సాహిత్యంతో తనను తాను సంలీనం చేసుకున్న ‘వంశీకృష్ణ’

సాహిత్యం

కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అంటే సాహిత్యం వినా అన్నీ అశాశ్వతమే అనగల నైజం గలవాడు- ప్రముఖ కవి,కథకుడు, సాహితీ విమర్శకుడు, సినీ విమర్శకుడు, అనువాదకుడు వంశీకృష్ణ అలియాస్ శ్రీ తాటికొండాల సత్యనారాయణ.

వంశీకృష్ణ.. మంచు ముత్యాలను కప్పుకొని సువాసనలు మంద్రంగా వెదజల్లుతున్న మల్లెపువ్వులాంటి మనిషి. సస్నేహ కరస్పర్శతో మిత్రులను కట్టిపడేయగలవాడు.తన దగ్గర మనకు తెలియని అయస్కాంత శక్తి ఏదో ఉంది. అర్ధం లేని అశాంతితో వేగిపోని తత్త్వం ఉంది.ఏదీ సీరియస్ గా తీసుకోడు. అలాగని దేనినీ తేలికగానూ పరిగణించని గుణం వున్నవాడు.

సుమారు ఎనిమిదేళ్ళుగా తనతో స్నేహం చేస్తున్నాను. ఈ సంవత్సర కాలంగా అప్పుడప్పుడు తన సాహిత్యం చదువుతూ, తననుఅనుసరిస్తున్నప్పుడు,ఎందుకో, వంశీకృష్ణ నాకు కొండంత ఎత్తులో కనిపిస్తాడు. తన కథ, కవిత, అనువాద కవిత్వం, వ్యాసం, సినిమా విమర్శ..ఏది చదివినా చాలా లోతైన అవగాహన తనది అనిపిస్తోంది. నాలుగున్నర దశాబ్దాల క్రితం రచనా వ్యాసంగం ప్రారంభించిన ఈ సాహితీవేత్త, ప్రపంచీకరణ తరువాత ఆర్ధిక పరిణామాల ప్రభావం నేపథ్యంగా కవిత్వం,విమర్శ రాసిన తొలి సృజనకారుల్లో ఒకరు. పాలపిట్ట మాసపత్రికలో రాసిన సినిమా విమర్శనా వ్యాసాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ సినీ విమర్శకునిగా ‘నంది’ పురస్కారం అందుకున్నారు. కవిత్వం-కథ, సాహితీ విమర్శ-సినీ విమర్శలను జంట స్వరాలుగా చేసుకొని ప్రవృత్తిగా సాహితీ యానం సాగిస్తూనే వృత్తిపరంగా బాంకింగ్ వ్యవస్థలో మూడున్నర దశాబ్దాల స్పూర్తిమంతమైన ఉద్యోగ జీవితాన్ని మనసారా ఆస్వాదించారు వంశీకృష్ణ. గాఢమైన తాత్త్విక చింతన కలిగిన వీరి రచనలు చదవడం ఒక సృజనానుభవం.

నిత్యం సాహిత్య పరిమళాలు మోసుకుంటూ సాగిపోయే ఈ బాటసారి, తన ఉద్యోగ విధులకు విరమణ చెబుతూ మిగిలిన జీవితమంతా సాహిత్యానికే అంకితం చేస్తారని ఆశించటం తప్పు కాదేమో!.

వంశీకృష్ణతో విల్సన్ రావు కొమ్మవరపు జరిపిన ముఖాముఖి సృజనక్రాంతి పాఠకులకు ప్రత్యేకం.

1.మీ కుటుంబములో దాదాపుగా అందరూ సాహితీవేత్తలే అనుకుంటాను.

అందరూ కాదు. నేనేంటో మీకు తెలుసు. మా నాన్న తాటికొండాల నరసింహారావు గారు ప్రధానంగా నాటకరంగంలో కృషి చేశారు. సొంతముగా నాటకాలు రాశారు. దర్శకత్వం వహించి, నటించి ప్రదర్శించారు. నాటకరంగంలో ఆయనకు నాలుగు నంది అవార్డులు వచ్చాయి. కొన్ని కథలు, కొంత విమర్శ, కొంత కవిత్వం రాశారు. ఎన్ని రాసినా ఆయన మంచి పరిశోధకుడు. ఖమ్మం జిల్లా కథకుల గురించీ, కవుల గురించీ ప్రామాణికమైన పుస్తకాలు రాశారు. తెలంగాణ నాటకరంగ చరిత్రను, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సాహిత్య చరిత్రను గ్రంథస్తం చేసారు. మా చెల్లెలు నీలిమ వి.యస్.రావు ఇటీవలే “ఆగ్రహి” అనే కవిత్వ సంపుటి వెలువరించింది. నా మిగతా కుటుంబ సభ్యులు, నా సహచరి అందరూ మంచి చదువరులు.

2.మూడున్నర దశాబ్దాల మీ సాహిత్య ప్రయాణంలోని వివిధ దశలు వివరిస్తారా?

నా మొదటి ‘కప్ ఆఫ్ కాఫీ’ కథ, నేను ఇంటర్మీడియట్ లో వున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టుడికించిన రమీజాబీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాసాను. అది అచ్చు అయిన నా మొదటి కథ. ఆదివారం వారపత్రిక ప్రారంభిస్తూ కథల పోటీ పెడితే అప్పటికే ప్రసిద్ధులైన వి.రాజా రామమోహన్ రావు గారి లాంటి వారి సరసన ఆ కథ బహుమతి గెల్చుకుని గర్వంగా నిలబడింది. ఆ తరువాత చాలా కథలు రాశాను. ‘కథ రాశాక అది నాది కాదు. ప్రపంచానిది’ అనే నమ్మకం ఒకటి ఉండేది నాకు అప్పుడు. ఆ నమ్మకంతో రాసిన కథలు చాలా పోగొట్టుకున్నాను. దొరికిన కొన్ని కథలతో “వంశీకృష్ణ కథలు” పేరుతో ఓ పదిహేను కథలను సంకలనం చేస్తే దానికి ‘జ్యేష్ఠ లిటరరీ అవార్డు’ వచ్చింది. కథకుడిగా అది నాకు మొదటి అవార్డు. కథా సంకలనానికి నాకు, ‘బంగారు మురుగు’ కథకి శ్రీ రమణ గారికి అప్పుడు అవార్డులు వచ్చాయి.

ఆ తరువాత కవిత్వంలో పడిపోయాను. నిజానికి నా అచ్చయిన మొదటి రచన కవిత్వమే. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆగస్టు నెలలో పన్నెండవ తారీకు మధ్యాహ్నం “ఆర్త గీతం” అనే ఒక కవిత రాసి ‘శ్రీ నండూరి రామమోహన్ రావు గారు, ఆంధ్రజ్యోతి, విజయవాడ’ అని ఒక ఎన్వలప్ కవర్ లో పంపిస్తే ఆగస్టు 15వ తారీకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సంచికలో ప్రకటించి కవిగా నా ప్రారంభ దశకు ఆయన బలమైన ఆశీర్వచనాన్ని ఇచ్చారు. ఆ తరువాత అఫ్సర్, ప్రసేన్, సీతారాం పరిచయంతో, కథ కాస్త వెనుకబడి కవిత్వం అనే మార్మిక లోయలో పడిపోయాను.

కూలి కోసం గుడివాడ రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి దిగి, చిన్నచిన్న గూడారాలు వేసుకునే వలస కూలీలను చూసి “కాందిశీకులు” అనే పెద్ద కథ రాస్తే స్వాతి మాసపత్రిక తన అనుబంధ నవలగా ప్రచురించింది. అలాగే చైతన్యవంతులైన ఒక యువ భార్యాభర్తల జీవితంలోని ఒక రోజును తీసుకుని “ఉనికి” అని మరొక పెద్ద కథ రాస్తే మళ్ళీ స్వాతి మాసపత్రికే దానిని అనుబంధ నవలగా ప్రచురించింది.

ఈ రెండిటినీ నేను పెద్ద కథలు అన్నాను. స్వాతి మాసపత్రిక నవలలు అన్నది. ఈ రెండు పెద్ద కథలతో పాటు మరికొన్ని కథలు కలిపి “ఉనికి” అని మరొక కథల సంపుటి ప్రచురించాను. ఈ మధ్యలో కవిత్వం కూడా చాలా బలంగానే రాశాను. ఇప్పటివరకు ఆరు కవిత్వ సంపుటులు రెండు కథా సంకలనాలు వచ్చాయి. అఫ్సర్, ప్రసేన్, సీతారాంలతో కవిత్వం అనే సంకలనం, ప్రసేన్, సీతారాం, గౌరీశంకర్ లతో కలిసి “గద్దర్ -రాజ్యం-మనము” అనే దీర్ఘ కవిత రాసాను. ఈ దీర్ఘ కవితను వేల్చేరు నారాయణ రావు గారు ఆంగ్లంలోకి అనువదించి 20th సెంచరీ ఇండియన్ పోయెట్రీ అనే పుస్తకంలో ప్రచురించారు. Oxford University Press దానిని ప్రచురించింది. ఈ మధ్యలో అఫ్సర్ తో కలిసి “అనేక ” అనే ఒక దశాబ్ది కవిత్వ సంకలనానికి సహ సంపాదకత్వం వహించాను.

ఇలా కథ, కవిత్వం నడుమ లోలకంలా తిరుగుతున్న నన్ను సినీ విమర్శ వైపు మళ్లించింది మిత్రుడు గుడిపాటి. ప్రసేన్ ఆంధ్రభూమిలో ‘వెన్నెల’ పేజీ చూసేటప్పుడు బాగా ఫాలో అయ్యేవాడిని. ప్రసేన్, సికిందర్, సత్యమూర్తి, జగన్, పాలకోడేటి నాకు బాగా ఇష్టమైన సినిమా విమర్శకులు. వాళ్ళ విమర్శ చదివి సినిమా వాక్యం ఎలా ఉండాలో నేర్చుకున్నాను.

3. మీలోని సృజనకు పదును పెట్టడానికి మీరేం చేస్తుంటారు ?

మీరు మంచి అవార్డు విన్నింగ్ పోయెట్ కదా. మీ “దేవుడు తప్పి పోయాడు” కవితా సంపుటికి ఎనిమిది అవార్డులు వచ్చాయి కదా! మీలోని సృజనకు పదును పెట్టడానికి మీరేం చేస్తారు ? మీలాగే నేనూ, మంచి సాహిత్యం చదువుతాను, మంచి సంగీతం వింటాను, మంచి మిత్రులతో సంభాషిస్తాను, అప్పుడప్పుడు నాలోకి నేను ప్రయాణం చేస్తాను. అంతకంటే ఇంకా ఎక్కువ ఎవరైనా ఏమి చేయగలరు?

4.ఇప్పటిదాకా ఎన్ని గ్రంధాలు ప్రచురించారు

కవిత్వం ఆరు సంపుటాలు,కథలు రెండు సంపుటాలు,సినిమా విమర్శ మూడు సంపుటాలు,లేఖా సాహిత్యం ఒకటి.

5.ఎవరి రచనలు ఎక్కువగా చదివి మీరు ఉత్తేజితులై సాహిత్యంలో కుదురుకున్నారు?

మొదట్లో యండమూరి, మల్లాది, యద్దనపూడి తరువాత చలం, బుచ్చిబాబు, గోపీచంద్, విశ్వనాథ, రావి శాస్త్రి, శ్రీశ్రీ, తిలక్, సినారె, దాశరధి. నేను చదివిన మొదటి నవల “జీవితం ఏమిటి?” రచన కకుభ. ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చింది. ఆ నవలను మా అమ్మ పని చేసుకుంటుంటే చదివి వినిపించేవాడిని. అలాగే పచ్చని కలశంలో వెచ్చని కన్నీళ్లు. చివుకుల పురుషోత్తమ్ “మూడో పురుషార్థం ” ఇది కూడా మా అమ్మకి చదివి వినిపించాను. చదివిన ప్రతి అక్షరం ఎక్కడో ఒక చోట నన్ను ఉత్తేజితుడిని చేసి ఉంటుంది.

6.కథ, కవిత,వ్యాసం..వీటిలో ఏ ప్రక్రియ కష్టం.అలాగే మీకు బాగా ఇష్టమైన ప్రక్రియ ఏది.?

బాగా ఇష్టమైనది అంటే కథ. బాగా కష్టమైనది కూడా కథే. అందుకే ఎక్కువ కథలు రాయలేదు. మళ్ళీ ఇప్పుడొక కథల సంకలనం వేయబోతున్నాను. కథ మనసులో ఎంత బాగా మగ్గితే, మాగితే అంత బాగా వస్తుంది. కాస్త ఓపిక, సహనం ఉండాలి. కవిత అలా కాదు.

7.మీరు చాలా కథలు,కవితలు, సాహిత్య విమర్శ,సినీ విమర్శ రాశారు.నవల జోలికి వెళ్లినట్లుగా లేరు.కారణం.

నేను రాసిన రెండు పెద్ద కదలని స్వాతి మాసపత్రిక నవలలు అని అనుబంధంగా ప్రచురించింది. కానీ వాటిలో ఒక దానికి నవల లక్షణాలు లేవు. అది వేరే సంగతి. ఇప్పటి దాకా నవల రాయకపోవడానికి పెద్ద కారణమేమి లేదు. ఒకే వస్తువు స్థిరంగా కూర్చునే ఓపిక లేకపోవడం ఒకటైతే అంత తీరిక లేకపోవడం కూడా మరొక కారణం. ఇప్పుడు రిటైర్ అయ్యాను కదా. ఎన్నాళ్ళ నుండో నా మనసులో మెదులుతున్న ఒక వస్తువును “కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి” పేరుతో రాయాలి అనుకుంటున్నాను.

8.మీకు సంగీతమంటే బాగా ఇష్టమనుకుంటాను. ఎమ్. యస్. విశ్వనాధం గారి సంగీత దర్శకత్వంలోని ఒక పాటను గురించి వివరిస్తారా.

ఎమ్. ఎస్.వి నే ఎందుకు? అయినా అడిగారు కనుక చెప్తాను? తమిళ మహా కవి కణ్ణదాసన్ విశ్వనాథన్ కి చాలా దగ్గర. ఇద్దరూ కలిసి ఒకసారి ఫ్లయిట్ లో రష్యా వెళ్లారు . ఆ ముచ్చట కణ్ణదాసన్ మాటలలో ““We boarded a plane and he misread Toilet and asked me what the rent was. We landed in Kabul and asked me what Afghanistan meant and who Muhammad Ghori was. We went to Tashkent and he was listless. We went to Leningrad (Saint Petersburg) and when I introduced him to someone,he mistook engineering for a vegetable. He was really quite hopeless. Our host took us to the Tchaikovsky concert hall and showed us a piano that the great Russian supposedly played on. Viswanathan couldn’t pronounce Tchaikovsky. But he sat at the piano and, for 30 minutes, played the maestro’s concerto. Naturally, the Russians were spellbound. He really knows nothing. Nothing but music.” సంగీతం తప్ప విశ్వనాథన్ కి మరేమీ తెలీదు. విశ్వనాథన్ కంటే గొప్ప సంగీత దర్శకులు చాలామంది ఉండవచ్చు కానీ సంగీతంలో తనను తాను సంలీనం చేసుకున్నవాడు విశ్వనాథన్ ఒక్కడే. నా వరకు నాకు విశ్వనాథన్ మరేమీ చేయకపోయినా ఆ రెండు పాటలు “మౌనమే నీ భాష ఓ మూగ మనసా?, కోటి దండాలు శతకోటి దండాలు” చాలు, ఆయనకి గుండెల్లో గుడి కట్టడానికి. మెల్లిసై మన్నార్ లేడని ఎప్పుడు తల్చుకున్నా నా కళ్ళలో నీళ్లూరుతాయి.

9.అంతర్జాతీయంగాను,జాతీయంగాను వివిధ భాషల్లో వచ్చిన కవిత్వం అనువాదం చేస్తున్నారు. వాటిని పుస్తక రూపంలో తీసుకొచ్చే ఆలోచన ఉందా.

కవి సంగమంలో రాసిన ‘కవిత్వ ప్రపంచం’ కాలమ్ కోసం అంతర్జాతీయ కవిత్వాన్ని చదవడం మొదలు పెట్టాను. ఆ తరువాత వివిధ దేశాల కవిత్వంతో ప్రేమలో పడిపోయి ఇంకా చదువుతూనే వున్నాను. తెలుగులో నేను సమర్ధంగా చెప్పగలను అనుకున్న వాటిని అనువాదం చేశాను. అవన్నీ కలిపితే దాదాపు ఆరేడువందల పేజీల కవిత్వం అవుతుంది. కేవలం కవిత్వాన్ని మాత్రమే అనువాదం చేయకుండా ఆయా కవుల దృక్పధాన్నీ, ఆయా భాషలలో వాళ్ళ జయాపజయాలను కూడా వ్యాస రూపంలోకి తీసుకుని రావడం వల్ల అవి మిగతా కవులు చేసిన అనువాదాలకంటే భిన్నంగా ఉండి పాఠకులను, ముఖ్యంగా యువకవులను బాగా ఆకర్షించినవి. చాలా మంది పుస్తకరూపంలో తీసుకుని రావచ్చు కదా అని అడుగుతున్నారు. ఆర్ధికంగా ఇబ్బంది పడితే కానీ హార్దికంగా సంతోషపడను. చూడాలి.

10.మీరు రాసిన ‘కార్తీక’,‘నిద్ర పట్టని రాత్రి’కవితలు దీర్ఘ కవితల లక్షణాలున్నవి కదా. వీటిని భాగాలుగా విభజించి ప్రచురించారు. దీనిలో ఉద్దేశ్యం.

‘కార్తీక’ లోనూ, ‘నిద్ర పట్టని రాత్రి’ లోనూ దీర్ఘ కవితా లక్షణాలు ఏవైనా ఉంటే వుండవచ్చునేమో కానీ అవి ప్రాథమికంగా కొన్ని అనుభూతి చిత్రాలు, కొన్ని భావ శకలాలు. దీర్ఘ కవితకి ఒక లక్ష్యం ఉంటుంది. ఈ అనుభూతి చిత్రాలకి, భావ శకలాలకీ తమదైన లక్ష్యం లేదు. ఒకే వస్తువును వివిధ రకాలుగా దర్శించే వస్తు విస్తృతి, భావ గాఢత వున్నాయి. కానీ వాటికవే దీర్ఘ కవితలుగా చెప్పడానికి సరిపోవు.

11.ఉత్తమ కవిత్వాన్ని అర్ధం చేసుకోవాలంటే ప్రధానమైన పాత్రను పోషించే అంశాలేమిటి

ఏది ఉత్తమ కవిత్వం అన్నది అసలైన ప్రశ్న. ఎంతమంది పాఠకులు వున్నారో అన్ని నిర్వచనాలు వున్నాయి. కానీ చదివే పాఠకుడికి అర్ధం అయిపోతుంది తాను ది బెస్ట్ చదువుతున్నానా? లేక ది వరస్ట్ కి బలి అయ్యానా అన్న సంగతి. “It is a test [that] genuine poetry can communicate before it is understood.” అని T. S. Eliot అన్నాడు కదా! అర్ధం కావడానికి ముందే అది హృదయంలోకి వెళ్లి ఏదో ఒక సంచలనాన్ని కలిగించాలి. అది కదా ఉత్తమ కవిత్వం అంటే.

12.కథలో/కవితలో వస్తువుకూ, శిల్పానికి మధ్య సామరస్యత ఆవశ్యకత గురించి

కథలో అయినా, కవిత్వంలో అయినా, వస్తు శిల్పాల మధ్య సరి అయిన సమన్వయము లేకపోతే రసాభాస అవుతుంది. మంచి వస్తువు నుండి శిల్పం బాగా లేకపోయినా, శిల్పం బావుండి వస్తువు లేకపోయినా ఆ కథ కానీ, కవిత కానీ పాఠకుడిలో వేయవలసినంత ముద్ర వేయవు. మన దురదృష్టం ఏమిటంటే సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు, వాటికంటే ముందు ఉన్న అభ్యుదయ, విప్లవ ఉద్యమాలు అన్నీ వస్తు కేంద్రీకృతమై శిల్పాన్ని బాగా నిర్లక్ష్యం చేశాయి. దానివలన కవిత్వం ఒట్టి నినాదప్రాయమై పాఠకుడిలో కలిగించవల్సినంత రసానుభూతిని కలిగించలేకపోయింది. అలాంటప్పుడు పాఠకులు కవిత్వం నుండి దూరం జరుగుతారు. కవిత్వంలో మొనాటనీ అని 1989 ప్రాంతాలలో జరిగిన చర్చ దాని ఫలితమే. ఆ చర్చ నుండి కవులు ఏవైనా పాఠాలు నేర్చుకున్నారో, లేదో నాకు తెలియదు కానీ ఆ తరువాత వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు కూడా అదే బాట పట్టాయి. దానితో కవిత్వం పేరుతో బోలెడంత అకవిత్వం వచ్చింది. సతీష్ చందర్, సిద్దార్ధ, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్, కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, మందరపు హైమావతి, అఫ్సర్ , ప్రసేన్ , సీతారాం, యాకూబ్ ఇంకా చాలా కొద్ది మంది వస్తువును, శిల్పాన్ని జమిలిగా సమర్ధవంతంగా నిర్వహించడం వలన తెలుగు కవిత్వ లోకంలో నిలబడి పోయారు. వస్తువు మాయలోనో, శిల్పం అనే బ్లాక్ హోల్ లోనో కవి పడిపోతే పైకి లేవడం కష్టం. కథలో కూడా వి.చంద్ర శేఖరరావు గారు తొలినాళ్ళలో శిల్ప వ్యామోహంలో పడి పాఠకుడికి వస్తువును అందకుండా చేశారు. ఆ తరువాత ఆయన ఆ లోపాన్ని అధిగమించారు.

13.Pre conceived notions తో ఒక రచనను విశ్లేషించే లేదా సమీక్ష చేసే సాహిత్య విమర్శకుల గురించి మీ వ్యాఖ్య.

“Pre-conceived notions” ఎవరి మీద? కవి మీదనా? కవిత్వం మీదనా? కవిత్వం మీద ఎవరికైనా అలాంటి అభిప్రాయాలు వుంటాయని నేను అనుకోను. కవి మీద ఉండే అభిప్రాయాలు కవిత్వ విశ్లేషణను ఒక మేరకు ప్రభావితం చేస్తాయేమో! కవిత్వ రంగంలో ఇప్పుడున్న గ్రూపిజంలో అలాంటి విశ్లేషణ ఉండటానికి చాలా అవకాశం ఉంది. కానీ విమర్శకుల, సమీక్షకుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఉత్తమ కవిత్వం పాఠకులను అలరిస్తూనే ఉంటుంది. నిజానికి ప్రతి విమర్శకుడూ ప్రాధమికంగా పాఠకుడు కాదేమో, కానీ ప్రతి పాఠకుడూ ఒక ఉత్తమ విమర్శకుడే.

14.మీరు రాసిన కథలలో మీకు బాగా నచ్చిన కథ, దాని నేపథ్యం.

నేను రాసినవి చాలా తక్కువ కథలు. రాసినవి అన్నీ నాకు ఇష్టమే. ప్రత్యేకంగా చెప్పాలి “మీ వారేం చేస్తారు?” అన్న కథంటే కొంచెం ఇష్టం. స్త్రీ ఎంత ఎదిగినా, ఎంత ఉన్నత స్థాయిలో వున్నా “మీ వారేం చేస్తారు?” అని అడుగుతారు. ఏదైనా చేస్తే పురుషుడే చేయాలా? ఈ కథ పాతికేళ్ల క్రితం రాసింది. ఇప్పుడు పరిస్థితి మారింది అనుకోండి. ఆ కథ వచ్చిన కాలానికి, సందర్భానికి అదే నాకు బాగా పేరు తీసుకుని వచ్చిన కథ. అలాగే “పేచీకోరు అమ్మాయి” కూడా. ఇది ఆంధ్ర ప్రభలో వచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినా, కడగండ్లు ఎదురైనా జీవన సౌరభం కోల్పోని ఆ అమ్మాయి ఆత్మ స్థైర్యం అంటే నా కిష్టం. ఇటీవల వచ్చిన వాటిలో అయితే “అద్దంలో దామోదర్ దాస్ నరేంద్ర మోడీ”, “ఉష్ ….!మాన్ చెప్పని కథ” అంటే ఇష్టం. అద్దంలో మోదీ అనగానే మీకు బహుశా అద్దంలో జిన్నా గుర్తుకు రావచ్చు. కానీ రెండింటి కార్యక్షేత్రం వేరు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడేవారు కారు.పి.వి.నరసింహారావు గారు ప్రధానిగా వున్నప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడేవారు కారు. పి.వి.ని అయితే మౌనముని అని కూడా అనేవారు. కానీ నరేంద్ర మోదీ అలా కాదు. ఆయన ఏ పక్షంలో ఉన్నా ధాటిగా మాట్లాడగలరు. ప్రజల మన్ కీ బాత్ వినకుండానే తన మన్ కీ బాత్ వినిపించి ప్రజల చేత జయజయ ధ్వానాలు చేయించుకోగలరు. అలాంటి మోదీ ఎందుకు మౌనంగా వున్నారు? అన్నదే కథ . ‘ఉష్ …. మాన్ చెప్పని కథ’ హిందూ ముస్లిం, గంగా జమునా తెహజీబ్ మీద రాసిన కథ. ఈ రెండు కథలను పాలపిట్ట ప్రచురించింది

15.జ్ఞానానికి పుస్తకాలే ప్రత్యామ్నాయం అంటారు. అలా కాదని మీరేమైనా ప్రతిపాదిస్తారా.

పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందా? ఏమో ! కానీ గోపీచంద్ ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’లో చెప్పినట్టు మన జ్ఞానం “సజ్జలు” కాకపోతే మంచిది. పుస్తకాల ద్వారా తెలుసుకున్న దానిని ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాము అనేది ముఖ్యం కదా. పుస్తకాలతో పాటు సమకాలీన సమాజాన్ని కూడా చదవాలి. లేకపోతే బుక్ వార్మ్ లాగా మిగిలి పోతాము. అధ్యయనము లేని ఆచరణ, ఆచరణ లేని అధ్యయనము రెండూ నిరర్ధకమే.

16. మీరు చాలా సాహిత్యం చదివారు. మీ సాహిత్య జీవితంలో ఒక కథ, ఒక నవల,ఒక కవితా సంపుటి..లేదు ఏ ప్రక్రియలో అయినా ఒక గ్రంధం చదివాక జ్వరగ్రస్థత లాంటి స్థితి కలిగిన సందర్భం చెబుతారా

అలాంటి సందర్భాలు చాలా వున్నాయి. ప్రతిభారాయ్ ‘బీజభూమి’ కథలు, ఇందిరా గోస్వామి కథలు. ప్రతిభా రాయ్ “దేవకి ” కథ చదివాక ఒక రోజంతా నేను నేనుగా ఉండలేక పోయాను. రెండు రోజులపాటు అన్నం సహించ లేదు. చివరకు ఆ కథను తెలుగు లోకి అనువదించి కానీ నేను సాంత్వన పొందలేకపోయాను.

తిలక్ ‘ఊరిచివర ఇల్లు’ కథ, బుచ్చిబాబు ‘అజంతా’ కథ. ఇలా చాలా ఉన్నాయి. కల్యాణరావు ‘అంటరాని వసంతం’, బండి నారాయణ స్వామి ‘రెండుకలల దేశం’ కూడా అలాంటి సంచలనాన్నే కలిగించాయి.

17.దాదాపు నాలుగున్నర దశాబ్దాల మీ సాహిత్య ప్రయాణంలో మీరు సృజించిన సాహిత్యానికి తగిన గుర్తింపు లభించిందని భావిస్తున్నారా

గుర్తింపు అంటే మీ ఉద్దేశ్యంలో అవార్డులు అయితే అవి నాకు చాలా తక్కువగా వచ్చాయి. చాలా తరచుగా నా కవిత్వం మీద సమీక్షలు, వ్యాసాలు రావు. కానీ వంశీకృష్ణ ఏం రాస్తున్నాడు అని చూసేవాళ్ళు, నేను ఏది రాసినా మనసుకు హత్తుకునే వాళ్ళు అయితే కచ్చితంగా చాలామంది వున్నారు. వాళ్ళ మనసుల్లో ఉన్న గుర్తింపు నాకు చాలు. అయినా ఏది రాసినా నేను, నన్ను ఆవహించిన సఫోకేషన్ నుండి, దుఃఖం నుండి విముక్తం చేసుకోవడానికే రాశాను. ఆ తండ్లాట నా పాఠకులకు నచ్చింది. ఇంతకంటే ఇంకా ఏమి కావాలి?

18.మీరు కవిత,కథ, అనువాదం, సాహిత్య విమర్శ,సినిమా వ్యాసాలు రాశారు కదా. వీటిలో మీకు బాగా పేరు తెచ్చిన ప్రక్రియ ఏది.

సినిమా విమర్శ. ఆ పుస్తకాల అమ్మకాలే అందుకు నిదర్శనం. నా సినిమా విమర్శ ఇమ్మీడియట్ ఒపీనియన్ కాదు. అది రీ కలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ. నా మూడో సినిమా పుస్తకానికి టాగ్ లైన్ కూడా అదే. సినిమాను విమర్శించడం తేలిక. మెచ్చుకోవడం కష్టం. ఆ కష్టాన్ని నేను చాలా ఇష్టంగా చేస్తాను. ఒక సినిమా చూసాక మనం ఏమి తీసుకుంటాము అనేదే ముఖ్యం. ప్రేక్షకుడు ఏమి తీసుకోవాలో నా సినిమా వ్యాసాలు చెప్తాయి. అందుకే అవి చాలా మందికి కనెక్ట్ అయ్యాయి.

19.మీ కవిత్వంలో మేనిఫెస్టోలాంటి కవిత గురించి.

ఇవాళ ఎవరూ కవిత్వాన్ని ఒక జానర్ కే పరిమితమై రాయడం లేదు. జీవితం లోని అన్ని సందర్భాలను, అన్ని భావోద్వేగాలను చిత్రిక పట్టి మరీ రాస్తున్నారు. అలాంటప్పుడు మేనిఫెస్టో లాంటి కవిత ఎవరికీ ఉండదు. మీరు కవిత్వం రాస్తారు కదా. మీ కవిత్వానికి మేనిఫెస్టో లాంటి కవిత ఏమిటి అంటే మీరూ చెప్పలేరు. ఎందుకంటే ఆధునిక జీవితం మేనిఫెస్టో లాంటి పడికట్టు పదాలను దాటుకుని చాలా దూరం వచ్చేసింది. ప్రతి క్షణమూ, ప్రతి భావావేశమూ, ప్రతి అనుభూతీ, ప్రతి అనుభవమూ కవిత్వమయమే. కనుక ఇదీ నా కవిత్వం అని నేను చెప్పలేను.

20.వచన కవిత్వం-నేటి స్థితి పై మీ అభిప్రాయం

వచనం ఎక్కువ అయి కవిత్వం వెనకపడింది.

21.ప్రాయోగిక విమర్శ(practical criticism) కు ఉండవలసిన లక్షణాలేమిటి.

ప్రాక్టికల్ విమర్శ లేదా ఆచరణాత్మక విమర్శ అనే భావనను మొదట సాహిత్యంలో ప్రవేశ పెట్టింది ఐ.ఏ.రిచర్డ్స్. 1929 లో తాను రాసిన practical criticism అన్న పుస్తకంలో ఈ విమర్శకి మూడు లక్ష్యాలు చెప్పాడు.

1) to introduce a new kind of documentation to those who are interested in the contemporary state culture whether as critics, as philosophers, as teachers, as psychologists, or merely as curious persons.

2)to provide a new technique for those who wish to discover for themselves what they think and feel about poetry, and why they should like or dislike it.

3)to prepare a way for educational methods to be more efficient than those who use now in developing discrimination and the power to understand what we hear and read.

తెలుగులో దీనిని సీతారాం పాఠక ప్రతిక్రియ విమర్శ అన్నాడు. తన విమర్శా గ్రంధం “అదే పుట” లో దీనిమీద ఒక మంచి వ్యాసం కూడా వుంది. ఇది తెలుగులో బాగా అభివృద్ధి చెందితే మీ ప్రశ్న pre-conceived notions కి స్థానం ఉండదు.

22. సాహిత్యం ద్వారా మీరు సాధించాలనుకునేదేమిటి.

నేను సాహిత్య రంగంలోకి ఒక ప్లాన్ వేసుకుని, ఒక కార్యాచరణ నిర్ణయించుకుని రాలేదు. కనుక నేను సాధించాలనుకునేది ఏదీ లేదు. ఇటీవల కవి కూడా అయిన ఒక యువ రచయిత నోబెల్ బహుమతి సాధించడమే తన లక్ష్యం అని చెప్పుకున్నాడు. నాకు అలాంటి లక్ష్యం ఏదీ లేదు. ఎప్పటికప్పుడు నా లోలోపలి ఉక్కపోతను, తండ్లాటను తప్పించుకోవడమే నేను సాధించాలి అనుకునేది.

విల్సన్ రావు:ధన్యవాదాలు వంశీకృష్ణ గారు. మీ ఉద్యోగవిరమణ అనంతర జీవితం సాఫీగా జరగాలని,మరెంతో ఉత్తమ సాహిత్య సృజన చేయాలని సృజనక్రాంతి తరపున ఆశిస్తున్నాను.

వంశీకృష్ణ: ధన్యవాదాలు విల్సన్ రావు గారు. విలువైన ప్రశ్నలు సంధించి నన్ను నేను ఆవిష్కరించుకునేలా మీ విలువైన సమయాన్ని కేటాయించారు. మీకు,మీ సంపాదకులకు ధన్యవాదాలు.

 

 

ముఖాముఖి: విల్సన్ రావు కొమ్మవరపు

89 85 43 55 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *