిసి ఆనందంగా ఉంటుంది. రవణం పిన్ని మాతృ హృదయం దాని మనసును గ్రహిస్తుంది. దానికి మాత్రం కనపడకుండానే ఇంకొన్ని రోజులు ఇక్కన్నే ఉంచుకోమని కోరుతుంది. దానికి తిండి పెడుతున్నాయన అంగీకరిస్తారు కూడా. ఇదే కదా నిజమైన మానవీయమైన దృక్పథం అంటే. ఆమె మాటలు మన గుండెల్లో కూడా మోగుతాయి. ‘కొన్ని కొన్ని బంధాలు అంతేరా.. విప్పి చెప్పలేము. చెప్పినా అర్థం కావు. అంతెందుకు? ఒక పేగు ఎడం అయినా నువ్వెందుకు నాకోసం పనులు మానుకొని వస్తున్నావు? లచ్చిమి కోసం నువ్వు కూడా ఎందుకంత ఇదిగా లగెత్తుతున్నావు? చెప్పగలవా? చెప్పలేవు.. ఇదీ అంతే…’
______
అన్ని మతాల వాళ్ళం సోదర భావంతో తరతరాలుగా జీవిస్తున్నాం. మారిన రాజకీయ వ్యవస్థ భావజాలంతో మనుషుల్లో మొలుస్తున్న విషబీజాలను నర్మగర్భంగా చెప్పిన కథ ‘కదిలిపోతున్న నేల’. కులాల పట్టింపులతో కొట్టుకున్న ఉదాంతాలెన్నో ఉన్నాయి. ఇప్పుడు మెజారిటీ మతం మాదేనని, మేం ఏం చేసినా చెల్లుతుందని యువతలో విషపు బీజాలు నాటుతున్న వైనాన్ని విశ్లేషించిన కథ ఇది. మైనార్టీ మతస్తులపై ముఖ్యంగా ముస్లిం మరియు క్రిస్టియన్ల పైన దాడులు సర్వ సాధారణం అవుతున్న నేటి తరుణంలో ఈ కథకు ప్రాధాన్యత ఉన్నది. అనుకోవడానికి ఇవి చిన్న విషయాలు అయితే కాదు. ఎక్కడికక్కడ తిప్పి కొట్టకపోతే మనమంతా పెద్ద విషవలయంలోకి వెళ్ళిపోతామని హెచ్చరిస్తున్న కథ ఇది.
______
‘గాలికి లేచిన ఆకులు, తిరనాల, రెటమతం మడిసి, వ్యవహారం, లీల’ కథలు కూడా మనల్ని ఆలోచింపజేస్తాయి. ప్రతి కథ కూడా వాస్తవ పరిస్థితికి ప్రతిబింబంలా నిలిచాయి. కథా రచయిత శ్రీనివాస్ గౌడ్ గారు ‘విముక్తి కోసం ఈ కతలు’ అంటూ తను రాసుకున్న మాటలోని వాక్యాలు ఆయన తండ్లాటకు నిదర్శనాలు. ‘కతలు ఒకచోట నిలవనీయవు. కూర్చోనీయవు. పాలు కోసం ఏడ్చే పిల్లల్లా ఒకటేమొయిన కాళ్ల చుట్టూ గోజారతా వుంటాయి. కతలు యాడికి పడితే ఆడికి వెంటాడతా వస్తాయి. కతలు కళ్ల ముందుకు వచ్చి పిలుస్తా వుంటాయి. కతల్లోని పాత్రలు ముంగాళ్ల మీన కూచోని మూగగా చూస్తా వుంటాయి. గుణించుకొని గుణించుకొని మాట్టడతా వుంటాయి. నీ చావు నువ్వు చచ్చి మమ్మల్ని బయటేయి అంటాయి ‘
గత దశాబ్ద కాలంలోని సంక్లిష్టమైన మానవ జీవనానికి ఆనవాళ్లు ఈ కథలు. వేగంగా మారిపోతున్న మానవ సంబంధాలు, బతుకు భారం అయిపోతున్న సామాన్యుల జీవితాలు, ఆధునిక సమాజంలోని అంతరాలను ఒక కొత్త కోణంలో పరిచయం చేస్తున్న కథలివి. ఈ కథల్లో ఊహాజనితాలు ఉండవు. కఠోరమైన వాస్తవాలే మనకు కనిపిస్తాయి. కనువిప్పు కలిగించే కథలే కావాలి. అందుకనే ఈ ‘ మార్జినోళ్ళు’ కథల్ని అందరూ చదవాలి.
– గోపగాని రవీందర్
94409 79882