అక్షరాల తడి-‘లోపలేదో కదులుతున్నట్టు’

సాహిత్యం హోమ్

మానవ సమాజం ఆవిర్భవించి సమూహం ఏర్పడినప్పటినుంచి మనుషుల్లో అసమానతలు, వివక్షల దౌర్బల్యం పెల్లుబుకుతూనే వుంది. అది సృష్టించే సామాజిక సంవేదనలు సెగలు గక్కుతూనే వున్నాయి. ఆ సెగల్లో అతలాకుతలమయ్యే మనుషుల మధ్య మానవీయ ప్రవాహాలు కరువైపోయి ప్రేమరాహిత్యపుటెడారులు చోటుచేసుకొని ఎవరికివారు ఏకమైపోయే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. సమూహాన్ని విచ్ఛిన్నం చేసే అస్తవ్యస్త వ్యవస్థ రాపిడిలో సతమతమయ్యే మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోతూ తనను బంధించిన దోపిడీ సంకెళ్లను విడగొట్టే మానవీయత కోసం అన్వేషిస్తూనే వున్నాడు.

ఆ అన్వేషణలో భాగంగానే కరకుదేలిన హృదయాలను తడిచేసే ఆత్మీయతా పవనాల కోసం తపిస్తూ వర్తమాన కవి పలమనేరు బాలాజీ కలం నుంచి జాలువారిన కవితాసంపుటి ‘లోపలేదో కదులుతున్నట్టు’.

గత రెండు దశాబ్దాలుగా కవిగా, కథకుడుగా రాణిస్తున్న బాలాజీ కవిత్వానికి మానవ జీవితాన్ని ముందుకు నడిపించే మానవత్వమే ప్రధాన కేంద్రబిందువైంది. ఇతని కవిత్వం తడితడి అక్షరాలతో సామాజిక అలజడి నుంచి తప్పించే ఆత్మీయత తడికోసం అన్వేషిస్తుంది. మనుషుల మధ్య మాటల్లో మానవ జీవన మాధుర్యాన్ని వెతుక్కుంటూ గతంలో ‘మాటల్లేని వేళ’(2007), ‘ఇద్దరి మధ్య’(2010) అనే కవితా సంపుటాలు, మానవ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ నాలుగు కథాసంపుటాలను వెలువరించాడు.
_________________
మనిషి లోపలి అసలైన మనిషి మీద అపారమైన ప్రేమతో, దయావాత్సల్యంతో ఇతని కవిత్వం ఎలాంటి ఆర్భాటాలకూ, పటాటోపాలకూ పోకుండా సూటిగా, సుతిమెత్తగా, ప్రవాహంలా సాగిపోతుంటుంది. మనిషి లోపలి అనేక పార్శ్వాల్ని స్పృశిస్తూ మనిషి జీవననాదం ఎలాంటి అద్బుత స్వరాలతో పలకాలో దిశానిర్దేశం చేస్తుంది. మనిషి లోపల కదిలించే అంశాలనూ, అక్కడి మనిషితనానికి విఘాతం కలిగించే విభిన్న సామాజిక రుగ్మతల్నీ ఏకరువు పెడుతుంది.
__________________

అందువల్లే ఈ సంపుటిలోని ముప్పాతిక కవితల్లోని అక్షరాలు మనిషితనాన్నే తొడుక్కున్నాయి. ఈ కవిత్వం అక్షరాల్లోకి వొంపిన జీవన తాత్వికత మనుషుల్ని ఎప్పుడూ కాపాడే అనుబంధపు మహత్యాలను విడమరచి చెబుతుంది. అందుకే మనుషుల మధ్య కృత్రిమ అనుబంధాలను సృష్టించే నిరంతర ఆడంబరాలు, పటాటోపాలు, మనుషుల్ని నిరాశక్తుల్ని చేసే దూరాలు, మనిషిని చిగురింపజేయని పరాయీకరణలు, మనిషి ప్రేమను నిలువెల్లా నింపుకునే ఊర్లు, మనిషితనాన్ని ఆక్రమించేస్తున్న తిరోగమనం, మనసుల్ని లాలించే స్త్రీ హృదయం, ప్రజల్ని కలల్లో ప్రవహింపజేసే, ఆశలరెక్కలతో విహరింపజేసే తెల్లపావురాలు, మనుషుల్ని మరుగుజ్జుల్ని చేసే వస్తుసంస్కృతి, మానవ సంబంధాల్ని సజీవంగా నిలిపే అమ్మభాష, ఆకుపచ్చని మనుషుల అస్తిత్వవేదన, మమతల్ని, మానవీయ విలువల్ని నిండుగా నింపుకున్న పురాతన మానవుడి అభీష్టాలు…ఇవన్నీ ఈ కవికి కవితా వస్తువులయ్యాయి.

‘ఎంతగా విధ్వంసం అవుతున్నా/ మనసులోపలి శిశువుల్ని/ పదిలంగా కాపాడుకునే వాళ్లు కదా/ కావాలిప్పుడు/ …. / లోపలేదో తిరుగుతున్నప్పుడు/ లోపలేదో కలవరపెడుతున్నప్పుడు/ లోపలేదో కదిలించి కదిలించి కరిగిస్తున్నప్పుడు/ తప్పకుండా మనుషులు బతికేవుంటారు’ (లోపలేదో కదులుతున్నట్టు) అంటూ జీవన విధ్వంసం సమయంలో మనిషి తన ఉనికిని ఎలా చాటుకోవాలో చెబుతాడీ కవి. బయట ఎంత విధ్వంసం జరుగుతున్నా లోపలి హృదయాలను కదిలించే, కరిగించే అతిసున్నితమైన మనిషితనపు ఆనవాళ్లను ఎలా కాపాడుకోవాలో చెబుతాడు.

మంచులా కరగడం, గాలిలా తిరగడం మనిషితనమనిపించుకుంటుందంటూ మనిషితనాన్ని ప్రకృతిలో సంలీనం చేస్తున్నాడు. మనుషుల అసలు స్వరూపాల్ని మాయం చేసేసి వారిని అమ్మకందారులు, కొనుగోలుదారులుగా విడగొట్టే ప్రపంచీకరణ వికృతచేష్టల్ని ఎత్తిచూపుతాడు.
జీవితమే నటనై మోసపూరిత చేష్టలైపోయిన అంతరంగాల మధ్య వానచినుకుల్లాంటి, లేత మొగ్గల్లాంటి మాటల కోసం ఈ కవిత్వం తపిస్తుంది.

‘ధృవాల మధ్యనో/భూమ్యాకాశాల మధ్యనో/మహాసముద్రాల రెండు చివర్ల మధ్యనో/ఉన్నంత దూరంగా/రెండు మనసులు, రెండు హృదయాలు/ ఒక జీవితం లేదా ఇద్దరు మనుషులు/ నిరాశక్తంగా, యథాలాపంగా బ్రతికేస్తారు’(ఇల్లు… ఖాళీ మనుషులు) అంటూ మనుషులు పరస్పరం ప్రక్కప్రక్కనే వున్నా వారిమధ్య సామాజిక పటాటోపం సృష్టించే కొండంత ఖాళీతనాన్నీ, ఆ ఖాళీతనాన్ని సృష్టించే నిరాశక్తతనూ ప్రశ్నిస్తుంది.

‘నిరంతర పరాన్నజీవులైన మనుషులు/ శిలల్లాంటి, శిథిలాల్లాంటి మనుషులు/పరాయీకరణల్లోంచి, పలాయనవాదాల్లోంచి/ బాషలు, మాటలు, నటనల జాతరల్లోంచి బయటపడినప్పుడే-/మనుషులు మొలకెత్తుతారు/మనుషులు చిగురిస్తారు’

(చిగురించే మనుషులు) అంటూ శిలల్లా పరాయీకరణ ఉచ్చుల్లో చిక్కుకున్న మనుషులు వాటినుంచి విముక్తులైనప్పుడే మొలకెత్తి ఆకుపచ్చని ఆత్మవిశ్వాసంతో చిగురిస్తారని ఉద్బోధిస్తుంది. మనుషులు మనసారా మాట్లాడుకోలేని సమయాల్ని సగం చీకటి, సగం వెలుతురు సమయాలుగా అభివర్ణిస్తుంది. మనిషిని అసంబద్ధతలోంచి మేల్కొలిపే కలలు, మెలకువలు, హృదయాలను ప్రక్షాళన చేసే కన్నీళ్ల కోసం కలవరిస్తుంది. అంతరంగాలే అంతరాలైపోవడాన్నీ, మనుషులే వస్తువులైపోవడాన్నీ, ఆకర్షణలు, అవసరాలు, కోరికలు జీవనసహచరుల మధ్య సృష్టించే అగాధాలనూ ఎత్తి చూపుతుది.

‘సమస్త విశ్వాసాలతో/ జీవావరణాన్ని కాపాడుకోవడం వెనుక/ మానవ సంబంధాల్ని/ సజీవంగా నిలుపుకోవడం వెనుక వున్న/ అసలు స్ఫూర్తి భాషే కదా!’(అమ్మభాష… చనుబాల ధార) అంటూ అమ్మభాషకు నీరాజనాలర్పించే ఈ కవిత్వం ‘అలాగే విడిచిపెట్టండి/ ఆకుపచ్చని అడవిని/ఆకుపచ్చని మనుషుల్ని అలాగే వుండనివ్వండి/ ఖనిజం కన్నా మనుషులు, అడవులే విలువైనవి/స్వేచ్ఛ, ప్రేమలే విలువైనవి’(అరణ్యం ఆదివాసీదే) అంటూ ఆదివాసీల ఆకుపచ్చని జీవితాలకు సంఘీభావం పలుకుతుంది.

‘మనం మన పావురాళ్లని/ పంజరాల కోసమే కదా కొంటున్నాం/మనకు మన పావురాల కన్నా/పంజరాలే ముఖ్యం/ అమ్మాయికి- జీవితాంతం పంజరాలే’. (పంజరం లేని లోకం కోసం) అంటూ సమాజం పంజరాలకు పరిమితం చేసే అబలల్లో స్త్రీ స్వేచ్ఛను కోరుకుంటుంది. జీవితం పొడవునా ప్రేమించే మనుషులు తిరుగాడే ఊర్లని నక్షత్రాలు నేలకు అందే ఊర్లుగా కీర్తిస్తూ నక్షత్రాల్లో ఊరు మమకరాన్ని దర్శిస్తుంది.

‘అవసరమొచ్చిన అన్నివేళల్లో/ఆమె వంటిల్లవుతుంది/…/రాత్రీపగలులా నిర్విరామంగా/హద్దుల్లేని ఆకాశంలా విశాలంగా/ఆమె ఇల్లవుతుంది/వసారా అవుతుంది/పూలతోట అవుతుంది’ (ఇద్దరూ ఇద్దరే) అంటూ కుటుంబం కోసం ఉప్పొంగే జీవన సహచరి సేవాతరంగాల ఉధృతిని చాటుతుంది.

‘ఆడపిల్లలున్న ఇంట్లో/వెన్నెల వుంటుంది/అమృతం ఉంటుంది/అందుకే కదా!/అమ్మల ప్రేమంతా/ అమ్మాయిల వద్దే దొరుకుతుంది’ (అప్పుడొక పాప వుండేది) అంటూ ఆడబిడ్డల పట్ల తండ్రి వాత్సల్యమౌతుంది.

‘జనాభా లెక్కల్లోనో, ఓటర్ల జాబితాలోనో కాదు/అధికారాల్లో, హక్కుల్లో/అందరూ సమానమైనప్పుడే/ మనుషులందరూ సమానమౌతారు’ (ప్రతిజ్ఞ) అంటూ అసలైన సమానత్వం అంటే ఏమిటో చెబుతూ ఈ కవి కొత్త శ్వాసనూ, కొత్త రక్తాన్నీ, కొత్త మాటనూ, కొత్త బ్రతుకునూ కోరుకుంటాడు.

‘ఇప్పుడు దేశాన్ని నిర్మించుకోవడం అంటే/నిఖార్సైన మానవుడ్ని నిర్మించుకోవడమే/ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవడం అంటే/మమతలు, మానవీయతలు ఆనవాళ్లైన/సజీవ నదుల్లాంటి మానవుడ్ని కాపాడుకోవడమే’

(పురాతన మానవుడు)అంటూ మానవీయత పునాది మీదే దేశం కలకాలం నిలుస్తుందంటాడు. ‘భూమికి తెలియనంత నిశ్శబ్దంగా, రహస్యంగా వానచినుకు ఏదో నేలను తాకినట్టు మనిషి మనిషిని తాకే’ ఆర్ద్రతంత మానవీయత కోసం ఈ కవిత్వం తపిస్తుంది.

ప్రతుల కొరకు పలమనేరు బాలాజీ
మొబైల్: 9440995010లో సంప్రదించవచ్చు.

– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర,
91777 32414