‘రక్తనాళాల్లోని అలజడుల సవ్వడులు’ బాణాల కవిత్వం

సాహిత్యం

‘జీవితం ముళ్ళపాన్పయినప్పుడు
ఓడిపోయిన ఆటల ఆలోచనే వద్దు
అన్నిట్నీ అనుభవాల
అమ్ముల పొదిలో పొదిగి
కొత్త వ్యూహాలకు పురుడు పోయాలి
అవమానాల పలుగురాళ్లపై
ఆయుధాల్ని సాన పెట్టుకొని
అదృశ్య ఆగంతకుని పై గురి పెట్టాలి’

పై వాక్యాలు డా.బాణాల శ్రీనివాసరావు కవితా సంపుటి ‘రాత్రి సింఫని’లోని ‘వ్యూహగామి’ కవితలోనివి. జీవితంలోని అనేక అనుభవాల నుండి పాఠాలను , గుణపాఠాలను నేర్చుకుంటూ నీకు నీవే ఒక వ్యూహకర్తగా మారనంతకాలం మనుగడ ఉండదని హెచ్చరిస్తున్నది. ప్రముఖ కవి డాక్టర్ బాణాల శ్రీనివాసరావు గారు ‘పర్యాయపదం’ కవితా సంపుటి మరియు ‘కుంపటి’ దీర్ఘ కవిత తర్వాత వెలువరిస్తున్న కవితా సంపుటి ‘రాత్రి సింఫని’. వర్తమాన సామాజిక సమస్యల మీద తనదైన దృష్టి కోణం నుండి కవిత్వం రాస్తున్న అతి కొద్ది మంది తెలంగాణ తెలుగు కవుల్లో బాణాల ఒకరు. కవికి, సమాజానికి మధ్యన నిరంతరం జరుగుతున్న మానవీయమైన సంఘర్షణకు అద్దం పడుతున్న కవితా సంపుటిది.

జన్మనిచ్చిన అమ్మను తలుచుకుంటే చాలు జ్ఞాపకాలు తనువంతా అల్లుకుంటాయి.అనుబంధాల ఆత్మీయపు స్మృతులు వెంటాడుతుంటాయి. తన జీవితంలో వందల మైళ్ళు నడిచిన అమ్మ, వయసు భారంతో మంచానికే పరిమితమైనప్పుడు చూసిన తన కళ్ళు వర్షించకుండా ఉండలేవు కదా. ఆ మాతృ హృదయానికి ఆయనేమిచ్చి రుణం తీర్చుకోగలరు. తన మాతృమూర్తి ఈ కవిని ‘శీనయ్యా’ అంటూ పిలుస్తున్నట్లుగానే ఉంటుందని అక్షరాల్లో వ్యక్తం చేస్తున్నప్పుడు మన మనసు చలించకుండా ఉంటుందా?.. ‘అమ్మొక సముద్రం’ అనే కవితొక్కటి చాలు ఆయన సున్నిత భావాలకు నిదర్శనమని చెప్పడానికి. ఈ కవితా పాదాలను చదువుతుంటే రోజురోజుకు మనుషుల్లో పేరుకుపోతున్న మొరటుతనం మటుమాయం కాకతప్పదని భరోసానిస్తున్నవి.

ఇంట్లో ఏ రూంలోకెళ్లినా
అమ్మ జ్ఞాపకాలే
దృశ్యాదృశ్యంగా వేళ్లాడుతున్నట్లు
అమ్మను ఎవరు గుర్తు చేసినా
ఆమెతో వాళ్ళకున్న అనుబంధాన్ని
ఎవరు తడిమినా
నా కళ్లు కురిసేవి కన్నీళ్లు కాదు
అమ్మ నాతో పంచుకున్న
గత కాలపు నైరాశ్యపు
జీవిత శకలాలు
నా మనో మైదానంలో ఆవిరైపోని
తీపి చేదు అనుభూతుల
మంచు బిందువులు
ఎప్పటికీ చెక్కిలిలోకి
ఇంకని ప్రేమ సింధువులు’

సామాజిక అభివృద్ధికైనా, కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకైనా తన జీవితాన్ని ధారపోస్తున్న ఇంటి ఇల్లాలి గురించి ‘గృహ కవచం’ శీర్షికతో ఆత్మీయమైన కవితను రాశారు. ‘ శ్రమకు నిలువెత్తు రూపమై /ఎల్లవేళలా కుటుంబాన్ని/ కాపాడుకునే రక్షణ వలయంలా/రాత్రి ఇంటిని వెలిగించే వెన్నెల దీపం’ అన్న వాక్యాలు నిత్యం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనిషికి మనిషికి ఉండవలసిన అనురాగపు అనుబంధాలు కనుమరుగవుతున్న ఈ విషాదపు కాలంలో మనమంతా జీవిస్తున్నందుకు చాలా కుమిలిపోతున్నాం. వర్తమానాన్ని అనేక కోణాల్లో దృశ్యమానం చేస్తున్న ఈ కవి ‘భయం ఊబిలో ‘ అనే కవిత ద్వారా తన వేదనను మనతో పంచుకుంటున్నారు. ‘విశ్వాన్ని జయించాలనుకుని/పాతాళంలో పడిపోయి/ఆశల మబ్బులపై ఎగిరే/ఆకాశ విహంగాలు/స్వార్థం ఊబిలో/ కూరుకు పోతున్న/ అత్యంతాధునిక/మానవ యంత్రాలు’

సామాజిక సంక్లిష్ట పరిస్థితులను తనదైన కోణంలో అర్థం చేసుకున్న తీరు మనల్ని ఆశ్చర్య పరుస్తుంది. కవిత్వ సృజన పట్ల స్పష్టమైన అవగాహనతో విభిన్నమైన వ్యక్తీకరణలతో పలకరిస్తున్న విధానంతో మనమంతా పులకరిస్తూపోతాం. కవిత్వం అంటేనే ఒక ఉత్తేజభరితమైన కెరటం వంటిది.కవిత్వాన్ని గురించి బాణాల గారి వాక్యాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. శోకం నుంచి శ్లోకం పుట్టినట్టుగా వేదన నుంచే కవిత్వం పుడుతుందనే భావాలతో రాసిన ‘పర్గేటోరియో స్వాగతం’ కవితలోని వాక్యాలతో మనమంతా ఏకీభవించకుండా ఉండలేము.

‘కవిత్వంలో నిబద్ధత అబద్ధం కాదనే ముక్కు మూసుకు తపస్సు చేయడం మానేద్దాం. సమీక్షలో అస్తిత్వాలు మాయమైతే గుండెల్ని బాదుకోవడం మానేసి ఇప్పుడు వాడిగా వీస్తున్న కవిత్వాన్ని పీల్చి ఊపిరితిత్తులని కడుక్కుందాం.. బాధలోంచి వచ్చే భావమే కవిత్వం/వేదనలోంచి వచ్చే నాదం కవిత్వం..!’

కవిత్వ ప్రయోజనం ఏమిటి? అని ఏ కవిని ప్రశ్నించినా తనకంటూ ఒక ప్రత్యేకమైన సమాధానాన్ని నిర్మించుకుంటాడు. రకరకాల ఊహాగానాలు మనసులో చెలరేగుతుంటే వాటికి ఒక క్రమమైన చూపునిచ్చి అక్షరాలతో ప్రాణం పోస్తాడు కవి. కవిత్వ సృజనలో కవిత్వం పైన కవిత్వం రాయలేకుండా ఏ కవి ఉండలేరు. ప్రపంచ సాహిత్యం నుండి ఎన్ని ఉదాహరణలైనా చెప్పవచ్చు. సందర్భానికి తగినట్టుగా, మెరుగైన వ్యవస్థ కోసం కృషి చేస్తున్న కవి జీవనోత్సాహాన్ని మరింత విస్తృత పరుస్తుంటాడు. ‘సంజీవని లాంటి పాదం’ కవిత తన కవిత్వానికి మార్గదర్శనం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ కవిత్వ పాదాలు చదువుతుంటే మానసికమైన కల్లోలంతో సతమతమవుతున్న మానవులకు ఒక కొత్త ఆశా కిరణంలా కనిపిస్తున్నాడు కవి. ప్రాణ సమానమైన జీవితాన్ని అక్షరాలతో బహుకరిస్తున్న తీరుకు ముగ్దులమైపోతాం.

ఒక్క వాక్యం చాలు
నీలో నిద్రాణమై ఉన్న నేను
నిప్పు రవ్వను చేసి
నిశి రాత్రులు నిండిన
నీ జీవితాన్ని
వెలిగించేందుకు’…..

నువ్వు నడిచిన దారుల్ని రహదారుల్ని చేసి
నీ భవిష్యత్తు గమనాన్ని మళ్లించే
జీవమున్న ఒక వాక్యం చాలు’

మానవ సంబంధాల పట్ల విశేషమైన ప్రేమను వ్యక్టం చేస్తున్నారు కవి. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన ఈ కవికి నాటి కుటుంబ బాంధవ్యాల్ని మర్చిపోకుండా పదేపదే గుర్తు చేస్తూ ఉంటారు. ఇంటికి బంధువులు వస్తే నాన్న పడే హడావుడిని కనులకు కట్టినట్టుగా వర్ణిస్తారు.సకల బంధాలకు వేదిక ఊరు. ఆ పలకరింతలను, ఆత్మీయతలను నేడు కరోనాకాలం ఎట్లా ధ్వంసం చేసిందో విడమర్చి చెప్పిన కవిత ‘దుఃఖనది’. తన బాల్యపు స్మృతుల్ని స్మరించుకుంటూనే అమానవీయమైన బంధాల పట్ల కలత చెందుతున్న వైనానికి దుఃఖ భరితులమవుతాము. జీవమున్న మనుషులు మరమనుషుల్లా మారుతున్నారనే ఆవేదనతో చెప్పిన ఈ వాక్యాలు మనల్ని ఎంతో వేదనకు గురిచేస్తాయి. గ్లోబలీకరణ యుగంలో భవిష్యత్ కాలాన్ని ఈ కవితా పాదాల్లో చిత్రీకరించారు.

మనుషులంతా
కృత్రిమ ప్రాణుల్లా కదులుతుండ్రు
పోను పోను ఇంకెంత దుర్భరంగా
ఉంటదో బతుకు…

ఇంకెన్ని అనర్ధాలు చూడాల్సొస్తదో!
ఎట్లాంటి పీడ కలలు కనాల్సొస్తదో!
ఊహించుకుంటేనే ఊపిరాడకపాయే
తలుచుకుంటేనే పాణం పోయినట్లాయే
ముందుముందెన్ని.. దుఃఖ నదుల్ని దాటాల్నో
ఊహించని విపత్తుల్నెన్ని ఎదుర్కోవాలో..’

అన్ని సాహిత్య ప్రక్రియల ఉద్దేశం ఒకటే. సంస్కారవంతమైన మానవ సమాజాన్ని నిర్మించడం. ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకోవడం. మానవీయ విలువలకు పట్టం కట్టడం. ఉత్తమ సాహితీ విలువలను పాటిస్తున్న బాణాల శ్రీనివాసరావు గారు ఉత్తమ సాహిత్యం గురించి తన అభిప్రాయాన్ని ‘నా సాహితీ వృక్షానికి తల్లి వేరు మావూరే’ అని రాసుకున్న మాటలో ఇలా వ్యక్తం చేశారు. ‘ఇప్పటివరకు ప్రపంచ సాహితీవేత్తలందరూ రకరకాల అభిప్రాయాల్ని సాహిత్యం గురించి వెలిబుచ్చారు.’What is for art’s sake’ అని కొంతమంది, కాదు ‘Art is for society’s sake అని ఇంకొంత మంది చెప్పడం జరిగింది. కళ కళకోసమైనా లేక సమాజం కోసం అయినా ఒక బృహత్తర ప్రయోజనం ఉంటుంది. ఉండాలి కూడా. కవిత్వం మనిషి అంతఃజ్యోతిస్సిమల్ని వెలిగించాలని తిలక్ అన్నారు కదా. తనకు, ప్రపంచానికి సామరస్యం కుదిరే వరకు కవి చేసే అంతర్ బాహిర్ యుద్ధారావమే కవిత్వం అని చలం వెలిబుచ్చాడు. అందుకే సాహిత్యం హృదయాన్ని వెలిగించుకుంటూ పాఠకుడిని ఆలోచింపచేయాలి కదా.

కవిత్వం అయినా సాహిత్యమైనా ఏ కళ అయినా మనిషిని మనిషిగా మానవత్వ విలువలతో జీవింపజేయాలి. అలా చేయగలిగిన సాహిత్యమే అసలు సిసలైన సాహిత్యం. అందుకే ఇటాలియన్ పోయెట్ Horace అన్నట్లు ‘ the purpose of literature is to teach and delight’..అంటే ఏదో కొత్త విషయాన్ని చెబుతూ, ఎంతో కొంత జ్ఞానాన్ని బోధిస్తూ ఆనందాన్ని ఇచ్చేదే అసలైన ఉత్తమ సాహిత్యం అంటారు. అటువంటి ఉత్తమ సాహిత్యాన్ని సృజించిన సాహిత్యకారులు అజరామరులవుతారు.

బాణాల కవిత్వం నిండా సామాన్య ప్రజల జీవన పోరాటం యొక్క తెగింపులే కనిపిస్తుంటాయి. ప్రజల పక్షపాతి ఈ కవి. బహుజనుల బతుకుమీద సాధికారికంగా రాయగలరు. సబ్బండవర్ణాల జీవన వృత్తిని వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా వర్ణించారు. ‘కుంపటి’ దీర్ఘ కవిత్వం ద్వారా విశేషమైన ఆదరణ పొందిన ఈ కవి కలం బహుజనుల పట్ల అపారమైన ప్రేమతో వారి దుఃఖాన్ని అక్షరీకరించింది.

‘రాత్రి సింఫనీ ‘ కవిత్వంలో అర్థ రాత్రి వినిపించే సున్నితమైన రాగాల శబ్దాలే కాదు సామాన్యుని రక్తనాళాల్లోని అలజడుల సవ్వడులు కూడా వినిపిస్తున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత వెలువరించిన ఈ కవితా సంపుటి కవి దృక్పథానికి తార్కాణంగా నిలిచింది.

ప్రసిద్ధ కవి సిద్ధార్థ గారు ఈ కవితా సంపుటికి ‘అస్తిత్వ జలాల్లో కదిలే ఒంటరి నాయకుడు’ అంటూ రాసిన ముందు మాటలో బాణాల కవిత్వం అందిస్తున్న చైతన్యాన్ని గూర్చి వివరించారు. ‘సూదిమొనల మీద జీవానుభవాన్ని పద పాదాలతో కలుపుతూ, దుఃఖాన్ని చిదుముతూ.. ఇదంతా నిశిరాత్రుల సుక్క పొడుపు నక్షత్రాల మానవేతిహాస రోదన. కవిత్వంలోని ఈ వేదన వినిపించదు. కనిపిస్తుంది’ అంటాడు.ఈ వాక్యాలు అక్షర సత్యాలు. కవిత్వ ప్రియులందరూ చదివి దాచుకోదగ్గ ఉత్తమ కవితా సంపుటిది.

 

 

– గోపగాని రవీందర్
94409 79882