చలంతి గిరయః కామం
యుగాంత పవనాహతాః
కృచ్చ్రేపిన చలత్వేవ
ధీరాణా నిశ్చలం మనః
ప్రళయకాలంలో పెనుగాలులు వేసినప్పుడు పర్వతాలు కూడా చలించిపోతాయి. కానీ ఎంతటి కష్టకాలంలోనూ ధీరుల మనసు చలించనే చలించదు.సాహితీ మేరునగం వంటి తిరుమల రామచంద్ర గారి జీవితంలో ఎన్నెన్నో మలుపులు, కష్టాలు, కన్నీళ్లు, మెరుపులు, మరకలు అయినా వెనుతిరిగి చూడలేదాయన. జీవితాన్ని మనసారా రెండు చేతులతో ఆస్వాదించి, ఆనందించిన తపస్వి ఆయన. రామచంద్ర గారు చేసిన సాహితీ ప్రయాణాలు..ప్రయోగాలు..అక్షరీకరించిన అనుభవాల సంపుటి “హంపి నుండి హరప్పా దాక” ఆత్మకథలలో అత్యధికంగా ఖ్యాతినార్జించిన గ్రంథం. ఎన్నెన్నో ఉత్కంఠతలకు నెలవు. మొదటి పేజీని మనం తిరగేస్తే మిగిలిన నాలుగు వందల తొంభై ఆరు పేజీలను పుస్తకమే మన చేత తిరగేయిస్తుంది. ప్రతి సాహితీకారుడు చదవవలసిన పుస్తకం. సాహిత్యంలోకి అడుగులు వేస్తున్నాం, వేయాలనుకునే ప్రతి ఒక్కరూ కంఠస్థం చేయవలసిన గ్రంథం. ఇది ఆయన జీవిత చరిత్ర కాదు.. జీవనానుభవాలు కాదు. ఈ గ్రంథంలో వివరించిన అంశాలు ఆయన మొత్తం జీవితం కాదు..కేవలం మూడో వంతు మాత్రమే. రామచంద్ర గారు నిత్య మనస్వి. నిరాడంబర వచస్వి. ఇరవై శతాబ్దాల తెలుగు సాహిత్య చరిత్రలో, సమీక్షలలో, అధ్యయనంలో ఓ పది పదిహేను మంది ప్రముఖులను ఎంపిక చేయవలసి వస్తే, అందులో తిరుమల రామచంద్ర గారిని తప్పనిసరిగా లెక్కించవలసిందే..! అర్థ శతాబ్దపు కాలం వివిధ పత్రికలలో పనిచేసినా తనకు తాను ఏనాడూ పెంపు చేసుకోలేదు. ఆయనకున్నంత పేద మనసు, పెద్ద మనసు అంతటి సాహిత్య మూర్తులలో ఎవరిలోనూ చూడలేము. ‘తరువులతి భార ఫల సమృద్ధి నమ్రత వహించు’ అనే భర్తృహరి సూక్తిమత్వం – రామచంద్ర గారి మూర్తిమత్వం. ఈయన జన్మ స్థలం కర్ణాటక రాష్ట్రంలోని ‘హంపి’. విజయనగరం దగ్గర్లోని రాఘవమ్మపాలెం ( రాఘవమ్మ పల్లె కాలక్రమంలో రాగంపాలెం అయిందట) తల్లి జానకమ్మ. బాల్యమంతా సంస్కృతం, కన్నడ, తెలుగు భాషలలోనే గడిచిపోయింది.
‘హంపి నుండి హరప్పా దాకా’ సాగిన తిరుమల రామచంద్ర సాహితీ ప్రయాణంలో ఆయన చూసిన ప్రతి సన్నివేశం, సంఘటన, అనుభవం ఎంతో ఆర్ధ్రతతో వర్ణిస్తారు. అక్షరాలను చెక్కి వాక్యాలు తీర్చిదిద్దినట్లుంటాయి. అనుభవాల వెనుక అనుబంధాల ఆర్తిని, ఆర్ధ్రతను వర్ణించిన వైనం చదువరులను కట్టిపడేస్తుంది. ప్రతి అధ్యాయానికి ముందు ఉదహరించిన సూక్తులు ఎన్నెన్నో విషయాలను చెబుతాయి. అధ్యాయంలోని ఊసులను క్లుప్తంగా వివరిస్తాయి. ప్రతి మాట ఆచితూచినట్లుగా ఉంటుంది. ఇందులో 60 చిన్న చిన్న అధ్యాయాలున్నాయి. అవి భారతీయ సంస్కృతిలోని మేలిమిని సాక్షాత్కరింపజేస్తాయి. మరెన్నో ఈ రకమైన విషయాలను నవరసభరితంగా వివరిస్తారు.
ఆయన లాహోర్ నుండి ధర్మశాల వరకూ వెళ్లిన మారుతున్న భాషలనూ, యాసలనూ గమనించిన తరువాత ‘పన్నెండు క్రోసులకొక భాష మారుతుంది’ అంటారు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతపు ఆహారాన్ని ఆస్వాదనాపూరిత ఆనందంతో స్వీకరించిన ‘త్రిదశుడు’ ఆయన. ఎనభైనాలుగేండ్ల జీవితాన్ని యాదృచ్చాలాభసంతుష్టంగానే గడిపారు. గతానికి అగతానికి ఒక అందమైన వారధిని ఈ రచన ద్వారా మనకి తెలియజేస్తారు. పంజాబు ప్రాంతంలో పర్యటించిన వేళ అమాయకమైన పల్లె జీవితాన్ని ఆస్వాదిస్తూ ‘రబ్బా! (భగవంతుడా!) నీవు భారత గ్రామ ప్రజల ఆనందంలో ఉన్నావు’ అంటారు. ‘లావణ్యం ఒలికే లాహోర్’ అనే అధ్యయనంలో మాధవశాస్త్రి బండారి గారి పరిచయం తదుపరి ఆయన మరణాన్ని కూడా ఎంతో ఆర్తితో, ఆర్ధ్రతాపూరిత హృదయంతో చెబుతారు.
27వ అధ్యాయంలో కుటుంబంలోనూ, సమాజంలోనూ గౌరవంగా ఉండడానికి మానవుడు న్యాయంగాను, నీతిగాను వ్యవహరించాలనే ఆర్య వాక్యాన్ని చెప్పిన వేళ రామచంద్ర గారి రూపం మన మనోనేత్రం ముందు సాక్షాత్కారమౌతుంది.
28వ అధ్యాయంలో ‘సత్యం, తపస్సు, జ్ఞానం, అహింసాగుణం, విద్వాంసులను సేవించడం, ఉత్తమ శీలము’ ఈ గుణాలు ఉన్న వాడే విద్వాంసుడు. ఒట్టి చదువుతో విద్వాంసుడు కాలేడు అంటారు. ఈ వ్యాఖ్యానానికి నిలువెత్తు రూపం తిరుమల రామచంద్ర గారి వ్యక్తిత్వం.
గురువుల గురించి చెబుతూ.. ‘ధర్మశాస్త్రాలు చదువుతున్నప్పుడు నాకు, మా గురువు గార్ల వంటి వారిని చూసే ధర్మశాస్త్రకారులు తమ సూత్రాలను రచించారా అని అనిపిస్తుంది. మా గురువుల వ్యక్తిగత జీవితాలు మాకు తెలియవు.. తెలుసుకుందామనే రంధ్రాన్వేషణకు ఎప్పుడూ పూనుకోలేదు. వారు మాతో ప్రవర్తించిన తీరు చాలు, వారి వైయుక్తిక జీవితము పవిత్రంగా ఉంది అని చెప్పడానికి.’ వర్తమానంలో ఈ సూత్రాలు చదివిన వారికి ఎలా ఉంటుందో వారి విజ్ఞతకే వదిలేద్దాం.
_____________
ఆయన తన జీవితంలో ఎన్నో ఎత్తులను చూశారు. కానీ ఏనాడు ఎటువంటి ప్రలోభాలకు, కీర్తి ప్రతిష్టల ఆశాపాశాల బలహీనతలకు లోనుకాలేదు. ఈ గ్రంథంలో ఆయన భాష ప్రలుబ్దత, ఆయన జీవితంలో వివిధ దృశ్యాలను ఎంతో రమ్యంగా చిత్రిస్తున్న వైనం, ఘనం, కరుణం, శుచిరుజ్జ్వలమైన శృంగారం, సుకుమార హాస్యం, పరమ మనస్విత వంటివి ఈ గ్రంథం నిండా పాఠకులు పూలతోటలో విహరించేంత సంతోషాన్ని కలిగిస్తాయి అంటారు అక్కిరాజు రమాపతిరావు గారు.
______________
సుజనుడు ఊళ్లో ఉన్నప్పుడు ఊరంతా నిండుగా ఉంటుంది. అతడు మరుగైపోతే అంతా వెలితే. అది ఎలాంటి వెలితి అంటే..గ్రామ సమీపంలోని మర్రిమాను కూలిపోతే ఎంతటి వెలితో అలాంటిది. ఆ వెలితిని పూడ్చడం ఎంతో కష్టం. తిరుమల రామచంద్ర గారు లేకపోవడం తెలుగు సాహిత్యానికి ఏర్పడిన లోటు అటువంటిదే.. ‘నాతోటి సామాన్యుడి జీవితంలో ఏమి గొప్ప సంఘటనలు ఉంటాయి గనుక? కానీ ఇది ఒక దేశ ద్రిమ్మరి అనుభవ విశేషంగా, సత్యాన్వేషి కథనంగా, జిజ్ఞాసువు ఆవేదనగా పాఠకుల మనసుకు దగ్గరవుతుందని నా విశ్వాసం’ అంటూ ఎంతో వినయంగా తనకు తానే చెప్పుకున్నారు రామచంద్ర.
చివరిగా..యోగవాశిష్ఠంలో “సజీవతి మనోయస్య: మననేవహి జీవం’ అనే శ్లోకం ఉంది. అనగా – ఎవరైతే మనసుతో మనసారా జీవిస్తారో వాళ్లే నిజంగా జీవించినట్లు.. వాళ్ల జీవితమే సార్థకం.” తిరుమల రామచంద్ర గారు ఇటువంటి వారే!
-భమిడిపాటి గౌరీశంకర్
94928 58395